‘డియర్ కామ్రేడ్’అంటే హీరో విజయ్ దేవరకొండా?

డియర్ కామ్రేడ్… మద్దుకూరి చంద్రం Legendary fighter of yester years

మద్దుకూరి చంద్రశేఖర రావు… ఈ పేరు ఎప్పుడైనా విన్నట్టనిపిస్తోందా? స్వచ్ఛమైన స్పటికంలాంటి మానవుడు. అక్షరాలు దిద్దించిన తొలితరం నాయకుడు. తెలుగు వామపక్ష జర్నలిజానికి భాష నేర్పించినవాడు. ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఆజానుబాహుడు. బ్రిటీష్ పాలనని వ్యతిరేకించి పోరాటం చేసినవాడు. సంక్షుభిత సంవత్సరాలు 1052-57 వరకూ ‘విశాలాంధ్ర’ దినపత్రికకి ప్రధాన సంపాదకుడు. మార్క్సిజాన్ని నమ్మి పూర్తిగా ఆచరించిన ఈ తిరుగుబాటు సిద్ధాంతవేత్త, తర్వాత్తర్వాత ఎందుకో స్తబ్దుగా వుండిపోయారు.

1972-73 లో విజయవాడ, సీతారాంపురంలోని ఒక సాధారణమైన దిగువ మధ్య తరగతి ఇంట్లో చంద్రంగారిని చూశాను. అనారోగ్యంతో వున్నారు. అప్పటికి ఆయన ‘విశాలాంధ్ర’ కాపౌండ్ నుంచి వస్తున్న ‘ప్రగతి’ వార పత్రిక ఎడిటర్. పొడవుగా, గంభీరంగా ప్రశాంతంగా వుండే నిండయిన మనిషి. మద్దుకూరి చంద్రం- కమ్యూనిస్టుల గత వైభవ శిఖరం… శిధిలం అయిపోతున్న దృశ్యాన్ని నేను పోల్చుకోగలిగాను. సంపాదించడం, డబ్బు పోగేసుకోవడం అంటే అసహ్యించుకునే కమ్యూనిస్టు నాయకులకు తోడుగా మిగిలే పేదరికంతో ఆ పెద్ద నాయకుడి సహజీవనాన్ని చాలాసార్లు చూశాను. చంద్రంగారికి ఇద్దరమ్మాయిలు, మంజరి, రాగిణి. మా చెల్లెళ్లు శకుంతల, సుజని, సరళలకి మంచి స్నేహితులు. మేం మారుతీనగర్ లో వుండేవాళ్లం. మా అందరి స్నేహానికీ, ఉద్యమానికీ, చదువుకీ హెడ్ క్వార్టర్స్ చుట్టుగుంట విశాలాంధ్ర ఆఫీసు.

చంద్రం గారిలాంటి నిలువెత్తు నిజాయితీతో తలెత్తుకుని బతికిన తరం అవసాన కాలంలో వున్న రోజులవి. పాత భూస్వామ్య మనస్తత్వంలోనే వున్న నాటి సి.పి.ఐ., సి.పి.ఎం. నాయకులు ఆఫీసుల కోసం స్థలాలు సంపాదించి భవన నిర్మాణ నిధులు వసూలు చేస్తున్న కాలం అది. హైదరాబాద్ లో మగ్దూమ్ భవన్, ఖమ్మంలో మార్క్స్ భవన్, విజయవాడలో పామీ దత్ భవన్, లెనిన్ భవన్, గుంటూరులో మల్లయ్య లింగం భవన్… ఇలా ఎన్నో….

మరో పక్క యద్దనపూడి సులోచనారాణి నవలలు మధ్య తరగతి ఆడవాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. లత, రంగనాయకమ్మ, సులోచనా రాణి, వాసిరెడ్డి సీతాదేవి, డి.కామేశ్వరి, పవని నిర్మల ప్రభావతి…. వార పత్రికల సర్క్యులేషన్ని విపరీతంగా పెంచుతున్నారు. ఇండియన్ టీనేజ్ సెన్సేషన్ జయబాధురి వెండి తెర నిండుగా నవ్వి మా గుండెల్ని కొల్లగొడుతోంది.

