రాముడున్న తర్వాత లక్ష్మణుడు కూడా ఉంటాడుగా షాడోలాగా. ప్రకాష్‌గారు కూడా అంతే, కొంచెం జులపాలున్న ఆర్టిస్ట్ మోహన్‌గారికి- క్రాఫ్ చేసిన నీడలాగా! మన్నించాలి , అప్పటికి ఆయన గురించి ఏమియునూ తెలియదు. పైగా చిన్నాపెద్దా అందరిముందూ పద్ధతిగా, వొందనంగా- వినయవిధేయ డ్రామా టైపులో కనిపించేవారు. తర్వాత ఎప్పుడో గానీ తెలియలేదు.. ఆయనకో బ్లాక్‌బస్టర్ లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందనీ, అది బాషా సినిమాలాంటిదనీ, శైలిలో ఆయనొక మాణిక్ బాషా అనీ. ఏలూరు రోడ్ ఆత్మగీతం చదివాక అది ఎంత పెద్ద సినిమానో మరింత బాగా అర్థమైంది. ఏలూరు రోడ్డు అంటే ఎటువంటి రోడ్డు అదీ? కొంచెం కమ్యూనిజమూ, మరికొంచెం రౌడీయిజమూ, కొంత సాహిత్యమూ, కొంత కులతత్వమూ, ఫైనల్‌గా పచ్చి కమర్షియలిజమూ..
నేను భీ ఇంటర్ డిగ్రీ అదే ఎస్సారార్ కాలేజీ, అదే మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట. ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ” విశ్వనాధ ఇల్లు ఇదే ‘ అనుకోవటమూ, “అడుగో అయనే పెద్దిబొట్ల ‘ అని సాయంకాలం అరుగుమీద కూర్చునే ఓ పెద్దాయన్ని రోజూ చూస్తూ కూడా , పలకరించే చొరవలేని చిన్న తనమూ . అప్పట్లో గుణదలవైపు వెళ్లాలంటే కొందరికి గుండెదడ, కృష్ణలంక వైపు చూడాలంటే కొందరికి కలవరం. దీనికి పునాది వేసిన, మొదటి హత్యాకాండ గురించి రాస్తూ, ఈ దుర్మార్గుడు ” ఊరించే పాటలూ, వణికించే హత్యలూ ‘ అని శీర్షిక పెట్టాడు. మనసున మల్లెలూగే రొమాంటిక్ పాటలతో, అనుభూతులతో మొదలు పెట్టి, వర్మ సినిమాల్లో వినిపించే బీభత్సపు బీజీఎంతో ముగిస్తాడు. ఈ అరకొర కమ్యూనిస్టు ఎంత క్లాసికల్లో అంత మాసికల్ కూడా. అదొక వైభవోజ్వల శకం.

ఈ పుస్తకం నిండా ఆ అచ్చుయుగపు పిచ్చి రోజుల జ్ఞాపకాలే.. ఆయన చూసిన మహానుభావులూ, కలిసి పనిచేసిన జీనియస్‌లూ, కవులూ రచయితలూ , గొప్ప సమయాలూ, మరికొన్ని గొప్ప సందర్భాలూ. రామోజీరావుని రాక్షసుడు అని ఎందుకన్నట్టు? నండూరీ, రాఘవాచారీ ఎలా ఉండేవారు? కారంచేడూ, చుండూరూ… పులిచంపిన లేడి నెత్తురును పులుముకున్న ఉదయం – ఉద్యమ ఆయుధంగా ఎలా మారింది? సమీప గతంలోని చరిత్రను ఎంత ఆసక్తికరంగా రాశారో … చదువుతున్న కొద్దీ అసూయ, అసిడిటీ.. ఒక సంపాదకుడు ఇంతకంటే ఏం సంపాదించాలి? ఎందరో మహానుభావులు- మిగతావాళ్ల సంగతేమో కానీ- ఏది మాట్లాడినా సౌతిండియాకీ, సుమేరియాకీ ఉన్న లింకుల్ని తవ్వే రాంభట్లను చూడలేకపోవటం ఒక వెలితి. మా కంటే ముందు తరం వాడు కాబట్టి, విశాలాంధ్రలో పురుడు పోసుకున్నవాడు కాబట్టి, ప్రకాష్‌గారికి ఆయన గురుత్వం దొరికింది. లక్కీ .
శ్రీశ్రీ గురించి శిగమూగటం సరేసరి. క్వైట్ నేచురల్. ఇక విశ్వనాథ ఇంటి పక్కనే ఉంటూ, ఆయన్ను చూస్తూ కూడా – శ్రీశ్రీ తిట్టుకవిత ప్రభావంతో ఆయన సాహిత్యాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయటం, అదే మహాకవి పుణ్యమా అని ఠాగూర్ హృదయ సౌందర్యానికి అంధులు కావటం.. పోనీలెండి, ఆలస్యంగానైనా పశ్చాత్తాపం ప్రకటించటం మంచి విషయమేగా. ఈ పుస్తకంలో తారసపడే – పతంజలీ, గోరటి వెంకన్నా లాంటి మనకాలపు మెగాస్టార్లనెందరినో మోహన్‌గారి కళాకాంపౌండ్‌లోనే తొలిసారి చూడటం. ఒకప్పటి ప్రకాష్‌గారి కొలీగ్స్ కే. శ్రీనివాస్, వసంతలక్ష్మి, కట్టా శేఖర్‌రెడ్డీ, పసుపులేటి గీత, నామిని, శ్రీరామమూర్తి లాంటి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశమొచ్చింది. కొన్నాళ్లు విజయవిహారం పత్రికలో ఈయనతో కూడా. ఇక్కడొక చిన్న సొంతడబ్బా: నేను మోహన్ కార్టూన్ల పేజీకి ఓ శీర్షిక చెబితే – నువ్వు చెప్పినదానికంటే ఇది ఫ్రెష్‌గా ఉందిరా అంటూ ఓకే చేశారు ఆయన, తమ్ముడు తన వాడైనా. ఓసారి చిట్‌ఫండ్‌కంపెనీల గోల్‌మాల్‌పై స్పెషల్‌స్టోరీకి ” చిట్టీ చిలకమ్మా బోర్డు తిప్పావా? ‘ అంటే, అందరికీ నచ్చేసింది, ప్రజాభిప్రాయమే ఫైనల్ అని భుజం తట్టారు ప్రకాష్‌గారు.ఇది అనంతరం ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చాక రిపీట్ చేయబడింది. ఈ పుస్తకంలో హెడ్డింగ్‌ల గోల కూడా ఉంది కాబట్టి సరదాగా ఈ ప్రస్తావన. ఇక అద్వైతసిద్ధికి, అపురూప సృష్టికి పానమే సోపానమూ అని పాడుకునే కళాకాంపౌండ్‌లో ఎందరో సర్రియలిస్టులూ, వెర్రియలిస్టులూ.. ఈయనకి ఇష్టమైన మూడు ఎమ్మెస్‌ల్లో – ఒకడు నాయుడు.
ఇక వెళ్లిపోతా అనకుండా ” ఒక వెళ్లిపోతా ‘ అని సంకలనం వేసినప్పుడు , ఆదేశ్‌రవీ, కృష్ణా, నేనూ తెగ నవ్వుకునేవాళ్లం. ఈ కవితా వినిర్మాణాన్ని అర్థం చేసుకునేంత సరస్వతి మన కాడ నేదు కదా అని. ఈ మధ్య మునికాంతపల్లి కథల రచయిత సోలోమన్ విజయ్‌కుమార్‌ని పట్టుకుని ” ఏమి రాశావ్‌రా నా కొడకా…’ అన్నాడీయన. ఇతడి పెన్ కొంచెం లుంపెన్. ఆ కతలు చదివినప్పుడు నాది కూడా సేమ్ ఫీలింగ్. ప్రేమ కొద్దీ బూతు కదా. రిటైర్ అయినా సెటైర్ తగ్గని పాత్రికేయుడు. కథలు రాయని స్టోరీ టెల్లర్. లెఫ్టిస్టే అయినా, వాక్యాలను లెఫ్ట్‌కి జరపని కవి. వామా కృష్ణా అని ఖాళీగా కూర్చోకుండా – కదిలి వెళ్లిపోయిన కాలాన్ని మన కళ్లకు కడుతున్నాడు.
వ్యక్తులు, సినిమాలు, సాహిత్యం, సంఘటనలు..అక్కడక్కడా ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్- తనకు నచ్చినవీ, హృదయానికి దగ్గరగా వచ్చినవీ- అప్పటికి ఏది గాఢంగా అనిపిస్తే అది – ఫేస్‌బుక్కులో రాసుకుంటూ పోతే , ఇప్పటికి ఈ బుక్కు అయింది. ఇక్కడితో అయిపోలేదు. హైదరాబాద్ జ్ఞాపకాలు కూడా ఉంటాయిగా. వాటితో ” ఖైరతాబాద్ చౌరస్తా ‘ అని పార్ట్ టూ రాబోతోంది, బహుశా అది కూడా దుమ్ము బాగా రేపే క్రేజీఎఫ్-2 కావొచ్చు..కాసుకోండి మరి !(ఈ పుస్తకం కావాల్సిన వారు prakash-9704541559 కి కాల్ చేయండి)
- Saambasiva Rao M (TV9 )