చేనేత అంటే బట్ట, బతుకే కాదు. చేనేత అంటే ఒక నినాదం, ఒక స్ఫూర్తి, స్వదేశీ పిలుపుతో స్వరాజ్య సాధనలో భారతావనిని ఏకం చేసిన ఇంధనం. చేనేత కళాకారుల కళానైపుణ్యం వలసపాలనను అంతమొందించడంలో సఫలీకృతమైంది. చరఖాను స్వదేశీ ఉద్యమ చిహ్నంగా మలచడంలో గాంధీజీ పాత్ర మరువలేనిది. ఆగస్ట్ 7ను ‘‘చేనేత దినోత్సవం’’గా జరుపుకునే సాంప్రదాయానికి 2006 లో పునాది పడింది.తెలంగాణ గడ్డ చేనేతకు పెట్టిందిపేరు. రైతన్న తర్వాతి స్థానం నేతన్నదే. అయితే చేనేత గిట్టుబాటు బాటు కాక చాలామంది నేతకార్మికులు ఉపాధికోసం ఇతర పనులు చూసుకుని వలస బాటపట్టారు. కుటుంబానికి ఒకరో ఇద్దరో మిగిలారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు గ్రామాల చేనేత కుటుంబాల మహిళలు చేనేతకు ఆధునికత,సాంకేతికత జత చేసి, చేనేతకు జీవం పోసే ప్రయత్నం చేస్తూ స్వయ సమృద్ది సాధిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17069 మగ్గాల ద్వారా చేనేత వస్త్రాలు ఉత్పత్తవుతున్నాయి.
నాణ్యతకు, మన్నికకు పేరొందినవే అయినా,పరిమిత ఉత్పత్తులు మాత్రమే అందుబాటులో ఉండటంతో అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో నెమ్మాని, మంద్ర, వెల్లంకి గ్రామాలకు చెందిన 116 స్వయం సహాయక బృందాలకు చెందిన 251మంది సభ్యులు శిక్షణ పొంది ఇక్కాత్ అద్దకం, నేతలో నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు.
చేనేత లో మహిళల పాత్ర
ఈ చేనేత గ్రామాలకు వెళ్తే, ప్రతీ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేది మగ్గాలే. అవే ఇంటికి సంపద. వాటి చుట్టూ అల్లుకొని వుంటాయి ఆ కుటుంబీకుల జీవితాలు. ప్రతి కుటుంబంలోను చిన్న పిల్లల దగ్గరనుంచీ అందరూ నేత పనిచేస్తారు. ముఖ్యంగా ఆడవారికి ఇంటిపని, వంటపనితో పాటు మగ్గం పని కూడా తప్పనిసరి. నూలు వొడికి దారం తయారీ దగ్గర నుంచి మొదలు పెట్టి వస్త్రం తయారయ్యే అన్ని స్థాయిల్లోను చాలా ఎక్కువ సమయం శ్రమించేది స్త్రీలే. నేతపనికి కేటాయించిన పనిగంటలంటూ ప్రత్యేకంగా వుండవు.
ఎక్కడిదీ ఇక్కాత్ ?
” ఇక్కత్ డిజైనింగ్ , నేతకు ఇవాళ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇక్కాత్ అనే పదం ఉర్దూ నుండి వచ్చింది. ఈ శైలి ఇండోనేషియాలో రూపుదిద్దుకొంది. ఈ వస్త్రాల నేత అత్యంత కళాత్మకం. దీనిలో రెండు ముఖ్య అంశాలుంటాయి. ఒకటి రంగు దారాల తయారీ, రెండు బొమ్మలు లేదా డిజైన్ అద్దకం. దారాల మీదే డిజైన్ వేసి , ఆ తర్వాత మగ్గం మీద నెయ్యడం దీనిలో ప్రత్యేకత. అందువల్ల ఇందులో ఆర్టూ, క్రాఫ్టూ ఉన్నాయి. అందువల్లనే దీనికి మార్కెట్లో అద్భుత డిమాండ్ ఉంది. ఈ నేత చీరలు నెమ్మాని, వెల్లంకి ,పోచంపల్లి లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.” అంటారు నేత కార్మికురాలు గంజి ఉమ.
ఎలాంటి నైపుణ్యం…
ఆకులు, పువ్వులు కూరగాయల నుండి రంగులు తియ్యడం, నూలు అమర్చడం, రంగుల అద్దకం, చీరలు, కుర్తాలు ఇక్కత్ వాడకం, అచ్చు అతకడం, పవర్‌లూం,హ్యాండ్‌లూం మగ్గాల మీదా నేతలో శిక్షణ పొందామంటున్నారు మంద్ర, గ్రామస్తులు.
ఫ్యాషన్ ప్రపంచం ఇవాళ పాత కొత్తల మేలు కలయికగా రూపొందుతోంది. పెరుగుతున్న వస్త్ర వినియోగ దారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఈ మహిళలు ఉత్పత్తులు చేయడమే కాక ఆన్ లైన్,ఆఫ్ లైన్ విధానాల ద్వారా మార్కెటింగ్ చేస్తూ మార్కెట్ నెట్ వర్క్ పెంచుకుంటున్నారు.
ఆన్లైన్లో అమ్మకాల జోరు
వీరు టెక్నాలజీని తమ ఉత్పత్తుల మార్కెట్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఇంటర్నెట్ విప్లవం ద్వారా చేనేతకు తిరుగులేని మార్కెట్ ను సృష్టించుకున్నారు. తాము నేసిన దుస్తులను వెబ్‌సైట్‌లో ఇన్‌స్టాగ్రాం,ఫేస్‌బుక్‌లో డిస్‌ప్లే చేసి ప్రవాసభారతీయిలను ఆకట్టుకుంటున్నారు. ఇంటిపట్టునే ఉంటూ నెలకు నలభై వేలకు పైగా సంపాదిస్తున్న వందలమంది యువతీ యువకులు పోచంపల్లిలో ఉన్నారు. ” సోషల్ మీడియా విప్లవం వల్ల విదేశాల నుండి రోజుకు రెండు నుండి నాలుగు ఆర్డర్లు వస్తున్నాయి. మా డిజైన్లను ఆన్‌లైన్‌లో చూసి వారికి నచ్చిన డిజైన్లను సెలక్టు చేసుకొని ఆర్డర్ ఇవ్వగానే కొరియర్‌లో పంపేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుండి కూడా అడుగుతున్నారు. నెలకు రూ.30 వేల నుండి రూ. 50వేల వరకు అమ్మకాలు జరుపుతున్నాం. ” అని బీబీసికి చెప్పారు పోచంపల్లికి చెందిన మంగళపల్లి లావణ్య,రాచ వైష్నవి.
శ్రమ తగ్గించిన ఆసు యంత్రం.
వస్త్రం నేతకు ముందు ‘ఆసుపోయడం’ అనే కష్టతరమైనపని ఉంది. ఈ పద్ధతిలో అర్ధచంద్రాక తిలో అమర్చిన రేకుల మేకుల చుట్టూ ఒక మీటరు పరిధిలో నేతకార్మికులు తన చేతిని సుమారు 9000 సార్లు పైకి కిందకి కదిలించాలి. దీని వల్ల భుజాలు, మోచేతులు తీవ్రమైన అలసటకు గురవుతాయి. ఒక చీర నేయడానికి కనీసం 5నుండి6గంటలు ఈ పద్ధతిలో కష్టించాలి.
పోచంపల్లి చేనేత కార్మిక కుటుంబానికి చెందిన చింతకింది మల్లేశం, చీరలు నేయడంలో తల్లి లక్ష్మి పడే కష్టాన్ని చూస్తూ పెరిగాడు. ఆసుపోయాడానికి ఒక యంత్రం ఉంటే పని సులభమవుతుందని గ్రహించి ఆసుయంత్రాన్ని కనిపెట్టాడు. ” నేడు 12వందల మంది నేతమ్మలు ఆసు యంత్రం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆరుగంటల పని గంటలో పూర్తి చేస్తూ శ్రమను తగ్గించుకున్నారు.” అని చింత కింద మల్లేశం బీబీసికి చెప్పారు. ఆసుయంత్రం కనిపెట్టినందుకు భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది.
మార్కెట్ మా దగ్గరకొస్తోంది
” గతంలో పోచంపల్లి చీరలు తెప్పించుకోవాలని వినియోగ దారులు చూసేవారు. కాని ప్రస్తుతం ఇక్కడి నేతపనితనం చూసిన వారెవరైనా పోచంపల్లి వెళ్లి చీరలు చూసొద్దామనే బయలుదేరుతున్నారు. దేశ, విదేశాల మహిళలు సైతం హైదరాబాద్‌కు వస్తే పోచంపల్లి ఎక్కడుందని తెలుసుకొని వస్తున్నారు. ప్రభుత్వం పోచంపల్లిని ఒక టూరిజం సెంటర్‌గా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పించాలి. అపుడే చేనేతకు మరింత చేయూత కలుగుతుంది.” అన్నారు పోచంపల్లి గ్రామ సర్పంచ్ లతా వెంకటేశం.
స్థిరమైన అభివృద్ధి వైపు
టెక్నాలజీ అధునీకరణ, నైపుణ్యం పెంపు, కొత్త డిజైన్ల రూప కల్పన, మార్కెటింగ్ అవకాశాలు మెరుగు పరుచుకోవడం వల్ల స్థిరమైన అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. నైపుణ్యం మెరుగుదలకు,బ్యాంకుల నుండి రుణ సదుపాయం పొందడానికి నాబార్డు,కొన్ని స్వచ్ఛంద సంస్దలు వీరికి తోడ్పడుతున్నాయి. ” ఒకపుడు రోజుకు రూ. 200 ఆదాయం కూడా పొందని స్ధాయి నుండి నేడు రూ 500నుండి 800 వరకు సంపాదిస్తూ సుస్ధిర జీవనోపాధులు పొందుతున్నాం’ వెల్లంకి గ్రామానికి చెందిన రామలచ్చుమమ్మ అన్నారు.
గ్రామీణ ఉద్పాదకత పెరుగుతోంది
స్వయం సహాయక గ్రూపుల మహిళలు ఇక్కాత్‌లో శిక్షణ పొందారు. తమ గ్రామాల్లో ముడి సరకు తయారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానింగా మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. దీని వల్ల పోచంపల్లి ఇక్కత్ డిజైన్ నేతమ్మలకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారి చేతిలో కొత్త ఒరవడి సంతరించుకుంటోంది. మహిళలు, ఉత్పత్తి, మార్కెటింగ్ క్రమంలో భాగస్వాములవుతున్నారు. వారికి బ్యాంకుల సాయంతో మార్కెటింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవడానికి సాయం అందిస్తాం..’ అంటున్నారు జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ది బ్యాంకు జిల్లా అధికారి డి. దయామృత.
ఒకపుడు మగ్గం తప్ప మరో మార్గం తెలీని ఈ పేద మహిళలు నేడు తమ ప్రగతికి తామే కొత్తబాటలు వేసుకుంటున్నారు.