ఈ గ్రామాన్ని చూసి నేర్చుకోవాలి | How Can I change my Village

జల హో…
…………………………………………………..
సమస్య వచ్చినపుడే పరిష్కారాల కోసం తడుముకుంటాం. ఇపుడు హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల హడావడి ఇదే. ఈ పనేదో ఏడాది క్రితం చేసి ఉంటే ఈ రోజు భూగర్భ జలాల లేక ఇబ్బందులు పడేవాళ్లం కాదు. ఇంకుడు గుంత అంటే కేవలం వాన నీటి సంరక్షణ మాత్రమే కాదు… మనం రోజు ఇంట్లో వాడేసిన నీటిని మన పెరట్లోనే చిన్న కుంట తవ్వి భూమిలో ఇంకేలా చేయడం. ఈ పని ప్రభుత్వమే చేయక్కర లేదు. ప్రతీ పౌరుడి కనీస బాధ్యత. ఇలాంటి బాధ్యత తెలిసిన గ్రామీణ మహిళల గురించే ఈ ముచ్చట.
వానలు కురవక ఆ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. వ్యవసాయ బావులు, చిన్న నీటి వనరులకు చుక్క నీరు లేక వెల వెల బోయాయి.వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడ కపించడం లేదు. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి ఆ గ్రామ మహిళలు దూర దృష్టితో సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రతీనీటి బొట్టు వృధా కానివ్వకుండా కాపాడుకోవడానికి ఇంకుడు గుంతల నిర్మాణం ఒక్కటే మార్గమని భావించారు . కరీంనగర్‌ జిల్లా, బెజ్జంకి మండలం లోని మాధాపూర్‌ స్త్రీలు పట్టుదలతో సాదించిన విజయం వల్ల వారి గ్రామంలో జలసిరులు పారుతున్నాయి.

మాదాపూర్‌లో నీటి జాడ క్రమంగా అంతరించి పోవడం ఏడాది క్రితం మాదాపూర్‌ మహిళలు కన్నంశాంత,మ్యాధారిస్వరూప,మాడుగులకనకవ్వ, నూనెపద్మ, కుమ్మరిరాజమణి, గాజులభాగ్యలక్ష్మి, మాడుగుల శృతి, గొడుగు శ్రీలత, బొల్లం లావణ్య, జాగిరి రేణుక గమనించారు.
బోర్లు ఎండి పోతున్నాయి. బావుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది. బత్తాయి,మామిడి తోటలకు నీరు లేక కాయలు రాలి పోతున్నాయి. ఇదంతా చూస్తూ కూర్చోకుండా పరిష్కారం దిశగా అడుగులు వేశారా మహిళలు. సమస్యను సర్పంచ్‌ రవీందర్‌ రెడ్డి దృష్టకి తీసుకెళ్లారు. ఉన్న నీటిని కాపాడుకోక పోతే భవిష్యత్‌ అంధకారమని సర్పంచ్‌ వారితో కలిసి జల రక్షణకు అడుగులు వేశారు. కొందరు ఇబ్రహీంపూర్‌ గ్రామంలో (మెదక్‌జిల్లా) ఉన్న ఇంకుడు గుంతలను చూసి వచ్చారు.
సర్పంచ్‌ రవీందర్‌ రెడ్డి అవగాహన సమావేశాలు నిర్వహించి గ్రామస్ధులను చైతన్య పరిచారు.
స్దానిక శాసన సభ్యుడు రసమయి బాలకిషన్‌ చేతుల మీదుగా
నవంబర్‌, 2015లో ఇంకుడు గుంతలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నరేగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌తో కలిసి ఉపాధి హామీ ద్వారా నిధులు రప్పించి కొన్ని ఇండ్లలో ఇంకుడు గుంతలు తవ్వారు.
మహిళలు సొంతంగా గుంతలు తవ్వుకుంటూ చుట్టుపక్కల గ్రామాల నుండి బండరాళ్లను ట్రాక్టర్ల ద్వారా రవాణా చేసుకుంటూ తక్కువ కాలంలోనే 264 ఇండ్లలో ఇంకుడు గుంతలు పూర్తి చేశారు. సర్పంచి రవీందర్‌ రెడ్డి తన సొంత నిధులతో 200 ఇంకుడు గుంతలకు అవసరమయ్యే మెటీరియల్‌ని రప్పించడమే కాక మిగిలిన 64 కుటుంబాలు స్వచ్చందంగా నిర్మించుకునేలా ప్రోత్సహించారు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌ కార్డులున్న వారికి ఇంకుడుగుంతల నిర్మాణం పనులు అప్పగించారు.

ఎండిన బావుల్లో నీళ్లు
సమిష్టి కృషితో ఈ మహిళలు సాధించిన విజయం నేడు తెలంగాణలో వందశాతం ఇంకుడు గుంతలున్న గ్రామంగా మాదాపూర్‌ ను మార్చింది.
గతంలో ఆరొందల అడుగులు తవ్వితేకానీ నీటి జాడ కనిపించేది కాదు. కానీ నేడు 120 అడుగులకే బోర్లు పడుతున్నాయి. గతంలో ఎండి పోయిన చేతి పంపులన్నీ ఇపుడు నీళ్లతో కళకళలాడుతున్నాయి.
ఇంకుడు గుంతలతో నీటిని సాధించిన మాదాపూర్‌ని చూసి సమీపంలో ఉన్న కాసింపేట్‌, జంగాపల్లి, మైలారం గ్రామాల ప్రజలు ఇంకుడు గుంతలు తవ్వడం మొదలు పెట్టారు.
ఇంతటితో ఈ గ్రామస్తులు తృప్తిపడలేదు. ఇండ్లలోనే కాక సర్కారీ ఆఫీసుల్లో కూడా గుంతలు తవ్వి గ్రామంలొ ఒక చుక్క నీరు కూడా వృధా కాకుండా ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకున్నారు.
రహదారులకు ఇరువైపులా ఆకుపచ్చని వనాలు పెంచుతున్నారు. మొక్కలు నాటి ఊరుకోకుండా వాటికి ట్రీగార్డులు పెట్టి, నిరంతరం నీరందేలా మహిళలలంతా పర్యవేక్షిస్తున్నారు.
వాలు ప్రాంతంలో వానలు వస్తే నీరు వృధా కాకుండా 20 ఫారం పాండ్స్‌ తవ్వుకున్నారు. హరిత హారంలో 32వేల మొక్కలు నాటారు.
ఇవన్నీ చేసి ఊరు కోకుండా, ఊరి భవిష్యత్‌ని కాపాడే మరో గొప్ప పని కూడా చేశారా గ్రామీణులు. గ్రామంలో ఉన్న నాలుగు లిక్కర్‌ షాపులను మూయించారు.
ఇపుడు చెప్పండి… మాదాపూర్‌ మహిళలు మనకు ఆదర్శం కాదా?


నిర్మాణం ఇలా
ఇంకుడు గుంత నిర్మాణానికి రెండు మీటర్ల పొడవు వెడల్పుతో రెండు మీటర్ల లోతు వరకు గుంత తవ్వాలి. అందులో గజం ఎత్తువరకు 60 మి.మీ బండరాళ్లును పరచాలి.వాటి మీద,గుంత మధ్యలో ఉండేలా సిమెంట్‌ గోలెం పెట్టి దాని మధ్య భాగానికి కొంత ఎత్తులో చుట్టూ నాలుగు రంద్రాలు చేయాలి. మళ్లా గోళెం చుట్టూ 40 మి,మీ. బండరాళ్లును పై వరకు పరచాలి. ఇంట్లో వాడిన నీరు అందులోకి పోయేలా పైపును బిగించాలి. వర్షాలు పడినపుడు, ఇల్లు కడిగినపుడు వృధాగా పోతున్న నీరు కూడా ఈ గుంతలోకి పోయేలా పైపు ఏర్పాటు చేయాలి. పైపులన్నీ ఒకే చోట కలిసేలా చాంబర్‌ నిర్మాణంలో ఒకే పైపు ద్వారా వాడిన నీటిని గుంతలోకి పంపించ వచ్చు. దీని నిర్మాణానికి రూ.4000 ఖర్చు అవుతుంది.

కరవును జయించవచ్చు.
ఇంకుడుగుంతల వల్ల భూగర్భ జలాలు రీచ్చార్జి అయి కరవు ప్రభావం అధిగమించవచ్చు. ఇంటి పరిశరాల్లో నీరు నిలువ ఉండదు. దోమలు ,పందుల సంచారం తగ్గి పరిశుభ్రవాతావరణం ఏర్పడుతుంది.
భూగర్భ జలాల పరిరక్షణకు మా గ్రామంలో వందశాతం ఇంకుడు గుంతలు నిర్మాణానికి మహిళలు ముందుకు రావడంతో మిగతా వారిని చైతన్య పరిచి లక్ష్యం సాధించాం. గ్రామంలోని అన్ని కుటుంబాలు ఇంకుడు గుంతలు నిర్మాణం సకాలంలో పూర్తి చేసేలా పాలక వర్గంలో సమిష్టిగా చర్యలు చేపట్టి విజయం సాధించాం. ఇంకుడు గుంతల పై ప్రజల్లో అవగాహన కల్గించడం కోసం అనేక సార్లు గ్రామసభలు నిర్వహించి గ్రామ చౌరస్తాల్లో గోడరాతలు రాయించాం. అధికారుల సహకారంతో అవగాహన కల్గించాం. మా కృషి ఫలించి ప్రస్తుతం గ్రామంలో నీటి సమస్యలు తగ్గాయి.
…. రవీందర్‌ రెడ్డి, మదాపూర్‌ సర్పంచి.

హరిత గ్రామం మాదాపూర్‌

1,భూగర్భజల పరిరక్షణకు ఇంట్లో వాడిన నీటిని అక్కడే ఇంకిపోయేలా మాధాపూర్‌లో 264 ఇళ్లలో ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు.
2, పర్యావరణ పరిరక్షణ పద్దతులను ఇక్కడి రైతులు 2011 నుండి మొదలు పెట్టారు. 2011..12 సంవత్సరంలో 12మంది రైతులను ఎంపిక చేసి వారితో 2020 మొక్కలు నాటించారు.
2012..13 లో 80మంది రైతులతో 16377 మొక్కలు నాటించారు.
2013..14 లో 14మంది రైతులతో 3470 మొక్కలు నాటించారు.
2014..15 లో 42మంది రైతులతో 17239 మొక్కలు నాటించారు.
హరిత హారంలో భాగంగా 2014..15 లో ప్రతీ ఇంటికి 5 మొక్కలు చొప్పున 1320 మొక్కలు సరఫరా చేశారు. ప్రభుత్వ సంస్ధల ఖాళీ స్ధలాల్లో 17239 మొక్కలు నాటించారు.
3, ఉపాధి హామీపధకం(ఐహెచ్‌హెచ్‌ఎల్‌) లో 68 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఈ గ్రామంలో జరిగింది.
4, ఇళ్లలో వాడిన నీరంతా ఇంకుడు గుంతల్లోకి చేరడంతో ఒక ఇంట్లో ఎండి పోయిన బోరు రీచ్చార్జి అయింది. అలాగే ఊరి మధ్యలో ఉన్న ఊట బావిలో కూడా నీటి మట్టం పెరిగినట్టు గ్రామ మహిళలు గుర్తించారు.
………………………………………………………………………………………………..
… శ్మాంమోహన్‌, (9440595858)

టీవీ,సెల్ ఫోన్,కంప్యూటర్ వాడని ఊరు! అమెరికాలోఉంది చూడండి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles