అడవి బిడ్డలకు భరోసా,Rural Hope !

A helping hand to poverty-hit Indigenous families
అరకు లోయలో అనాధ గిరిజన బిడ్డలకు నీడనిస్తోంది, ప్రత్యూష ఆశ్రమం,
ఒక రోజు ఫండ్స్‌ రాక , పూట గడవడం కష్టమైంది. పిల్లలు ఆకలితో విలవిల్లాడుతున్న సమయంలో అరు నెలలకు పరిపడా నిత్యావసర వస్తువులు వారికి అందాయి. అదొక కడుపు నింపిన ఆత్మీయత !
లాక్‌ డౌన్‌ లో ఉపాధి పోవడంతో, రెక్కాడితే గానీ, డొక్కాడని కొన్ని చేనేత, వ్యవసాయ కూలీల కుటుంబాలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు… వారికి కొంతకాలం ఆహారం అందించి, జీవితం మీద నమ్మకం కలిగించారు.
రాళ్లచిలుక(తెలంగాణ) తండాలో తాగునీరు లేక, నిలువ నీటి కుంటలో బురద నీళ్లు తాగుతూ రోగాల పాలవుతున్నారు కోయగిరిజనులు. ఆ నీటిని స్వచ్ఛంగా మార్చే వాటర్‌ ఫిల్టర్‌లు వారి ఇళ్లకు చేరాయి. వారికి భవిష్యత్‌ పట్ల ఒక ఆశ చిగురించింది.
రోగాలు వస్తే చూసే దిక్కు లేని మారుమూల చీకటి పల్లె అది.
ఇపుడక్కకు కొందరు వైద్యులు వెళ్లి సేవలు చేస్తున్నారు.. ఆ పేదల ఆరోగ్యానికి ఒక ఆసరా కలిగింది.
ఇలా ఎవరికీ పట్టని, అట్టడుగు అడవి బిడ్డలకు భవిష్యత్‌ పట్ల కాప్త నమ్మకం కలిగిస్తున్న ఆ సంస్ధ పేరు ‘ రూరల్‌ హోప్‌ .’ ప్రవాస భారతీయుడు కొండా చంద్రశేఖర్‌ రెడ్డి, అమెరికాలోని కాలిఫోర్నియాలో 2013 లో ప్రారంభించారు. ఈ పబ్లిక్‌ చారిటబుల్‌ ట్రస్టు చీకటి గూడేల్లో వెలుగులు ఎలా నింపిందో చూద్దామా…?
ఆదివాసీ ప్రొటీన్‌ ఫౌడర్‌
……………………………………
కొత్తగూడెం జిల్లాలో పౌష్టికాహార లోపం ఉన్న 350 మంది ఆదివాసీ తల్లులు,పిల్లలకు
ప్రొటీన్‌ ఫౌడర్‌ అందచేస్తున్నారు. రక్తహీనత నివారణకు గోధుమలు,జొన్నలు,పల్లీ పిండితో చేసిన పౌష్టికాహారాన్నిఎలా చేసుకోవాలో వారికి నేర్పారు. వాటిని పిండిగా తయారు చేసి,బెల్లం పొడి కలపి పిల్లలకు అందిస్తారు. దీని తయారీ కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేసి, ఇద్దరు గిరిజన యువకులకు ఉపాధి కూడా కల్పించింది రూరల్‌ హోప్‌.
” గత ఆరు నెలలుగా నిత్యం 350 మంది గోండు ఆదివాసీ తల్లులు, పిల్లలకు 60 గ్రాముల ప్రొటీన్‌ ఫౌడర్‌( ఆదివాసీ హర్లిక్స్‌) అందచేస్తున్నారు.ఈ ఆహారం వల్ల 70 శాతం వరకు అక్కడి వారిలో రక్త హీనత తగ్గింది.” అంటారు అక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ నరేందర్‌.
అనాధలకు ఆసరా
తూరుపు కనుమల్లోని అరకు లోయలో ఆనాధల కోసం ఏర్పాటయిన ప్రత్యూష హోమ్‌లో 65మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. గత ఏడాది కాలంగా వీరికి నిత్యావసర వస్తువులు,దుస్తులు,పాఠ్య పుస్తకాలు, కాలేజీలో చదువుతున్న 8మందికి ఫీజులు ను అందిస్తున్నారు.
ఆదివాసీ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని కుగ్రామాల్లో ఆదివాసీ బడులను ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా ,లంబసింగిలో ఒకటి, కొత్తగూడెం, సమీపంలో గందిగుప్ప,బెండ్లపాడు,మోత్కుర్‌,ఒంటి గుడెస,పాలవాగు,మర్రిగూడెం ఆవాసాల్లో
7 స్కూల్స్‌ నిర్వహిస్తున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం,పుస్తకాలు, అక్కడి టీచర్లకు జీతాలు సమకూరుస్తున్నారు.250 మంది చిన్నారులకు విద్యావెలుగులు పంచుతున్నారు.
స్వచ్ఛ జలాలు
భద్రాచలం అటవీ ప్రాంతలో నివశిస్తున్న గిరిజనులకు తాగునీరు అతి పెద్ద సమస్య. ఎవరైనా సాయం చేసినా బోర్లు వేసుకోవడానికి అటవీ చట్టాలు అంగీకరించవు.దాంతో వారు వాగులు,కుంటల మీద ఆధారపడతారు. పశువులకు మనుషులకు అవే నీళ్లు కావడంతో కలుషితంగా మారిపోతుంటాయి. వాటినే తాగి రోగాల పాలవుతుంటారు. ఈ సమస్యల నుండి వారిని కాపాడడానికి 12 ఆవాసాల్లో 354 కుటుంబాలకు వాటర్‌ ఫిల్టర్లను అందచేశారు. వాటిని నిర్వహించడం కూడా సులువే.మురికి నీళ్లును కూడా తెల్లగా స్వచ్ఛంగా మార్చడం ఈ ఫిల్టర్ల ప్రత్యేకత.వీటిని ఇచ్చాక చాలా వరకు జీర్ణకోశవ్యాధులు తగ్గాయని ఇక్కడ హెల్త్‌ వాలంటీర్‌గా పని చేస్తున యువకులు అంటారు.
అడవిలో ఆసుపత్రి
తూరుపు తెలంగాణ కొత్తగూడెంలో 149 ఆదివాసీ తండాల్లో పదివేల మంది జీవిస్తున్నారు. బీపీ,మధుమేహం చెక్‌ చేసుకోవాలన్నా , అందుబాటులో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఆసుపత్రికి వెళ్లాలంటే 60 కిలో మీటర్లు వాగులు, వంకలు దాటి ఏరియా ఆసుపత్రికి నడిచి పోవాలి. ఆలాంటి చోట ఆరోగ్యకేంద్రాలను గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారు రూరల్‌ హోప్‌. నిరంతరం వారికి ఆరోగ్యపరీక్షలు జరిపి తగిన మందులు ఇస్తున్నారు.
ప్రాణాలు కాపాడే హెల్త్‌ కిట్స్‌
బాలింతలకు తరుచూ ఆరోగ్యపరీక్షలు జరపాలి. వృద్దులకు బీపీ ,షుగర్‌ చెక్‌ చేయాలి. వాటి కోసం ఆసుపత్రికి తిరిగ లేక రోగం ముధిరే వరకు ఆగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.దీని నివారణకు, అన్ని ఆరోగ్యపరీక్షలు తండాల్లోనే నిర్వహించడానికి వీలుగా మొబైల్‌ హెల్త్‌ కిట్స్‌ ని సమకూర్చింది రూరల్‌ హోప్‌.
తండాల్లోని కొందచు చురుకైన యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి హెల్త్‌ వాలంటీర్లుగా తీర్చి దిద్ది వారికి హెల్త్‌ కిట్స్‌ అంద చేశారు. ప్రతీ కుటుంబానికి హెల్త్‌ చెకప్‌లు నిర్వహించి సీరియస్‌ కేస్‌లు ఉంటే పెద్దాసుపత్రకి తీసుకెళ్తున్నారు.దీని వల్ల వ్యాధులు ముదరక ముందే కనిపెట్టి సకాలంలో మందులు వాడి ప్రాణాలు కాపాడుకుంటున్నారు.
……………………..………………………………………………………………………………………………………………………

ఇవి కూడా చదవండి…

మట్టిలో మొలకెత్తిన జ్ఞానం  

అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్!

…………………………………………………………………………………………………………………………………
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, విద్యార్థులకు అవసరమైన శిక్షణ, వైద్య, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఉచిత కంటి శస్త్రచికిత్సలు,వికలాంగులకు కత్రిమ అవయవాలు పంపిణీ చేసి, పేదల జీవితాలకు ఆసరా అవుతోంది రూరల్‌ హోప్‌.
ఎవరీ చంద్రశేఖర్‌?

Chandra sekher,Rural Hope
గిరిజన తండాలకు అండగా మారి, అడవుల్లో వెలుగు బాటలు వేస్తున్న రూరల్‌ హోప్‌ వ్యవస్ధాపకుడు చంద్రశేఖర్‌ గుంటూరు జిల్లా నూతక్కి గ్రామవాసి. ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌, ఐ.ఐ.టి , మద్రాసు నుండి కంప్యూటర్‌ సైన్స్‌ చేపి , గత 25 ఏండ్లుగా అమెరికాలో సాఫ్ట్‌ వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. సకల మానవాళికి ప్రాణవాయువునిస్తున్న అడవులను కాపాడుతున్న వనవాసులకు ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో రూరల్‌ హోప్‌ ని ఏర్పాటు చేశారు. ఆదివాసీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న, విద్య, వైద్య, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కొత్త ప్రాజెక్టులు ప్లాన్‌ చేస్తున్నారు.
తండాల గుండెల్లో కాసింత చోటు సంపాదించుకున్నందుకు చంద్రశేఖర్‌ గర్వపడుతున్నాడిపుడు. అడివిబిడ్డల హృదయాలను గెలిచి, ప్రకృతిని చదువులమ్మ ఒడిగా,ఆరోగ్య ప్రధాతగా మార్చి ,గిరిజనుల మధ్య నీడనిచ్చే చెట్టుగా... ఓదార్చేపిట్టలా.. ఓ జీవనగీతంలా 'రూరల్‌ హోప్‌'ని మార్చాడు.
................................................
శ్యాంమోహన్‌ ( 9440595858)

WATCH NEXT:  

Green School, Dream school  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles