పొద్దు పొడవక ముందే తిరుపతిలో బయలు దేరి 80 కిలోమీటర్ల అవతల, నిండ్ర మండలంలో ఎం ఎస్ వి ఎం పురం చేరుకున్నాం.
గడ్డి కోసం బయలు దేరిన దాసరాజు దీపమ్మ ఎదురయింది.
‘‘ మాకెపుడూ… పశుల గడ్డికి కరువు. రెయ్యి పొనుకునేటబ్బుడు కుడా రేపు గెడ్డికి ఎక్కడికి పోవాలా అనే యోచనతోనూ ఉంటాము. గిన్నెలో అన్నం పెట్టుకుంటే మనమేమో తింటా ఉండాము, గొడ్ల కెట్ల మేతనే యాతనయి పోతా ఉంటుంది…’’ అని చెబుతుంటే రికార్డు చేస్తున్నాం కానీ, నా మదిలో ఈ మధ్య చదివిన కథ మెదిలింది.
దాదాపు దీపమ్మ చెప్పిన మాటలతోనే ‘పేగుల్లేని ఆడోళ్లు’ కథ మొదలవుతుంది.
ఇద్దరు ఆడోళ్లు చిత్తూరు యాసలో చెబుతున్నది చదువుతుంటే, గౌతమ్ ఘోష్ సినిమా చూస్తున్నట్టుంటుంది.
వారు ఆవులకు గడ్డి కోసం చిన్రెడ్డి చెరకు తోట వైపు బెదురుతూనే వెళ్తారు.
‘‘ మే నర్సీ మనిద్దరం కంటి సూపుకు నోటి మాటకు కనపడేంత దగ్గరలో ఉండి గెడ్డి కోసుకుందాం…’’ అనుకొని చెరో వైపు వెళ్తారు .
వారు ఊహించినట్టే ప్రమాదం ఎదురైంది. ఒకామెను చిన్రెడ్డి చూస్తాడు..
‘‘ అన్నా గొడ్లు పొస్తు అన్నా, ఇంగ రామన్నా..’’ అని వేడుకుంటుంది.
‘‘ మా సొమ్ము ఐతే తేరగా కావాల్ల, మీ సొమ్ము అయితే రాకూడదా..’’ అని వాడు ఆమె వైపు వస్తాడు…
వాడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని,
‘‘ అన్నా ఈపొద్దే బయటుండా… మూడు దినాలు తరువాత ఇదే తావికి వస్తా ’’ అని వేడుకుంటుంది.
చిన్రెడ్డి నమ్మడు ‘‘ నువ్వు అబద్దాలు చెప్తా ఉండావులే, ఏదీ చీర పైకి ఎత్తు చూద్దాం,’’ అంటాడు.
చదువుతున్న మనం పుస్తకాన్ని మూసి కళ్లు తుడుకుంటాం.
రాయల సీమ పల్లెల్లో లైంగిక దోపిడీని ఎదుర్కొనే పేద స్త్రీల ’బతుకీత’ ఇది.
ఐదో తరగతి చదివిన ఎండపల్లి భారతి అనే కష్టజీవి రాసిన జీవన వెతలు ఇవి.
ఇరవై కథల సంకలనం ఇది. మట్టి రేఖలతో కిరణ్‌కుమారి గీసిన ముఖచిత్రం కథలకు అతికినట్టుంది.
అనేక బాధల మధ్య శ్రామిక మహిళలు చెదరని చిరునవ్వుతో తమ జీవితాలను ఎలా వెలిగించుకుంటారో విత్తనాలు నాటినట్టు చెబుతారు భారతి.
2021 లో నన్ను కదిలించిన అరుదైన పుస్తకం బతుకీత,
ఈ సారి చిత్తూరు వైపు వెళ్లినపుడు భారతి పాదాలను తాకి రావాలి.
( సాహిత్య అకాడమీలు, అవార్డులిచ్చే జ్యూరీలు ఈ పుస్తకం వైపు పొరపాటున కూడా చూడకండి . భారతి లాంటి వాళ్లను గుర్తించనందుకు సిగ్గుపడే ప్రమాదం ఉంది! )
( “బతుకీత” కథలు. రచన ఎండపల్లి భారతి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. వెల: రు.120 )