చీకటి తన రెక్కల మధ్య పొదువుకున్న ఆ ఆడవి మీద ప్రకృతి ఆకుపచ్చని దుప్పటి కప్పినట్టుంది ఆ ప్రాంతం.
రెండు వాగులు దాటాక ‘బుస్సురాయి’ ఆవాసం . అక్కడ 40 గిరిజన కుటుంబాలు, ఎప్పుడు పడిపోతాయో అన్నట్టుగా నాచు పేరుకున్న ఎర్రపెంకుల ఇళ్లులో బతుకుతున్నారు. చీకటి ముసిరిన మట్టి గోడల ఇంటిలో కుక్కిమంచం మీద పడుకున్న మృత్యుముఖంలో ఉన్న రోగి గాలికి కొడిగట్టడానికి సిద్ధంగాఉన్న ఇప్ప చమురు దీపాన్ని చూస్తున్నాడు. అతని కళ్లల్లో ఆశ, నిరాశతో నిర్వేదమైన చూపులు!
అపుడక్కడ ఎవరూ ఊహించనిది జరిగింది.
కాలిబాటలో ఇద్దరు హెల్త్ వాలంటీర్లు అక్కడకు చేరుకున్నారు….
చేతిలోని హెల్త్ కిట్‌ని తెరిచి, తీవ్రజ్వరంతో ఉన్న ఆ రోగికి బ్లడ్ టెస్ట్ చేశారు. మలేరియా ప్రమాదకరమైన స్టేజ్‌లో ఉందని తేలడంతో, తక్షణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించి అతడి ప్రాణాలు కాపాడారు. అదేవిధంగా మరో నలుగురు రోగులను గుర్తించి, సకాలంలో వైద్యం అందించారు.
కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ స్వప్న, గంగ చొరవతో ఈ మారుమూల ప్రాంతంలో కొందరి ప్రాణాలు నిలబడ్డాయి.