‘ఉపహార్’ రిలీజయ్యింది. జయ బాధురి హీరోయిన్. రవీంద్రనాధ ఠాగూర్ చిన్న కథ ‘సంపతి’ని బెంగాలీ దర్శకుడు సుధేందురాయ్ బ్రిలియంట్ గా తీశాడు. పల్లెటూరి పెంకి పిల్లగా జయ బాధురి దుమ్మురేపింది. ‘‘మే ఏక్ రాణీ హూ, తూ ఏక్ రాజా హై’’ అని పాడుకుంటూ ఏలూరు రోడ్డు మీద తిరుగుతున్నాం. బాసు చటర్జీ ‘పియాకా ఘర్’ బాగా హిట్టయింది. ‘‘ఏ జీవన్ హై’, ఇస్ జీవన్ కా…. యహీ హై రంగ్ రూప్’’ … కిషోర్ కుమార్ పాట వింటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. అదే బాసు చటర్జీ ‘రజనీ గంధ’ మిడిల్ క్లాసు గుండెల్లో బాంబులా పేలింది.

ఇక విద్యా సిన్హా వెంట పడ్డాం. తెలుగులో అందాల రాముడు, బంగారు కలలు, నోము లాంటి చవకబారు, చిల్లర మెలో డ్రామాలు సూపర్ హిట్టు కొడుతున్నాయి. 18 ఏళ్లు కూడా నిండని మేమంతా సి.పి.ఐ. ఊరేగింపుల్లో నడుస్తూ… వాడ జనం ఎదురు రండిరా అడుగడుగున హారతులెత్తండిరా అంటూ ఏటుకూరి ప్రసాద్ పాటలు పాడుకుంటున్నాం. కృష్ణ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ దేవుడు చేసిన మనుషులు కలెక్షన్లు కురిపిస్తున్నాయి. కాలం కమర్షియలైజ్ అవుతోంది. రాజకీయాలు కరప్ట్ అవుతున్నాయి. పెట్టుబడిదారీ విధానం కేబురే డాన్సులతో కేక పెట్టిస్తోంది….విస్తుపోయిన మద్దుకూరి చంద్రంలాంటి త్యాగధనుల తరం ఇదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ప్రజల కోసం ఎత్తిన కలం – ప్రశ్నార్థకంగా మిగిలింది. ప్రగతిదారిలో పలికిన పదం – మూగ వేదనగా ఘనీభవించిపోయింది. కమ్యూనిస్టులకు భవనాలు మాత్రమే మిగిలి జనాలు దూరం కావడం అప్పుడే మొదలయింది.

కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో 1907లో చంద్రం జన్మించారు. (నెల, తేదీ రికార్డు కాలేదు). ఇంజనీరింగ్ విద్యార్థిగా వున్నపుడే 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు కెళ్లారు, 1932లో వ్యష్టి సత్యాగ్రహం. పోలీసులు చంద్రాన్ని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్లు కఠిన కారాగార శిక్ష…. జైల్లోనే మార్క్సిస్టు సాహిత్య అధ్యయనం- తన దారేమిటో తేల్చుకున్నాడు. యువకుల్ని కూడగట్టాడు. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి రాళ్లెత్తారు. అటు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, ఇటు మాతృదేశ దాస్య విముక్తి- ఈ రెండిటి సమన్వయంతో పార్టీని నడిపించడంలో చంద్రం చూపిన మార్గమే దిక్సూచి అయింది.

1937లో కమ్యూనిస్టు పార్టీ ‘నవశక్తి’ పత్రిక ప్రారంభించింది. దానికి ఎడిటర్ గా మద్దుకూరి చంద్రం జర్నలిస్టు జీవితం మొదలయింది. పార్టీ రహస్య పత్రిక ‘స్వతంత్ర భారత్’, 1942-45 మధ్యలో ప్రజాశక్తి వార పత్రిక, నిర్బంధ కాలంలో మూసివేసే దాకా ‘ప్రజాశక్తి’ దినపత్రిక సంపాదకునిగా వున్నారు. 1948లో అరెస్ట్ అయ్యారు. ‘విశాలాంధ్ర’ దినపత్రిక 1952లో ప్రారంభమయింది. ప్రధాన సంపాదకుడు చంద్రం! 1964 నుంచి 68 వరకూ సంపాదక వర్గంలో ఒకనిగా వున్నారు. 1969 నుంచి 1974 దాకా ‘ప్రగతి’ వార పత్రిక ప్రధాన సంపాదకుడు ఆయనే. ఒకనాడు, జయ భారత్, రెడీ అనే రెండు రహస్య పత్రికలు చంద్రం నాయకత్వంలోనే నడిచాయి. ఆయన తెలుగు వాక్యం సూటిగా, సరళంగా, సుబోధకంగా వుంటుంది. సుభాస్ చంద్రబోస్ లాంటివాళ్లు తప్పుదారి పట్టిన దేశభక్తులని విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో వ్యాసాలు రాశారు. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధి, అభ్యుదయ భావజాల వ్యాప్తి కోసం అసంఖ్యాకంగా ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ రాశారు. ఆంద్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమంలో అతి కీలకమైన సంవత్సరాలు 1951-56. ఊపిరి సలపని పోరాటాలు, మహోధృతంగా ఎన్నికలు జరిగిన ఆ అయిదు సంవత్సరాలూ పార్టీ కార్యదర్శిగా చంద్రం వున్నారు. అప్పుడే, 1952లో రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాలని పార్టీ కోరినపుడు ఆయన తిరస్కరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న స్వార్థం, వెర్రితలలు వేస్తున్న ముఠా తత్వాన్ని ఆయన ఏవగించుకున్నారు. నిరసనగా కర్నూలు వెళ్లిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ బతికారు. పార్టీ అగ్రనాయకుడూ, సంపాదకుడూ అయిన చంద్రం అక్కడొక సాధారణ పార్టీ కార్యకర్తగా వున్నారు.

‘‘నాయకుడన్నవాడు సామాన్య పార్టీ సభ్యునిగా వుండటం చాలా కష్టం. కానీ చంద్రంగారు అది సాధ్యమని ఆచరణలో రుజువు చేశారు’’ అన్నారు చండ్ర రాజేశ్వరరావు. విజయవాడలోని ‘విశాలాంధ్ర’ డైలీ, పుస్తకాల పబ్లిషింగ్ హౌస్ కోసం పెద్ద భవనాలు నిర్మించినపుడు ఆ కాంప్లెక్స్ కి ‘చంద్రం బిల్డింగ్స్’ అని పేరు పెట్టింది రాజేశ్వరరావే!

తెలుగు సాహిత్యాన్ని సీరియస్ గా అధ్యయనం చేసిన పాత తరం కమ్యూనిస్టు నాయకుల్లో చంద్రం ఒకరు. వీరేశలింగం, గురజాడ, గిడుగుల కృషిని అభ్యుదయ సాహిత్యానికి పూర్వరంగంగా అన్వయించుకోవాలని చంద్రం అన్నారు. వీరేశలింగంపై ఎవరెన్ని విమర్శలుచేసినా, ఆంధ్ర జాతీయ వికాసానికి పునాదులు వేయడం, తెలుగు జాతికి ఆయన చేసినది విప్లవకర సేవ అనేది మద్దుకూరి నిశ్చితాభిప్రాయం! ఆరుద్ర ‘త్వమేవాహం’లో పసిడి తునకలూ, ముళ్ల పొదలూ రెండూ వున్నాయని విశ్లేషించారు. ‘‘త్రిపురేని గోపీచంద్ రాసిన ‘అభ్యుదయ రచన అంటే ఏమిటి?’’ అనే వ్యాసంపై వ్యాఖ్యానిస్తూ చంద్రంగారు, అరసంలో వుండే మార్క్సిజం తెలియని వాళ్ల అభిప్రాయాలను గోపీచంద్ ఉపయోగించుకోవడాన్ని తార్కికంగా ఎత్తి చూపారు. ఈ సందర్భంగా చంద్రం గారు ‘పాతని తగలబెట్టండి’ అనే వాదాన్ని మార్క్సిజం ఆమోదించదన్నారు. పోతన, ధూర్జటి మాటలను చంద్రం వ్యాఖ్యానించిన తీరు అభ్యుదయ విమర్శలోని ప్రజాస్వామిక లక్షణాన్ని నిరూపిస్తుంది’’ అని రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఒక వ్యాసంలో రాశారు. ‘చంద్రం వ్యాసావళి’లో తెలుగు సాహిత్యంపై వున్న అయిదు వ్యాసాలూ చదివితే ఆయన సమాజ, సాహిత్య చరిత్రలను ఎంత లోతుగా అధ్యయనం చేశారో తెలుస్తుందనీ అన్నారు.

tadi prakash
prakash

అలా పసిడి రెక్కలు విరిసిన కాలం కనుమరుగైపోయింది. త్యాగం అంటే డబ్బు సంపాదించడం తెలీని వాళ్లకి వచ్చే రోగం అని సభ్య సమాజం కనిపెట్టింది. ‘డియర్ కామ్రేడ్’ అంటే హీరో విజయ్ దేవరకొండ అని చెప్పి ఈలలు వేసే తరం ఒకటి తోసుకొచ్చింది. ధనరాసులుగా, పసిడి దిమ్మెలుగా, మబ్బుల్ని ముద్దాడే మేడలుగా మానవ జీవితం Freeze అయిపోతోంది. గచ్చిబౌలి వీధుల్లో రియల్ ఎస్టేట్… సర్రియల్ కలల్ని ఎస్.ఎఫ్.టి.ల లెక్కన హాట్ హాట్ గా అమ్ముతోంది. చీకటి కడుపును చీలిస్తేనే వేకువ రేకుల ఉదయం తూరుపు నొసటన త్యాగం బొట్టును పెట్టేస్తేనే ఉదయం- అని గుండె చీల్చుకుని, గొంతు చించుకుని చెప్పిన మద్దుకూరి చంద్రశేఖరరావు మాత్రం, 1974 జూలై 26న చరిత్ర చీకటి పుటల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు, మౌనంగా!కమ్యూనిస్టు జర్నలిజం కన్నతండ్రి వెళ్లిపోయిన రోజు ఇది.

PS: చంద్రంగారి పెద్దమ్మాయి మంజరి విశాలాంధ్ర, సాక్షి దినపత్రికల్లో చాలా యేళ్లు పనిచేసిన సీనియర్ జర్నలిస్టు. కమ్యూనిస్టు రాజకీయాల్ని, తెలుగు సాహిత్యాన్నీ బాగా చదువుకున్న మంజరి హైదరాబాద్ లోనే స్థిరపడింది.

– Taadi Prakash. 9704541559

……………………………………………………………………………………

కొబ్బరి బొండం తాగినప్పుడల్లా అనుకునేవాడు పాండ్యరాజ్‌…

కొబ్బరి కాయలను సులభంగా రంధ్రం చేసే పరికరం వస్తే ఎంత బావుండని.! కూల్‌ డ్రింకులను, సోడాలను ఓపెన్‌ చేసే పరికరంలాంటి కోకోనట్‌ ఓపెనర్‌ డిజైన్‌  చేశాడు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చివరి అంచున ఉన్న పదునైన కటింగ్‌ ఎడ్జ్‌ తో కొబ్బరి బొండంపైన రంధ్రం చేయవచ్చు.  ఇది చూసేందుకు గ్యాస్‌ లైటర్‌ లా అనిపిస్తుంది.చిటిక లో బొండాం ఎలా ఓపెన్ చేయ వచ్చో.. ఈ వీడియో చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles