శిరీష ఆస్ట్రో టూరిస్టా? తెలుసుకోవాల్సిన నిజాలు!

( అరణ్య కృష్ణ )

డెబ్బై ఏళ్ల రిచర్డ్ బ్రాన్సన్ ఒక బ్రిటీష్ వ్యాపారవేత్త. తన “వర్జిన్” గ్రూప్ ద్వారా సుమారు ఓ 400 రకాల వ్యాపారాలు సాగించే ఓ మల్టీ మిలియనీర్! ప్రముఖ మొబైల్ బ్రాన్డ్ ‘వర్జిన్’ ఈ గ్రూపులోదే. ఇప్పుడు అంతరిక్ష వ్యాపారంలోకి దిగాడు. అవును ఇవాళ అమెరికాలోని ఓ స్పేస్ కేంద్రం నుండి “వర్జిన్ గెలాక్టిక్” అనే తన సంస్థ ద్వారా “స్పేస్ టూరిజం” అనే ఒక కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. మొత్తం ఆరుగురున్న అతని టీంలో తెలుగు మూలాలున్న, అమెరికాలో ఎం.బి.ఏ. చదివిన బండ్ల శిరీష అనే 34 సంవత్సరాల యువతి కూడా వున్నది. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పేస్ టూరిస్ట్ యాత్ర ఒక హాట్ టాపిక్ గా మారింది శిరీష వల్లనే.

అమెరికా నాసా,భారత్ షార్, చీనీస్ సి.ఎన్,ఎస్.ఏ., రష్యన్ రొస్కొస్మస్…ఇవన్నీ అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేసే ఆయా దేశాల అధికార అంతరిక్ష సంస్థలు. ఈ సంస్థలు నిరంతరం భూమికి, అంతరిక్షానికి వున్న సంబంధం గురించి తెలుసుకోడానికి, అంతరిక్ష రహస్యాలు అన్వేషించడానికి ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. అందులో పరిశోధకులుగా పనిచేసే వారు కేవలం ఉద్యోగులు కారు. వారి పరిశోధనల్లో, ఆలోచనల్లో, అన్వేషణల్లో, సృజనాత్మకతలో వ్యాపార దృక్పథం వుండదు. మానవాళి ప్రయోజనాలే వుంటాయి. ఆ సైంటిస్టులు, అంతరిక్ష శాస్త్రం (ఆస్ట్రానమీ), ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మేథ్స్ వంటి సబ్జెక్టులలో నిష్ణాతులు. వాళ్ల ఆశయం, లక్ష్యం వ్యాపారం కాదు. వీరితో స్పేస్ టూరిజంలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేవారిని పోల్చడం ఘోరమైన అజ్ఞానం.

బండ్ల శిరీషగానీ, ఆ సంస్థ అధిపతి బ్రాన్సన్ గానీ స్పేస్ సైంటిస్టులు కారు. వారు స్పేస్ టూరిస్టులు మాత్రమే. బండ్ల శిరీషని సునీత విలియంస్, కల్పనా చావ్లాతో పోల్చడం మన అజ్ఞానానికి పరాకాష్ట. సునీత, కల్పన వంటి వారు నెలలు, సంవత్సరాల పాటు స్పేస్ లో వుండిపోయారు. అక్కడే జీవిస్తూ ఎన్నో పరిశోధనలు చేసారు. అది వారికి వాణిజ్యం కాదు. అందుకోసం వారు తమ జీవితాల్ని పణంగా పెట్టారు. కల్పన చావ్లా అంతరిక్షంలోనే ప్రమాదవశాత్తు మరణించారు కూడా. ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ వెహికల్ ధ్వంసమైపోయింది. ఆమె దేహం ముక్కలుముక్కలై అక్కడే తిరుగుతుంటుందని చదివాను.

