నిజమైన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ రోజులంటే?

బాలల బొమ్మల రంగుల అనిల్ బత్తుల!

Rediscovery of Russian children’s literature

‘పిల్లలకే నా హృదయం అంకితం’ అని చెప్పే అనిల్ బత్తుల 1982 జూన్ 26న పుట్టాడు. ఈరోజు 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.*మేమంతా బుద్ధుడూ, అంబేద్కరూ, విప్లవమూ, తాత్వికతా, చేగువేరా, చార్లీ చాప్లిన్, నోమ్ చోమ్ స్కీ, దాస్తోవస్కీ, పికాసో, లాటిన్ అమెరికా, పారిస్ కమ్యూన్… అంటూ చాలా సీరియస్ గా ఊగిపోతున్నపుడు, అనిల్ అనే ఈ కుర్రకుంక వచ్చి, తూనీగలూ, కుందేళ్లూ, ప్లోప్లార్లూ, బాతులూ, సెలయేళ్లూ, చంద్రోదయాలూ, బుజ్జి మేకలూ, సీతాకోకలూ అంటూ ఉంటే… జగజీత్ సింగ్ మా వెనకే నించుని… – ఏ కాగజ్ కీ కష్తీ, ఏ బారిష్ కీ పానీ… అని పాడుతున్నట్లే అనిపించేది.పోగొట్టుకున్న బాల్యమేదో కుక్కపిల్లలా తిరిగివచ్చి కాళ్ళకి చుట్టుకుంటున్నట్టే ఉండేది.

*** *** ***

నిజమైన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ రోజులంటే… చందమామ, బాలమిత్ర చదువుకున్న కాలమే. పిట్టల అరుపులు వింటూ, సింహమో, పులో వస్తాయని భయపడుతూ, తెలతెలవారుతుండగా అరణ్యంలో చెట్ల కింద నిద్ర లేచేవాళ్ళం. అప్పటికే విజయసేనుడూ, వీరబాహుడూ గుర్రాలతో సిద్ధంగా ఉండేవాళ్ళు. ఆ అడవి దారిలో వాళ్ల వెంట రివ్వున దూసుకుపోయే వాళ్ళం. పగడాల దీవికి చేరుకోవాలంటే ముందు రాక్షస లోయని జయించాలి. తర్వాత నరమానవుడెవడికీ సాధ్యం కాని మాయాద్వీప రహస్యాన్ని ఛేదించాలి. శాపవిమోచనం పొందిన వూడలమర్రి గంధర్వకన్యగా మారి వరమివ్వాలి… and the breathtaking climax of treasure hunt begins… పగడాల దీవి వైపు గుర్రాల్ని పరిగెత్తించే వాళ్ళం. దారిలో దెయ్యాల్నీ, భూతాల్నీ ఓడించి, చివరికి కళ్ళు మిరుమిట్లుగొలిపే పగడాల దీవి చేరేవాళ్ళం. సంచుల్లో పంచవన్నెల పగడాల్ని నింపుకుంటూ ఉండగా, యవ్వనంతో మెరిసిపోతున్న రాకుమారి చిత్రాంగద వచ్చి, “ఇవన్నీ ఎందుకు. నేనున్నాను, నా సామ్రాజ్యం ఉంది, పదండి పోదాం” అంటుంది. వెంటనే ఆ సౌందర్యరాశి ని నా రెక్కల గుర్రం మీద ఎక్కించుకొని అమాంతంగా మబ్బుల్లోకి ఎగిరిపోతుండగా… “ఏరా.. ఇవ్వాళా స్కూలుకెళ్ళవా, లే లే” అంటూ అమ్మ వీపు మీద సుతారంగా చరిచేది.

…………………………………………………………………………………

పెద్దజుట్టు, తెల్ల చొక్కా, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అసాధారణ కళాకారుడు దర్శనం మొగిలయ్య. తన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అరుదైన కళకు చిట్టచివరి వారసుడు. ఆయన వాడే ‘పన్నెండు మెట్ల కిన్నెర’ ఓ అద్బుత వాద్యం. హరిత సమాజం కోసం అతడు గానం చేసిన కొత్తపాట ఇది…https://youtu.be/3ylC2T9Fc9g

………………………………………………………………………………………………………..

కలల చిత్రాంగద కథ అట్టర్ ఫ్లాప్ అవడంతో అరచేతిలో బొగ్గుపొడి వేసుకుని, పళ్ళు తోముకోవడానికి వేపచెట్టు కిందికి వెళ్లి నించునేవాణ్ణి. అలాంటి అందమైన రోజుల్ని, అద్భుతమైన కథల్ని, రంగురంగుల బొమ్మల్ని తిరిగి తెచ్చి మా ముందు వెలుతురు కుప్పలుగా పోసినవాడు అనిల్ బత్తుల. ఆ పిల్లల బొమ్మల కథల గురించే మాట్లాడి, ఆ బాలల గీతాలే పాడి వినిపించి, ఆ పిట్టల పువ్వుల పుస్తకాలే సేకరించి మనల్ని చూసి వెక్కిరింతగా నవ్వినవాడు అనిల్. 50 సంవత్సరాల నాటి అపురూపమైన సోవియట్ బాలల బొమ్మల పుస్తకాల్ని హైదరాబాద్ మిత్రులందరికీ చూపించి, పంచి, ఒక బ్లాగ్ ప్రారంభించి, 2011లోనే ఆంధ్ర ప్రదేశ్ ఉలిక్కిపడేట్టు చేసినవాడు ఈ బత్తుల అనిల్ రెడ్డే!

*** *** ***”

శరత్కాలపు స్తెప్ మైదానపు రోడ్డుమీద వాళ్ళిద్దరూ నడుస్తున్నారు. సువిశాలమైన ప్రకాశమానమైన దిగ్మండలం వాళ్ళ యెదట విస్తరించి ఉంది. దనియార్, జమీల్యాల మీదికి పోతుంది నా మనస్సు. “మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? జమీల్యా.. ప్రియతమా! నువ్వు వెళ్ళిపోయావు. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయావు. బహుశా నువ్వు అలసిపోయే ఉంటావు. దనియార్ పాటలతో స్తెప్ మైదానానికి చైతన్యం వచ్చి, తన రంగులన్నిటినీ ప్రదర్శించనీ! నా ప్రతి కుంచెలోనూ దనియార్ పాట మార్మోగుగాక! నా ప్రతి కుంచె లోనూ జమీల్యా హృదయం స్పందించుగాక… ” చింగీజ్ ఐత్ మాతోవ్ ‘ జమీల్యా ‘ లోని ఈ చివరి మాటలు చదివి విజయవాడ, ఏలూరు రోడ్డు మీద వెన్నెల ఆకాశం కింద పరవశంతో నడిచి వెళుతున్న నవయవ్వనపు రోజులవి! అప్పటికి అనిల్ బత్తుల అనే బాలుడింకా కళ్ళు తెరవనేలేదు.

*** *** ***

అలెక్స్యేవ్ తోల్ స్తాయ్ రాసిన సైన్స్ ఫిక్షన్ ‘అయిలీత’ చాలా ఏళ్లు గుర్తొచ్చేది. అంగారక గ్రహం నుంచి లోశ్, గూసెవ్ – ఇద్దరూ తిరిగి మాస్కో వచ్చేస్తారు. బుల్లి రేడియోలో ఒక మధురమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. అది అయిలీత గొంతు. దూరాతి దూరం నుంచి భూలోకానికి సంబంధించని భాష, జాలి గొలుపుతూ, పునశ్చరణ చేస్తూ… ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఆకాశపుత్రా! ఆ గొంతుక గాలిలో లీనమైపోయింది. అయిలీత కంఠస్వరం. ప్రేమవాణి, అమరవాణి, తీరని కోరికకు చిహ్నమైన వాణి… విశ్వాంతరాళ ప్రదేశం దాటి తనను పిలుస్తూంది… బతిమాలుకుంటూంది… దీనంగా వేడుకుంటూంది. “ఎక్కడున్నావు నువ్వు, ప్రియతమా?” ఇది చదివి మేము దిగులుతో కరిగి నీరైపోయే నాటికి అనిల్ బత్తుల అనే కుర్రాడింకా పుట్టనేలేదు.

*** *** ***

2010వ సంవత్సరం… ఒక సాయంకాలం… హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టిస్ట్ మోహన్, నేనూ ఉన్నాం. మోహన్ కో ఫోనొచ్చింది, కలవొచ్చా? అని. “ప్రెస్ క్లబ్ లో ఉన్నా. రాగలిగితే సరే” అన్నాడు మోహన్. ముచ్చటగా ఉన్న 30 సంవత్సరాల యువకుడు వచ్చాడు. అనిల్ ని అన్నాడు. నాటి పుస్తకాల స్నేహం పుష్పించి, పరిమళించి అబిడ్స్ కి వెళ్లి పాత పుస్తకాలు సంచులతో కొనుక్కునేదాకా విస్తరించింది.

*ఎన్నెన్ని కథలు!ఎవా వాసిలివిస్కాయ – రెక్కల కుందేలుమికోలాట్రుబ్ లైని – వెండి చేపపిల్ల కథలియో టాల్ స్టాయి – మూడు ఎలుగుబంట్లుఅలెగ్జాండర్ పుష్కిన్ – జాలరి బంగారు చేపమాక్సిమ్ గోర్కీ – సముద్ర తీరంలో పిల్లవాడుఅలెగ్జాండర్ అఫనాసియేవ్ – నిప్పు పక్షిఆర్కాదిగైదార్ – తిమూర్ అతని దళం… ఇలా కొన్ని డజన్ల కథలు, రచయితలు, వాటికి బొమ్మలు వేసిన ఆర్టిస్టుల గురించి గంటల తరబడి మాటలు. బుజ్జి మేకపిల్ల, నొప్పి డాక్టర్, హనీ కేక్స్ పెడతానూ, తాయం పెడతానూ, ఏడురంగుల పువ్వు, చందమామ రొట్టె, బంగారు చేపపిల్ల… ఇలా పుస్తకాల పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారు. వాటికి బొమ్మలు వేసిన ఆర్టిస్టులందరి పేర్లూ చెప్పడం అనిల్ స్పెషాలిటీ. ఇదే మోహన్ ని బాగా ఆకర్షించింది. ఆ ఆర్టిస్టుల పేర్లూ, ఏనుగు, ఎలుగుబంటి, కోడిపుంజు, నక్క, పిల్లి బొమ్మలు వేయడంలో వాళ్ల స్టైలూ, వాటి షోకు గురించి మోహన్ చెప్పేవాడు. ఆ రష్యన్ మహా కళాకారుల highly stylised drawings లోని mesmerising beauty వెనుక వున్న wonder ని మోహన్ చెపుతూ వుంటే అనిల్ కీ, నాకూ ఏదో ఒక మైకం కమ్మినట్టుగా ఉండేది.

*** *** ***

రష్యాలో 1917లో లెనిన్ బోల్షివిక్ పార్టీ అధికారంలోకి వచ్చాక, తొలి సంవత్సరాల్లోనే, అగ్రశ్రేణి సోవియెట్ రచయితలు, ఆర్టిస్టులతో లెనిన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రష్యాలో చలిని వణికించే చలి అనకూడదు. గడ్డకట్టించి, ప్రాణాలు తీసే క్రూరమైన చలి అది. అక్కడ పిల్లలు ఎవరూ ఉదయాన్నే నిద్ర లేచేవారు కాదు. పళ్ళు తోముకుని, ముఖం కడుక్కుని స్నానం చేయాలంటే గడగడా వణికిపోయేవాళ్ళు. అది వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసేది. కనుక రష్యన్ పిల్లల్లో ఆసక్తి, మానసిక వికాసం, చైతన్యం రగిలించడానికి బొమ్మల పుస్తకాలతో ప్రచారం హోరెత్తించాలని లెనిన్ చెప్పారు. దాంతో రచయితలు కొత్త కథలు రాశారు. ఆర్టిస్టులు ప్రాణం పెట్టి తరతరాల బిడ్డల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే బొమ్మలు వేశారు. ఆ అపూర్వమైన పిల్లల పుస్తకాల్ని అతి ఖరీదైన ఆర్ట్ పేపర్ మీద రంగుల్లో ముద్రించి ప్రపంచం అంతా పంచింది రష్యా.తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో మాస్కోలోనే ఆ పుస్తకాలు లక్షల్లో ప్రింట్ చేశారు. సాహిత్యంలో 19వ శతాబ్దపు రష్యన్ స్వర్ణయుగంలానే, బాలల బొమ్మల పుస్తకాలు వేయడంలో నాటి రష్యా సృష్టించిన చరిత్ర ఇది.

………………………………………………………………………………………….

ఇవి కూడా చదవండి…

భావాలను చంపే తుపాకులు పుట్టలేదు..

అడవిని కాపాడే మానవులను చూస్తారా?

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్!

……………………………………………………………………………………………………………….

40 ఏళ్లు లైబ్రేరియన్ గా పనిచేసి రిటైరైన మా చిరకాల మిత్రుడు కడుపు గంగాధరరావు పిల్లల కోసం ఏలూరులో చందమామ గ్రంథాలయం పెట్టారు. దాని ఓపెనింగ్ కి ఆత్మీయ అతిథి అనిల్ బత్తుల. అలా రెండు మూడుసార్లు ఏలూరెళ్ళిన అనిల్, అక్కడి పిల్లల్ని రంగుల బొమ్మల కబుర్లతో మురిపించాడు. మీకో పుస్తకాల నిధిని బహుమతిగా ఇస్తానని వాళ్లని వూరించాడు. ఏ విషయం అయినా సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే అనిల్, తాను ‘ రెడ్డి ‘ అని చెప్పుకోడానికి సిగ్గుపడతాడు. చాలా ఏళ్ళ క్రితం వాళ్ళ కుటుంబం ప్రకాశం జిల్లా నుంచి నిజామాబాద్ కి వచ్చేసింది. కొన్నేళ్ళు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వెలగబెట్టాడు. తండ్రి పెద్ద పోలిరెడ్డి చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. పిల్లల పుస్తకాలు, బాలల కవిత్వం బొమ్మలు అనిల్ ని చుట్టుముట్టాయి.అదే అతని life time ambition. ఒకేఒక్క magnificent obsession! ఈ సౌందర్యం ముందు, పెద్ద జీతం వచ్చినా software ఉద్యోగం చిల్లర పనిగా కనిపించింది. లక్షలాది software గొర్రెల్లో ఒక గొర్రెగా బతకడం వెర్రితనం అని అర్థం అయినట్టుంది!… And the maverick came out of the herd long back.

tadi prakash
Prakash Tadi

*** *** ***

బాగా దూకుడు. భలే చొరవ. ఆదివారం అనగానే రెక్కలు కట్టుకుని అబిడ్స్ లో వాలిపోయేవాడు. పాత పుస్తకాలు అమ్మడంలో ఆరితేరి, దాన్ని ఒక కళగా మార్చిన ఖాన్, హుస్సేన్ లాంటి అబిడ్స్ చిల్డ్రన్స్ బుక్స్ డాన్ లతో స్నేహం చేసేవాడు. డబ్బు అడ్వాన్స్ ఇచ్చేవాడు. ఏ రష్యన్ పిల్లల పుస్తకం వచ్చినా తనకి రిజర్వ్ చేసి ఉంచాలనేవాడు. వ్యాపారస్తులు ఆ బుక్స్ ఇంపార్టెన్స్ తెలిసినవాళ్లు. డిమాండ్ ని బట్టి రేటు, బిహేవియరూ మారిపోతాయి. కలెక్టర్స్ కాపీ అనీ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనీ కొన్ని విలువైన పుస్తకాలు ఉంటాయి. ఒకే ఒక్క పుస్తకమో, మహా అయితే రెండు కాపీలో ఉంటాయి. నలభై, యాభై ఏళ్ల క్రితం వాటి ధర 30 లేదా 40 రూపాయలు ఉండొచ్చు. ఇప్పుడు వాటిని వెయ్యీ, 1500, రెండు వేలకీ అమ్ముతారు. సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే బాగా చీప్ గా దొరుకుతాయి అనుకునే వాళ్ళకి ఈ వ్యాపార రహస్యం తెలీకపోవచ్చు. రెండు కాదు, మూడువేల రూపాయలైనా అది అరుదైన పుస్తకం అయితే అనిల్ కొనేస్తాడు. భద్రంగా దాస్తాడు. అలాంటి అమూల్యమైన అరుదైన వందల బొమ్మల పుస్తకాల ఖజానా అనిల్ దగ్గర మూలుగుతోంది. ఇరవై కథలు అనువాదం చేసి ‘ అపూర్వ రష్యన్ జానపద కథలు ‘ అనే ఒక ఆకర్షణీయమైన పుస్తకం వేశాడు 2018లో. అంతకుముందో బుక్కు వేశాడు రష్యన్ కథలతోనే. 2017 మొదటి నెలల్లో కావచ్చు, అప్పటికి మోహన్ ఆరోగ్యం సరిగా లేదు. అయినా అనిల్ కోసం మంచి ముందుమాట రాశాడు.అదే మోహన్ రాసిన చివరి వ్యాసం.ప్రెస్ క్లబ్ లో జరిగిన ఆ పుస్తకం ఆవిష్కరణ సభ కీ ముఖ్యఅతిథిగా మోహన్ వచ్చాడు. మాట్లాడాడు.అదే మోహన్ పాల్గొన్న చిట్టచివరి సభ.

…………………………………………………………………………………………..

ఇవి కూడా చూడండి…

Green School, Dream school 

Organic aquaculture

Deccan Development Society PV Satish Interview

ఈ రద్దీ హైదరాబాద్ నగరాన్నీ, కోవిడ్ చీకటి రోజుల్నీ వదిలించుకుందాం అనేమో, నిజామాబాద్ దగ్గర ఓ పల్లెలో ఉండే తల్లి మహాలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అనిల్. పుస్తకాల కోసం నగరానికి వచ్చి వెళిపోతున్నాడు. ఫేస్బుక్ లో పిల్లల కోసం రోజుకో పోయెమ్ రాస్తున్నాడు. ఉడతలు, మిడతలు, సీతాకోకచిలకల మీద రాస్తున్న ఆ కవితలు మనకి బాల్యం అనే ఒక దివ్యానుభూతిని ప్రసాదిస్తాయి. అరె.. అనిల్ ఇంత చక్కగా రాయగలడా? అని నేనైతే ఆశ్చర్యపోయాను.అనిల్ దగ్గర కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అవి భవిష్యత్ తరాల కోసం.. మన బిడ్డల బిడ్డల కోసం.. పిల్లల కథలు, కవితలు, మరిచిపోలేని బొమ్మలు… ఇంకా పిల్లల సినిమాలు కూడా తీస్తాడేమో! నాకు తెలిసీ, ఉన్న డబ్బులన్నీ పుస్తకాలు కొనడానికే తగలబెట్టాడు. ఆ దుస్సాహసమే ఇప్పుడు అతన్నొక అజేయశక్తిగా నిలబెట్టింది. విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పబ్లిషింగ్ జెయింట్స్ కంటే అనిల్ దగ్గర ఉన్న కలక్షనే పెద్దది, గొప్పదీ, అరుదైనది.వెలకట్టలేని కానుకల్ని ముందుతరాల కోసం అతను సిద్ధం చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అభిరుచీ, పిల్లల పట్ల అవ్యాజమైన అనురాగమూ ఉన్న అనిల్ కోటి కాంతుల కల ఫలిస్తుందా..?

HAPPY BIRTHDAY ANIL

– TADI PRAKASH 97045 41559

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles