అనంత మోహనుడు

పుంభావ సరస్వతీ కుంజరమునకు సంభావము కూర్చవలెనన్న ఈ గంజాయి వనమున కనీస మందార పరిమళమ్ము ప్రభవించునా ‘చిన్నా’! మంధర మెత్తిన మగధీరుని ప్రస్తుతింప మతిమాలిన మందమతికి మాటలు తడబడవా అన్నా!! ఐనా.. ఏమైనా… చిమ్మ చీకటి నేనైనా కమ్మటి నా కంఠాన రాగమొకటి ఆలపిస్తా… అశ్రువొకటి ధారపోస్తా….. అంజలొకటి ఘటియిస్తా.. చుంబన మొకటిస్తా… అంబర వీధులో విజృంభించి నర్తిస్తా… గురుదేవుని పాదధూళినై సంభావనము సమర్పిస్తా…ఆజానుబాహుడూ… అరవింద దళాయతాక్షుడూ… అఖిలాంధ్ర ప్రేక్షకదేవుడూ… అయిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు గారు మిటకరించి చూస్తున్న గుడ్లగూబ కళ్ళతో, మొనదేలిన చాకువంటి ముక్కుతో, వంకర దరహాసముతో, నుదుట విభూతి రేఖతో, గుమ్మడికాయ తలతో, తల నుండి మెడ వరకూ సవరించిన గడ్డిపరక వెంట్రుకలతో పీతాంబర లాల్చీ పైకండువాతో, తళుకులీను ఉంగరాలు ఐదింటిని తొడిగి, వామహస్తపు చూపుడు వేలితో ఒక కామన్ మాన్ కి “ప్రపంచంలో అతిపెద్ద లెఫ్టిస్టుని నేనే” అని హూంకరించి చెప్తున్న బొమ్మ ఆనాటి ఉదయం పేపర్లో ప్రచురితమైంది.

ఏషియన్ పెయింట్స్ నెరోలాక్ శాంపుల్ కి అది పొట్లమై నాకంట పడింది. ఆవిధంగా 1983లో మోహన్ బొమ్మ పరిచయమైంది.మాది చిన్న బావి. గుండ్రటి అక్షరాలు రాసే వినుకొండ రంగనాయకులు, పోర్టయిట్లు చేసే సాల్మన్ రాజు, బాపూ అక్షరాలను దంచేసే పరిశుద్ధరావు తూర్పున కొద్దిపాటి దూరంలో చీమకుర్తి సుబ్బారావు, పశ్చిమాన చీరాల రాజు, గుంటూరులో సాంబశివరావు హాయిగా కాలక్షేపం చేస్తున్నాము. సైన్బోర్ట్ు రాసుకుంటూ, ‘నువ్వెంతంటే నువ్వెంతని’ తన్నుకుంటూ ఎంతో హాయిగా ఉన్నాము. అలాంటి మా బావి పైకి “తెలుగుదేశం పిలుస్తుంది రా ! కదలిరా! అని కాకుండా “లెఫ్టిస్టుని నేనే” అంటూ దురంత భీకర కరోర ఫణిర్మాంసాస్వాంతుడగు గజేంద్రుని నఖక్షత రేఖలతో ‘మోహనోవా’ మా బావిని చీల్చివేసింది.

నేను చంటోడ్ని, సాల్మన్ రాజన్న చంకనెక్కి వెక్కివెక్కి ఏడుస్తూ “నాకది కామాలి. నాకది కామాలి” అంటే అపార జ్ఞానసంపత్తి కలిగిన రాజన్న ‘వేయి జలమలెత్తాలి’ అన్నాడు. అటు తరువాత ఐదేళ్ళ సుదీర్ఘమైన నిద్రలేని కల. కలనిండా మోహన్ బొమ్మలు. రేఖలు, అవిశ్రాంతంగా ప్రతిరోజూ శాసించేవి. ప్రత్నించేవి. ఆనందింపచేసేవి. ఏడ్చించేవి. గిలిగింతలు పెట్టేవి. వెక్కిరించేవి. ఉక్కిరిబిక్కిరి చేసేవి.

మోహన్ ఎలా ఉంటాడు? సుమారు ఓ అరవై ఏళ్ళు ఉండొచ్చు. కారూ గీరూ.. బంగ్గా గింగ్లా… నౌకర్లూ చాకర్లూ… మందీమార్బలంతో మారాజులా ఉంటాడు. ఎంతైనా ఉదయం పేపరు గదా!, కనీసం ఆమాత్రం ఖచ్చితంగా వుంటుంది. “ఎంతచేసినా ఏం పీకినా మనం ఈ ‘మంగుళూరు గణేష్ బీడీ మిగులు’ని దాటలేం కదా! కొడ్తే కుంభస్థలాన్నే కొట్టాలి. ఐతేగీతే మోహనే అవ్వాలి. అదే నా ప్రస్థానం” అని రాజన్నతో అంటే “అసంభవం” అనేవాడు.

ఒకరోజు దొనకొండ నుంచి వచ్చిన పాస్టర్ “మీ అబ్బాయిలా అత్తెసరు మార్కులతో టెస్తు పాసయినోళ్ళకి జెఎన్టీయు (జంతు’ కాదు) కళాశాలలో ట్రైనింగ్ ఇస్తారు. మోహన్ సారు లాంటి వారి పరిచయంతో సిద్ధుడవుతాడు. నీకు డబ్బులే డబ్బులు పంపవమ్మా సుబ్బమ్మా” అంటే “వంటపని చేసుకుంటూ వీడ్ని ఇంతవాణ్ణి చేసాను. ఇంకెంత వాణ్ణి చెయ్యాలా దేవుడా.. అంటూ విసుక్కుంటూ, కసురుకుంటూ, “స…రే” అంది. రాజన్నన్ను వదల్లేక వదల్లేక హైద్రాబాద్ చేరా రాంనగర్ గుండులో ‘ఉదయం’కి కూసింత దూరంలో ఇరవై ఐదురూపాయలకి గది కుదుర్చుకున్నా.కంకణ బద్దుడైన వానికి కార్యోన్ముఖతే లెక్కగా.. కార్యాతురాణం నసుఖం, న నిద్ర. అర్జెంటుగా మోహన్ని కలవాలి. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు ఆ ‘రేఖలు మీకు ఎక్కడనుంచి వచ్చాయి. ప్రళయకాల భీకర శబ్బోన్నతి నుత్పన్నం కావించే ‘గీతలు’ ఎలా సంపాదించారు. చిటికెలో చటుక్కున ఐడియాలు రావాలంటే మీరు ఏం తాగుతారు? పొలిటీషియన్స్ ను దున్నల్లా, పందుల్లా, రాబందుల్లా గీయాలంటే మీకు ఎన్ని గుండెలు? అవి ఎక్కడైనా అరువు దొరుకుతాయా బొమ్మల అమరిక కుదరాలంటే మనం ఎలాంటి ఆసనాలు వేయాలి? పేదల పక్షాన గీస్తే డబ్బులేమైనా వస్తాయా? ఇన్ని రకాల ఐడియాలు చేయటానికి మీకు ఎన్ని తలలున్నాయి? అలాంటివి మార్కెట్లో దొరుకుతాయా? ఇంతలా పరస్పర విరుద్ద రేఖాచిత్రాలు గీయటానికి మీకు ఎన్ని చేతులున్నాయి? నాకున్న రెండు చేతులకు కొన్ని చేతులు కలపగలరా?

మీ శిష్యకోటిలో నన్ను చేర్చుకుంటే మీ ఫీజు ఎంత? ఇంతకీ మీకారు నంబరెంత? మీ బంగ్లా అడ్రస్ ఎక్కడ?… ఇలాంటి సవాలక్ష ప్రశ్నల సమాహార పూదండలతో ఉదయం ఆఫీసుకి బయలుదేరా.ఉదయం పదిగంటలకి వెళితే మోహన్ లేడు. మరుసటిరోజు పదకొండుకి వెళితే లేడు. అటు తరువాత పన్నెండుకి లేడు. ఆపైన ఒంటిగంట, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు నుంచి పది వరకూ ప్రయత్నించా… మోహన్ ఎప్పుడూ కనపడలా. కార్టూన్లూ, రన్నింగ్ కామెంటరీ, దిబ్బరాజ్యం, ఎడిటోరియల్లో బొమ్మలు, ఉత్తరాలూ… అన్నింట్లో మోహన్ బొమ్మలు మామూలుగానే వస్తున్నాయి. ‘మోహన్ రాకుండా బొమ్మలు ఎలా వస్తున్నాయని గేట్ కీవర్ని అడిగితే “వారు ప్రత్యక్షమవుతారు. సెకన్సులో బొమ్మలు రాసి మాయమవుతార”ని చెప్పాడు. అతన్ని బతిమిలాడి విజిటర్స్ రూమ్ లో రెండు నుంచి సాయంత్రం ఐదువరకు వెయిట్ చేసా. (కుంభస్థలాన్ని కొట్టాలిగా, ఆ మాత్రం సహనం చూపాను).

గేట్ కీపర్‌కి కూడా తెలవకుండా మోహన్ ప్రత్యక్షమవటమూ, పనిచేసుకు పోవటమూ రెండూ జరిగాయి. బయటనున్న గేట్ కీపర్ వెళ్ళిపోతున్న మోహన్ సారును చూసి “ఓ మోహన్ సార్.. ఎవరో పోరడు మీకోసం శాన రోజుల్నుంచి వస్తుండు, పోతుండు చూడండి” అంటే, మోహన్ సార్ వెనక్కి వచ్చి ఇంతకు ముందే పరిచయమున్న వాడిలాగే “ఇక్కడొద్దబ్బా టేబుల్ మురికిగా వుంటుంది. బర్కత్ పురా వెళ్తున్నా రారాదూ” అంటూ మధ్యవేలితో మీసాల్ని సరిచేసుకుంటూ పిలిచాడు. నాకల ఫలించింది. మోహన్ ని చూశా. గాంధీగారి ముతక కాటన్ లాల్చి, పాంట్, భుజానికి వేలాడుతున్న స్కూలు పిల్లలు తీసుకు వెళ్ళే బాగ్, కాళ్ళకి తెగటానికి సిద్ధంగా ఉన్న స్లిప్పర్లు. చిక్కుముడి గిరజాల జుట్టు. సగం మాసిన గడ్డం, ఈనె పుల్లలో పావుపాటి కండకలిగిన ముప్పై ఎనిమిదేళ్ళ శరీరం. అసురసంధ్యలో ప్రభాతనూర్యుడితో ఇరవై రెండేళ్ళ ప్రయాణం.ప్రయాణపు ప్రతి మజిలీ చిత్రం. పెన్నూ పేపరు, ఇంకూ బ్రష్షు వాహనంగా తిరిగిన ప్రతి మలుపూ విచిత్రం. ఆ పాతాళ సభా స్థలాంత భువన బ్రహ్మాండాలు వేదికగా మసలిన వైనం వర్ణనాతీతం. మోహన్ తన కుంచెకు చెప్పిన పని అంతా ఇంతా కాదు, వాటన్నిటిని వింతపడి చూడటం మాకు కొత్తేం కాదు.బండెనక బండికట్టి పదారు బళ్ళు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడకో నైజాం సర్కరోడా… ఒక అతిపెద్ద చిత్రరూపం మోహన్ ఆవిష్కరించాడు.

