నను గన్న నాతల్లి విశాలాంధ్ర | THE ETERNAL SONG OF ELURU ROAD

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నించి కృష్ణా జిల్లా, విజయవాడ, ఏలూరురోడ్డు మీదికి…

సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం…సుబ్బమ్మదేవి హైస్కూల్ల్లో పదోతరగతి ముగించి, పరీక్షలు రాసి, కొన్నాళ్లు ఏలూరు లోనే వున్నాక, 1971 జూన్ లో విజయవాడ ప్రయాణం.

ఏలూరు నుంచి కేవలం 40 కి.మీ. దూరం. అప్పుడు రైలు చార్జీ రెండు రూపాయలు!

పవర్ పేట స్టేషన్లో రైలెక్కితే, ఏ మాస్కోకో వెళుతున్నట్టు సుదీర్ఘంగా అనిపించిందా ప్రయాణం.

విజయవాడ చుట్టుగుంటలో మాది చిన్నఇల్లు.

నేను బాగా సన్నగా, నల్లగా, unimpressive గా ఏలూరు కలుగులోంచి బెజవాడ రోడ్ల మీదకొచ్చిన ఎలుకలా వుండేవాణ్ణి. చుట్టుగుంట చౌరస్తా పక్కన వున్న ఖాళీ స్థలంలో రోజంతా జీడిపిక్కలు కాలుస్తూ వుండేవాళ్ళు. కాల్చిన జీడీ వాసన తోడురాగా రెండు నిమిషాలు నడిస్తే విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసు. ఎప్పుడు తీరిక వుంటే అపుడు విశాలాంధ్రకి వెళ్లడమే నా పని. అలా అయిదు సంవత్సరాలు – ఇంటర్, డిగ్రీ అయిపోయేదాకా– రెగ్యులర్ గా విశాలాంధ్రకి వెళ్ళాను. ఎప్పుడూ నడిచివెళ్లడమే. విశాలాంధ్ర విలేకరులు సైకిళ్ళమీద తిరుగుతుండే వాళ్ళు. అప్పట్లో ఈ దిగువ మధ్యతరగతి ఉద్యోగులకి స్కూటర్ ఒక లగ్జరీ! చుట్టుగుంట సెంటర్ నించి లెఫ్ట్ కి తిరిగి విశాలాంద్ర వీధిలోకి వెళ్ళాలి. అది చాలా కీలకమైన రోడ్డు.

………………… ……… ………..

15 ఏళ్ల వయసున్న నేను, లలలా అని పాడుకుంటూ వెళుతుంటే, మడత నలగని ఇస్త్రీ పంచె, తెల్లని చొక్కాతో, మెరుస్తున్న బట్టతలతో తుమ్మల వెంకట్రామయ్యగారు నడుస్తూ వుండేవారు. “ఎగరాలి… ఎగరాలి మన ఎర్ర జెండా అదురు బెదురూ లేక అడ్డేదియును లేక… ధనికస్వామ్యమ్మింక దగ్ధమై పోవాలి…” అని రాసింది ఈ సామాన్యుడూ, నోరెత్తి ఎవర్నీ ఒక్క మాట అనని గొప్ప సంస్కారి, యీ పెద్దాయనేనా అనిపించేది.

…… …….. ………

మరోరోజు వేములపల్లి శ్రీకృష్ణ… తెల్లపంచె.. మోచేతులదాకా మడిచిన తెల్ల గ్లాస్కో చొక్కా, కళ్ళజోడు లోంచి ఒక brilliant intellectual lookతో …

వీరరక్తపుధార వారబోసిన సీమ

పలనాడు నీదెరా వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి

తాండ్రపాపయ కూడ నీవోడోయ్

చెయ్యైత్తిజైకొట్టు తెలుగోడా…

అని అంత force తో రాసింది ఈ బక్క పల్చని సున్నితమైన అందమైన శ్రీకృష్ణ గారేనా అని నాకు ఒకటే ఆశ్చర్యం!

…………. ……….. ………….

రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి వచ్చి జోషి గారితో మాట్లాడి వెళ్లేవారు. అప్పటికి ఆమె నవల ‘మరీచిక’ నిషేధించారో లేదో మరి.

కవయిత్రి మందరపుహైమవతి మోహన్ ని కలిసి మాట్లాడుతుండేది

‘మృత్యుంజయుడు’ నవలతో పేరుపొందిన బొల్లిముంత శివరామకృష్ణ ‘ప్రగతి’ వారపత్రిక కు ఎడిటర్ గా ఉండేవారు. జర్నలిస్టు గుఱ్ఱంకొండశ్రీకాంత్ ఆయనకి అసిస్టెంట్. మనుషులుమారాలి సినిమా మాటలరచయితగా బొల్లిముంత ప్రసిద్ధులు.

విశాఖ నుంచి వచ్చే చందుసుబ్బారావు, లేత మేకమాంసంలాంటి కవులు ఖాదర్, గులాం గౌస్ ల రూంలో దిగేవాడు. చందుఅంటే nonstop కబుర్లు, కవిత్వం, మిమిక్రీ. శ్రీకృష్ణార్జున యుధ్ధం సంక్షిప్తశబ్ధచిత్రం అరగంటలో వేసి చందు తెగనవ్వించేవాడు.

మాస్కోలో బ్రెజ్నేవ్ తో చర్చించి, ఢిల్లీ లో ఇందిరాగాంధీ తో మాట్లాడి, నేరుగా విశాలాంధ్రకి వచ్చేవాడు చండ్ర రాజేశ్వరరావు. మోహన్ పలకరిస్తే, నాన్న ఎలా ఉన్నాడు అని అడిగే వారాయన.

కమాండర్ ఇన్ ఛీఫ్ రావినారాయణ రెడ్డి దగ్గర నించి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి దాకా, ఆరుద్ర నించి కొల్లాయి గట్టితేనేమి మహీధర రామ్మోహనరావు దాకా… అందరూ విశాలాంధ్ర కు వచ్చేవాళ్ళే.

ఇంకోరోజు, టక్ చేసుకుని, హుషారుగా వుండే రాంభట్ల కృష్ణమూర్తి, పిచ్చి సిగరెట్ కాలుస్తూ… అదే అదే పతాక జైత్రయాత్ర సాగుతోందిరా… పదే పదే రణానికై నగార మోగుతోందిరా! మార్చింగ్ సాంగ్ రాసినవాడు. పంచచామరం అంటే రాంభట్లకి పంచప్రాణాలని నాకు తర్వాత రోజుల్లో తెలిసింది.

ఒక లెదర్ బ్యాగ్ పట్టుకుని గంభీరంగా, ఓ పెద్ద మనషి నడిచి వస్తుండేవాడు. నిండైన విగ్రహం. హృదయంతో నవ్వి పలకరించే నాయకుడు… నీలం రాజశేఖర్ రెడ్డి. పొలిటికల్ క్లాస్ చెబుతుంటే చూడాలి… The British is – maritime imperialism.. అని మొదలుపెట్టి మెస్మరైజ్ చేసేవాడు.

సంపాదకుడు రాఘవాచారి సరే సరి… తెల్లచొక్కా తెల్లఫ్యాంట్ ట్రేడ్ మార్క్. బట్టతల, ఎడం చేతి వేళ్ళ మధ్య కాలుతున్న సిగరెట్, అందమైన మనిషి ఇంటిపేరు చక్రవర్తుల అనీ, ఆయన తెలంగాణా జనగామ వాడనీ నాకు అప్పటికి తెలీదు. బురదలోన కెందామర పుట్టినట్టు ఈ కుళ్లిన సంఘం గర్భం చీల్చుకు సమధర్మం ప్రభవించును… అని ఆశ పెట్టిన గజ్జెల మల్లారెడ్డి హుందాగా నడుస్తూ, ఏం కామ్రేడ్ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు.

అప్పట్లో విశాలాంధ్రకి వచ్చివెళ్లే యంగ్ అండ్ బ్యూటిఫుల్ నాయకుల్లో బాగా ఆకర్షించినవాడు సురవరం సుధాకర్ రెడ్డి, వెరీ కర్టీయస్, ఛార్మింగ్, అయస్కాంతం చిరునవ్వు… కమ్యూనిస్ట్ నాయకుడిలా కాకుండా ఓ పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ సి‌ఈ‌ఓలా గ్లామరస్ గా ఉండే వాడాయన. సుధాకర రెడ్డి గారు మోహన్ కి మంచి ఫ్రెండ్. ఆయన కబుర్లు, కంపెనీ లైవ్లీ గా ఉండేవి.

రామచంద్రపురం నుంచి కవి అదృష్ట దీపక్ వచ్చేవాడు. గలగలా గంగమ్మ కదిలి పోతుంటే…. మిలమిలా నీ మేను మెరిసిపోతుంటే… రెప్పావాల్చక నేను నిన్నే సూత్తంటే… యేరే సొర్గం ఇంకా ఎక్కడున్నాదే…. ఎక్కాడున్నాదే… అంటూ కవ్వించే జనపదాలు పాడేవాడు.

నర్సాపురం నుంచి రచయిత ఎం‌జి రామారావు, దర్శకుడు ధవళసత్యం వచ్చేవాళ్లు… ఓ ఓ ఓ… లగిజిగి లగిజిగి లంబాడీ తకిట తకిట తక తాళం వేస్తు తిరగబడర అన్నా, ఓ.. ఓ… తిరగబడర అన్న అంటూ దుమ్మురేపుతూ పాడి వూగించేవాడు ధవళ.

ఇలా ఆ రోడ్డు మీద ‘విశాలాంధ్ర’ కి వెళ్ళే కవులురచయితలు, నాయకులు, గాయకులు, ప్రజా నాట్యమండలి ఆర్టిస్ట్ లు, మహిళా ఉద్యమకారులు… ఇలా ఎంతమంది… ఎంత కోలాహలం!

ఒక ఊపు, ఒక ఉత్తేజం, ఒక విశ్వాసం, ఆశల జెండాల రెపరెపల ఉద్వేగంతో నడిచే వందల వేల ఉద్విగ్న హృదయాల ఊరేగింపు. అది కేవలం ఒక దిన పత్రిక కార్యాలయం కాదు. కమ్యూనిస్టు పార్టీ headquarters. కొత్త ఆలోచనలను యిచ్చి ఉద్యమాలని నిర్మించే కర్మాగారం. పోరాటాలను తయారు చేసే ఫ్యాక్టరీ.

జనం కోసం నిర్విరామంగా మోగే ఒక నగారా.

పార్టీ, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక సంఘాల్ని, ప్రజానాట్యమండలి కళాకారుల్ని, వేలమందిని ఊగించే గాయకుల్ని తన చుట్టూ తిప్పుకునే కేంద్రబిందువు!

అప్పట్లో ‘విశాలాంద్ర’ అంటే ఒక విద్యుదావేశం!

తాడి అప్పల స్వామి అబ్బాయి గా, ఆర్టిస్ట్ మోహన్ తమ్ముడుగా, ‘విశాలాంధ్ర’ లోపల స్వేచ్చగా తిరగడానికి నాకు లైసెన్స్ వుండేది. విశాలాంధ్ర గేట్ మాన్ నించి, ప్రొడక్షన్ ఇంచార్జి, ఎడిటర్, జనరల్ మేనేజర్ అందరికీ నేను తెలుసు. కేవలం కమ్యూనిస్టు ప్రాపగాండా కరపత్రం అయిన విశాలాంధ్రకి మరో ప్రత్యేకత వుండేది.

అది పరీక్షా ఫలితాలు, ముఖ్యంగా tenth results,

అప్పట్లో, ఆంధ్రజ్యోతి, పత్రిక, ప్రభ, విశాలాంధ్ర ఈవినింగ్ ఎడిషన్లు వచ్చేవి. అంటే సాయంకాలమ్ అయిదింటి లోపులోనే విజయవాడలోని ముఖ్యమైన అన్ని సెంటర్లో ఆ రోజు వార్తలతో దినపత్రికలు వేడి వేడి పకోడీల్లా అమ్ముడుపోయేవి! బిసెంటు రోడ్డు, లక్ష్మి టాకీస్ సెంటర్, అలంకార్, న్యూ ఇండియా హోటల్ సెంటర్లో వందల మంది టీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, ఆత్రంగా దినపత్రికలు చదువుతూండే వాళ్ళు.

టెన్త్ క్లాస్ రిజల్ట్స్… ఒక మేజర్ ఈవెంట్.

విశాలాంధ్ర గేట్ల ముందు కొన్ని వందలమంది విద్యార్థులు… ఎవరూ లోపలికి వెళ్లడానికి వీల్లేదు.ఠంచనుగా ఉదయం 11 గంటలకి ఆ కుర్రాళ్లనందరిని పక్కకి వుండమని చెబుతూ, దర్జాగా లోపలికి వెళ్ళేవాణ్ణి. వాళ్ళు యిచ్చిన కొన్ని డజన్ల చీటీలు నా చేతిలో ఉండేవి. ఎడిటోరియల్ సెక్షన్లో పార్ధసారధి, బాబురావు, నళినిరంజన్, యోగయ్య, జనార్ధనరెడ్డి… ఎవర్ని అడిగినా ఫలితాల రఫ్ కాపీ ఒకటి నా మొహాన పడేసేవారు. జాగ్రత్తగా results చూసి, ఒక కాగితం మీద నోట్ చేసి, మెట్లుదిగి కిందికి వచ్చేవాణ్ణి. దూరం నుంచి, “అరేయ్, వచ్చాడ్రా” అనుకుంటూ కుర్రాళ్ళు excite అయ్యేవాళ్లు. అపుడు నేనో చిన్న జానపద హీరోని. గేట్ దగ్గరకొచ్చి, ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ల నెంబర్లు పైకి చదివి చెప్పేవాణ్ణి. “మా నెంబర్లు, మా నెంబర్లేవి” అంటూ చాలా గొంతులు అడిగేవి! ఫేయిల్ అయిన వాళ్ళ నంబర్లు చెప్పేవాణ్ణి కాదు.ఆ నంబర్లు ఇంకా చూడలేదని, అరగంటాగి చెబుతానని అనేవాణ్ణి. టెన్త్ క్లాస్ అంటే మరీ కుర్ర సన్నాసులు కదా! ఫెయిల్ అయ్యారని చెబితే ఆత్మహత్య చేసుకుంటారేమోనని ఆ జాగ్రత్త!

అలా విశాలాంధ్ర ఈవినింగ్ ఎడిషన్ బైటికి వచ్చే దాకా, అటు యిటూ తిరుగుతూ రిజల్ట్స్ చెబుతూనే వుండేవాణ్ణి. తర్వాత… ఇంటర్ రిజల్ట్స్…వాళ్లూ అదే హడావిడి.

ఆనక, కొన్నేళ్ళకి, ఏలూరు రోడ్డు మీద నడిచి వెళుతుంటే, ఓ అపరిచితుడు పలకరించేవాడు.1973లో నేను టెన్త్ ఫస్ట్ క్లాస్ల్ లో పాసయ్యానని మీరే చెప్పారు సార్” అనేవాడు కృతజ్ఞతతో.

“నేనెప్పుడూ అంతే” అన్నట్టు భుజాలు ఎగరేసి నవ్వేసేవాణ్ణి. చెయ్యి గట్టిగా నొక్కి వెళ్లిపోయేవాడు. అయిదు సంవత్సరాల పాటు సొంత బాధ్యతలాగా ఆ పని చేశాను.

‘విశాలాంధ్ర’లో ముందు ఎడిటోరియల్ సెక్షన్… ఏటుకూరి బలరామమూర్తి, నిడమర్తి ఉమరాజ్, నరేంద్రదేవ్, పరకాల పట్టాభి తదితర పెద్దలంతా కూర్చొని వుండే లోపలి గదీ, ఒకపక్క విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సూపర్ బాస్ పి.సి.జోషి గారు… అదొక అధ్యయన కేంద్రంలాగా వుండేది.

బ్రహ్మం అని ఒక అటెండర్ వుండేవాడు. పెద్దాయన. ఖాకీ నిక్కరు, చొక్కా, కళ్ళజోడుతో వొద్దికగా వుండే ఆయన్ని అందరూ బ్రహ్మంగారు అని పిలిచేవాళ్లు. ఆఫీసు బోయ్ లా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఫిలాసఫీ మాస్టారు ఏటుకూరి బలరామమూర్తి పేపరో పుస్తకమో చదవడంలో నిమగ్నం అయి వుండేవారు. బ్రహ్మం టీ గ్లాసు పెట్టిన చప్పుడు అవగానే, జేబులోంచి ఒక పావలా తీసి టేబుల్ మీద పెట్టేవాడు. ఓ రోజు ఇంట్లో బలరామమూర్తి గారి భార్య టీ ఇవ్వగానే, ఆయన జేబులోంచి పావలా తీసి ముందున్న కుర్చీ మీద పెట్టారు.

“హయ్యో! ఎంత అదృష్టం చేసుకున్నానో…” అని నాలుగు నిఖార్సైన బ్రాహ్మణ తిట్లు తిట్టిందట ఆమె. బలరామమూర్తి గారి గురించి యిలాంటి జోకులు చాలా చెప్పుకునే వాళ్ళం.

‘విశాలాంద్ర’ స్టార్ ప్రూఫ్ రీడర్ కె.రాజేశ్వర రావు. కవి, బాగా చదువుకున్నవాడు. మంచి అందగాడు. దురుసు మనిషి. రెచ్చిపోతూ ఉండేవాడు, ఒక “రైటియస్ ఇండిగ్నేషన్’ తో. నాకు కవిత్వమూ మాత్రలు, నడక, ఛందస్సు… రోజూ చెప్పేవాడు. మోహన్, రాజేశ్వర రావు టీ, సిగరెట్ మిత్రులు, రారా, చేరా లాగా అతను ‘కెరా’ అని రాసుకునేవాడు. ఒక సాయంకాలం నేను విశాలాంధ్రకి వెళ్ళేసరికి, రష్యన్ కవి రసూల్ గమ్జ్ తోవ్ ప్రేమ కవితలు చదువుతున్నాడు. నాకు కొన్ని వినిపించాడు ఇంగ్లిష్ లో. చాలా బావున్నాయి.

“అరేయ్ నేను వీటిని ట్రాన్స్ లేట్ చేస్తాను. గమ్జతోవ్ లమ్జా కొడుకు భలే రాశాడు” అన్నాడు రాజేశ్వర రావు. నవ్వుకుంటూ చాయ్ తాగాం.

పార్టీ అగ్ర నాయకుడు శ్రీపాద అమృత డాంగేకి 75 ఏళ్ళు వచ్చిన సందర్భంగా, నాటి సోవియెట్ ప్రభుత్వం ఆయనకి ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ అవార్డ్ ప్రకటించింది. దానిమీద కవిత్వం చెప్పు అన్నాడు కె.రా. నా వల్ల కాదన్నాను. చాలా ఈజీ… “ఆర్డరాఫ్ లెనిన్ అవార్డు పొందావని తెలిసి నేను ఆశ్చర్యంపొందలేదు, విభ్రమమూ చెందలేదు…” అంటూ రాజేశ్వర రావే ఎనిమిది లైనులు రెండు నిమిషాల్లో రాసేశాడు. మర్నాడు విశాలాంధ్ర ఆదివారం సంచికలో ఆ పొట్టి కవిత నా పేరుతో అచ్చయింది. రాజేశ్వరరావు అలా చేశాడని నాకు తెలీదు. మా యింట్లో, ఉదయం టంచనుగా పేపర్లన్ని చదివే మా నాన్న, కాఫి అందుకుంటూ మన చిన్నాడు కవిత్వం రాశాడు ‘విశాలాంధ్ర’ లో అని అమ్మతో చెప్పాడు. చటుక్కున నా చెయ్యి మణికట్టుని Firm గా పట్టుకొని మా అమ్మ గబగబా వంటింట్లోకి లాక్కెళ్లింది. ‘కూర్చోరా’ అంది. “వాడా బొమ్మలేసి చెడిపోయాడు, నువ్విలాంటి పిచ్చిరాతలురాసి పాడైపోకురా” అని ఎంతో concern తో చెప్పింది.

“రాయనే రాయనమ్మా” అన్నాను. “అలాక్కాదు, నా చేతిలో చెయ్యివెయ్యి. వొట్టు వెయ్యి” అంది. అలాగే చేశాను. “మంచివాడివిరా నువ్వు’ అని అద్దిరిపోయే ఫిల్టర్ కాఫి ఇచ్చింది.బొమ్మలు గీసుకునే నాయాళ్ళూ, కవిత్వాలు రాసుకునే సోదిగాళ్ళు ఎందుకూ కొరగారని సభ్యసమాజం ఆనాడే కనిపెట్టిందని యిందు మూలముగా తెలియజేయడమైనది.

‘ఉదయం’ దినపత్రిక వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మోహన్ పేరు రాష్ట్రమంతా మోగిపోయింది. ప్రతి రోజూ పొలిటికల్ కార్టూన్, శివాజితో కలిసివేసిన దిబ్బరాజ్యం స్క్రిప్ట్ కార్టూన్, ఆదివారం ఇంటర్వ్యూ లు, పతంజలి వేట కథల బొమ్మలు, ఇంకా పోర్ట్ రెయిట్లు, కేరికేచర్లు జనానికి తెగనచ్చాయి. “అమ్మా, నీ పెద్దకొడుకు సూపర్ స్టార్ కార్టూనిస్ట్, ఆంధ్రదేశం గర్వించదగిన ఆర్టిస్టు అయ్యాడమ్మా” అని చెప్పాలని 1986లో ఎంత ఆరాటపడ్డానో.

35ఏళ్ల వయసుకే ఎనిమిదిమంది పిల్లల్నికని, కనీసం 35 సంవత్సరాలు నాన్ స్టాప్ వంటలు, ఇంటెడు చాకిరీ చేసి చేసీ, పిల్లలు, ఫీజులూ, అద్దెలూ అంటూ ఆరాటపడి అలిసిపోయిన అమ్మ 1980లోనే విజయవాడలో గుండెపోటుతో చనిపోయింది. అప్పటికి మా అమ్మ సూర్యావతి వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే.మండుతున్న చితిముందు, కన్నీళ్లతో నించొని వున్నప్పుడు, ఇంతమందిమి వుండి, ‘నువ్వు ఇష్టపడే ఒక మంచి బంగారం గొలుసు కొని యివ్వలేకపోయాం’ అన్న వేదన కలిచి వేసింది. అది నన్నిప్పటికి వెన్నాడుతూనే వుంటుంది.

ఏలూరు రోడ్డులో విశాలాంద్ర బుక్ హౌస్ పెద్దది వుండేది. ఆ భవనంపైన చెక్కమెట్లు ఎక్కి వెళితే ఒక చిన్నగది. అక్కడ అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలు జరిగేవి. ఓ సారి గుంటూరు శేషేంద్ర శర్మా, ఇందిరా దేవి ధనరాజ్ గిరి వచ్చారు. ఆ రోజు ఆమె స్టార్ అట్రాక్షన్. పెదవులూ, బుగ్గలూ, నుదురూ, చెవుల దగ్గర రకరకాల రంగుల స్ప్రెలు, గలగలలాడుతుందని పించే నీలం పూల షీఫాన్ చీర. స్లీవ్ లెస్ బ్లౌస్. రాజస్తాన్ రాజుల అంత:పురాలనించి దిగివచ్చినట్టే వుంది. అవాక్కయిన కవులూ, రచయితలూ అంతా ఆవిణ్ణే చూస్తున్నారు. ఆ ఇరుకుగదిలో గాలి సరిగా లేకపోవడం వల్ల ఆమె వ్యానిటి బాగ్ లోంచి, రకరకాల కర్చీఫ్ లు తీస్తూ, ఓ సారి బుగ్గలూ, మరోసారి నుదురు, ఇంకోసారి పెదవులూ అద్దుకుంటోంది. ఆ దృశ్యాన్ని క్లోజప్ లో చూస్తున్న ఒన్ బై టూ చాయి, ఛార్మినార్ సిగరెట్ గాళ్ళంతా జన్మ ధన్యమైందని మురిసిపోతున్నారు. ఈ దేవత కొద్దిసేపట్లో వెళ్లిపోతుంది కదాని దిగులుపడిపోతున్నారు.శేషేంద్ర శర్మా యేమీ తక్కువ తినలేదు. వొంపుతిరిగిన అందమైన ముక్కు, సమ్మోహన పరిచే చిరునవ్వు, బంగారు మేనిచాయతో కాంతులీనుతున్నాడు. కవి అంటే యిలా వుండాలి అన్నట్టుగా వున్నాడు. వీళ్ళంతా ఇందిరాదేవిని చూసి విలవిల తన్నుకుంటున్నారని తెలిసిన జ్ఞానిలా వెలిగిపోతున్నాడు.

కొంత కవిత్వం, కబుర్లు… సభ ముగిసింది. అందరం కిందికి దిగివచ్చాం. బుక్ హౌస్ ముందు ఏలూరు రోడ్డు మీద నుంచున్నాం. శేషంద్ర, ఆమె అందరికీ నమస్కారం పెట్టి, వీడ్కోలు చెప్పారు. మేం ఇంటివైపు బయల్దేరామ్. ముందు మోహన్, జర్నలిస్ట్ రచయిత సోదుం రామ్మోహన్ నడుస్తున్నారు.

tadi prakash
prakash

“మోహన్, ఇందిరా దేవి యింట్లో అంట్లు తోమే పని ఏమైనా వుంటే, కుదురుకుందామని ఉందినాకు” అన్నారు సోదుం. “నాకు అలానే అనిపిస్తోంది” అన్నాడు మోహన్.*వెనక నాతో నడుస్తున్న కె. రాజేశ్వర రావు

“ఈ ఇందిరా దేవి ధన్ రాజ్ గిరి ముందు ముఖ్దూం కవిత్వాన్ని, తర్వాత ముఖ్దూం మొహియుద్దీన్నీ ప్రేమించింది. ఎప్పుడూ ఉద్యమాలు, అరెస్టులూ, అండర్ గ్రౌండ్ అంటూ క్షణం తీరికలేని ముఖ్దూంని చూసి జడుసుకున్నట్టుంది. ఆనక అందగాడైన శేషేంద్ర శర్మకి వల విసిరింది” అని చెప్పాడు.

“ఈ అందాల రాజహంసకి శేషేంద్రే వల విసిరి వుండొచ్చుగా” అన్నాను.”ఏమైనా, నష్టపోయింది అసలైన ప్రేమికుడు మన ముఖ్దూం కదా” అని ఓ పంచ్ విసిరాడు కె. రాజేశ్వర రావు.

ఇందిర దూరం అయిపోయిందన్న వేదనతో ముఖ్దూం రాసిన పోయమ్ వినిపించాడు.”ఆత్మను తాకట్టుపెట్టి, ప్రాణాలను పణంవొడ్డి పద బాధల రాకాశశి ఉదయించే వేళయింది. చేసేదేముంది శశిని చషకంగా చేసి కళ్ళు మూసి తాగు వేదనలను…” అనే కవిత అంతా వినిపించాడు కెరా.

ఇందిరా దేవిని, ‘ఆ వన్నెల విసనకర్ర’ అన్నారు ముఖ్దూం ఆ పోయంలో.నాంపల్లి జ్ఞాన్ బాగ్ పేలెస్ లో శేషేంద్ర, ఇందిర ల ఆతిథ్యం స్వీకరిస్తూ… మహా కవి శ్రీ శ్రీఇందిర… ఇందిరా… ఎంచక్కని విందురా ఇంకెక్కడ కందురా… నీది మంచి పద్యమా… లేకఫ్రెంచి మద్యమా… అని అన్నారు.

Taadi Prakash 970 454 1559

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles