ఊర్వశినీ, రాజేశ్వరినీ నాకు దూరం చేసిన విలన్

My Teenage Thunder…
Mesmerising Wonder
నా గుండె, నా జెండా, నా పద్యంనా శ్రీశ్రీ

ఎర్ర జెండాలు ఎగురుతున్న విజయవాడ
కొండల మీద వెండి వెన్నెల కురుస్తున్న రోజులవి.
కమ్యూనిస్టు ఊరేగింపులకు వెళ్లడం, వచ్చి చెలాన్నీ, కృష్ణశాస్త్రినీ చదువుకోవడం…. అదే నా పని.
1973వ సంవత్సరం.
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నా.
పట్టుమని 17 ఏళ్లు కూడా లేవు నాకు.
ఆ నూత్న యవ్వన దుర్దశలో ఒక్కో రోజు… జాకెట్టు పైహుక్కు తీసి, నవ్వుతూ, రారా కుర్రాడా అని వెలుతురు కళ్లతో ఊరించేది ఊర్వశి.

ఆమెని కృష్ణశాస్త్రి పంపించే వాడు… నా కోసం.

తెల్లవారక ముందే కలల మెట్ల మీంచి దిగి వచ్చేది ఊర్వశి. కలవర పెట్టేది.
మరో రోజు… మైదానం దాటి వెళ్లి యేట్లో స్నానం చేద్దామని పిలిచేది రాజేశ్వరి. చెలాన్నీ, అమీర్నీ వొదిలి వచ్చేసేది నా దగ్గరికి. ఎవరన్నా అంటే ఆమె మనసుకి కష్టంగా వుంటుందిగానీ నాతో లేచి పోవడమంటే రాజేశ్వరికి ఇష్టమే.

‘‘ఆడ పిల్లలు, ఆడ పిల్లలు,
అవని అంతా ఆడ పిల్లలు…
అమ్మ వసుమతి కడుపు పంటలు,
ఆకుపచ్చని ఆడపిల్లలు…’’
అని కవి మహానగ్న (బీవీఎస్ శాస్త్రి) గీతాన్ని పాడుకుంటూ వుండేవాణ్ణి.
ఏలూరు రోడ్డు మీద మా కాలేజీ కన్నె పిల్లల వెంట కుక్కపిల్లలా తిరుగుతుండే వాణ్ణి.

Roman Holiday సినిమాలో నాలాంటి వెర్రి జర్నలిస్టు అయిన గ్రెగరీపెక్ కి, రోడ్డు పక్క ఫుట్ పాత్ మీద రోమన్ మహా సామ్రాజ్యపు యువరాణి దొరికినట్టు, నాకూ ఒక ఆడ్రీ హెబ్బర్న్ లాంటి శృంగార దేవత దొరకకపోతుందా? అని వెతుక్కుంటా వుండేవాణ్ణి. అలా… కనాభిషేకాల కళ్ల కోసం పరితపిస్తున్న వేళ… ఒక మనోహరమైన చల్లని సాయంకాలపు గాలిలో ప్రేమ గీతాన్నై తేలిపోతున్న మధుర క్షణాల్లో….
అకస్మాత్తుగా వచ్చిన భూకంపం వొకటి నన్ను తొక్కుకుంటూ వెళ్లిపోయింది-

అది శ్రీశ్రీ మహా ప్రస్థానం!

తేరుకునేలోగా, ఉప్పెనలా విరుచుకుపడిన ఒక మహా సముద్రం నన్ను లాక్కెళ్లి తనలో కలిపేసుకుంది-

అది చెలం యోగ్యతా పత్రం.

నన్ను ఆకాశంలోకి విసిరేసిన ఆ కవితావేశాన్ని తట్టుకుని, నిలబడి, పరికించి చూస్తే అర్థం అయింది.

కృష్ణశాస్త్రినీ, చెలాన్నీ నాకు లేకుండా చేసిన
ద్రోహి- శ్రీశ్రీ.
ఊర్వశినీ, రాజేశ్వరినీ నాకు దూరం చేసిన
విలన్- శ్రీశ్రీ.
నా గొంతు కోసి, స్వేద బిందువుల తలంబ్రాలు పోసి కార్మిక వర్గంతో నాకు బాల్య వివాహం చేసి సుఖశాంతులు లేకుండా చేసిన
కఠినాత్ముడు ఈ శ్రీశ్రీ.

*** *** ***

పద్యాలు కావవి, ఎగురుతున్న జెండాలు!
కవిత్వం కాదది… మరుగుతున్న ఉద్రేకం!!
‘మహా ప్రస్థానం’తోనే అయిపోలేదుగా…
కళ్ల ముందే ‘ఖడ్గసృష్టి’ జరిగింది.
శరశ్చంద్రోదయం దర్శనభాగ్యం కలిగింది.
నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా యిలా వచ్చావేం వెన్నెలా?…..
ఆ దీర్ఘ కవిత చివరిలో…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలి దాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే! అంటారు శ్రీశ్రీ.
స్మృతిపథం నుంచి ఎన్నటికీ
చెరిగిపోని యిమేజి కదా యిది!

కూటి కోసం,
కూలి కోసం పట్టణంలో బతుకుదామని…
వలస కార్మిక విషాద గీతికని
ఆనాడే ఆలపించాడు కదా!
ఇంకా ప్రాసక్రీడలూ, సిరిసిరిమువ్వలూ
లిమరిక్కుల మేజిక్కులు…
ఆ గాలిలో కొట్టుకుపోవడంలో
శ్రీశ్రీ కవితాగ్నిలో
దగ్ధం అయిపోవడంలో
గొప్ప సంతృప్తి. బతుక్కో సార్ధకత!

ఇక పట్టపగ్గాలు వుండేవి కావు.
హనుమాన్ వ్యాయామశాలలో
వొళ్లంతా నూనె పట్టించి,
మెరిసే కండలతో తిరిగే
బండ పహిల్వానుల్లా…
శ్రీశ్రీ కవిత్వాన్ని వొంటినిండా పూసుకున్న నేను,
విజయవాడ రోడ్ల మీద పొగరుబోత్తనంతో
దురుసుగా తిరిగేవాణ్ణి.
కుర్రతనం నా పెట్టుబడి.
వెర్రితనం నా సంపద.
మహాకవి నా మారణాయుధం.

అయినా పురాణ ప్రతీకలు వాడడమేంటో అనే వారు కొందరు కమ్యూనిస్టు అతిగాళ్లు…
వీళ్లేదో రష్యా కార్మిక తిరుగుబాటుకీ,
చైనా వ్యవసాయ విప్లవానికీ కలిపి పుట్టినట్టు!
మహాకవి వాల్మీకి రామాయణం
మన మూల గ్రంథం కాదా…?
భాగవతానికీ, మహాభారతానికీ
జమిలిగా పుట్టిన బిడ్డలం కాదా మనం..?
వాల్మీకి ట్రైబల్ అనీ, వ్యాసుడు గంగపుత్రుడనీ
మళ్లీ చెప్పాలా?

కనక దుర్గా చండ సింహం
జూలు దులిపి ఆవులించింది
అనడంలో వున్న ఫోర్సూ, విజువల్ బ్యూటీకి…
చలం అన్నట్టుగా అంధులమా? మనం.

ఆవేశానికి చివరి అంచు కదా శ్రీశ్రీ!

దొంగలంజ కొడుకులసలే
మెసలే ధూర్తలోకంలో… అన్నపుడు,
అది బూతుకాదనీ, పట్టరాని ఆగ్రహమనీ,
ప్రాణమిత్రుణ్ణి కోల్పోయిన వేదన అనీ తెలియకపోతే… శ్రీశ్రీ ఎందుకు నీకు,
పోయి తెలుగు సినిమాలు చూసుకోక….
అంటూ నేను పెగ్గు మీద గుగ్గిలం అయిపోతున్న కష్టకాలంలో….
శ్రీశ్రీ పౌర హక్కుల సభ కోసం విజయవాడ వస్తున్నాడని ఎవరో చెప్పారు.
ఆయన విజయవాడ రావడమేమిటి? నాన్సెన్స్!
మహాకవి ఎక్కడుంటాడో నాకు తెలుసు. మహోన్నత హిమాలయ పర్వత సానువుల్లో…
కవన మానస సరోవర తీరంలో…
సరస్వతీదేవి పాదపీఠం ముందు ఆశీనుడై…
ఘోర తపస్సు చేస్తూ వుంటాడు…
అర్థ నిమీలిత నేత్రాలతో!

లేకపోతే ఒక మనిషికి అంత విద్య ఎలా సాధ్యం? శరశ్చంద్రిక రాసిన వాడు. కొంపెల్ల జనార్ధనరావుని చారిత్రక పురుషుణ్ణి చేసినవాడు. రోడ్డు పక్క అడుక్కునే ముసిల్దానికి కవితామృత ధారలతో నివాళి అర్పించినవాడు. మన వూరెలా వస్తాడు?
అని నేను మూర్ఖంగా అనుకుంటున్న వేళ…
1973 నవంబరు 4న శ్రీశ్రీ మాంటిస్సోరి స్కూల్లో జరిగిన సభకి వచ్చారు.
ఎంత అదృష్టం అనుకుంటూ వెళ్లాను.
దూరంగా వేదిక మీద తెల్లని దుస్తులతో కూర్చుని వున్నాడు శ్రీశ్రీ ఆ ట్రేడ్ మార్క్ కళ్లజోడుతో! అందని ఆకాశం అంత ఎత్తుగా వుంటాడనుకుంటే, మామూలుగానే వున్నాడే, ఐనా వాడు శ్రీశ్రీ కదా! చెలం డెత్ బెడ్ ప్రజంట్ గా పంపమన్న మహా ప్రస్థానం రాసిన వాడు కదా! నిలువెల్లా కవిత్వమై కాంతులీనిన వాణ్ణి, అదే తొలిసారి చూడ్డం!

ఆ సభకి తరిమెల నాగిరెడ్డి, జ్వాలాముఖి, సింగరాజు రామకృష్ణయ్య, దివి కుమార్ వచ్చారు. ఆ రోజే… విజయవాడ హోటల్ రూంలో ఉన్న శ్రీశ్రీ… తరిమెల నాగిరెడ్డి కోసం ‘వజ్రం’ అనే పొయo రాసి ఆయన చేతికే ఇచ్చారు.

*** *** ***

1979. విశాఖ ‘ఈనాడు’లో పని చేస్తున్నాను. ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం…. లాండ్ లైన్ రింగయింది. న్యూస్ ఎడిటర్ తెన్నేటి కేశవరావు ఫోనెత్తి మాట్లాడి ‘‘మీకే’’ అన్నారు. ఫోన్ చేసింది చలసాని ప్రసాద్ గారు.
శ్రీశ్రీ మా యింట్లో ఖాళీగా వున్నారు. ఇంటర్వ్యూ చేస్తారా? అనడిగారు. కేశవరావుగారి పర్మిషన్ తీసుకుని, వెళ్లి శ్రీశ్రీతో గంటసేపు మాట్లాడాను. సాదాసీదా మనిషి. భేషజాలు లేనివాడు. నేను రాసిన అర పేజీ ఇంటర్య్యూ మేడే నాడు
ఈనాడులో వచ్చింది.

1980 మార్చి 2 కాకినాడ:
శ్రీశ్రీ 70వ జన్మదిన మహోత్సవం.
అదొక చరిత్మాత్మకమైన సన్నివేశం.
శ్రీశ్రీ సభని కవర్ చేయడానికి విశాఖ నుంచి నేను కాకినాడ వెళ్లాను. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం పదేళ్లకి అంటే 1980 నాటికి బాగా మసకబారింది. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి చెందిన అభ్యుదయ రచయితలంతా సభ నిర్వహిస్తున్నందున ‘‘ఆ సభకి వెళ్లరాదు’’ అని విరసం తీర్మానం చేసింది.
దాన్ని లెక్క చేయకుండా శ్రీశ్రీ కాకినాడ వచ్చారు. సాహితీ, విద్యావేత్త డాక్టర్ చిరంజీవినీ కుమారి ప్రతిష్ఠాత్మకమైన ఆ సభకి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భార్య సరోజతో వచ్చిన శ్రీశ్రీ మూడు రోజులు కాకినాడలో వున్నారు.
మార్చి రెండో తేదీ ఉదయం వాతావరణం ఆహ్లాదంగా వుంది. శ్రీశ్రీ సాహిత్యంపై మిరియాల రామకృష్ణ పరిశోధనా గ్రంథం ఆవిష్కరణ, ఆ సభ విశేషాల్లో ఒకటి. సభలో ఒక పండుగ వాతావరణం. సూపర్ లిటరరీ స్టార్స్ అంతా వేదిక మీద మెరుస్తున్నారు. సి.నారాయణరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, చీఫ్ గెస్ట్ కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, ప్రత్యేక అతిథి సినీ నటుడు రావు గోపాలరావు, చిరంజీవినీ కుమారి, ఆలూరి విజయలక్ష్మి, చందు సుబ్బారావు, అదృష్ట దీపక్… ఇంకా ఎందరో ప్రసిద్ధులు.

‘‘హరీన్ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇస్పిరేషన్’’ అని శ్రీశ్రీ ఒకనాడు రాసిన పద్యం హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గురించే.

సాహితీవేత్తలంతా వేదిక మీద ఆశీసులై వున్నారు. శ్రీశ్రీ వేదిక ముందు రెండో వరసలో కూర్చుని వున్నారు. నేను లక్కీగా శ్రీశ్రీ వెనకే కాసుక్కూర్చున్నాను. కవి అదృష్ట దీపక్ వేదిక మీద మైక్ ముందుకు వచ్చాడు. ‘‘సభకు నమస్కారం. 20వ శతాబ్దాన్ని మడిచి జేబులో పెట్టుకున్న మహాకవి శ్రీశ్రీని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను’’ అన్నాడు. కిక్కిరిసి వున్న సభ…. రెండు నిమిషాలసేపు చప్పట్లతో మోగిపోయింది. ‘‘ఆ కుర్రాడెవరు?’’ అని పక్కనున్న పెద్దాయన్ని శ్రీశ్రీ అడిగారు. కరతాళ ధ్వనుల జడివాన మధ్య శ్రీశ్రీ నెమ్మదిగా వేదిక మీదికి వెళ్లారు.
గజ్జెల మల్లారెడ్డి మైక్ అందుకున్నారు. ఆయన మాటల ప్రవాహం ఆగేదికాదు. ఆ ఉధృతమైన flowలోనే జోకు, విరుపు, చమత్కారంతో
70 ఎం.ఎంలో శ్రీశ్రీని ఆవిష్కరించాడాయన!
తర్వాత మైక్ అందుకున్న సి.నారాయణ రెడ్డి తొలి నిమిషాల్లోనే పెను తుఫాన్ గా మారిపోయారు. జనం మంత్ర ముగ్ధులై విన్నారు. తెలుగు కవిత్వానికి అక్కడ అభిషేకం జరుగుతోంది. అదిగదిగో శ్రీశ్రీ పతాకం ఎగురుతోంది. మహాకవి 70వ జన్మదిన సభ
చరిత్ర ప్రసిద్ధినొందుతోంది.

హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మైక్ అందుకున్నారు. కవి, నటుడు, వక్త… ఇంకా చాలా విశిష్టతలున్న హరీన్ ఆంగ్ల ప్రసంగంతో సభ దద్దరిల్లిపోయింది. ప్రఖ్యాతి చెందిన ఆయన ‘రేల్ గాడీ’ కవిత పాడి జనాన్ని ఉర్రూతలూగించాడు హరీన్. పూల మాలలు, పూల రేకులూ, షేక్ హాండ్లూ, పలకరింపులూ, చిరునవ్వుల మధ్య సభ ముగిసింది.

శ్రీశ్రీకి మద్య నిషేధం:

సభ కోసం ఒక రోజు ముందే వచ్చిన శ్రీశ్రీకి మంచి హోటల్లో బస. సరోజ కూడా వున్నారు. హోటల్ రూంకి వెళ్లిన చిరంజీవినీ కుమారి, శ్రీశ్రీ లేని సమయం చూసి ‘‘సరోజా… శ్రీశ్రీకి మూడు రోజులు మద్య నిషేధం. ఆ బాధ్యత నీదే. మహాకవికి మూడు లక్షల రూపాయలు యిస్తున్నాను. మద్య నిషేధ నియమం తప్పకూడదు’’ అని మర్యాదగా హెచ్చరించారు. మూడు రోజులు అయిపోయింది. చిరంజీవినీ కుమారి… శ్రీశ్రీ హోటల్ గదికి వెళ్లారు. ‘‘కుమారీ మీరు పెట్టిన నియమం పాటించాను. 36 గంటలు దాటి మరో గంట కూడా అయింది. ఏమంటారు?’’ అన్నారు శ్రీశ్రీ. చిరంజీవినీ కుమారి నవ్వుతూ ‘‘శ్రీశ్రీ గారూ నా మాట నిలబెట్టుకుని రెండు గంటలు దాటింది’’ అన్నారు. అర్థం కానట్టు చూశాడు శ్రీశ్రీ. ‘‘మీ పక్క నున్న కప్ బోర్డు తెరిచి చూడండి’’ అన్నారామె. శ్రీశ్రీ ఎడం చేత్తో డోర్ వోపెన్ చేస్తే, అందులో ఫుల్ బాటిల్ స్కాచ్ విస్కీ, మూడు లక్షలూ వున్నాయి. ఆ రెండింటిలో సరోజ ఏం తీసుకుందో,
శ్రీశ్రీ ఏం తీసుకున్నారో ఇట్టే చెప్పొచ్చు.

1980లో అనగా- 40 సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలంటే మాటలు కాదు. అది శ్రీశ్రీకి కట్టిన వెల కాదు. మహాకవికి యిచ్చిన గౌరవం! అందుకే విరసం అభ్యంతరాల్ని లెక్క చేయలేదేమో శ్రీశ్రీ. నాకైతే తెలియదు.

*** *** ***

Taadi Prakash,senior journalist

1981, మే నెల ఒకటో తేదీ. ఒరిస్సాలోని రాయగడలో ‘ప్రగతి’ అనే సాహితీ సంస్థ వుంది. అక్కడ కుర్రాళ్లు ఉత్సాహంగా శ్రీశ్రీని పిలిచారు. అంతకు ముందే లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన శ్రీశ్రీ ఉల్లాసంగా వున్నారు. ఆరోగ్యంతో మెరుస్తున్నారు. ఒక సభ కోసం విశాఖ వచ్చారు. అక్కడి నుంచి రాయగడ దగ్గరేగా అని ఆయన ఒప్పుకున్నారు. ‘ప్రగతి’ పేద రచయితల సంస్థ. నన్నూ పిలిచారు. రెడీ అన్నాను. ఎర్రకాంతుల ఇనోదయమూ, రెక్కవిప్పిన రివల్యూషన్… అని రాసిన మహాకవిని వాళ్లొక ఎర్రబస్సు ఎక్కించారు. నేనూ శ్రీశ్రీతోపాటే. కూరగాయల, చేతి సంచుల, ట్రంకు పెట్టెల ఆడవాళ్లతో బస్సు నిండి వుంది. శ్రీశ్రీగారూ, నేనూ నించున్నాం. మానవుణ్ణి ‘శరీర పరీవృతుడా’ అన్న మానవుడు నా కళ్ల ముందే నిరాడంబరంగా నిలబడి వున్నాడు.

ఇంతకీ ఉన్నత పర్వత శిఖరాగ్రాన అగ్ని కీలలై ఎగసిపడే శ్రీశ్రీ ముందు నేనెవణ్ణి?

కుడిచేత్తో కవితోద్యమాన్నీ,
ఎడం చేత్తో విప్లవోద్యమాన్నీ ఏకకాలంలో నడిపించిన
సవ్యసాచి మదర్స్ హజ్ బెండ్ కదా శ్రీశ్రీ!

పావలాకి వొళ్లమ్ముకున్న జర్నలిస్టుగాణ్ణి,
రామోజీరావింట్లో పెంపుడు కుక్కలా
తిరిగిన వాణ్ణి… శ్రీశ్రీ కవిత్వ ఔన్నత్యం
గురించి లెక్చర్లు యివ్వబోవడం లేదు.

Just celebrating my fabulous fortune
Got at the age of seventeen.

శ్రీశ్రీ అనే మేరు పర్వత సానువుల్లో
పూసిన గడ్డి పువ్వుని నేను.

గగనమంతా నిండిన శ్రీశ్రీ కవితా పాదాల మీద
మెరిసిన అశ్రు బిందువుని నేను.

*** *** ***
జూన్ 15 శ్రీ శ్రీ వర్ధంతి
– తాడి ప్రకాష్, 97045 41559

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles