‘చీకటోళ్లు’ అర్నాద్ కి 75 ఏళ్లు

True celebration of human emotions

అర్నాద్… మంచి రచయిత అని మనందరికీ తెలుసు. బాగా పాతబంగారం… పెద్దమనిషి తరహా.పద్ధతిగా, మర్యాదగా ఉండే మధ్యతరగతి టైపు.గప్పాలు కొట్టడం, పేరూ, పబ్లిసిటీ … అస్సలు గిట్టవు.మాకు తెలియకేం ‘ చీకటోళ్లు ‘ అర్నాదేగా! అంటారు కొందరు. ‘ రిక్షా ప్రయాణం ‘ కథ ఎంత గొప్పగా రాశారు అంటారు ఇంకొందరు. తెలుగు కథా సాహిత్యంలో చెరిగిపోని పేరది.

*** *** ***

అసలు పేరు దుంప హరనాథ్ రెడ్డి. ఊరు విశాఖపట్నం. ‘వొరే, అర్నాద్ బాబూ’ అని అమ్మ పిలిచేది. ఆ కమ్మని పిలుపే కుర్ర రచయితకి నచ్చింది. ‘ అర్నాద్ ‘ అనే అనే కొత్త, వింత పేరుతోనే కథలూ, నవలలూ రాశాడు. పాపులారిటీ అనే పూల రథం అతని ఇంటి ముందుకొచ్చి ఆగింది.

*** *** ***

అది 1977. “అర్నాదూ, పోయి పటిక బెల్లం పట్రా” అనింది వాళ్ళ అమ్మ. తెచ్చాడు. చుట్టిన కాగితం పడేసి, పటిక బెల్లం తీసుకుందామె. విసిరేసిన కాగితం కోటి రూపాయల లాటరీ టికెట్ అని వాళ్ళిద్దరికీ తెలీదు.చదివే అలవాటున్న అర్నాద్ ఆ కాగితాన్ని తీసి, సాపు చేసి చూసాడు. ఒక స్త్రీని వర్ణిస్తూ రాసిన మాటలు… భలేగా ఉన్నాయి. చూస్తే, అది రాచకొండ విశ్వనాథ శాస్త్రి ప్రసిద్ధ నవల రాజుమనిషి లోని వర్ధనమ్మ వర్ణన. అర్నాధ్ గుండె గుబ గుబలాడింది. మర్నాడే సంపాదించి ఆ పుస్తకం చదివాడు.రావిశాస్త్రా.. ఇంకేమన్నానా..! తూటాల్లాంటి మాటలు. వాక్యాల్లో విరుపు, చమత్కారం, సిమిలీలు, వెటకారాలు … ఆ కథనంలోంచి కవిత్వంలోంచి రావిశాస్త్రి అనే ఒక మహా తేజస్సు లోపలికి వెళ్లిపోయిన ఆ కుర్రాడు, ఒక రచయితగా తిరిగి వచ్చాడు. అప్పటికి విశాఖలో విరసం గాలివీస్తోంది. తూర్పు దిక్కు ఎరుపెక్కుతోంది. నవల రాశాడు అర్నాద్. ‘ చీకటోళ్ళు ‘ అని పేరు పెట్టాడు. విజయవాడ నుంచి వస్తున్న ‘ స్వాతి ‘ మంత్లీకి గొప్ప గౌరవం ఉండేది. స్వాతి 1978 నవలల పోటీలో మొదటి బహుమతి గెల్చుకుంది ‘ చీకటోళ్ళు ‘. అచ్చు రావిశాస్త్రి శైలిలో సాగిన ఆ నవలని బహుమతి ఇవ్వడానికి ముందే శాస్త్రి గారికి పంపించారు. చదివి చిరునవ్వుతో కొత్త రచయితని ఆశీర్వదించారు చాత్రిబావు. అప్పట్లో ఫస్ట్ ప్రైజ్ అంటే, అర్నాద్ కి 2500 రూపాయలు దక్కింది. అది మంచి మొత్తమే!విశాఖలో కొబ్బరి తోట అనే ప్రాంతంలో ఉండే నిరుపేద బతుకుల కన్నీటి విషాదమే ‘ చీకటోళ్ళు ‘. నవల పెద్ద హిట్ అయ్యింది. అర్నాద్ పేరు మోగిపోయింది. విశాఖ సాహితీ లోకం నివ్వెరపోయింది. అర్నాద్ ని ప్రేమగా కౌగిలించుకొని అభినందించింది. 1946 జూలై ఒకటో తేదీన పుట్టిన అర్నాద్ కి అప్పటికి 32 ఏళ్లు.

*** *** ***

1978 ఫిబ్రవరి 15… విశాఖ ఈనాడు ‘లో నేను జర్నలిస్టు గా చేరాను. ఆ ఏడాదే ‘ చీకటోళ్ళు ‘ చదివాను. నాటి విశాఖపట్నం వర్ణనాతీతమైన ఒక సాహితీ మహాసముద్రం. నా వయసు 21 సంవత్సరాలు. గణపతిరాజు అచ్యుతరామరాజు డాబా మీద వారాంతపు సాహిత్య సమావేశాలకు వెళ్ళేవాడిని. ఈనాడు లో నా మిత్రుడు, రచయిత కెవిఎస్ వర్మ, మాకు సీనియర్, రచయిత కె.ఎన్.వై.పతంజలి. ఈనాడులోనే మరో సీనియర్ సీతారాం రెడ్డి. ఆయన యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్. పార్ట్ టైం ఈ నాడు జర్నలిస్టు. పతంజలి, సీతారాం రెడ్డి సాహిత్య ఉపన్యాసాలు చాలా ఉత్తేజకరంగా ఉండేవి. విశాఖ లో నెలలో నాలుగైదు సాహిత్య సభలు జరిగేవి. చెప్పనలవి కాని అదృష్టం నాది.పురిపండా అప్పలస్వామి, రోణంకి అప్పలస్వామి, కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి, భరాగో, వాకాటి పాండురంగారావు, జేష్ఠ, తంబు, చందు సుబ్బారావు, అందే గోపాలకృష్ణ, అత్తలూరి నరసింహారావు, చలసాని ప్రసాద్, కృష్ణా బాయి, బండి గోపాల్ రెడ్డి (బంగోరె) అనంతం…. చాగంటి తులసి, భైర వయ్య… ఇలా ఎన్ని పేర్లు అయినా రాయొచ్చు. అలాంటి సమయంలోనే అల్లం శేషగిరిరావును చూశాను. అక్కడే బలంగా, ఆరోగ్యంగా హీరోలా ఉన్న అర్నాద్ నీ కలిశాను. వివిన మూర్తి కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. బాగా కుర్రకుంక అయినందువల్ల వీళ్ళకి నేను తెలీదు. ఎవడో ‘ ఈనాడు ‘ ‘ వాడు ‘ అనుకునేవాళ్లు. అప్పటి విశాఖపట్నం అంటే ఇటు ఉప్పొంగే సాహిత్యం, అటు అంతులేని సముద్రం, మధ్యలో ఆంధ్ర యూనివర్సిటీ! చాగంటి సోమయాజులు (చాసో), తూమాటి దొణప్ప, వేల్చేరు నారాయణరావు, బూదరాజు రాధాకృష్ణ, త్రిపుర నుంచి ఆరుద్ర, సోమసుందర్ లాంటి సాహితీవేత్తలు ఎందరో యూనివర్సిటీలో సభలకి వచ్చేవాళ్ళు. మర్చిపోలేని ప్రసంగాలు విన్న రోజులవి. వంగపండు ప్రసాదరావు, గద్దర్ పాటలు హోరెత్తిన కాలమది. అర్నాద్, వివిన మూర్తి లాంటి కొత్త తరం రచయితల్ని ఉత్తేజపరిచే ఆ మహత్తర సన్నివేశాన్ని నేను ఎంతో ఉత్సాహంతో చూడగలిగాను. అటు బరంపురం నుంచి ఇటు రాజమండ్రి, కాకినాడ… తూర్పుగోదావరి మొత్తం నుంచి కవులు, రచయితలు, విమర్శకులూ తరలి వచ్చేవారు. ఎంత పేరున్నా రచయితలైనా, మహాకవులైనా… ఆ పడవలన్ని విశాఖతీరం చేరేవలసిందే! చలం, శ్రీశ్రీ, రావిశాస్త్రి, ఆరుద్ర, ఎన్. ఎస్. ప్రకాశరావు, శ్రీరంగం నారాయణ బాబు, పతంజలి, అల్లం శేషగిరిరావు, వాకాటి పాండురంగారావు, భరాగో లాంటి మహానుభావుల్ని inspire చేసిన శతకోటి బాహువుల నీలి తరంగాల విశాఖ మహాసముద్రమే అర్నాద్ నీ ఉద్రేకపరిచింది. అర్నాధ్ గానీ, మరొకరు గానీ అక్కడ మంచి రచయిత కాకుండా ఎలా ఉండగలరు?ఆశుకవితా కెరటాల్లా ఎగసిపడుతున్న నీలాకాశం లాంటి ఆ సాహితీ సముద్రం నుంచి నువ్వెంత తోడుకోగలిగితే అంత! నిప్పు కణికల్లాంటి కవుల్ని రచయితల్ని తయారు చేసిన కాలం అది. ఆవేశంతో ఊగించే ఉత్తమాభిరుచిని ఉత్పత్తి చేసిన కర్మాగారం అది. సృజనాత్మకమైన కళాకారుల్ని manufacture చేసిన ఆ literary ఫ్యాక్టరీ లో బాల కార్మికుడిగానైనా పనిచేయగలిగినందుకు నేను ఎంతో మురిసిపోతున్నాను. 40 ఏళ్ల క్రితమే ఆ భాగ్యం కలిగినందుకు నిజానికి ఎగిరెగిరిపడుతున్నాను కూడా!

*** *** ***

ఆ ‘ రిక్షా ప్రయాణం ‘ ఒక క్లాసిక్!1981 ఆంధ్రజ్యోతి వీక్లీ పోటీకి రిక్షా ప్రయాణం కథ రాశాడు అర్నాద్. విశాఖ స్టేషన్ లో రైలు ఆగుతుంది. ఏడేళ్ల బూరె బుగ్గల మనవరాలితో, చేతిలో ఒక ట్రంకు పెట్టెతో పెద్దావిడ దిగుతుంది. వాళ్లు ‘నర్సిమ్మ, రిక్షా ఎక్కుతారు. చెప్పులు లేని మురికి చిరుగుల బనియన్ పేద రిక్షావాడు వాళ్లని ఇంటిదగ్గర దింపడమే కథ. అనుమానం, భయం, సస్పెన్స్ అనే మూడు చక్రాల మీద మానవ స్వభావమూ, భావోద్వేగమూ అనే రిక్షాని అర్నాద్ నడిపించిన తీరు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ‘ జ్యోతి ‘ పురాణం సుబ్రమణ్య శర్మ పరవశంతో ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారు. బాపు కలకాలం గుర్తుండిపోయే బొమ్మ వేశారు. అప్పట్లో లో మొదటి బహుమతి అంటే 1500 రూపాయలు. 1966 – 85 మధ్య వచ్చిన ఉత్తమ తెలుగు కథలతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్ బి టి) వేసిన సంకలనంలో అర్నాద్ కథ చోటు దక్కించుకుంది. వందేళ్ళ తెలుగు కథ అని హెచ్ఎంటీవీ కోసం గొల్లపూడి మారుతీరావు చేసిన పాపులర్ ప్రోగ్రాం కి ‘ రిక్షా ప్రయాణం ‘ ఎంపికయింది. రచయిత అర్నాద్ ని ఇంటర్వ్యూ చేశారు. రచయిత కంటే గొల్లపూడి వారే అతిగా మాట్లాడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత! రిక్షా ప్రయాణం రచయితని చూడాలనీ, మాట్లాడాలనీ చాలామంది పాఠకులు ఆ రోజుల్లో తహతహలాడారు!

*** *** ***

తెలుగు సినిమా చీకటి తెరల్లోకి…అప్పట్లో లో చాలా మందిలాగే సినిమా డైరెక్టర్ అవుదామని అర్నాద్ కీ ఆశ పుట్టింది. దక్షిణభారత సినీ రాజధానిలో అడుగుపెట్టడానికి మద్రాస్ మెయిల్ ఎక్కాడు. పేరున్న దర్శకుడు సి.ఎస్.రావు దగ్గర అసిస్టెంట్ గానో, అప్రెంటిస్ గానో, ఆఫీస్ బాయ్ గానో చేరిపోయాడు. సినిమా కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు మద్రాసులో భోజనం 75 పైసలు. తినడానికి ఆ డబ్బులూ ఉండేవి కాదు. ‘నిండు మనసులు’ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఒకరోజు దర్శకుడు సి.ఎస్.రావు, అర్నాద్ ని ప్రేమగా పిలిచాడు. “ఇదిగో, రాత్రి 7 గంటల కి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఉందే, ఆ అమ్మాయిని నా హోటల్ రూమ్ కి తీసుకువచ్చేయ్” అన్నారు. విశాఖలో అమ్మకి మాటయినా చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని అర్నాద్ విలవిలలాడి పోయాడు. సి.ఎస్.రావు పని ఎగ్గొట్టి, హీరో చంద్రమోహన్ మావయ్య డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని కలిశాడు అర్నాద్. బాధలు చెప్పుకున్నాడు. ఇమడలేనన్నాడు.నోరు మూసుకుని, ఊరెళ్ళి అమ్మ చెప్పిన మాట విను అని పెద్దాయన నాలుగు మంచి మాటలు చెప్పి అర్నాద్ ని విశాఖ రైలు ఎక్కించాడు. కొన్నాళ్ళకి మద్రాసు ఏవీఎం స్టూడియో నుంచి అర్నాద్ కి ఫోన్ కాల్ వచ్చింది. మీ చీకటోళ్లు నవల బాగా నచ్చింది. సాక్షాత్తూ ఏవీఎం సూపర్ బాస్ మురుగన్ గారే దర్శకుడు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండొచ్చు అన్నారు. అర్నాద్ లో చిన్న ఆశ చిగురించింది. సినిమా లెక్కలు వేరే. వాళ్ళు ఎవరికీ పిసరంత ఆనందాన్నీ మిగల్చరు. చీకటోళ్లు అంతా విశాఖ యాసలో ఉంది. దాన్ని మధ్యతరగతి వాళ్ళ భాషలోకి మార్చి స్క్రిప్ట్, డైలాగులు రాయమన్నారు. రచయిత అవాక్కయ్యాడు. “నేనలా చేయలేను” అన్నాడు అర్నాద్. ఆ పనికి ఎం వి ఎస్ హరనాథరావు గార్ని కుదుర్చుకున్నాడు మురుగన్. చిత్రం పేరు ‘ వాడని మల్లి ‘. సినిమా ఫెయిలయింది. అలా అర్నాద్ సినీ ప్రయాణం.. అతి తక్కువ విషాదంతో ముగిసింది.

*** *** ***

కాళీపట్నం రామారావు, రావిశాస్త్రి ల స్నేహమూ, సహకారమూ అర్నాద్ ని ఒక సొంత గొంతున్న మంచి రచయితగా నిలబెట్టాయి. 1972 నుంచి రెండు వేల పన్నెండు దాకా అంటే 40 సంవత్సరాల్లో అర్నాద్ నాలుగు నవలలు, 80 కథలు రాశారు. పది కథలు జ్యోతి, స్వాతి, తానా బహుమతులు గెలుచుకున్నాయి. ప్రసిద్ధ రచయిత గా పేరు తెచ్చుకున్న అర్నాద్ ని, ఒక సంవత్సరం నవలల పోటీ కి జడ్జి గా ఉండమని ‘ స్వాతి ‘ వీక్లీ ఎడిటర్ ఆహ్వానించారు. విజయవాడ వెళ్లిన అర్నాద్, మొదటి బహుమతి కి అర్హమైన నవల ఏదీ లేదని చెప్పాడు. మీరు విశాఖ వెళ్లి ఒక మంచి నవల రాసి పంపండి అన్నాడు స్వాతి బలరామ్. అలా రాసిన నవల ‘ ఈ తరం స్త్రీ ‘. అది ఇది ఒక చిన్న భూకంపమే సృష్టించింది. ఆ నవల ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది.ఒక మధ్యతరగతి స్త్రీ, కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోకుండానే, సెక్స్ సుఖం పొందుతుంది. అది అది ఆమె సొంత నిర్ణయం. కొన్నాళ్ళకి గర్భవతి కూడా అవుతుంది. Come what may అని ఉద్యోగం చేసుకుంటూ, నిర్భయంగా బతుకుతుంది. ఆడది, సంప్రదాయ సమాజం, సెక్స్ అనే సబ్జెక్టు మీద రాసిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. పోటీకి ముందే నవల చదివిన కారా మేస్టారు చీకటోళ్లు రాసిన వాడు, ఇలా రాయడం పద్ధతిగా లేదు అన్నారు. దాంతో అర్నాద్ ఆ నవలని రమణమణి అని తన భార్య పేరుతో పంపారు. ‘ ఈ తరం స్త్రీ ‘ గురించి విని… కవనశర్మ, అర్నాద్ కి ఫోన్ చేశారు. “ఏదో దరిద్రపు సెక్స్ నవల రాశారటగా” అన్నారు. “మీరు చదివి ఆ మాట అనండి” అని అర్నాద్ కౌంటర్! చదివాక, కవనశర్మ ఫోన్ చేసి, అంతగొప్పగా రాసి, మీ ఆవిడ పేరు పెట్టడమేంటి? ఆ నవల నీ పేరుతోనే ఉండాలి, అని చెప్పడమే కాకుండా, అర్నాద్ పేరుతో శర్మ గారే ఆ నవలని అచ్చేశారు.

*** *** ***

tadi prakash
Tadi Prakash

2009 – 2012 మధ్య అర్నాద్ రాసిన వాటిలో 12 మంచి కథల్ని ఎంపిక చేసి తెలంగాణా, ‘ పాలపిట్ట బుక్స్ ‘ గుడిపాటి గారు అందమైన పుస్తకం తెచ్చారు. పేరు ‘ ఆపద్ధర్మం ‘. అర్నాద్ కథల్లో సౌందర్య పరిమళం అంటూ గుడిపాటి, ఆ కథా సంపుటికి అద్భుతమైన ముందుమాట రాశారు. ఈ కథల పై డాక్టర్ వేమూరి రాధాకృష్ణ కామెంట్ చేస్తూ, “భిన్న వర్గాలకూ, సంస్కృతులకూ చెందిన పరిచయస్తుల మధ్య వెల్లివిరిసిన, రగిలిరేగిన రాగద్వేషాల గాఢత పై, విస్తృతి పై చాలా సంయమనంతో సాగిన రన్నింగ్ కామెంటరీ. ఈ కథలు జీవన సూత్రాలను చూపిస్తాయి. తట్టిలేపుతాయి” అన్నారు. తెలుగు వార పత్రికలు పచ్చి వ్యాపారము, circulation పెంచుకోవడం అనే తాపత్రయమ్ తో ఎంతకైనా తెగించి దిగజారడాన్ని హేళన చేస్తూ అర్నాధ్ రాసిన ‘ది ఎడిటర్’ నవల ఒక సాహసం. అది అందరి మన్ననా పొందింది.

*** *** ***

విశాఖలోని భారత హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్ (BHPV) లో ఇంజనీరుగా చేసిన అర్నాద్, మెటీరియల్స్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. చేతికి అందివచ్చిన ఇద్దరు అబ్బాయిలతో, విశాఖలోనే సెటిల్ అయ్యారు. మంచమ్మీది నుంచి కదల్లేని భార్య అనారోగ్యం ఒక్కటే ఆయనకి తీరని చింత. అయినా ‘ నా మనసులో మాట ‘ అంటూ ఫేస్ బుక్ లో ఓపిగ్గా రాస్తూనే ఉన్నారు అర్నాద్

– the unforgettable artist of our time.

TADI PRAKASH – 97045 41559

………………………………………………..

రాయల సీమ అంటే , కత్తులూ ,సుమోలు గాలిలో ఎగరడం సినిమాల్లో చూస్తాము. కానీ అక్షరానికి ఆక్సిజన్ ఇవ్వడం ఎప్పుడైనా చూసారా ?https://www.ruralmedia.in/desktop-story/a-man-who-likes-translation-of-books-from-oxygen-support-bed/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles