స్వర్గపు ఆకాశం కింద,వికసించిన ఇంద్రధనుస్సు!

“నేను కవితలను పూర్తిగా చదవలేక పోయాను, ఎందుకంటే నా కళ్ళు కన్నీళ్లతో నిండి పోయాయి…”

44 సంవత్సరాల క్రితం ఒక ఆగస్టు రోజు, బాంబేలోని ఒక ఆసుపత్రిలో 16 ఏళ్ల అమ్మాయి క్యాన్సర్‌తో మరణించింది. చాలా నెలల తరువాత, ఆ అమ్మాయి తల్లి ఆ అమ్మాయి పరుపు, తలగడల్లో అమ్మాయి రాసి, దాచిపెట్టిన అనేక కవితలను కనుగొనింది. ఆమె వాటిలో కొన్నింటిని తనకు పరిచితుడైన ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’ సంపాదకుడు ప్రీతిష్ నంది కి ఇచ్చింది. ఆయన వాటిలో కొన్నింటిని పత్రికలో ప్రచురించాడు. ఆ కవితలకి “నమ్మశక్యం కాని ప్రతిస్పందన” వచ్చింది.

కొన్ని వారాల తరువాత, బొంబాయిని తరుచుగా సందర్శించే కలకత్తాకి చెందిన వ్యాపారవేత్త గోర్డాన్ ఫాక్స్ తను బస చేసిన హోటల్ సమీపంలో ఒక బీచ్ వెంట తిరుగుతూ గాలికి కొట్టుకువచ్చిన చిరిగిన కాగితపు ముక్క ని తీసి చూసాడు. అది చనిపోయిన ఆ అమ్మాయి కవితలని ప్రచురించిన పేజీ. ఆ కవితలు చదివిన ఆ వ్యాపారవేత్త కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.

అతను ప్రీతిష్ నంది ని కలిసి, ఆ కవితలు రాసిన అమ్మాయి తల్లిని సంప్రదించి అన్ని కవితల్ని తీసుకొని ఇంగ్లాండ్‌లోని ఒరియల్ ప్రెస్ ప్రచురణకర్తలు డేవిడ్ బేకన్ మరియు బ్రూస్ ఆల్సోప్ లకి పంపించాడు. ఆ ప్రచురణకర్తలు వాటిని ఓ పాఠకుడికి చదవమని పంపాడు.

ఆ పాఠకుడు ఇలా అన్నాడు: “నేను వాటిని పూర్తిగా చదవలేక పోయాను ఎందుకంటే నా కళ్ళు కన్నీళ్లతో నిండి పోయాయి…”.

110 కవితలు ఉన్న ఆ సంకలనాన్ని వారు ప్రచురించారు. 13 -15 ఏళ్ళ వయస్సులో ఒక అమ్మాయి

 రెండేళ్ల లో రాసిన ఆ కవితలు ప్రపంచవ్యాప్తంగా కదిలించాయి . తిరిగి ఇండియా లోని గుజరాత్ కు చెందిన ఆనంద్ సాహిత్య ప్రకాషన్ సంస్థ వారు ముద్రించారు. ఆ ప్రచురణకూ అంతే ఆదరణ వచ్చింది.

ఒక విమర్శకుడు చెప్పినట్లుగా: “కవిత్వ చరిత్రలో ‘గీతాంజలి’కి రెండవ వర్షన్ ఉందా అని నాకు అనుమానం ఉంది, ఎందుకంటే  టీనేజ్ లో మరపురాని కవితలు మరెవరు రాశారు? ఆ కవితలు సెయింట్ జాన్ ఆఫ్ ది క్రాస్ శ్లోకాలు, రిల్కే కవితల సొగసులు , ఠాగూర్ తరువాతి కవితల నుంచి విడదీయలేనంత సమానంగా ఉన్నాయి”.

ఎవరా అమ్మాయి?

‘గీతాంజలి ఘీ ‘జూన్ 12, 1961 న,  మీరట్‌లో జన్మించారు .ఆమె జీవితంలో ఎక్కువ భాగం ముంబైలో గడిపారు, అక్కడ ఫోర్ట్ కాన్వెంట్‌లో చదువుకున్నారు. ఆమె చాలా చైతన్యవంతురాలైన అమ్మాయి. ఇతరులపై అపారమైన సానుభూతి, లోతైన భావాలతో, ఆమె ఆలోచనలలో చాలా పరిపక్వత ని కలిగివుండేది.  ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె తల్లి సంరక్షణ లో ఉన్నప్పటికీ తండ్రి అంటే ఎంతో ప్రేమని కలిగి ఉండేది. 14 సంవత్సరాల వయస్సులో, ఆమెకు టెర్మినల్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది, ప్రతి ఒక్కరూ ఆమె నుంచి ఆ వ్యాధి విషయాన్ని దాచడానికి ప్రయత్నించారు. కానీ తన తల్లి, సోదరుడు, సన్నిహితులు అనుభవిస్తున్న క్షోభ ని బట్టి ఆమెకు తను మరెక్కువ రోజులు బతకనని అర్ధం అయిపోయింది. అయినా ఆ విషయం తనకు తెలిసినట్లు ఎవరికీ తెలియనీయలేదు. తన భావాల్ని, మరణ స్పృహ నీ, బాధని, దుఃఖాన్ని తాను రాసిన కవిత్వం లో పంచుకుంది. గీతాంజలి క్యాన్సర్‌తో దాదాపు రెండు సంవత్సరాలు పోరాడింది.  ఆగష్టు 11, 1977 న ఆమెని ఆ వ్యాధి  ఈలోకాన్నుండీ తీసుకెళ్లిపోయింది. ఆమె మరణం తరువాత,  ఈ అరుదైన కవితలు బయటపడ్డాయి. ఈ రచనలలో ఆమె తన అంతరంగిక ఆలోచనలను వ్యక్తం చేసింది, కానీ తన ప్రియమైన వారిని మరింత దుఃఖానినుంచి తప్పించటానికి వాటిని దాచిపెట్టింది.

‘గీతాంజలి ‘ పేరుని రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకం స్పూర్తితోనే పెట్టారు. ఆమె మరణానంతరం వెలుగు చూసిన ఒక కవితలో, “ఓహ్! దేవుడా నాకు సహాయం చెయ్యి / నేను అలాగే జీవిస్తాను … / నేను ఆ పేరుకు అనుగుణంగానే జీవిస్తున్నాను” అని ప్రార్థిస్తుంది.

వీణ

వీణ

నన్ను ఒక వీణ లాగా

దేవుడు ఉపయోగిస్తున్నాను .

ఒక క్షణం అతను నన్ను

ఇష్టపడే బిడ్డలా చూసుకుంటాడు ,

మరు క్షణం

అతను నన్ను గట్టిగా తోసివేస్తాడు

ఆ పదునైన గట్టి దెబ్బ నన్ను నొప్పితో ముంచెత్తుతుంది , అయినా ఫలించలేదు నా హృదయపు తీగలను లాగడం ద్వారా నన్ను హింసించడం .

అంత శీఘ్రంగా ఈ తీగ తెగిపోదు.

నేను బాధ తో సోలిబోతున్నప్పుడు,

ఆయన నా తలని అతని ఛాతీపై వెచ్చదనంలో ఉంచుతాడు. అత్యంత మృదువుగా ఆయన నన్ను తన హృదయానికి హత్తుకొని నా నొప్పిని నా కన్నీళ్లను తుడిచివేస్తాడు. నవ్వుతాడు.

…………………………………………………………

ఎవరునువ్వు?

మృత్యువా! ఎవరు నువ్వు?

ఎక్కడినుంచి వస్తావు?

నన్నెక్కడికి తీసుకెళ్తావు?

ప్రయాణం చాలా దూరమా? చీకటిగా ఉంటుందా?

నాకు నేను చాలా ధైర్యమున్నదానిని అని చెప్పుకుంటూనే

చాలా భయపడుతున్నాను.

మరి నాకు తెలియదు కదా అక్కడ ఏముంటుందో, అందుకని.

మృత్యువా! నొప్పి మెలిపెట్టినప్పుడు నువ్వు వచ్చే సమయం

వచ్చిందనుకుంటాను. మరోసారి నువ్వు అసలు రానే రావనుకుంటాను.

నీవు కచ్చితంగా నన్ను తీసుకెళ్లాలని నిశ్చయించుకుంటే

నన్నెవరూ నొప్పించని చోటికీ, వీలైతే నా బాల్యపు తొలి నిద్రలోకి తీసుకెళ్లు

ఏ చింతా లేకుండా నిద్రపోతాను శాశ్వతంగా !

(12 జూన్ గీతాంజలి ఘే జయంతి సందర్భంగా ఈ సంస్మరణను, ప్రముఖ రచయిత్రి దుర్గ.ఎం  తన ఫేస్బుక్ వాల్ మీద రాశారు .)

( Poems of Gitanjali, Pritish Nandy (Intro)
ISBN 10: 0853621950 / ISBN 13: 9780853621959
Published by Oriel Press, 1982)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles