…తాగునీటికి 4కిలో మీటర్లు నడవాలి
…వానలు పడినా చుక్క నీరు నిలువదు
…మరుగు దొడ్లు ఎలా ఉంటావో తెలీదు
………………………………………………….
అక్కడ వానలు కురుస్తాయి కానీ తాగడానికి చుక్క నీరుండదు. భూములున్నాయి కానీ పంటలు పండవు, వీరికి గతం లేదు, వర్తమానం లేదు, ప్రభుత్వం పట్టించుకుంటే భవిష్యత్ ఉండవచ్చు.లేకపోతే అంతరించి పోతున్న జాతుల చరిత్రలో కలిసి పోవచ్చు. అందుకే అక్కడ తంగేడు పూలు పూస్తాయి కానీ, పరిమళించవు.
స్వతంత్ర భారతావనిలో గుక్కెడు నీళ్ల కోసం తరతరాలుగా అలమటిస్తున్న రెండు ఆదివాసీ తండాల కత మాత్రమే కాదు ఇది దేశం సమస్య.
ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలానికి 20కిలో మీటర్ల దూరంలో దండకారణ్యంలో విసిరేసినట్టున్న తండాలు దొడందా,గట్టేపల్లి . ఇక్కడ 170 గోండు,ప్రధాన్ జాతి గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. 1970 లో వీరు పోడు వ్యవసాయం చేసినందుకు అటవీ అధికారుల కేసులను ఎదుర్కోవలసి వచ్చింది.ఆ కేసుల నిమిత్తం పోలీసు ఠాణాల చుట్టూ 70కిలోమీటర్లు కాలినడకన బోధ్‌కి వెళ్లాల్సి వచ్చేది.దీనివల్ల కొన్ని దశాబ్దాలు ఈ ఆదివాసీలు ఉపాధిని కోల్పోయి నరకం అనుభవించారు. 1991లో అటవీ హక్కుల చట్టం అమలై వీరి భూములకు పట్టాలు వచ్చాయి.దీంతో ఒక్కో కుటుంబానికి పది ఎకరాల వరకు భూమి దొరికింది. అంతటితో వీరి సమస్యలు తీరిపోలేదు.
అసలు కథ అపుడే మొదలైంది…
ఈ గిరిజనులకు భూమి ఉంది కానీ దానిని సాగు చేయడం అసాధ్యంగా మారింది.
అత్యధిక వర్షపాతం అయినా...
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నప్పటికీ ఈ గిరిజనులను సాగునీటి కొరత వెంటాడటం ఒక విచిత్రపరిస్ధితి. దట్టమైన అడవుల మధ్య ఉన్న దొడందా,గట్టేపల్లి తండాల్లో అన్నీ ఏటవాలు భూములే. కొండల మీద కురిసిన వర్షమంతా ఒక్క చుక్క కూడా వీరి భూముల్లో ఇంకకుండా దిగువకు ప్రవహించి కడెం ప్రాజెక్టులో కలిసిపోతుంది.వీరి భూముల్లో మట్టితక్కువ,రాళ్లు ఎక్కువ. దున్నడానికి నాగలి కూడా దిగదు. వాననీటిని ఒడిసి పట్టే పద్ధతులు పాటించక పోవడం వల్ల బోర్లు,బావులు ఎండి పోతున్నాయి. అందుకే వర్షాధార పంటల మీదనే మెట్టపంటలు పండిస్తున్నారీ గిరిజనులు.
నీళ్లు లేవని బంధువులు రారు
ఈ ప్రాంతంలో 400 అడుగులు తవ్వినా బోర్లు పడవు.అందు వల్లే తాగు నీటికి,సాగునీటికి ఈ ప్రజలు అల్లాడి పోతున్నారు. కనీస అవసరాలకు కూడా నీళ్ళు లేక లేచింది మొదలు అటు చిద్దరి ఖానాపూర్ ఇటు నర్సాపూర్ వైపు నాలుగుకిలో మీటర్లు నడిచి పోయి నీళ్లు తెచ్చుకోవాల్సిందే.
” వానలు పడే రెండు నెలలు బావుల్లో కొంత నీరు ఉంటుంది. మిగతా కాలమంతా నీళ్ల కోసం తంటాలే.పంటలకే కాదు,పశువులకు, మనుషులకు కూడా నీళ్లు దొరకవు. దీంతో మా ఇళ్లకు బంధువులు కూడా రావడం మానేశారు.పండుగలు కూడా చేయం..” అని దొడందాకు చెందిన ఆశావర్కర్ తన గోడును చెప్పుకుంది.
ఒక్క ఇంటికి మరుగు దొడ్డిలేదు
” మన దేశాన్ని తల్లీ భారతీ అని పిలుచుకుంటాం కానీ,ఈ దేశంలో ఎందరో అమ్మలు,అక్కలు,చెల్లెళ్లు,కూతుళ్లు,భార్యలు కాలకృత్యాల కోసం బయటకు వస్తూ సిగ్గుతో ప్రతీ రోజూ బతక లేక చస్తున్నారు.అత్యాచారాలకు గురవుతున్నారు.ఇది ఆత్మగౌరవ సమస్య మాత్రమే కాదు.స్త్రీల ఆరోగ్య భద్రత,జీవన ప్రమాణాల సమస్య కూడా. 95కుటుంబాలున్న గట్టేపల్లి తండాలో ఒక్క పాయాఖానా కూడా లేక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.” అంటారు ఏకలవ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్ధ కార్యకర్త చందాసింగ్ పడవాల్.
ఆడబిడ్డలు కాలకృత్యాల కోసం అడవుల్లోకి పోవాలి.పాములు,అడవి జంతువుల నుండి కాపాడుకోవడానికి ఈ గిరిజనులు పడని కష్టాలు లేవు.తెలంగాణా గ్రామాల్లో 53 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉంది.మిగతా వారిలో ఈ తండాలు కూడా చేరాయి.ఉపాధి హామీ పథకం,స్వచ్ఛభారత్‌మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ వారెందుకో ఈ మారు మూల తండాల వైపు ఇంకా చూడలేదు.
ఈ ఊరికి పిల్లనివ్వడం లేదు
” చుట్టూ అడవులు ఉన్నాయి కాబట్టి చెట్లు,పొదలే మాకు మరుగు నిస్తున్నాయి. మా ఊరికి పిల్లనివ్వడానికి వెనుకాడుతున్నారు. కాబోయే భర్త ఇంటిలో మరుగు దొడ్డి లేదని తెలిసి చాలామంది అమ్మాయిలు ఇక్కడి సంబంధాలు వద్దంటున్నారు.” అని గట్టేపల్లి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యకు పరిష్కారమిదే …
తాగునీరు,సాగునీరు లేని ఈ ఆదివాసీలకు విద్యుత్, రేషన్ కార్డు,ఆధార్ కార్డు ఉండీ ఉపయోగం లేకుండా పోయింది. మరుగు దొడ్ల సదుపాయం లేక, రహదారులు,కనీస వసతులు లేక అభివృద్ధిలో వెనుకబడి పోయారు. ఇపుడిపుడే వారంతా ఏకమై సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా అడుగులు వేస్తున్నారు.
” మాకు వర్షాలు ఎక్కువే కానీ వాటిని ఒడిసి పట్టే పద్దతులు లేక కురిసిన వానంతా వృధాగా పోతోంది. ఇక్కడ ప్రభుత్వం వాటర్ షెడ్ కార్యక్రమం చేపడితే 3వేల హెక్టార్లు సాగులోకి వస్తాయి. చెక్‌డ్యాంలు,ఫాంపాండ్‌లు నిర్మిస్తే వాన నీటిని నిలుపు కునే అవకాశం ఉంటుంది. బోర్లు,బావులు నిండి దొడందా గ్రామపంచాయితీ పరిధిలోని 12 గ్రామాలకు చెందిన ఆరొందల కుటుంబాలు బాగు పడుతాయి. ఇటీవల మా గ్రామస్ధులంతా ‘ఏకలవ్య ఫౌండేషన్ ‘ సాయంతో సర్వే చేసి, వాటర్ షెడ్ కి అనువైన ప్రాంతంగా గుర్తించాం. ప్రభుత్వం సాయం చేస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీరుతో పాటు సాగునీటి అవసరాలు తీరతాయి.” అని గట్టేపల్లి గ్రామ పటేల్ డోంగూరావ్ అంటున్నారు.
వాటర్ షెడ్ అవసరం ఉందా?
నీటి కొరత, పేదరికం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం,గాలి,నీరు ద్వారా నేల కోతకు గురవుతూ భూమిలో సారం తగ్గిపోవడం,పశుగ్రాసం కొరత,వ్యవసాయ దిగుబడులు స్వల్పంగా ఉండటం,జీవనోపాధులు లేక ప్రజలు వలసలు పోవడం వంటి పరిస్ధితులున్న చోట వాటర్ షెడ్ అవసరం ఉందని నాబార్డు పూర్వ సీజీఎం పాలాది మోహనయ్య రూరల్ మీడియాతో అన్నారు. దొడందా,గట్టేపల్లి తండాలు ఇలాంటి పరిస్ధితులనే ఎదొర్కొంటున్నాయి.ఇక్కడి 500 ఆదివాసీ కుటుంబాలు 3000 హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారు.కానీ జలవనరులు లేక దిగుబడి పడిపోయి అప్పులు పాలవుతున్నారు.
వాటర్‌షెడ్ వల్ల ఏం జరుగుతుంది…?
జలసంరక్షణ వల్ల సహజ వనరులు అభివృద్ది చెందుతాయి.ఉత్పాదకత పెరిగి జీవనోపాధులు మెరుగువుతాయి.
గిరిజన రైతులను సంఘటితం చేయడం వల్ల ఐకమత్యం ఏర్పడి సామర్ద్యాలు పెరుగుతాయి.వర్షపు నీటిని ఒడిసి పట్టడం వల్ల అడుగంటిన భూగర్బ జలాలు పైకి వస్తాయి.అటవీ సంరక్షణ,మొక్కల పెంపకం వల్ల నేల కోతకు గురి కాకుండా ఆపవచ్చు. ఫలితంగా బంజరు భూములు సారవంతమై న నేలలుగా తయారవుతాయి.
బోరులు, బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది.వ్యవసాయం,పండ్లతోటలు,పశువుల,చేపల పెంపకం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. గిరిజనుల ప్రస్తుత జీవనో పాధులు మెరుగు పరిచి నూతన జీవనోపాధి అవకాశాలు సృష్టించి,వారిసామాజిక,ఆర్ధిక స్ధితిగతులను మెరుగుపరచవచ్చు.
స్ధానిక సంస్క ృతి,సంప్రదాయాలను కాపాడవచ్చు.
ఈ రెండు పల్లెల్లో వాటర్ షెడ్ పనులు చేపట్టడం వల్ల సుమారు 2000 ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా మారుతుంది. సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది.గిరిజనుల సంస్ధా గత సామర్ధ్యాలు పెరుగుతాయి.వర్షాధార సాగు పై ఆధార పడిన రైతులకు నీటి వసతి కల్పించడం వల్ల దిగుబడి పెరిగి అప్పుల నుండి బయట పడతారు. జీవనోపాధులు పెరిగి వలసలు తగ్గుతాయి.
తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ పల్లెలను పట్టించుకోక పోతే, జనగణమణలో ఈ జనం కనిపించరు? వందే మాతరంలో ఈ తరం ఉండదు.
……………..
….. శ్యాంమోహన్ (రూరల్‌మీడియా) ఫోటోలు.కె.రమేష్‌బాబు