ఆ రోజు ఆ పత్రిక మందుపాతరలా పేలింది!!

అది 1989 ..ఒక శరత్కాలపు సాయంత్రం,బందర్‌ రోడ్‌లో ‘ఉదయం’ ఆఫీసు బయట,టీ తాగుతున్నాం…

‘‘ ఇతని పేరు శ్రీను… రేపటి నుండి మనతో కలిసి పని చేయబోతున్నాడు… అడవి నుండి డైరెక్టుగా ఆఫీసుకి వచ్చాడు…’’ అని ఎవరో సరదాగా పరిచయం చేశారు. చేతిలో ఉన్న గుంటూరు శేశేంద్రశర్మ ‘నాదేశం నా ప్రజ’ను చాతికి అన్చుకుంటూ….కిసుక్కున నవ్వుతోన్న చందమామలా నా వైపు చూశాడు శ్రీను…అలా మొదలైంది మా పరిచయం…వచనం తప్ప కవిత్వం తెలియని నాకు, కవిత్వం చదవక పోతే వచనమై పుడతావ్‌ అని బెదిరించి చదివించాడు. తను చూస్తున్న సాహిత్య పేజీలో కవిత లకు సర్రియ లిస్ట్ బొమ్మ లు గీయించాడు.

Tripuraneni Srinivas

ఒక రోజు రాత్రి 7 గంటలకు నా రూమ్‌ తలుపు చప్పుడయింది.ఎదురుగా శ్రీను. నన్ను పక్కకు తోసుకుంటూ లోపలకు దూసుకు పోయి షెల్ప్‌లో పుస్తకాలు చిందర వందర చేస్తున్నాడు. ‘‘ ఏం కావాలో చెప్పొచ్చుగా…?’’ అన్నాను అర్ధం కాక…‘‘ ఆ … దొరికాడు డాలీ…’’ అన్నాడు మనోహరంగా నవ్వుతూ…‘‘ సాల్వ్ డార్‌ డాలీ పోయాడని ఇపుడే పీటీఐ న్యూస్‌, స్టోరీ చేయాలి.. ఆకాశం వైపు మెలి తిరిగిన మీసాలున్న డాలీ ఫొటో ఉన్న బుక్‌ నీ దగ్గర చూసినట్టు గుర్తుకొచ్చి, ఆఫీసు నుండి ఇటే వచ్చేశా… రేపు ఆఫీసుకు వచ్చినపుడు తీసుకో… ’’ అని వచ్చినంత స్పీడ్‌గా వెనక్కి తిరిగాడు.

ఉదయం పత్రిక అస్తమించే పరిస్ధితులు ఏర్పడ్డాయి.కొంత కాలానికి, అదే రోడ్‌లో ఉన్న ఆంధ్రజ్యోతిలో కార్టూనిస్టుగా అవకాశం రావడంతో చేరి పోయాను.నండూరి గారు ఎడిటర్‌. 12గంటలకల్లా రెండు మూడు ఐడియాలు ఆయనకు చెప్పి కార్టూన్‌ మొదలు పెట్టాలి. ఒక మధ్యాహ్నం నండూరి క్యాబిన్‌లో మా మీటింగ్‌ అయ్యాక నేను బయటకు వస్తుంటే ఎర్రపూల షర్ట్‌తో మెరుస్తున్నాడు శ్రీను. ‘‘ ఇక్కడ సండే ఇన్‌ఛార్జిగా చేరుతున్నా శ్యామ్‌… మీ ఎడిటర్‌ పక్కదే మా క్యాబిన్‌ ’’ అని మరోసారి కిసుక్కున నవ్వాడు. అతనితో పాటు భుజాల వరకు జుత్తు,అందమైన గడ్డంతో వెలుతురు నిండిన కళ్లతో శ్రీవత్స అనే లెజెండర్‌ కూడా ఉన్నాడు. వారిద్దరూ ఆంధ్రజ్యోతి అంతు చూడాలని… రాక్షసుల్లా పనిచేసేవారు. అప్పటి వరకు ఓ క్రైమ్‌ కథ, వింతలు విడ్డూరాలు, నాలుగు కవితలు, సీరియస్‌ సాహిత్య చర్చతో నీరసించి పోతున్న సండే మ్యాగజైన్‌కి యవ్వనోత్సాహాన్ని తెచ్చి, ప్రతీపేజీ.. అబ్బుర పరిచేలా తీర్చిదిద్దాడు. జిల్లా రిపోర్టర్ల వెంట పడి హ్యూమన్‌ ఇంట్రస్టింగ్‌ కథనాలు రాయించేవాడు..

అలా ‘ఎందరికో ఒయాసిస్‌గా మారిన పెద్దాపురం మహిళల’ జీవితాన్ని సీరియల్‌గా వేశాడు. అప్పట్లో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఒక తెలుగు సినిమాను విడుదలకు ముందే ప్రివ్యూ చూసి, ‘మానవహక్కుల పై తొలి సినిమా’ అని కవర్‌ స్టోరీ రాసి వదిలాడు.రిలీజ్‌ తరువాత, నిజంగానే సంచలనం సృష్టించింది ‘అంకురం’ . ఆ సినిమాలో రేవతి,ఓంపురి నటించారు.

ఫీచర్‌ జర్నలిజంలో శ్రీను చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే  ఇల స్ట్రేటెడ్‌ వీక్లీ ఎడిటర్‌ ప్రితీష్‌ నంది గుర్తుకు వచ్చేవాడు.ఇపుడున్నన్ని పత్రికలు అపుడు లేవు. జ్యోతికి ఈనాడు మాత్రమే పోటీ, సండేమ్యాగజైన్‌లో వచ్చిన మార్పుల తో సర్క్యులేషన్‌ పెరగడంతో ఎండీ జగదీష్‌ ప్రసాద్‌ హ్యాపీగా ఉన్నారు. డైలీని కూడా మార్చాలనే తపన అపుడే మొదలైంది.

ఒక రోజు ఉదయం క్రిష్ణానదికి ఈతకు వెళ్లి వస్తున్నాం…‘ ఎంత కాలం ఇలా కార్టూన్లు వేసుకుంటూ ఆఫీసులో కూర్చుంటావ్‌?దట్టమైన అడవుల్లో తిరిగొద్దాం, వస్తావా…?’ అని పిలిచాడు శ్రీను. లీవ్‌ దొరక్క వెళ్లలేక పోయాను కానీ, ఒక అద్భుతాన్ని మిస్‌ అవుతున్నానని అపుడు నాకు తెలీదు.అతను మాత్రం రెండు రోజుల తరువాత మాసిన గడ్డంతో ఆఫీసుకు వచ్చాడు.క్యాబిన్‌ లోపల హడావడిగా ఉంది. సర్క్యులేషన్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ వాళ్లు వచ్చి పోతున్నారు… ‘‘ ప్రింట్‌ ఆర్డర్‌ పెంచండి..లూజ్ సేల్స్‌ బాగా పెరుగుతాయి..’’ అంటున్నాడు శ్రీను వాళ్లతో.

ఆ మార్నాడు ఆంధ్రజ్యోతిలో న్యూస్‌ మందుపాతరలా పేలింది!!రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఛత్తీస్‌ గడ్‌, ఒరిస్సాల్లో పోలీసుల కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు సెర్చ్‌ చేస్తున్న, మోస్ట్‌ వాంటెడ్‌ పీపుల్స్‌వార్‌ నాయకుడు కొండపల్లి సీతారామయ్య తో ఇంటర్వ్యూ ఫస్ట్‌ పేజీలో మల్టీకలర్‌ ఫొటోలతో పరుచుకుంది.చిక్కని అడవుల మధ్య జొన్న చేనులో ఆ వృద్ధ వీరుడి అనుభవాలను,నరాలు తెగిపోయే ఉత్కంఠతో, మలుపులు తిప్పే  సస్పెన్సుతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ అక్షరానువాదం చేసి రెండు రోజులు సీరియల్‌ గా రాశారు.ఆ దెబ్బకు , పత్రిక ప్రతులు లక్షల్లో కి పెరిగాయి.తెలుగు జర్నలిజం చరిత్రలో ఆదొక విస్ఫోటం.

నండూరి రాంమోహన రావు రిటైర్‌ అయ్యాక , ఐ.వెంకట్రావ్‌ ఎడిటర్‌ అయ్యారు. నన్ను హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. కొన్ని రోజులకు శ్రీను ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్‌గా ప్రమోట్‌ అయి హైదరాబాద్‌ వచ్చేశాడు.

జర్నలిజం జర్నీలో ఎందరో కలుస్తుంటారు… వారిలో అరుదైన వండర్‌…ఈ శ్రీను అనే త్రిపుర్నేని శ్రీనివాస్‌. అతడ్ని తలుచుకోవడమంటే వేకువ కంటే ముందే వచ్చే సూర్యోదయాన్ని, జర్నలిజం సెలిబ్రేషన్‌న్ని, అక్షరాల్లో యవ్వనాన్ని నెమరేసుకోవటమే. 

ఆ రోజుల్లో ఎవరూ పట్టించుకోని స్త్రీ, దళిత, మైనారిటీ సాహిత్యానికి,తను పనిచేసే పత్రికల్లో తొలి ప్రాధాన్యత నిచ్చేవాడు. ఎంత గొప్ప పేరున్న వారైనా, కవిత్వమో, కథో మామూలుగా రాస్తే నిర్మొహమాటంగా ఇది యీ కాలపు రచన కాదని ముఖంమీదే చెప్పేవాడు. అందుకోసం ఉద్యోగపరమైన వత్తిళ్లని ఎన్నో నవ్వుతూ భరించాడు. పాత్రికేయ వృత్తికి , కవిత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎక్కడ నవ్యత, ప్రయోగాత్మకత కనిపించినా, ఇట్టే పసిగట్టి ఆ కలాలను ప్రోత్సహించాడు.
రావిశాస్త్రి నవల లోని కవిత్వాన్ని ఒడిసిపట్టి ‘ఎన్నెలో ఎన్నెలో ..’ ప్రచురించాడు. త్రిశ్రీ ది పదునైన పదజాలం

‘‘ కొత్తవైన ప్రతీకలతో కవిత్వం కావాలి,  ప్రజల మీదే రాయి. ప్రజల్లోని అనాధ గాధల మీదే రాయి, కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకిదూసుకుపోయే కవిత్వం రాయి, ఒక వాక్యం చదవగానే… అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి… అతడి ఛాతీమీద ధాటీగా రెండు నమ్మకాల్ని రాయి, ధైర్యంగా శౌర్యంగా అతడ్నొక వీరుడ్ని చెయ్‌ , కవిత్వమై అతడికి కాపలా కాయ్‌…’’

…… అంటూ కవిత్వపు గుండెచప్పుడిని ప్రపంచానికి వినిపించి,ఏదో పని ఉన్నట్టు హడావడిగా ఒక వర్షం పడుతున్న రాత్రి, 1996 ఆగస్టు 17 హైదరాబాద్‌ ,లోయర్‌ టాంక్‌ బండ్‌ రోడ్డులో మెరుపులా అదృశ్యమయ్యాడు. – ShyamMohan

టీవీ,సెల్ ఫోన్,కంప్యూటర్ వాడని ఊరు! అమెరికాలోఉంది చూడండి!

…………………………………………………………..

‘‘పచ్చని తివాచీ పరిచినట్టుంది ఆ ఊరు. పక్కనే గలగలా పారుతున్న ఏరు. చుట్టూ పచ్చని పొలాలు, దూరంగా బోర్లించినట్టు కొండలు, వాటి నడుమ నీటికుంటలు. పాడిపంటలకు లోటు లేని జీవితం…” ఇలాంటి ఇమాజినేషన్‌ కతల్లో, సినిమాల్లో చూస్తుంటాం. నిజంగా పచ్చల హారం వంటి పల్లె ఉంటుందా? అని ఎప్పటి నుండో వెతుకుతుంటే మాకు అనంతపురం జిల్లాలో కనిపించింది. ఒకపుడు ఎడారి లాంటి ఆ ప్రాంతాన్ని… గ్రామస్తులు ఎలా మార్చారో … https://youtu.be/M5PybmFagRo చూడండి.

…………………………………………………………….

కొండగాలి, కొత్తసాగు!

మామూలుగా పొలం పనే కష్టం.  కొండల వాలులో చుక్క నీరు నిలువని చోట వరి పండిరచడమంటే, నిత్యజీవన పోరాటమే! అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడీ యువకుడు. కొండమీదకు మెట్లుగా మడులు కడుతూ,నాట్లు వేస్తూ, మనకందనంత ఎత్తుకి ఎలా వెళ్తున్నాడో, https://youtu.be/kAN3fkvgWrM చూసి తరించండి!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles