పాప గారు ఈనాడులో కార్టూన్లు వేస్తున్న రోజుల్లో వాటిని అవగాహన చేసుకునే వయసు కాదు నాది. ఇంటర్ చదువుతున్నాను. నేను పత్రికల్లో చేరాక ఆయన కార్టూన్ రంగం నుండి బయటకు వచ్చేశారు. పొలిటికల్ కార్టూన్ల గురించి మిత్రుల దగ్గర ప్రస్తావన వచ్చినపుడల్లా ‘పాప’ గారిని గుర్తుకు చేసుకోవడం తెలుసు.

ఈనాడు వల్ల పాప పాపులర్ అయ్యారా? పాప కార్టూన్ల వల్ల ఆ పత్రిక మార్కెట్ పెరిగిందో చెప్పలేం కానీ , తెలుగు పత్రికల్లో పొలిటికల్ కార్టూన్ ప్రాధాన్యత మాత్రం పాప కార్టూన్ల తోనే మొదలైంది. అప్పటి నుండి మిగతా పత్రికలు కూడా రాజకీయ కార్టూన్ అవసరాన్ని గుర్తించాయి.
పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఏపీ ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌గా ఉన్నపుడు,హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో కార్టూన్ ఉత్సవ్ జరిపాం. ఆ సమయంలో కొందరు సీనియర్ కార్టూనిస్టులను గౌరవించుకోవాలనుకున్నపుడు పాప గారిని కూడా సత్కరించాలనుకుని వారిని ఆహ్వానించాం. అదే తొలిసారి ఆయన్ని చూడటం.తక్కువగా మాట్లాడతారు,ఆత్మీయంగా నవ్వుతారు.
ఆయన ఇంటర్వ్యూ కోసం 1.2.2022న ఫొటోజర్నలిస్ట్ కె.రమేష్‌బాబుతో కలిసి వెళ్లాను. జూబ్లీ హిల్స్,జర్నలిస్ట్‌కాలనీలో దాదాపు రెండు గంటల పాటు తన జీవన యాత్రను, ‘ఈనాడు’ అనుభవాలను మాతో పంచుకున్నారు. ఉద్యోగంలో తనకు అనేక ఇబ్బందులు ఎదురైనా, ఎవరినీ నొప్పించకుండా మాట్లాడారు. కాకినాడ నుండి హైదరాబాద్ ఎలా వచ్చింది? హాయిగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న తనను ‘ఈనాడు’ లో చేరమన్నది ఎవరు? లాంటి చాలా విషయాలు ముచ్చటించారు. ఆ వీడియోలను 3 భాగాలుగా రూరల్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేశాం. చాలా ఆసక్తిగా సాగిన ఆయన ఇంటర్వ్యూ పై సోషల్ మీడియాలో ఊహించని స్పందన వచ్చింది. ( వీడియోల కోసం ruralmedia ఛానెల్ ప్లేలిస్ట్ లోకి వెళ్లి media ను క్లిక్ చేయండి)
ఆ రోజు పాప గారితో ఇంటర్వ్యూ ముగిసిన తరువాత ‘‘ మీ కార్టూన్లతో ఒక బుక్ వేయండి. ఈ తరానికి చాలా అవసరం. ’’ అన్నాను.
‘‘ ఆలోచన ఉంది కానీ, కార్టూన్లు అన్నీ నా దగ్గర లేవు . ఎలా సేకరించాలో అర్ధం కావడం లేదు..’’ అని కాన్త నిర్లిప్తంగా అన్నారు. చివరికి ఆయన సంకల్పం వారి అమ్మాయి కవిత ద్వారా ఇలా పూర్తవుతుందని ఊహించలేదు.
ఈ కార్టూన్ సంకలనాన్ని తీర్చిదిద్దడంలో సహకరించిన సీనియర్ జర్నలిస్టు మార్పుగోపినాధ్ , అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాజీ పిఆర్‌ఓ ఎ.విశ్వేశ్వరరెడ్డి గార్లకు, ఆత్మీయ పలుకులు రాసిన జర్నలిస్టులు,కార్టూనిస్టులకు ధన్యవాదాలు.
సింపుల్ లైన్‌తో అరుదైన సెటైర్ సృష్టించిన పాప కార్టూన్లు ఈ తరం కార్టూనిస్టులకు ఒక అధ్యయనం. రాజకీయ పరిశీలకులకు ఒక డాక్యుమెంటేషన్.
… శ్యాంమోహన్,రూరల్ మీడియా
( కార్టూన్ల సంకలనం ‘పాప కార్టూన్లు’ బుక్‌ని ఉచితంగా చదవండి! ఆ కార్టూనిస్టు ఇంటర్వ్యూ వీడియోను వీక్షించండి. ఇదీ లింక్ https://heyzine.com/flip-book/aecf042c2b.html )