ట్రాన్స్ కో, జెన్ కో.. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? కనీసం ట్రాన్స్ఫార్మర్ అంటే కూడా వాళ్లకు తెలీదు. తెలిసిందల్లా.. అడవుల్లో కట్టెలు, కాయలు ఏరుకోవడం, బీడీలు చుట్టుకోవడం.. కూడు కోసం పోడు సేద్యం చేయడం. అలాంటి కష్టజీవులు సడన్ గా, ముఖ్యమంత్రి పేషీలో ప్రత్యక్షమైతే, ఎలా ఉంటుంది.?
సీఎం ఎదురుగా హూందాగా కూర్చోగా వారి చెరో పక్కన అధికారులు నిల బడి,వంగి వినయంగా ఫైళ్లమీద సంతకాలు తీసుకొని ఎంఓయు కుదుర్చుకుంటుంటే… ఇది కలయా?నిజమా అని కళ్లు నలుపుకొని చూసే సరికి వారు మీటింగ్ ముగించుకొని, కట్టెలు ఏరుకొని కొండ దిగివస్తున్నట్టు… పేషీ మెట్లు దిగి, నవ్వుతూ బయటకు రావడం ఒక అరుదైన అబ్బురం !!
మైక్రో ఇరిగేషన్ సమాచారం కోసం, హైదరాబాద్ సెక్రటేరియట్లోకి వెళ్లగా,
‘ సి బ్లాక్ ’ దగ్గర ఎదురైన సీన్ అది.
అధికారులు హడావడిగా, ఫైల్స్ పట్టుకొని లోపలి నుండి బయటకు వస్తుంటే, వారి వెనుకే పల్లె మహిళలు ఉన్నారు. ఒకరిని పకరిస్తే…
‘‘ రంపచోడవరం ఏజెన్సీ నుండి వచ్చామండీ, సీఏం గారు కబురుచేశారు.’’ అందామె.
మామూలు గా అయితే బడా కార్పొరేట్ కంపెనీ బాసులు సీఏం పేషీలో మీటింగ్ లకు వస్తుంటారు.దీనికి భిన్నంగా మన్యంలో మట్టి పనులు చేసుకొనే, అతి మూమూలు ఆడవాళ్ళకు ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ ఇవ్వడం ఏమిటి? దీని వెనుకున్న ముచ్చటేమిటో, తెలుసుకోవాలనుకొని…ఆ తరువాత వేరే పనుల్లో పడి మరిచిపోయా…
………………….
సీన్ కట్ చేస్తే…
సంవత్సరం తరువాత ఒక రోజు నాబార్డ్ సీజీఎం మోహనయ్యగారు పిలిచారు.
‘‘ ఒక ఇంట్రస్టింగ్ కేస్ స్టడీ ఉంది. ఏలేరు నది మీద మహిళలు పవర్ ప్రాజెక్ట్ పెట్టారు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాం… మీరు స్టోరీ చేయాలి. ’’ అని, రెండు పేజీల నోట్ ఇచ్చారు.
………….
రోడ్డు పక్కనే పెసరట్లు వేస్తున్నారు. పెనం మీద అవి కాలుతుంటే, సన్నగా తరిగిన, అల్లం, పచ్చిమిర్చి,పుదీనా చల్లు తున్నారు. సత్తు గిన్నెలోని ఇప్పనూనెను కొబ్బరి చిప్ప గరిటతో, రౌండ్ గా పోసి, అట్లు తిరగేసి లేత అరిటాకులో వేసి చేతిలో పెట్టారు. ఉప్మా కావాలంటే పెట్టు కోవచ్చు. ఛాయిస్ మనదే… నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి.
‘‘ ఇక్కడ ఐదొందల కుటుంబాలు వరకు ఉంటాయండే. చేపల వేట, జీలుగ కల్లు, వరి, జీడిమామిడి పంటలే మాకాధారం. ఎవరికీ పెద్దగా సదువుల్లేవండీ బాబూ !!’’ పక్కనే పిండి రుబ్బుతున్న ఆమె ఊరిని పరిచయం చేసింది.
అలాంటి గిరిజనులే ఏకంగా ఒక విద్యుత్ ప్రాజెక్టును నడపడం.. ఊళ్లోవాళ్లే నమ్మలేని ముచ్చట .
అక్కడి నుండి సమీపంలోని, విద్యుత్ ప్రాజెక్ట్ కి చేరుకున్నాం.
లోపల మిషన్ కి రిపేర్లు చేస్తున్నారు నలుగురు మహిళలు. అరగంట తరువాత మాకు ప్లాంట్ ని చూపించి, అక్కడి విశేషాలు చెప్పారు.
ఆ రోజు సెక్రటేరియట్లో చూసిన వాళ్లే వీరంతా… అప్పటి మీటింగ్ లో సీఎంతో తీసుకున్న ఫోటోలు చూపించింది సత్యవతి. ఈ టీమ్ కి ఆమె బాస్.
‘మా ఊరి పక్కనే పారే ఏలేరులో చేపలు పట్టుకోవడమే మాకు తెలుసు. ఇప్పుడు, ఇవే నీళ్లతో కరెంట్ ను సృష్టించడం వింతగా అనిపిస్తుంది..’ అని సంతోషంగా చెప్పింది, బట్టు రాజేశ్వరి.
‘‘ ఈ ప్రాజెక్టు నిర్వహణకు మాతో ఒక కమిటీ ఏర్పడింది . పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించాం. యంత్రాలు ఎలా వాడాలో తెలుసుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టిన తర్వాత.. మాలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది.’ అన్నారు,ట్రైబల్ విమెన్ పవర్ ప్రాజెక్టు కమిటీ అసోసియేషన్ ఆఫ్ ది వేటమామిడి’ సభ్యులు మద్దికొండ దేవకాంతమ్మ,మడకం లక్ష్మి.
ఇవి కూడా చదవండి…
జన గణమణలో ఈ జనం కనిపించరు? https://www.ruralmedia.in/water/untold-story-from-telangana/
Tripura’s Bamboo Salt | A Healthy Alternative https://www.ruralmedia.in/back-to-nature/tripuras-bamboo-salt-a-healthy-alternative/
ఇవి కూడా చూడండి WATCH NEXT: How to Make Variety Bags with Banana Fiber https://youtu.be/sxHJWAnjO5M
సహజసిద్ధమైన జలపాతాలు , నదులు, వాగులు వంకల్లో పారే నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, వచ్చిన ఆదాయంతో స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం లక్ష్యంగా ఏపీ గిరిజన విద్యుత్ సంస్థ ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పింది. నిర్మాణానికి అవసరమైన నిధులు నాబార్డ్ ఇచ్చింది. …………………………….
అడవితల్లిని నమ్ముకుని బతికే వీళ్లు.. అభివృద్ధికి దూరంగా ఉంటారనుకుంటాం. గుడ్డి దీపాల వెలుతురు లోనే బతుకుతారని భ్రమిస్తాం. ఇక్కడికి వస్తే మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. ఎందుకంటే, కరెంటుకు నోచుకోని ఆ గిరిజనులే ఇప్పుడు కరెంటు ఉత్పత్తికి నడుం బిగించారు. అక్షరం ముక్క రాని మహిళలే..12 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని సమర్థంగా నడుపుతున్నారు.
………………..
అంతా బాగుంది కానీ, ఇంతకూ వీరితో ఆనాడు మీటింగ్ జరిపిన సీఎం ఎవరనే కదా మీ సందేహం…
ఈ మహిళా శక్తిని గుర్తించి, ఏకంగా విద్యుత్ శక్తిని సృష్టించే పని అప్పగించింది, 2007లో ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే కష్టపడి పనిచేయమని , వీరికి గుడ్డి దీపాల గూడేలను వెలిగించడం నేర్పారు.
తాము వెలిగి. పదిమంది జీవితాలనూ దేదీప్యమానం చేయడమూ తెలుసుకున్నారు కానీ, ఇంత చేస్తున్నా… వీరికిచ్చే గౌరవ వేతనం చాలా స్వల్పం. ఆదేమీ ఆలోచించకుండా, ఊరి బాగు కోసం, ఒక పూట ప్లాంట్లో పనిచేస్తూ, మరోపూట కూలికి వెళ్తున్న వీరికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. (shyammohan-9440595858)
…………………………………………………..
రాయల సీమ అంటే , కత్తులూ ,సుమోలు గాలిలో ఎగరడం సినిమాల్లో చూస్తాము. కానీ అక్షరానికి ఆక్సిజన్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా ?https://www.ruralmedia.in/desktop-story/a-man-who-likes-translation-of-books-from-oxygen-support-bed/