ఇద్దరు పైలట్స్ మినహా వర్జిన్ గెలాక్టిక్ ద్వారా ఇప్పుడు స్పేస్లోకి వెళుతున్న వాళ్లు కేవలం పర్యాటక వ్యోమగాములు మాత్రమే. వీరికి కొంత ట్రెయినింగ్ మినహా అంతరిక్ష విద్య, జ్ఞానం, యాప్టిట్యూడ్ అవసరం లేదు. ఆకాశంలో 90 కిలోమీటర్ల ఎత్తు వెళ్లి ఒక 90 నిమిషాలు అలా కాలక్షేపం చేసి వస్తారంతే. చార్లెస్ బ్రాన్సన్ అయితే తాను ఒక వినియోగదారుడిగా మాత్రమే స్పేస్లోకి వెళుతున్నానని, ఒక వినియోగదారుడిగా తన అనుభవాన్ని మదింపు చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు బ్రాన్సన్ బృందం అంతరిక్ష పర్యాటకం చేస్తుంటే ఈ నెలాఖరుకి బెజోస్ బృందం మరో కంపెనీ తరపున స్పేస్లోకి వెళుతున్నది. రెండున్నర లక్షల డాలర్ల చార్జీలు పెట్టుకోగలిగితే రేపు ఏ ఆదానీనో, అంబానీనో లేదా వారి పుత్ర, పుత్రికా రత్నాలు అంతరిక్ష పర్యాటకులుగా వెళ్లొచ్చు. అయితే మనకేంటట? ఇప్పటికి 38మంది అంతరిక్ష ప్రయాణానికి వర్జిన్ గెలాక్టిక్ కి దరఖాస్తు పెట్టుకున్నారు. మీరు కూడా దరఖాస్తు చేసుకుంటే 39వ వారు అవుతారు. అంతకు మించిన విశేషం ఏమీ లేదు. మన మధ్య తరగతి వాళ్లు అమెరికా వెళ్లి గొప్పగా ఫీలైనట్లు వీళ్లు అంతరిక్షం వెళ్లి గొప్పగా ఫీలవుతారు.

ఇప్పుడు శిరీష తన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ హోదాలో స్పేస్లోకి వెళ్లటం వలన నేనేమీ గర్వంగా ఫీలవడం లేదు. ఆమె తన కంపెనీ వాణిజ్య అవసరాల నిమిత్తం ఈ యాత్రలో భాగం అయింది. అది ఆమె కెరీర్ విజయం. మన దేశానికి, లేదా తెలుగు రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఆమె ఎటువంటి ఆవిష్కరణలు చేయబోవటం లేదు. ఈ మాత్రం దానికి మనం గర్విత పులకితులం కానవసరం లేదు. చిత్రం ఏమిటంటే ఆమె మా ప్రాంతానికి చెందినదని, మా ఇంటి పేరుతో వున్నది కాబట్టి మా కుటుంబమని, తమ కులం ఆడపడుచని డబ్బాలు కొట్టుకోవడం హాస్యాస్పదం. ఆమెని మనందరం ఏమీ చందాలేసుకొని అమెరికా పంపి ఎంబీఏ చదివించలేదు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ఉద్యోగంలో పెట్టలేదు. ఆమె కెరీర్ విజయం ఆమె స్వంత కుటుంబానికి, ఆమె బంధు మిత్రులకి మాత్రమే సంబరాలు చేసుకునే సందర్భం అని అనుకుంటున్నా.

పీఎస్: భూమ్మీద అన్ని పర్యాటక ప్రాంతాల్ని ధ్వంసం చేస్తున్నారు మనుషులు. హిమాలయాలకి కూడా హాని కలిగిస్తున్నారు. పచ్చటి పర్వత సానువులకి, అడవులకి, సముద్రాలకి, జీవ వైవిధ్యానికి కూడా హాని కలిగించని విధంగా ఇంకా భూ పర్యాటకం అభివృద్ధి చెందలేదు. ఆ మధ్య నాసా ఎక్కడికక్కడ ప్రయోగ సామాగ్రిని వదిలేయడం ద్వారా అంతరిక్ష వ్యర్ధాలు కొండలా పెరుగుతున్నాయని ప్రకటించింది. మరిప్పుడు అక్కడికి టూరిస్టులు కూడా దూరుతుంటే? మనిషి ఏదీ చూసి ఊరుకోడు. అందుకే ఈ అంతరిక్ష టూరిజం నాకు సంతోషకరమైన విషయంగా అనిపించడం లేదు.

మీ సంబరాల నుండి నన్ను నేను మినహాయించుకుంటున్నాను. మన్నించండి.
అరణ్య కృష్ణ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles