శ్రీసిటీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఆసియా సీఎఫ్ఓ లీడర్షిప్ సంస్థ “సీఎఫ్ఓ ఆఫ్ ది ఇయర్” అవార్డును శ్రీసిటీ సీఎఫ్ఓ ఆర్.నాగరాజన్ కు బహూకరించింది. ఆ సంస్థ వర్చువల్ మోడ్‌లో శుక్రవారం నిర్వహించిన 19 వ ఆసియా ఎడిషన్ కాన్‌క్లేవ్‌లో ఈ అవార్డును ప్రదానం చేసింది. మౌళిక వసతుల కల్పన రంగంలో ఆర్థిక నిపుణుడుగా తాను చూపిన అసాధారణమైన ప్రతిభ, కృషికి గుర్తింపుగా నాగరాజన్ కు ఈ గౌరవం దక్కింది.
నాగరాజన్ కు అభినందనలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఈ ప్రతిష్టాత్మిక అవార్డు గెలుచుకోవడం తమకు చాలా గర్వంగా వుందన్నారు. ఆర్థికరంగ నిపుణులను ప్రోత్సహిస్తూ ఏటా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆసియా సీఎఫ్ఓ లీడర్షిప్ సంస్థను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
కాగా, అత్యంత ప్రభావవంతమైన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఆర్థిక నిపుణులను గుర్తిస్తూ ఆసియా లీడర్‌షిప్ అవార్డ్స్ సంస్థ ప్రతి సంవత్సరం కాన్క్లేవ్‌ను నిర్వహిస్తోంది. ఆసియా ఆర్థిక అభివృద్ధిలో భాగంగా వివిధ పరిశ్రమల రంగాలలో పలు కీలక అంశాలలో ప్రతిభ ఆధారంగా ఫైనాన్స్ నిపుణులను ఇది గుర్తిస్తుంది. ఈ పురస్కారంలో భాగంగా ట్రోఫీ మరియు ప్రశంసాపత్రం అందచేశారు.
ప్రస్తుత ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు 2019, 2020, 2021 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు ‘సిఎఫ్ఓ ఇండియా’ అవార్డును నాగరాజన్ అందుకున్నారు. 2018 లో యుకె ఏషియన్ బిజినెస్ కౌన్సిల్ మరియు వైట్‌పేజ్ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే ‘ఇండియా 50 ఉత్తమ సిఎఫ్ఓలలో ఒకరు’ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు.