ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త, శ్రీసిటీ వ్యవస్థాపకులు మరియు కార్యనిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డికి నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేయనుంది. విశ్వవిద్యాలయం యొక్క 6వ & 7వ స్నాతకోత్సవం ఈ నెల 24న నిర్వహించనుండగా, ఆ కార్యక్రమంలో ఆయన డాక్టరేట్ గౌరవాన్ని పొందనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు షెడ్యూల్ వివరాలతో రవీంద్ర సన్నారెడ్డికి ఆహ్వాన పత్రికను అందచేసి స్నాతకోత్సవంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానించారు.
ఆహ్వానపత్రిక కార్యక్రమ వివరాల మేరకు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీమతి ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి, ఇతర పలువురు విశిష్ట అతిధుల సమక్షంలో గౌరవ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రవీంద్ర సన్నారెడ్డికి అవార్డును ప్రదానం చేస్తారు.
ప్రధానంగా సాంకేతికత, పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన కృషి మరియు వెనుకబడిన ప్రాంతాలైన సత్యవేడు, వరదయ్యపాలెం, తడ మండలాలను ప్రపంచ స్థాయి మౌళికవసతులు, అపార ఉద్యోగ అవకాశాలను సృష్టించే సమీకృత వ్యాపార నగరంగా మార్చడంలో ఆయన దార్శినికత, విశేష కృషికి గుర్తింపుగా రవీంద్ర సన్నారెడ్డిని ఈ గౌరవానికి ఎంపిక చేశారు.