( ఎన్ వేణుగోపాల్ )
‘చదవవలసిన పుస్తకాలు’ ఏమిటో చెప్పడం కనబడుతున్నంత సులభమైనది కాదు. ‘చదవవలసిన పుస్తకాలు’ అనే చదువరులందరికీ వర్తించే ఏకైక జాబితాను తయారు చేయడం అసాధ్యం. అసలు ఆ మాటను రెండు వైపుల నుంచి – పుస్తకాలు చదివే పాఠకుల వైపునుంచీ, పుస్తకాల వైపు నుంచీ కూడ – అర్థం చేసుకోవచ్చు. పాఠకుల వైపు నుంచి చూసినప్పుడు ఆ పాఠకుల దేశ, కాల, వయో, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థాయిలను బట్టి చదవవలసిన పుస్తకాల జాబితాలు మారవచ్చు, ఒక్కొక్క వ్యక్తికీ లేదా ఒక్కొక్క సమూహానికీ ఒక్కొక్క రకంగా ఉండవచ్చు. లేదా పుస్తకాల వైపు నుంచి చూసినప్పుడు స్థలకాలాలతో నిమిత్తం లేకుండా, కనీసం ఆధునిక కాలంలో, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలు అనే ఒక జాబితా, లేదా కొన్ని జాబితాలు తయారవుతాయి. అసలు ఏ జాబితా అయినా తయారుచేస్తున్నవారి దృక్పథాన్ని బట్టీ, సామాజిక స్థితిని బట్టీ, అధ్యయనాన్ని బట్టీ తయారవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందువల్ల పాఠకులలో ప్రతి ఒక్కరూ ఈ వేరు వేరు జాబితాల నుంచి తమ సొంత జాబితాను తయారుచేసుకోవలసి వస్తుంది.
అసలు పుస్తకం చదవడం ఎందుకు? చదువు ద్వారా మనిషికి తన గురించీ, సమాజం గురించీ, ప్రకృతి గురించీ అవగాహన పెరుగుతుంది. తన జీవితంలోనూ, తన చుట్టూ ఉన్న సమాజంలోనూ, ప్రకృతిలోనూ జరుగుతున్న మార్పులను అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. తాను పొందుతున్న అనుభవాలు తనకే ప్రత్యేకమైనవి కావనీ, ఇతర వ్యక్తులు ఏదో ఒక కాలంలో ఒక స్థలంలో అనుభవించినవేననీ మనిషికి పుస్తక పఠనం ద్వారానే తెలుస్తుంది. తనలో ఉన్న ప్రత్యేకతలేమిటో, తనలో జరుగుతున్న మార్పులేమిటో, బయటి పరిణామాలకు తన స్పందన ఎలా ఉండడం అవసరమో, సముచితమో తెలుసుకోవడానికీ, తెలిసినదాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికీ పుస్తక పఠనమే వీలుకలిగిస్తుంది. అంటే మనిషి సామాజికవ్యక్తిగా మారడం ఎలాగో పుస్తక పఠనం నేర్పుతుంది. మనుషులు ఎంత ప్రతికూల సమయంలోనైనా కూడ పుస్తకం చదివే అలవాటును నిలబెట్టుకున్నారో చూపే ఉత్తేజకరమైన అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
ఒకవైపు నిరంతర యుద్ధాలలో పాల్గొంటూనే, యుద్ధరంగం మీదా, ఒక యుద్ధరంగం నుంచి మరో యుద్ధరంగానికి ప్రయాణంలో శకటాలలోనూ నెపోలియన్ పుస్తకాలు ఎలా చదువుతూ ఉండేవాడో చరిత్ర నమోదు చేసింది. అలాగే ఉరికంబం ఎక్కబోతూ చివరి రోజులలో భగత్ సింగ్ పుస్తకాలు చదువుతున్నాడనీ, నోట్స్ తీసుకుంటున్నాడనీ ఆధారాలు ఉన్నాయి. ఉరి తీయడానికి ముందు రోజు లెనిన్ రాసిన ‘రాజ్యమూ విప్లవమూ’ పుస్తకాన్ని భగత్ సింగ్ చదువుతూ ఉన్నాడని అప్పటి రికార్డ్స్ తెలుపుతున్నాయి. చైనా లాంగ్ మార్చ్ నుంచి, లాటిన్ అమెరికా గెరిల్లా పోరాటాలనుంచి, దండకారణ్య ప్రజాసైన్యం దాకా ప్రజాసైనిక జీవితంలో పుస్తకపఠనం అనివార్యమైన, తప్పనిసరి అయిన జీవితపార్శ్వంగా ఉన్నదని కూడ ఆధారాలున్నాయి. అంటే యుద్ధాన్నీ, మృత్యువునూ, నిరంతర ప్రమాదాన్నీ, దైనందిన జీవితాన్నీ కూడ అధిగమించగలిగే ఆకర్షణ ఏదో పుస్తకాలలో ఉంటుందన్నమాట.
అక్షరాస్యులు కానివారు చాలమంది ఈ అవగాహనలను తమ ఆచరణ ద్వారా పొందుతారు. మరొకమాటల్లో చెప్పాలంటే అక్షరాస్యులు పుస్తకాలలో చదవగలిగినదాన్ని, నిరక్షరాస్యులు తమ చేతల్లోనూ, ఇతరుల చేతల్లోనూ చదువుతారు. కాని ఆ అవగాహనకు పరిమితులుంటాయి. అది ప్రత్యక్ష ఆచరణ అధ్యయనం కాగా, పుస్తకంలో పరోక్ష ఆచరణ అధ్యయనానికి వీలుంటుంది. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను మాత్రమే కాక, తాను ప్రత్యక్షంగా చూడని పరిణామాలను కూడ అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలను మనిషికి పుస్తక పఠనమే కలగజేస్తుంది. ఈ ప్రకృతి ఏమిటో, అందులో తన స్థానమేమిటో, ఏ చారిత్రక పరిణామాలను దాటి తాను ప్రస్తుతం జీవిస్తున్న సమాజం ఏర్పడిందో, దీని మంచి చెడులేమిటో మనిషికి పుస్తకాల ద్వారానే అర్థమవుతుంది. తాను జీవిస్తున్న సమాజంలో అర్థవంతంగా పాల్గొనడానికి, తన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోవడానికి మనిషికి సహకరించేది చైతన్యాన్ని పెంచే పుస్తకమే.
అక్షరాస్యులయిన ప్రతి ఒక్కరూ తమ జీవితక్రమంలో – విద్యార్థిగా తప్పనిసరిగానో, వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కోసమో – కొన్ని పుస్తకాలు చదవవలసి వస్తుంది. లేదా విద్యార్థి దశలోనో, ఆ తర్వాత జీవితంలోనో కేవలం ఆసక్తితో చదివే పుస్తకాలు కూడ ఉంటాయి. అంటే ప్రతి మనిషీ తన జీవితంలో తప్పనిసరిగా చదివే పుస్తకాలు కొన్ని డజన్లో, కొన్ని వందలో ఉంటాయి. కనీసం కొందరికయినా పుస్తకాలు చదవడంలో రుచి దొరికి ‘పుస్తకాల పురుగులు’గా మారి దాదాపు ప్రతిరోజూ చదవకుండా ఉండలేని స్థితికి చేరుకుని జీవితకాలంలో కొన్ని వేల పుస్తకాలయినా చదువుతారు. సంవత్సరానికి మూడువందల పుస్తకాలు చదవడం గరిష్ట పరిమితి అనుకుంటే అరవై సంవత్సరాల పఠన జీవితంలో ఒక మనిషి అత్యధికంగా పద్దెనిమిది వేల పుస్తకాల కన్న ఎక్కువ చదవడం కుదరదు. ఇది కొంచెం విస్తరించినా ఇరవై – ఇరవై ఐదు వేల పుస్తకాలు చదవడం అసాధ్యమైన గరిష్ట ప్రమాణం కావచ్చు. పూర్తిగా చదవకపోయినా, విజ్ఞాన సర్వస్వాలు, సంక్షిప్తీకరణలు, సమీక్షలు, పరిచయాలు, జాబితాలు, ఉపన్యాసాలు, సంభాషణలు వంటి మార్గాల ద్వారా మరి కొన్ని వేల పుస్తకాల గురించి కూడ తెలుసుకోవచ్చు. ఎంత ఎక్కువలో ఎక్కువ పుస్తకాలు చదివేవారయినా, పుస్తకాల గురించి తెలుసుకునేవారయినా, జీవితకాలంలో ఇరవై, ముప్పై వేల పుస్తకాలు చదివినప్పటికీ, మొత్తం మీద వెలువడిన పుస్తకాలలో వెయ్యికి ఒక్కటి కూడ చదివినట్టు కాదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఎందుకంటే మానవజాతి – అన్ని ప్రాంతాలూ సమాజాలూ సాహిత్యాలూ భాషలూ కలిసి – సామూహికంగా ఇప్పటికి రాసిన, సంకలనం చేసిన పుస్తకాలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రతిసంవత్సరం పదిలక్షల పుస్తకాలు వెలువడుతున్నాయని 2006లో అంచనా వేసింది. ఈ వార్షిక సంఖ్య కూడ పూర్తిగా విశ్వసనీయమైనది కాదు. యునెస్కో జాబితాలోకి రాని పుస్తక ప్రచురణలు ఎన్నో ఉంటాయి. చాల భాషలలో, చాల సమాజాలలో వెలువడుతున్న పుస్తకాలన్నీ ఈ యునెస్కో సమాచార సేకర్తలకు అంది ఉంటాయనే నమ్మకం లేదు.ఈ వార్షిక సంఖ్య ఇటీవలి దశాబ్దాలలో చాల ఎక్కువగా ఉండవచ్చు. అచ్చు యంత్రం కనిపెట్టక ముందు, చేతిరాతతో పుస్తకాలు రాసి, చేతిరాతతోనే ప్రతులు తీసుకునే రోజుల్లో, వెలువడిన పుస్తకాల సంఖ్య ఏటేటా కొన్ని వందలకు మించిఉండకపోవచ్చు. అచ్చు యంత్రం కనిపెట్టాక ఆ సంఖ్య కొన్ని వేలకు చేరి ఉండవచ్చు. పుస్తక ప్రచురణలో, ముద్రణలో ఆధునిక సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య పెరిగిపోతూ ఉండవచ్చు. గూగుల్ అనే ఇంటర్నెట్ సంస్థ ఇటీవలి కాలంలో ప్రపంచంలో వెలువడిన పుస్తకాలన్నిటినీ డిజిటైజ్ చేయాలనే ఒక పథకం తయారు చేసుకుని ఆధునిక కాలంలో ప్రపంచంలో వెలువడిన పుస్తకాల సంఖ్య దాదాపు పదమూడు కోట్లు అని తేల్చింది. ఈ సమాచార సేకరణలో పుస్తకం అనే మాటకు ఇచ్చుకున్న నిర్వచనంవల్ల, స్పష్టంగా చెప్పని ఆధునిక కాలం అనే మాట వల్ల, ప్రచురణ సంస్థలను ఐ ఎస్ బి ఎన్ అనే సాంకేతిక ప్రమాణంతోనే గుర్తించడం వల్ల, ఈ పదమూడు కోట్ల సంఖ్యకు కూడ చాల పరిమితులున్నాయి.
మొత్తం మీద అర్థమయ్యేదేమంటే, మనిషి చదవదలచుకుంటే ఎదురుగా ఉన్న పుస్తకాలు సముద్రంతో సమానమైనన్ని కాగా, అందులో తప్పనిసరిగా చదవవలసినవీ, మంచివీ, విజ్ఞాన వినోద దాయకమైనవీ, ఆహ్లాదకరమైనవీ ఒక నదితో సమానమైనన్ని ఉండగా, ఒక మనిషి ఎక్కువలో ఎక్కువ ఒక దోసెడు నీళ్లు మాత్రం తాగడానికి వీలవుతుంది. మరి ఆ దోసెడు నీటిని ఎంచుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న.ఈ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ‘చదవవలసిన పుస్తకాల’ గురించి కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాస లక్ష్యం. చదవగలిగే తక్కువ సమయంలో చదవదగిన ఎక్కువ పుస్తకాలను సూచించడం కూడ కష్టం కావచ్చుగాని కనీసం ఆయా పాఠకుల అభిరుచులను బట్టి మొత్తంగా పఠన కార్యక్రమం ఏ పద్ధతిని అనుసరిస్తే ఎక్కువ ప్రయోజనకరమో సూచించడం ఈ వ్యాస లక్ష్యం.
ప్రతి మనిషికీ కొద్దిగానైనా ప్రకృతి శాస్త్రాల పరిచయం, మానవ పరిణామం గురించి అవగాహన తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. కనుక ఎవరికైనా ‘చదవవలసిన పుస్తకాల’ జాబితాలో ఈ ప్రకృతిశాస్త్రాల, మానవపరిణామ విషయాల గురించి చైతన్యం పెంచగల పుస్తకాలు తప్పకుండా ఉండాలి. గెలీలియో, కోపర్నికస, న్యూటన్, డార్విన్ ల సిద్ధాంతాల నుంచి ఎన్నో పుస్తకాలు చదవవలసి ఉంటుందని చెప్పవచ్చు గాని అది ఆచరణ సాధ్యం కాని జాబితా అయిపోతుంది. ఈ అంశాలను వివరించిన పుస్తకాలు ఇంగ్లిషులో చాల ఉన్నాయి. కనీసంగా, ఎంగెల్స్ రాసిన ‘మానవ పరిణామంలో శ్రమ పాత్ర’ గాని, జె డి బెర్నాల్ రాసిన ‘సైన్స్ ఇన్ హిస్టరీ’ కాని ఐజాక్ అసిమోవ్ రచనలు గాని చదవడం ఈ పరిజ్ఞానానికి ఉపయోగపడుతుంది. తెలుగు పాఠకులకు సంబంధించినంతవరకు ఈ విషయాలకోసం నండూరి రామమోహనరావు రాసిన ‘విశ్వరూపం’, ‘నరావతారం’ చాల ఉపయోగకరమైన పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలు మూడు దశాబ్దాల కింద రాసినవే అయినా, ఈలోగా శాస్త్ర పరిశోధనలు మరింత ముందుకు సాగినా, ఈ పుస్తకాల శైలి వల్ల, విస్తృతివల్ల చాల ప్రాచుర్యాన్ని పొందాయి. ఇటీవలి కాలంలో ఈ విషయాలపైననే మరింత అదనపు సమాచారంతో, ఆసక్తిదాయకంగా కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన ‘విశ్వాంతరాళం’, ‘మానవపరిణామం’, సూక్ష్మజీవులూ నాడీకణాలూ’ కూడ వెలువడ్డాయి.
ప్రకృతి గురించి, మానవపరిణామం గురించి తెలుసుకున్న తర్వాత సమాజ చరిత్ర గురించి తెలిపే పుస్తకాలు చదవడం అవసరం. నిజానికి ఇది చాల ఇబ్బందికరమైనది. ప్రపంచంలో ప్రతి ఒక్క సమాజానికీ దానికే ప్రత్యేకమైన చరిత్రలు ఉన్నాయి. అవి కూడ పాలకవర్గ దృక్పథం నుంచి రాసినవీ, ప్రజల దృక్పథం నుంచి రాసినవీ ఎన్నో ఉన్నాయి. గతంలో తక్కువ ఆధారాలతో, పరిమిత దృక్పథంతో రాసిన పుస్తకాల కన్న ఆ తర్వాత ఎక్కువ ఆధారాలతో, మరింత సమగ్ర దృక్పథంతో రాసినవీ ఉన్నాయి. కనుక చరిత్ర అధ్యయనంలో పాఠకులు తమకు అవసరమని అనిపించిన, తమకు అభిరుచిగల ప్రాంతీయ చరిత్రనో, తాము అభిమానించే దృక్పథం నుంచి రాసిన చరిత్రనో చదవవచ్చు. తప్పనిసరిగా చదవవలసిన చరిత్ర లేదా చరిత్రలు ఇవే అని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే చారిత్రక దృక్పథం గురించి మాత్రం ఎవరయినా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇ ఎచ్ కార్ రాసిన ‘వాట్ ఈజ్ హిస్టరీ?’ (‘చరిత్ర అంటే ఏమిటి?’ అని తెలుగులో వచ్చింది). అలాగే గార్డన్ చైల్డ్ రాసిన ‘వాట్ హాపెండ్ ఇన్ హిస్టరీ’, ‘మాన్ మేక్స్ హిమ్ సెల్ఫ్’(‘చరిత్రలో ఏం జరిగింది’, ‘మానవుడే చరిత్ర నిర్మాత’ అని తెలుగులో వచ్చాయి) కూడ ఇందుకు ఉపయోగపడతాయి. ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన ‘కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగయంత్రాల పుట్టుక’, కార్ల్ మార్క్స్ రాసిన ‘ఎ కాంట్రిబ్యూషన్ టు ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ’ ముందుమాట చారిత్రక దృక్పథం ఏర్పడడానికి చాల ఉపయోగపడతాయి. అలాగే క్రిస్ హార్మన్ రాసిన ‘ఎ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్’, హోవార్డ్ జిన్ రాసిన ‘ఎ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ ఉపయోగకరమైనవి. భారత సమాజ చరిత్రకు సంబంధించినంతవరకు డి డి కోశాంబి రాసిన ‘ఆన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ చదవడం ఒక స్థూల అవగాహనను ఇస్తుంది. రాహుల్ సాంకృత్యాయన్ నేరుగా చరిత్ర రాయకపోయినా, చారిత్రక నవలల ద్వారా ఈ దృక్పథాన్ని అందించడానికి ప్రయత్నించారు. ఆయన రాసిన ‘ఓల్గా సే గంగా’, ‘సింహ సేనాపతి’, ‘జయ హౌధేయ’, ‘విస్మృతయాత్రికుడు’ వంటి నవలలు, ‘రుగ్వేద ఆర్యులు’ వంటి పుస్తకాలు ఉతేజకరంగానూ, ఆలోచనాస్ఫోరకంగానూ ఉంటాయి. తెలుగు సమాజ చరిత్రకు సంబంధించినంతవరకు సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, కంభంపాటి సత్యనారాయణ రాసిన ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ చదవడం ఉపయోగకరం.
ప్రకృతి చరిత్రనూ, సామాజిక చరిత్రనూ, అందులో మనిషి స్థానాన్నీ అర్థం చేసుకోవడానికి కొంత తాత్విక దృక్పథం, కొంత రాజకీయార్థిక దృక్పథం కూడ తప్పనిసరిగా అవసరమవుతాయి. నిజానికి చరిత్రలాగే తత్వశాస్త్ర అధ్యయనం కూడ దానికదిగా ఒక మహాసముద్రం. ఆ వందలకొలది పుస్తకాలలో కొన్నిటిని విడదీసి చూపడం కష్టం. కాని ప్రతి మనిషీ కనీసం తత్వశాస్త్ర చరిత్రను, ప్రధాన తాత్విక దృక్పథాలను పరిచయం చేసుకోవడం అవసరం. తెలుగులో సరయిన తాత్విక పరిభాష ఇంకా అభివృద్ధి చెందలేదు గాని గోపీచంద్ రాసిన ‘తత్వవేత్తలు’, నండూరి రామమోహనరావు రాసిన ‘విశ్వదర్శనం’, రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ప్రాక్పశ్చిమదర్శనాలు’, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ రాసిన ‘భారతీయ తత్వశాస్త్రం – సులభ పరిచయం’ వంటి గ్రంథాలయినా అధ్యయనం చేయడం అవసరం. మార్క్స్ రాసిన ‘ఎకనమిక్ అండ్ ఫిలసాఫికల్ మాన్యుస్క్రిప్ట్స్’, ‘థీసిస్ ఆన్ ఫ్యూర్ బా’, ఎంగెల్స్ రాసిన ‘లుడ్విగ్ ఫ్యూర్ బా అండ్ ఎండ్ ఆఫ్ క్లాసికల్ జర్మన్ ఫిలాసఫీ’, లెనిన్ రాసిన ‘మెటీరియలిజం అండ్ ఎంపిరియో క్రిటిసిజం’, మావో రాసిన ‘వైరుధ్యాలు’, ‘ఆచరణ’, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ రాసిన ‘వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ’ వంటి పుస్తకాలు చదవడం ఉపయోగకరం.
గతితర్కం గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో మావో ‘చైనాలో డెబ్బైకోట్ల గతితర్క వాదులను చూడాలని నా ఉద్దేశం’ అన్నాడు. అప్పుడు చైనా జనాభా డెబ్బై కోట్లు. అంటే, ప్రతిఒక్కరూ గతితార్కిక ఆలోచనాపద్ధతిని నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.ఇక రాజకీయార్థిక శాస్త్ర పుస్తకాల అధ్యయనం సమాజాన్ని, సమాజానికి పునాది అయిన ఉత్పత్తి శక్తులనూ ఉత్పత్తి సంబంధాలనూ అర్థం చేసుకోవడానికి చాల ఉపయోగపడుతుంది. ఈ రంగంలో కూడ ఇంగ్లిషులో వందలాది పుస్తకాలున్నాయి గాని తెలుగులో ఆ పరిభాష సులభమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు, సులభ గ్రాహ్యమైన పుస్తకాలు వెలువడలేదు. ఇంగ్లిషులోని మంచి పుస్తకాలకయినా మంచి తెలుగు అనువాదాలు రాలేదు. లియో హ్యూబర్ మన్ రాసిన ‘మాన్స్ వరల్డ్లీ గూడ్స్’ వంటి పుస్తకాలు రాజకీయార్థికశాస్త్ర దృక్పథాన్ని సులభంగా పరిచయం చేస్తాయి. అలాగే రాజకీయార్థ శాస్త్రం మీద ఎన్నో పాఠ్య పుస్తకాలున్నాయిగాని లియాంటివ్ రాసిన ‘రాజకీయార్థ శాస్త్రం’ వంటి పుస్తకం ఒకటయినా చదవడం అవసరం. చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో సాధారణ పాఠకులందరికీ అర్థమయ్యే పద్ధతిలో రాజకీయార్థ శాస్త్రాన్ని బోధించడానికి ‘షాంఘై టెక్స్ట్ బుక్’ తయారయింది. అదీ, మావో రాసిన ‘క్రిటిక్ ఆఫ్ సోవియట్ ఎకనామిక్స్’ కూడ చదవడం అవసరం.ఇక సాహిత్యంలో కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం వంటి ప్రక్రియలలో చదవవలసిన పుస్తకాలు అసంఖ్యాకంగా ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక మానవ జీవిత, సమాజ శకలాన్ని, మానవ సంబంధాల విశిష్ట అనుభవాన్ని చెపుతుంది గనుక దేనికది చదవవలసిందే. కాని అన్నీ చదవడం సాధ్యం కాదు గనుక, అభిరుచిని బట్టి, ఆయా సమాజాల గురించి ఉండే ఆసక్తినిబట్టి కొన్ని పుస్తకాలు ఎంచుకోక తప్పదు. పద్దెనిమిది, పందొమ్మిదో శతాబ్దాలలో యూరప్ లో సమాజంలో, మానవ జీవితంలో అనూహ్యమైన, అసాధారణమైన, ప్రగాఢమైన మార్పులు వచ్చాయి గనుక, ఆ కాలపు నవలా సాహిత్యం ఆ మార్పులను పట్టుకున్నది గనుక ఆ నవలలు చదువుతుంటే మానవస్వభావాల గురించీ, వాటిలో వచ్చే మార్పుల గురించీ, వ్యక్తికీ సమాజానికీ మధ్య ఉండే ఐక్యత – ఘర్షణ గురించీ గొప్ప అవగాహన కలిగి పాఠకుల చైతన్యం ఉన్నతీకరణ జరుగుతుంది. ఆ నవలల అధ్యయనం గొప్ప జీవితానుభవంలా ఉంటుంది. ఇంగ్లిష్, ఫ్రెంచి, రష్యన్ సమాజాలలో వెలువడిన ఆ నవలలు, కాల్పనిక సాహిత్యం ప్రతిచోటా చదవవలసిన పుస్తకాల జాబితాలో ఉండడం అందువల్లనే. అలాగే రష్యా, చైనాలలో విప్లవక్రమంలో మానవజీవితం అనుభవించిన సంఘర్షణ, కొత్తసమాజ నిర్మాణపు పురుటి నొప్పులు చాల గొప్ప సాహిత్యాన్ని వెలువరించాయి. అలాగే చాల దేశాలలో సోషలిజం కోసం మనుషులు కన్న కలలూ, చేసిన పోరాటాలూ నిర్మాణాలూ గొప్ప సాహిత్యాన్ని సృష్టించాయి. ఆ కథలూ నవలలూ కవిత్వాలూ నాటకాలూ వ్యాసాలూ అన్నీ, కనీసం వాటిలో ముఖ్యమైనవైనా తప్పనిసరిగా చదివి తీరవలసినవే.
అటువంటి కథల, నవలల జాబితా కనీసం వంద పుస్తకాలదైనా తయారవుతుంది.ఇక పాఠకులెవరికైనా ప్రత్యేకంగా కొన్ని రంగాలమీద, కొన్ని సమాజాలమీద హెచ్చు ఆసక్తి ఉండవచ్చు. ఒకరికి వ్యవసాయరంగంలో ఏమి జరిగిందో, జరుగుతున్నదో తెలుసుకోవాలని ఉంటే, మరొకరికి క్రీడారంగంలోని పరిణామాల మీద ఆసక్తి కావచ్చు. ఒకరికి అమెరికన్ సమాజంలో ఏమి జరిగిందో చదవాలని ఉంటే, మరొకరికి దండకారణ్యంలో ఆదివాసి తెగల జీవితం గురించి చదవాలని ఉండవచ్చు. అలా ఆయా రంగాలకే, సమాజాలకే పరిమితమైన, ప్రత్యేకమైన పుస్తకాలు, అలా పరిమితమవుతూనే సార్వకాలిక, సార్వజనిక ఆలోచనలను ప్రేరేపించగల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. శ్రీశ్రీ అన్నట్టు ‘అట్టడుగున అంతమందిమీ మానవులమే’ అని నిరూపించడానికి దేశం, కాలం, భాష, సంస్కృతి ఏదయినా మనిషి పడే వేదన, మనిషి కనే కల, మనిషి సాగించే ఆచరణ అన్నిచోట్లా ఒకటే. కనుక ఏసమాజంలోనయినా మనిషి గురించి పట్టించుకున్న పుస్తకమేదీ మనిషికి అనవసరమైనది కాదు. అందువల్ల మనిషి గురించి, మానవజీవిత ఉన్నతీకరణ గురించి ఆలోచించిన, చర్చించిన, మార్గాలు సూచించిన పుస్తకాలన్నీ చదవవలసినవే.
ఎవరికి వారు వారి పరిమితులను బట్టి వాటిలో కొన్ని ఎన్నుకొని చదువుతారు.ఇక ప్రస్తుత సమాజంలో పుస్తకపఠనానికి ఉన్న అవరోధాలను గురించి కూడ చెప్పుకోవాలి. ‘చదవడం తగ్గిపోతున్నది’ అనే మాట ఇటీవల చాల తరచుగా వినబడుతున్నది. ముఖ్యంగా టెలివిజన్ వంటి వినోదసాధనం, సెల్ ఫోన్ వంటి సమయహరణ సాధనం వచ్చిన తర్వాత, నగరీకరణ పెరిగి ఉద్యోగాలకూ వృత్తులకూ ఎన్నోగంటల ప్రయాణం చేయవలసిన ఒత్తిడి పెరిగిన తర్వాత మనుషులు పుస్తకాలు చదవడం తగ్గిందని చాలమంది అంటున్నారు. నిజంగానే మన సమాజం లాంటి సమాజాలలో అక్షరాస్యుల సంఖ్యకూ అచ్చవుతున్న పుస్తకాల సంఖ్యకూ పొంతన ఉండడం లేదు. కాని ఈ దృశ్యాన్నే మరొక పక్కనుంచి చూస్తే రచయితలు పెరిగారు, ప్రచురణ సంస్థలు పెరిగాయి, సాలీనా వెలువడుతున్న పుస్తకాల సంఖ్య పెరిగింది. అది జనాభాతో, అక్షరాస్యులతో పోల్చి చూసినప్పుడు ఉండవలసినంతగా లేకపోవచ్చు గాని పెరుగుదల అసలే లేదని చెప్పలేం.గతంలో చదివే అలవాటు ఉండి ఇప్పుడు వదిలేసినవాళ్లయినా, ఇప్పుడు చదవవలసిన యువతరమయినా ప్రధానంగా పుస్తక పఠనానికి అవరోధాలుగా చూపుతున్న వాదనలలో ముఖ్యమైనవి – “చదవడానికి సమయం దొరకడం లేదు”, “కావలసిన పుస్తకం దొరకడం లేదు”, “ఏ పుస్తకం చదవాలో చెప్పేవాళ్లు లేరు”, “చదవవలసిన పుస్తకం పరభాషలో ఉంది/అనువాదం సరిగా లేదు.”నిజానికి చదవడానికి సమయం లేదనే వాదన చాల సందర్భాలలో వాస్తవం కాదు. ఆధునిక జీవితంలో వ్యాపకాలు పెరిగిపోయిన మాట, సమయంపైన ఒత్తిడి పెరిగిన మాట నిజమే గాని, ఒకసారి చదువు రుచి దొరికిన తర్వాత, చదువు అవసరం గుర్తించిన తర్వాత రోజుకు గంటో, అరగంటో సమయం దొరికించుకోవడం కష్టం కాదు.
వారానికి ఒకటో రెండో పుస్తకాలు తప్పనిసరిగా చదవాలనే నియమం పెట్టుకుంటే, సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే ఇది అనుకుంటున్నంత పెద్ద సమస్య కాదు.కావలసిన పుస్తకం దొరకడం లేదనేది కొంతవరకు నిజమైన సమస్యే. గతంలో లాగ అందుబాటులో గ్రంథాలయాలు, చదువుకున్న వారు, పుస్తకపఠన సంస్కృతి ఇప్పుడు లేవు. అందువల్ల ఎవరయినా ఏదయినా పుస్తకం చదువుదామని అనుకున్నా, ఆ సమయానికి ఆ పుస్తకం దొరకకపోవడం, ఆతర్వాత జీవన వ్యాపకాలలో పడి అది మరచిపోవడం జరుగుతున్నాయి. అనుకున్నపుస్తకం అనుకున్నప్పుడే దొరికితే చదవడానికి ఎక్కువ అవకాశం ఉండే మాట నిజమే. పాఠకులు ఒక్కచోటికి రావడం, పఠనసంస్కృతిని పెంపొందించడం, ఒకరి సొంత గ్రంథాలయాన్ని మరొకరు వినియోగించుకునే అవకాశం ఉండడం, సామూహిక పఠనం కోసం స్టడీసర్కిళ్లు ఏర్పడడం వంటి మార్గాలు వెతికి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అటువంటి పఠన సంస్కృతి పెరిగినప్పుడు, స్టడీసర్కిళ్లు ఏర్పడినప్పుడు ఏపుస్తకం చదవాలో చెప్పే మార్గదర్శకులు, సలహాదారులు, పుస్తకాలలో అర్థం కాని విషయాలను వివరించేవారు కూడ సమకూరుతారు.
తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాలు పరభాషలలో ఉండడం, మాతృభాషలో ఉన్నప్పటికీ సరయిన, సులభమైన అనువాదాలు లేకపోవడం నిజమైన సమస్యే. తెలుగులో ఇది మరింత పెద్ద సమస్య. కాని ఈ సమస్యను పరభాష తెలిసినవారిని పక్కన కూచోబెట్టుకుని చదువుతూ, అనువాదం చేయమని కోరుతూ కాలక్రమంలో పరిష్కరించుకోవలసిందే తప్ప తక్షణ పరిష్కారాలు లేవు.చివరిగా, పుస్తక పఠనం మీద ఆసక్తి ఉన్నవారికి కొన్ని సూచనలు చేయవలసి ఉంది.ఒకటి, పైన వివరించిన జాబితాగాని, ఇతరులు సూచించే జాబితా గాని ఎప్పుడూ సంపూర్ణమూ సమగ్రమూ కావు. ఈ పుస్తకాలలో మీకు ప్రత్యేకంగా ఉపయోగకరమని అనిపించేవి కొన్నే ఉండవచ్చు. అలాగే ఏ ఒక్క పుస్తకమూ సంపూర్ణంగా ఆమోదించగలిగేదీ తృప్తినిచ్చేదీ కాదు. ఎందుకంటే అది ఒక నిర్దిష్ట స్థల కాలాలలో ఒక ప్రత్యేక దృక్పథంతో రాసినది గనుక దానిలో కాలంచెల్లినదీ, కాలంవల్ల మార్పుకు గురయినదీ ఎంతోకొంత ఉంటుంది. కనుక ఒక చదువరికి ఒక పుస్తకం కొన్ని అవగాహనలకు మార్గదర్శి మాత్రమే అవుతుంది, కొన్ని ఆలోచనలను ప్రేరేపించగల చెకుముకి రాయి మాత్రమే అవుతుంది గాని అదే సంపూర్ణ అవగాహనను పొట్టువలిచి నూరి నోట్లో పెట్టజాలదు.
ఏ పుస్తకమయినా చదువరి నుంచి కొంత సమయాన్ని, కొంత శ్రమను, కొన్ని ఆలోచనలను, కొన్ని ఆచరణలను, కొంత మార్పును కోరుతుంది. చదువరికి ఆ ఆసక్తి, సంసిద్ధత, సాహసం, పట్టుదల, కృషి ఉన్నప్పుడే ఆ పుస్తకం ఉపయోగపడుతుంది.రెండు, పాఠకులెవరయినా ఇప్పటికే చదివి, ఆలోచించి, ఆచరణలో ఉన్న అభిప్రాయాలకు భిన్నమైన, వ్యతిరేకమైన అభిప్రాయాలను తప్పకుండా చదవాలనే నియమం పెట్టుకోవాలి. ఏ అభిప్రాయమయినా నిగ్గుతేలేది సమానమైన అభిప్రాయం ఉన్నవాళ్ల మధ్య కాదు, ఆ అభిప్రాయాన్ని ఖండించే, వ్యతిరేకించే అభిప్రాయాలతో పోటీపడి అది నెగ్గగలుగుతుందా లేదా అనేదానిమీద మాత్రమే ఒక అభిప్రాయపు బలం నిర్ధారణ అవుతుంది. అందువల్ల భిన్నాభిప్రాయాల పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. అయితే ఆ భిన్నాభిప్రాయాల గాలికి కొట్టుకుపోకుండా ఉండడం కూడ నేర్చుకోవాలి.
చదువరి తన నేలమీద తాను గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే ఆ భిన్నాభిప్రాయాల గాలికి కొట్టుకుపోకుండాఉండడం వీలవుతుంది.మూడు, పుస్తకపఠనం ప్రారంభించిన కొత్తలో చేతికి దొరికిన పుస్తకమల్లా చదివే అలవాటు ఉంటుంది. అది చాల మంచిది కూడ. పుస్తకపఠన దాహం అలానే పెరుగుతుంది. కాని కొద్ది కాలం గడిచాకనయినా ఈ పద్ధతి మాని, అభిరుచి, ఆసక్తి, అవసరం, జీవితలక్ష్యాలకు అనుగుణమైన విషయాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాల ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా చదవడం అలవాటు చేసుకోవాలి. తెలుగులో గతంలో తప్పనిసరిగా చదవవలసిన పుస్తకాల జాబితాలు కొన్ని తయారయ్యాయి గాని అవి ప్రధానంగా సాహిత్యరంగపు జాబితాలే. అలా కాకుండా సాహిత్యంతోసహా సమగ్ర ప్రాపంచిక దృక్పథాన్ని అందించే పుస్తకాల జాబితాలు ఇంగ్లిషులో ఎన్నో ఉన్నాయి. ఆ జాబితాలకు మన సామాజిక స్థితినిబట్టీ, అవసరాలనుబట్టీ, అభిరుచులను బట్టీ మార్పులు చేర్పులు చేసుకుని మన సొంత ప్రణాళికను రూపొందించుకోవచ్చు.ఇంతకూ పుస్తకం చదవడం ఎందుకు? సమాజాన్నీ ప్రపంచాన్నీ అర్థం చేసుకునేందుకు. అర్థం చేసుకుంటే సరిపోతుందా? ఆ అర్థమైనది, ఎక్కడో ఒకచోట, ఏదో ఒక స్థాయిలో ఆచరణలోకి రాకపోతే ప్రయోజనమేమీ లేదు. అంటే, పుస్తకం చదవడం చదవడం కోసం మాత్రమే కాదు. ఆ పుస్తకం ద్వారా నేర్చుకున్న అవగాహనను, జ్ఞానాన్ని మార్పుకోసం ఉపయోగించడానికి. జరుగుతున్న మార్పులో భాగం కావడానికి. ఏపని చేస్తున్నా శ్వాస ఆడడం మాననట్టు, మనం పాల్గొన్నా, పాల్గొనకపోయినా మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు ఏదిశలో జరుగుతున్నదో అవగాహన చేసుకోవడానికి, ఆ మార్పు దిశ ప్రతికూలమైనదయితే దాన్ని మార్చడానికి, ఆ మార్పు ప్రయత్నాలలో భాగం కావడానికి పుస్తకం అదనపు అవగాహనను ఇస్తుంది. ఉట్టి చేతితో శ్రమ చేయడం ప్రారంభించిన మనిషి, ఆ చేతికి కొనసాగింపుగా పనిముట్టును తయారు చేసుకుని ఉత్పాదకత పెంచుకున్నట్టుగా, పుస్తకం అనే పనిముట్టును పట్టుకునే మనుషులు సమాజ చలనాన్ని మరింత వేగవంతం చేయగలుగుతారు.అటువంటి మార్పు పరికరాలను ఇచ్చే పుస్తకాలు తప్పనిసరిగా చదవవలసినవి. మార్క్స్, ఎంగెల్స్ రాసిన ‘కమ్యూనిస్టుపార్టీ ప్రణాళిక’ అలా ఎల్లకాలాలకు, అన్ని సమాజాలకు చదవవలసిన పుస్తకం అవుతుంది. ఆ మార్పును మరింత ముందుకు తీసుకుపోయిన పుస్తకాలుగా ‘బోల్షివిక్ పార్టీ చరిత్ర’, మావో రచనలు, చేగువేరా రచనలు ఉపయోగపడతాయి. భారత సమాజానికి సంబంధించి ఇటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర పుస్తకాల నుంచి ‘వ్యవసాయ విప్లవం’ వరకు అవన్నీ చదవవలసినవే.
( ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా )