విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ డాక్టరేట్ అందుకున్న రవీంద్ర సన్నారెడ్డి
– రాష్ట్ర గవర్నర్ చే అవార్డు ప్రదానం
శ్రీసిటీ, మే 24, 2022:
ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త, శ్రీసిటీ పారిశ్రామిక నగరం వ్యవస్థాపకులు మరియు కార్యనిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డికి నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మంగళవారం జరిగిన 6వ & 7వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎం సుందరవల్లి సమక్షంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.
స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన రవీంద్ర సన్నారెడ్డి మరియు విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ లకు గవర్నర్ తన స్నాతకోత్సవ ప్రసంగంలో అభినందనలు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయంలో సంపాదించిన జ్ఞానం, ప్రతిభ, విలువలు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడంలో మీకు సహాయపడతాయని తాను విశ్వసిస్తున్నాను అన్నారు. నెల్సన్ మండేలాను ఉటంకిస్తూ, సమాజాన్ని మార్చడానికి విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం అని పేర్కొన్నారు. డిగ్రీలు పొందినవారు పేద, వెనుకబడిన వారితో సానుభూతితో ఉండాలని, వారి పట్ల శ్రద్ధ అవగాహనతో వ్యవహరించాలని కోరారు.
గౌరవ డాక్టరేట్ స్వీకరణ అనంతరం రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని, గవర్నర్ చేతుల మీదుగా ఈ సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీసిటీ కోసం తన కృషి, ప్రయత్నాలను గుర్తించి తనను ఈ గౌరవానికి ఎంపిక చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, సహకరించిన ఇతరలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో అమెరికాలో లాభదాయకమైన వ్యాపార వృత్తిని స్వచ్చందంగా వదులుకుని ఈ ప్రాంతంలోని ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే అవకాశం ఉన్న కొత్త ప్రాజెక్ట్‌పై పనిచేయడం ప్రారంభించానని అన్నారు. చుట్టుపక్కల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని గ్రాడ్యుయేషన్ విద్యార్థులను కోరారు.
కాగా, సాంకేతికత, పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన కృషి మరియు వెనుకబడిన ప్రాంతాలైన సత్యవేడు, వరదయ్యపాలెం, తడ మండలాలను ప్రపంచ స్థాయి మౌళికవసతులు, అపార ఉద్యోగ అవకాశాలను సృష్టించే సమీకృత వ్యాపార నగరంగా మార్చడంలో చూపిన దార్శినికత, విశేష కృషికి గుర్తింపుగా రవీంద్ర సన్నారెడ్డికి ఈ గౌరవం దక్కింది. రవీంద్ర సన్నారెడ్డి ప్రయాణం, సాధించిన విజయం ప్రతి విద్యార్థికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు, అలాగే ప్రతి వ్యక్తికి కూడా అద్భుతమైన స్ఫూర్తిదాయకమని విశ్వవిద్యాలయం తమ ప్రకటనలో పేర్కొంది.
కార్యక్రమంలో ప్రొఫెసర్ సుందరవల్లి విశ్వవిద్యాలయం విద్యావిషయక విజయాలపై నివేదికను సమర్పించగా, ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి ముఖ్యోపన్యాసం చేశారు.