ఆదిలాబాద్ గోండులూ, సికాకుళం సవరలూ, భద్రాచలం కోయలు సాంస్కృతిక వైభవాన్నీ, వెనుకబాటు తనాన్నీ జనబాహుళ్యానికి తెలియజేసింది మోహన్ కుంచె. భారతదేశ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి చిట్టచివరి కవి వరకూ అందరూ మోహన్ ని వాడిన వాళ్ళే. కార్టూన్ కు మోహన్, కవితకు మోహన్, కథకు మోహన్, ముఖచిత్రానికి మోహన్… వాల్ పోస్టరుకు మోహన్, సావనీరు మోహన్, మోనోగ్రామ్ కి మోహన్, లోగోకి మోహన్, యానిమేషన్ కి మోహన్, మీన మేషాలకి మోహన్, మోహన్.. మోహన్… మోహన్.. ఇందుగలడందులేడని కాకుండా ఎండులేదో చెప్పగలిగితే చాలా బావుండేది. కానీ అది అసాధ్యం.

త్రివిక్రమణం లంఘించి విజృంభించిన మోహన్ని చూడటం చాలా కష్టం.ఆ లైను పట్టుకుందామంటే తునిగిపోతుందేమో అనిపిస్తుంది. ముట్టుకుందామంటే జారిపోతుందా.. అనిపిస్తుంది. ముద్దు పెట్టుకుందామంటే మాసిపోతుందేమో అనిపిస్తుంది. ఇంటర్నెట్, ఎడొబ్ ఫొటోషాపులూ, లైట్ బాక్స్ లూ, కలర్ ప్రింటుల మీద వర్కులు చేసే ఈ కాలంలో కూడా కండె, రంగులు కలిపే చిప్ప, కాల్చిన బొగ్గు వాడే పాతకాలపు మనిషి మోహన్.

“సర్”మని వస్తే పవన గుంభితము. జర జరా వస్తే గంగా ప్రవాహము. ఫెటీల్మని వస్తే ముక్కంటి నేత్రము, పెళపెళ ధ్వనితోడి ఆకాశ కవాటమ్ము. ధం ధం మనిపిస్తే భూగర్భ ఆక్రోశము. ఆ రేఖను వర్ణించ తరంకాదు శూలి కైనా, తమ్మి చూలికైనా!ఇంత తెలిసుండీ, ఇన్ని నేర్పులు చేర్చి తన ఆవశ్యకతను తానెరిగి ఏక పక్షంగా ‘అయామ్ రిజైన్డ్ అంటూ ఏకవాక్య తీర్మానాన్ని ఉదయం పేపరులో ప్రవేశపెట్టి ఆమోదించమన్నాడు మోహన్. ఆకాశపక్షి కైనా గూడు పుందేమోకాని భూమిపై సూదిమొన మోపినంత స్థలం లేదు. విద్యానగర్ ఫ్లై ఓవర్ కింద బల్లవేసుకు కూర్చున్నాడు. ఇంకోసారి నీరజ్ మల్టీ మీడియా వనంలో అల్లనేరేడు బోధికింద, మరోసారి ఇందిరాపార్క్ లో, ఇలా అమీర్ పేట్, కాచిగూడ చిక్కడపల్లి, ఖైరతాబాద్ .. అంటూ ఆ బస్సు తిరిగినచోట తిరక్కుండా వస్తుంది.

నాదీ, శ్రీరాం, శంకర్, అన్వర్, రవి, మీరా లాంటివారిది పర్మినెంట్ స్టూడెంట్ పాస్. కవులూ, కళాకారులు, మేధావులూ, రాజకీయ నాయకులు, స్నేహితులూ, అభిమానులు పాసింజర్లు. గుడికి, బడికి సెలవుంటుంది కాని మోహన్ భువనవిజయానికి సెలవనేది లేదు. ఈరోజుకీ పాటలు, పద్యాలూ, కథలూ, కవిత్వాలూ, చర్చలూ, గోప్ఠులతో అజ్ఞాన తిమిరాల నుండి విద్వన్మణుల వరకు అందరికీ అవకాశం కల ఏకైక సభాప్రాంగణం మోహన్ విలాసము. ఈ కోలాహలాల మధ్యే మోహన్ కుంచె, కలము, గళము పనిచేసివి. కళావిష్కరణ కావించేవి. ప్రపంచాన్ని చూపించేవీ, సత్యాన్ని బోధించేవి! మావూరి వాడైన గంగినేని వెంకటేశ్వరరావు (మాజీ ఎం ఎల్ ఏ) రచియించిన ‘ఉదయిని’ ప్రముఖ చిత్రకారుడు చిత్తప్రసాద్ గారు గీసిన ముఖచిత్రం గురించి మోహన్ గారి ముఖతా తెలుసుకున్నానంటే నన్నేమనాలి? మోహన్ నేమనాలి?? చిత్తప్రసాదు గీసిన తెలంగాణ పల్లెల జీవితం, రజాకార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణ జీవన పోరాటాల చిత్రాలను మోహన్ చూపించారు. తెగువంటే ఏమిటో తెలియ చెప్పేవారు. “ఆ గడ్డంతో, భూతద్దాల కళ్ళజోడుతో, మరగుజ్జు రూపంతో జట్కాబండి నుంచి కాన్వాస్లు, ఆయిల్స్, చార్కొల్స్ దించుతున్న పురుషుడు లోత్రెక్. భువనైకోద్ధారక వారవనితా జనతా ఘనతోద్ధారక కారకుడు. కళా-ప్రేమా-సత్యం కోసం బతికాడు. మరి మీ సంగతేంటి గురూ”? అని యువచిత్రకారులను ప్రశ్నిస్తారు మోహన్. బెల్జియం బెటోల్ గ్రామంలో గని కార్మికుల జీవన దృశ్యాలను వాంగో ఎలా చిత్రీకరించాడు? తైతి ఐలండ్ లో మాత్యా గ్రామంలో పాల్ గాగిన్ చచ్చినా ఎలా జీవించాడు? డేగాస్ ఎవ్వడు? ముంచ్ ఎవ్వడు? బెర్డిలీ, హెగార్త్, డచ్చ్యామ్స్, హొపర్, మోడిగ్లినీ, కాలో, చాగల్, పొలాక్, మోరిస్, టర్నర్, హార్డ్ బెన్టన్, డాలి, డావిన్సీ, రూబెన్స్, రాఫెల్, ఫ్రాగోనా ర్డ్.. ఇలా ఎందరో చిత్రకారుల చిత్రాలను, వారి జీవితాలను చూపించి తనవైపునున్న దృష్టిని బాహ్య ప్రపంచం వైపు మరల్పింప ప్రయత్నిస్తున్న దేవుడు మోహన్. “తరళసలీలాలు రసరమ్య దృశ్యకావ్యాలు. అబ్దుల్ రెహమాన్ చౌగాయ్ చిత్రాలు, పాకిస్తాన్ పోదాం పారశీక అమ్రపాలిని వెంట తెచ్చుకుందాం. కదలరేం గురూ” అంటూ బాధపడతాడు,

“ఎల్లయ్య, సుబ్బారావు, వెంకటేశ్వర్రావు ఆంకర్వాట్ లో అతి పెద్ద క్షీరసాగర మధనం చెక్కింది మన కృష్ణాజిల్లా వాళ్ళేనోచ్” అని ఆనందిస్తాడు. “రజ్జువునందాపాదించబడిన సర్ప భ్రాంతి. మృత్తిక ఘట న్యాయాదుల ఖడ్గధారణతో ఆసేతు హిమాచల పర్యంతం జయకేతన మొనరించిన ఆదిశంకరుని శిష్యుణ్ణి నేనని మత్త వేదండమునెక్కి చాటింపు చేస్తా. మీకేమన్నా అభ్యంతరమా?” అంటూ విజయ దరహాస చంద్రికలు వెలయిస్తాడు.

“బొమ్మలు వేయాలంటే తిరోగమించండి, మొక్కపాటి కృష్ణమూర్తి వారిని చేయండి. జన్మధన్యత చెందండని” ఆజ్ఞాపిస్తాడు. ఒక ఆర్టికల్ రాసే నిమిత్తమై కొండపల్లి శేషగిరిరావు గుడికెళ్ళి ఆయన గీసిన తెలంగాణ తల్లికి.. సారీ తెలుగుతల్లికి దణ్ణం పెడితే వరూధిని కానీ, డెడ్ కౌ గాని దొరకొచ్చు పోదామా” అంటూ మమ్మల్ని వెంటబెట్టుకు పోతాడు. శంకరో, అన్వరో గుర్తులేదు కాని ఖరీదైన కాన్సన్ షీట్లు, సెడ్లర్ పెన్సిల్స్ తీసుకొచ్చి మోహన్కి ఇస్తే వియత్నాం గెరిల్లా వార్‌లో బెంబూ విల్లుతో సంధించిన బాణం అంబరాన పోయే అమెరికా డేగను ‘ పేల్చిన ‘ వైనం చెప్పి “గీయటానికి చెయ్యి, మెదడుండాలి గాని ఇవన్నీ ఎందుకబ్బా” అని ప్రశ్నిస్తాడు.

“అన్నమయ్య, త్యాగరాజు మనవారే. గద్దర్ కీ, గోరటికీ జయహారతులిద్దాం. గుండెల్లో దాచుకుందాం” అంటూ వాపోతాడు. ఇలా వచ్చి అలా వెళ్తున్న పతంజలి గారిని చూసి “ఏంద్సార్ అంత తొందరగా వెళ్తున్నారంటే” – డబ్బు నిచ్చే నంజకొడుకు ఏంచెబితే అది చెయ్యాలిగా, చేశా, పోతున్నా” అంటే మోహన్ ఎంత విలవిలలాడాడో చెప్పలేం. ఒకసారి మోహన్ టేబుల్ పైనున్న పుస్తకాన్ని చూసి ఎవరు రాశారు సార్? అంటే, మన శివాజీ గురూ! బౌద్దానికై తపస్సుచేసి బుద్ధుడయ్యాడు. ఇక బుద్ధుడు నిర్వాణం చెందినా పరవాలేదు” అని ప్రశంసలు గుప్పించాడు.

అతని అక్షయపాత్ర మేధను తంగేటి జున్నులా జుర్రుకున్నాం. మొన్నామధ్య చంద్రగారిని బుజాలకెత్తుకుని సన్మానం చేశాడు మోహన్. ఆ సన్మాన సభలో ఓ పెద్ద చిత్రకారుడు చంద్రగారి గురించి పొగుడుతూ పొగుడుతూ అదుపుతప్పి ‘తన్ను పొగుడుకోవటం బిగిన్ చేశాడు. ఇలా ఒకరి వేదికపై ఇంకొకరి గొప్పలు చెప్పుకోవటం ఏమి సంస్కృతో అర్ధం కాదు. ఈ మధ్య మోహన్ కి ‘షష్టి’ వచ్చాయి. మోహన్ గురించి రాద్దామని యువచిత్రకారులూ, సమకాలికులూ అనుకున్నారు. ఈ విషయం మోహన్ కి తెలియకుండా చెయ్యాలనీ, తెలిస్తే ఆయన ఊరుకోడనీ గుట్టుచప్పుడు కాకుండా రాద్దామని సంకల్పించాం. సమకాలికులు అనుకున్నట్లే అద్భుతంగా రాశారు. యువచిత్రకారులు మాత్రం అదుపు తప్పి విజృంభించారు. గురువుని మించిన శిష్యులని చాటారు. బైబిలులో ఒక మాట వుంది. శిష్యుడు గురువుకంటే అధికుడు కాదు. దాసుడు యజమానికంటే అధికుడు కాడు. శిష్యుడు గురువు వలెను, దాసుడు యజమాని వలెను ఉండిన చాలును” అని ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మోహన్ ఒక చిత్రం కాదు, బహుచిత్రం! మోహన్ ఒక గ్రంథం కాదు, బహుగ్రంధం!! పైగా మేము మోహన్ ని అనుకరించామే తప్ప, అనుసరించలేదు. ఆ అతిపెద్ద అడుగుల్లో మా చిన్న కాళ్ళు సరిపోవటం లేదు. ఉదయం లేస్తే తిండితిప్పలు, పెళ్ళాం బిడ్డలు, వాటి మధ్య గిరి తీసుకుని గీసిన గీతలకూ, రాసిన రాతలకూ చెల్లుబాటు కావాలనుకోవటం అజ్ఞానం. నవుత్రం, నభార్యం, నమిత్రం అంటూ మోహన్ శివుడయ్యాడు.

“అతను తాగాడు… ఇతను తూలాడు” అన్న చందాన వుంది శిష్య కోటి గణం. ఇంకొకటేందంటే మాలో ఎవరి బొమ్మైనా విన్సర్ మానర్ హెటల్ లో ఎగ్జిబిటై లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందని విన్నా, ప్రపంచ కార్టూన్ పోటీల్లో ఫస్టు ప్రైజ్ వచ్చినా, ఇంకెవరైనా బొమ్మ అద్భుతంగా గీసినా ప్రాజ్ఞ్యు లేన పెద్దలు మెచ్చుకోవటం, పొగడటం పరిపాటి. అందునా మోహనయితే నెత్తిమీద కెక్కించుకుంటాడు. అదే నిజమని నమ్మి ఛాతీలు విరగ్గొట్టుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. బొమ్మలమ్మిన ప్రతివాడు ఆర్టిస్టు కాడు. అచ్చయిన ప్రతిబొమ్మ ఆర్టు కాదు. అద్దమందు కొండను చూసి ‘అదింతే.. మనమెంతో.. అనుకుంటే ఎలా? ఈపాటి క్షుద్రవిద్యలు చేసే కుర్రాళ్లు ఎందరో వున్నారు. నెలవుతప్పి ఎగరటం పాడికాదు. డేవదేవుళ్ళను పక్కనుంచి చూడాలేకాని ఎదురేగి మతిమీరకూడదు. కాళ్ళు కడిగి శిరస్సున ధరించాలే తప్ప తలకెక్కడం అవివేకం.మోహన్ సార్ వంటి భాగీరథి దొరకటం అరుదు. ఎలాంటి వారికైనా నీడనిచ్చి, సేదతీర్చే పుణ్యతీర్ధం అది. దోసిళ్ళలో తీసుకు వెళ్ళిన వారికి దోసెడు. చెంబులతో తీసుకు వెళ్ళిన వారికి చెంబుడు. బిందెలతో వెళ్ళిన వారికి బిందెడు. మా సత్తాకొద్దీ. మా ప్రారబ్ద పుణ్యఫలంగా దొరికినంత దొరికింది. స్థిర చిత్తయైన ఆ నది మాత్రం తనకేమీ కొరవడనట్లే సాగిపోతుంది. ఆ సూర్యుని తేజో ప్రాభవం ముందు మా దివిటీలు ధగద్ధగలై వెలిగిపోతున్నాయి. అది గొప్పే. ఇప్పుడు మా బావి చాలా విశాలమైంది. ఇంతకు పూర్వం బెకబెకలాడే వాళ్ళం. ఇప్పుడు భౌ భౌ అంటున్నాం. ఎర్రటి ఎండల్లో, ఎండిన గుండెల్లో ఉండే మోహన్ మీసాల్ని సరిచేసుకుంటూ అనంతుడై సచ్చిదానంద స్వరూపుడై అలా.. ఉండిపోయాడు.అరవై ఏళ్ళ మోహన్ విరాట్ స్వరూపానికి జేజేలు. అంతు తెలియని ఈ వింత లీలా మానుష విగ్రహానికి పాదాభి వందనాలు.

– పాండు, ఆర్టిస్ట్(మోహన్ గారికి అరవై ఏళ్ళ సందర్భంగా రాసిన అముద్రిత వ్యాసం)MAGAZINE STORY ON MOHAN – SAKSHI TV – 24TH DECEMBER AT 9.30 PM-( TAADI PRAKASH. 9704541559)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles