అక్కడ ఎన్ని మొక్కలు పెంచినా,విష పుష్పనాలు తప్ప వేరేమీ వికసించవు!

మన కోర్టులు…ఏ దేశంలోనైనా సరే ఎక్కడైనా సరే ఏ ఖుషీ కుర్చీల్లో ఎంత గంభీరంగా ఉండప్రయత్నించినా సరే నునుమెత్తని పులుల్లా వుంటారు.అందమైన తోడేళ్ళలా వుంటారు. లేదా దుక్కబలిసిన గుంటనక్కల్లా వుంటారే తప్ప జడ్జిలెవరూ దయగల మనుషుల్లా వుండరు (అనిన్నీ),

ఏ దేశంలో ఎక్కడికి వెళ్లి చూసినాసరే, సరసారాలాడే తాచులాగో పడగెత్తిన నాగులాగో లేక తోకమీద నిలబడి నడిచే జెర్రిపోతులాగో ఉంటాడే తప్ప ఏ ప్లీడరూ కూడా మనిషిలా మాత్రం ఉండడు, ఉండడు చస్తే ఉండడు (అనిన్నీ),

ఏ దేశంలో ఏ మారుమూల ఏ కోర్టుకి వెళ్లి చూసినప్పటికీ అక్కడ కనిపించే పోలీసులూ బంట్రోతులూ గుమాస్తాలూ అంతా కూడా పీడించడానికి యముడు పంపిన స్పెషల్ టైపు పిశాచాల్లా వుంటారే తప్ప మనుష్యుల్లా కనిపించరు, మనుషుల్లా ప్రవర్తించరు (అనిన్నీ),

ఏ దేశంలోనైనా సరే ఎంత మంచి ఉన్నత న్యాయస్థానమైనా సరే దాని ఆవరణలో ఎంత మంది పూలమొక్కలు పెంచినా వాటిని విషపుష్పనాలు తప్ప వేరేమీ వికసించవు (అనిన్నీ),

అక్కడ అంత మంచి చెట్టు ఎంత బాగా ఎదిగినప్పటికీ అది ఆకొక నాలికగాకల వింత రాక్షసిలా ఉంటుంది తప్ప చల్లని చెట్టులా ఉండదు (అనిన్నీ),అక్కడ ఏ పచ్చని తీగె సాగినా అది పసరిక పాములా ఉంటుందే తప్ప నునులేత పూతీగలా ఉండదు (అనిన్నీ),అక్కడ పచ్చటి పచ్చిక పరిస్తే అది పచ్చటి నివురుగప్పిన నిప్పుల తివాచీలాగా ఉంటుందే తప్ప మరో విధంగా ఉండదు (అనిన్నీ),అక్కడ మానసరోవరం లాంటి మంచినీటి చెరువు తవ్వితే అది అభాగ్యుల్ని మింగేసే ముసలి మొసలి గొయ్యిగా కుంచించుకుపోతుందే తప్ప చెరువుగా నిలవదు (అనిన్నీ),

ఏ దేశంలో కోర్టులో అయినా సరే తడిగుడ్డలు చల్లగా గొంతులు పిసుకుతాయి, ప్రాణాలు తీస్తాయి తప్ప బాహాటంగా కత్తులు రాపాడవు. గదలు ఢీకోవు (అనిన్నీ),

ఏ దేశంలో కోర్టులో ఎవరు నవ్వినప్పటికీ ఆ నవ్వు రాక్షస వృచ్చికాలు తోకలతో నవ్వినట్టుంటుందేమో కాని మానవత్వాన్ని సూచించే మనిషి నవ్వుగా సహజంగా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండదు (అనిన్నీ),

ఏ దేశంలో ఏ కోర్టు అయినా సరే అది ఎంత చక్కగా ఎంత మంచి పాలరాతితో ఇంద్రభవనంలా స్వర్గహర్మ్యంగా మలచినప్పటికీ అది వెన్వెంటనే గుండెలేని గోరీగా మారి తీరుతుంది (అనిన్నీ),

ఆ కోర్టు ఎంత ‘కళ’గా ఉన్నప్పటికీ ఎప్పుడూ తొడతొక్కిడిగా శవాల హడావిడిగా వుండే శ్మశానంలా ఉంటుందే తప్ప ఇంకో విధంగా ఉండదు (అనిన్నీ),ఏడ్చే దౌర్భాగ్యులు తప్ప అక్కడ వేరెవరూ మనుషుల్లా వుండరు…అనిన్నీ పైడిరాజుకి అప్పటికింకా తెలియదు.

– రావిశాస్త్రి (తలుపు గొళ్ళెం కథలో)

44

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles