ఈ కల్లు కోసం క్యూ కడుతున్నారు… !!

హైదరాబాద్‌ నుండి 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే తర్నికల్‌ (నాగర్‌కర్నూల్‌ జిల్లా) గ్రామం. రహదారి పక్కనే కార్లు,బైక్‌లు ఆగుతున్నాయి. కొందరు క్యాన్లు ,బాటిల్స్‌తో లోపలున్న ఖర్జూర తోటలోకి వెళ్తున్నారు. కొన్ని చెట్లకు గులాబీరంగు పండ్ల గెలలు, మరికొన్ని చెట్లకు మట్టి కుండలు వేలాడుతున్నాయి.
ఇప్పటి వరకు ఈత,తాటి కల్లు గురించి అందరికీ తెలుసుకానీ, ఇక్కడ తొలిసారిగా ఖర్జూర కల్లును తీస్తున్నారు. దానిని రుచి చూడడం కోసమే వారంతా వస్తున్నారు. ఎక్కడో అరబ్‌ దేశాల్లో విస్తారంగా కనిపించే ఖర్జూర వనాలు తెలంగాణలో ఎలా పెరుగుతున్నాయి,వాటి వెనుక విశేషాలు తెలుసుకోవాలంటే, తర్నికల్‌ లో కొంక యాదయ్య గౌడ్‌ని కలవాలి. అధిక ఉష్ణోగ్రతల్లో పండే ఎడారి మొక్కలను కల్వకుర్తి లో పండించడమేకాదు,వాటి నుండి కల్లును తీయాలనే ఆలోచనే ఒక సాహసం. దాని వెనుక ముచ్చట్లను ఇలా చెప్పాడు…
వెట్టి చాకిరీ నుండి రైతుగా
” తాటి చెట్లెక్కాలన్నా, కల్లు గీయాలన్నా , నాకు చానిష్టం. పన్నెండేండ్లు ఒక దొర దగ్గర పాలేరుగా వెట్టి చాకిరీ చేసిన. ఇంకెంత కాలం ఈ పన్జెయ్యాలె.. మా కులవృత్తి చేసుకోవాలనుకున్న కానీ, నాకేమో తాళ్లెక్కరాదు, ఎట్లా అని ఆలోచిస్తుంటె.. మా ఊర్ల ఓ పెద్దాయన కల్లు గీయడం నేర్పిండు.. ఆ తరువాత ఆంధ్ర పోయి ప్రకాశం జిల్లాలో ఒకాయన దగ్గర ఆరేండ్లు ల్లు గీసిన. నెలకు కొంత జీతం ఇచ్చిండ్రు.. తరువాత సొంతూరు తర్నికల్‌ (ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ) కు వచ్చిన. ఆంధ్రలో ఆరేండ్లు కష్టపడి కూడబెట్టిన పైసలతో రెండెకరాల పొలం కొన్నా… కానీ అది బీడు నేల ఎవుసాయానికి పనికిరాదు. దానినలా వదల కుండా ఎడారిలో పెరిగే ఖర్జూర చెట్లు వేయాలనుకున్నా..అందరిలా ఈత, తాడి కల్లు కాకుండా , ఖర్జూరా కల్లు కమ్మగుంటదని కొత్తగా ఆలోచించి,ఈ పని మొదలు పెట్టినా…” అన్నాడు, చెట్టు నుండి కల్లు ముంతను తీసి కింద పెడుతూ యాదయ్య.

కష్టాల సాగు…
ఇదంతా 18 ఏండ్ల నాటి సంగతి. ఖర్జూర మొక్కల కోసం చాలా చోట్ల తిరిగాడు యాదయ్య. చివరికి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నర్సరీ ద్వారా కడియపు లంక(తూర్పుగోదావరి జిల్లా) నుండి మొక్కలు తెచ్చి, తండ్రి ఇచ్చిన ఎకరానికి తోడు తాను కొన్న రెండెకరాల్లో , ఎకరాకు 70 మొక్కలు చొప్పున నాటాడు. పూర్తిగా చౌడు భూమి కావటంతో ఆ గుంతల్లో ఎర్రమట్టిని పోసి మొక్కలు పెంచారు. ఒక్కో పాదు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా నాటాడు.
కాపాడిన కల్వకుర్తి
కానీ నీటి వసతి లేక మొక్కలు ఎండి పోసాగాయి. ఖర్జూరా కల్లు పడాలంటే చెట్లకు నీరు ఉండాలి. బోర్లు వేసినా పడలేదు.ఇక లాభం లేదని, ఉన్న ఊరిలో మళ్లా తాళ్ళు, ఈత చెట్లు ఎక్కుతూ, కల్లు అమ్మేటోడు. అలా కొంత డబ్బు జమ కాగానే ఇరవై ఏడు సార్లు బోర్లేసినా ఒక్క దాంట్ల చుక్క నీరు పడలే… ఇగ లాభం లేదనుకొని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి చెట్లకు పారిస్తూ భార్యతో కలిసి, కంటిపాపల్లెక్క కాపాడుకున్నాడు.
ఐదారేండ్ల నుంచి ఖర్జూరా చెట్లు పచ్చగా కళకళలాడుతున్నయి. తోట పక్కనుండే కల్వకుర్తి కాల్వ పారుతుంది. దాంతో బోర్లలో ఊట పడింది. ఆ నీళ్లతోనే తోటను పెంచుతున్నాడు. దుందుభి నది మీద అక్విడెక్ట్‌ కట్టడంతో కల్వకుర్తి మండలానికి నీళ్లొస్తున్నయి. ఈ కాల్వ వల్ల తర్నికల్‌ చెర్వుతోపాటు తోటపల్లి, వెంకటాపూర్‌, వేపూర్‌ ఊళ్లలో ఉన్న చెర్వులు, కుంటలన్నీ నిండాయి.
మూడు నెలలకోమారు చెట్ల చుట్టూ పాదుల్లో వర్మికంపోస్టు, వేపచెక్కను వేశాడు. ప్రతి మూడు రోజులకోమారు డ్రిప్‌ ద్వారా చెట్లకు తడి ఇస్తున్నాడు.
తవ్వి వదిలేసిన బోర్లలో చిన్న పిల్లలు పడి పోకుండా, బోర్ల మీద బండలు పెట్టి మట్టిపోసి కనవడకుండా చేశాడు. ప్రస్తుతానికి నాలుగు బోర్లు పనిచేస్తున్నాయి.
చెట్టుకు 5లీటర్లు…
” ఈ తోటను నీళ్ల కోసం అప్పులు చేసి బోర్లు వేసినా పడలేదు. చివరికి నాలుగు బోర్లు నిండాయి. అప్పటికే కొన్ని చెట్లు చచ్చిపోయినయి. ఇపుడు 1600 చెట్లు మిగిలాయి. చెట్టుకు 5లీటర్ల కల్లు వస్తది. రోజుకు ఇరవై చెట్ల నుండి తీస్తున్నాం. కల్లు మీద వచ్చిన ఆదాయం పొదుపు చేసి బిడ్డ పెండ్లి జరిపాం.కొడుకు ఇంటర్‌ చదువుతున్నాడు.” అని చెప్పింది యాదయ్య భార్య నీలమ్మ. కల్లు గీతలో నా భర్తకు సాయం చేస్తుంది.కల్లు తీస్తున్న చెట్లకు కాయలు కాయవు. మిగతా చెట్లకు కాసినా పక్షులు,కోతుల కోసం వదిలేస్తున్నారు.
ప్రముఖులంతా క్యూ కడుతున్నారు..
” మిగతా కల్లు తో పోలిస్తే ఈ కల్లు చాలా రుచిగా చెరకు రసంలా ఉంటుంది. మత్తు ఎక్కదు. తాగినా వాసన రాదు. రెండు రోజుల వరకు పులవ కుండా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదని, ప్రముఖులంతా మా ఖర్జూరా కల్లు కోసం వస్తరు. రోజుకు పన్నెండు వందల నుండి రెండు వేల వరకు సంపాదిస్తున్నా,ఏడాది లో 5 నెలల వరకు కల్లు వస్తది.” అన్నాడు యాదయ్య.
ఇది రుచి చూసిన వారు ఈతకల్లుకంటే తీయగా ఉంది అంటున్నారు . యాదయ్య రోజుకు ఇరవై రెండు చెట్లు గీస్తారు. 5లీటర్లను రూ. 300కి డిమాండ్‌ని బట్టి అమ్ముతున్నాడు. సుమారు నెలకు 60 వేలు ఆర్జిస్తున్నాడు.
ఇరాక్‌ టు కల్వకుర్తి
ఖర్జూరాన్ని అత్యధికంగా పండిస్తున్న దేశం ఇరాక్‌. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచుతున్న దేశం ఇదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు మీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ అలా విస్తరించి ఇండియా మీదుగా తెలంగాణకు వచ్చింది. ‘హరిత హారం’ కార్యక్రమంలో ఈ మొక్కలను రైతులకు పంచుతూ, ప్రోత్సహిస్తుంది సర్కారు.

P.C.Vengaiah


జలుబు, దగ్గుకు చెక్‌ !!
మిగతా కల్లుతో పోలిస్తే, ఈ కల్లులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు.
” కర్జూర కల్లును చెట్టు నుండి తీసిన తర్వాత 4 గంటలవరకు తాజాగా ఉంటుంది. కూలింగ్‌ లో ఉంచితే 12 గంటల వరకు నిలువ ఉంటుంది. ఇందులో సూక్ష్మపోషకాలైన కాల్సియం, పాస్పరస్‌,ఐరన్‌, మెగ్నిషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది. జీర్ణవ్యవస్ధ మెరుగు పడుతుంది. ఈ కల్లులో గ్లూకొజ్‌ , ప్రక్టోజ్‌ మోతాదు ఎక్కువగా
ఉండడం వలన మధుమేహులు కూడా తీసుకోవచ్చు. తాటి,ఈత కల్లుతో పోలిస్తే ఇందులో ప్రోటోన్‌ ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు నివారణకు ఇది అమోఘం. శ్లేష్మం కరిగించి గొంతును క్లియర్‌ చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నిషా తక్కువగా ఉంటుంది.నెమ్మదిగా పులుస్తుంది. కొబ్బరి కల్లులో పొటాషియం శాతం ఎక్కువ, జీలుగ కల్లులో కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది… ” అని తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా కేంద్రం సీనియర్‌ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య వివరించారు.అన్ని రకాల కల్లుల పై ఈయన అధ్యయనం చేస్తున్నారు.

ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు. ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని సేవిస్తారని ఆయన వివరించారు.
అందరికంటే భిన్నంగా ఆలోచించడం వల్ల ఈ గీత కార్మికుడి రాత మారి, కులవృత్తి తలెత్తుకొని బతుకుతోంది. పాలమూరు వలసలు వాపస్‌ అయి , పదిమందికి ఉపాధి నిస్తున్నాయి. -ShyamMohan

……………………………………………………

ఇది కేరళ కాదు, కోన సీమ అసలే కాదు. తెలంగాణ లోని అరుదైన ఆక్సిజన్ గ్రామం. పదండి చూద్దాం…

…………………………………………………..

  ఈ వీడియో చూసే  మిత్రులకు ఒక సూచన. ఈ ఔషధాన్ని మీరే స్వయంగా చేసుకోండి. తిప్పసత్తు, జ్యూస్‌, పొడిని మార్కెట్‌లో కొనే ప్రయత్నం చేయవద్దు. మీకు పొలం ఉంటే గట్లు మీద, లేకపోతే పెరట్లో, టెర్రస్‌ మీద కొన్ని మొక్కలు పెంచుకోండి. ఆసుపత్రులకు, మందులకు పెట్టే… ఖర్చు తగ్గిపోతుంది.  https://youtu.be/yD4W–3F2qk

………………………………………………………..

ఇవి కూడా చదవండి… అరుదైన రుచుల కెఫె గ్రీన్ ఎత్నిక్! https://www.ruralmedia.in/back-to-nature/organic-millet-restaurant-in-zaheera-bad/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles