గీతా బోధ ఇల్లు కావొచ్చు వాకిలి కావొచ్చు మనిషి, హృదయం, దేశమే కావొచ్చు, ఎల్లలున్న ఏదయినా స్వార్థం లేనిదంటే వొప్పుకోను చివరికి భూమి ఆకాశం సముద్రమైనా …వీధిలోకొచ్చే కూరగాయల బండిలోంచి మెరుగైన సరుకు ఎంచుకోడంలో ఇరుగు పొరుగుల పోటీ,కొనుక్కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, అనుదినం అడుగులేసేటప్పుడు అవతలివారిని కిందుచేసే, పరస్పరం నరుక్కొనే పోటీ, పోటీ లేనిదే క్వాలిటీ ఉండదనే ఆత్మహత్యా సదృశ డ్యూటీ పోటీ తోబుట్టువైంది ప్రపంచం,జీర్ణించుకొన్నది సంపూర్ణంగా డార్విన్ సిద్ధాంతం, బరిలో బలహీనులకు చోటుండదనే అమానుషం…..
అయినవారూ కానివారూ వుండని వొంటి స్తంభపు మేడ చందం,పై చేయి కోసం పుంజుకత్తులకు విషం పూసి,ధర్మోత్తముని చేతనే చావని కొడుకు చచ్చాడని చెప్పించి గురువు తల నరికిన దుస్సంప్రదాయంపోటీ లేకుంటే నాణ్యత కోసం తాపత్ర్యముండదని,శ్రమ సోమరిదవుతుందని, ఉత్పత్తులు వ్యాపారాలు మూతపడి విశ్వశవం భూమి మోడుకు వేళ్ళాడుతుందని చెప్పి, పురుగును బల్లి, బల్లిని పాము, పామును మనిషి, మనిషిని సాటి మనిషి విందు చేసుకొని పసందుగా లోకాన్ని స్వార్ధపాకంగా మార్చే పిరమిడ్ ప్రీతులు చెప్పి హద్దులేర్పరిచారు, ఎవరెస్టును కొందరికే పరిమితం చేశారు, కులాల గోడలతో, ముఠాల మేడలు కట్టి కుత్తకలు కోసుకోడం అలవాటు గావించారు.
ఆయుధ బజారులతో ఆత్మీయతలను బేజారు చేసి, బడిబిడ్డలకు తుపాకులందుబాటులోవుంచి ముద్దు బాల్యాన్ని రక్తసీసాలు గావించి మోజుగా తాగుతున్నారు,తమది కాని చోట అన్నదమ్ములకు తంపులు సృష్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు,హద్దులు చెరిపితేగాని ముద్ద యావన్మందిదీ కాదు,కలిసి కష్టపడి ఉమ్మడిగా బతికే రోజు రాదు,వెనుకబడినవారిని వేలందించి ముందుకునడిపించే ముచ్చటైన క్షణం మళ్ళీ ఆవిర్భవించదు, ‘గీత’ను భూస్థాపితం చేస్తే గాని భూమి బాగుపడదు
-నిజం,28-06-2021
( జి. శ్రీరామ మూర్తి సీనియర్ పాత్రికేయులు . పలు ప్రముఖ దిన పత్రికలకు సంపాదకులుగా పని చేశారు.
‘నిజం’ కలం పేరు.)
………………………………………………………………………………..
ఇవి కూడా చదవండి…
భావాలను చంపే తుపాకులు పుట్టలేదు..
అడవిని కాపాడే మానవులను చూస్తారా?
అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్!