‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’

తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది

It is a cart if it travels, else it is but timber

The scholar gypsy M.Adinarayana
——————————————————–

ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు.

ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది.

ఈ దేశ దిమ్మరికి ప్రయాణమే ప్రాణ వాయువు.

సంచారమే ఎంతో బాగున్నది….
దీనంత ఆనందమేడున్నది…
అని పాడుకుంటూ పోయే
గోరటి వెంకన్నలాంటి వాడు.

సజనురే ఝూట్ మత్ బోలో…
ఖుదా కె పాస్ జానా హై
న హాథీ హై, న ఘోడా హై,
వహా పైదల్ భీ జానా హై

‘తీస్రీ కసమ్’లో శైలేంద్ర రాసిన ముఖేష్ పాట గుర్తుందా? రాజ్ కపూర్ నీ, ముఖేష్ గొంతునీ ఇష్టపడతాం. ప్రేమిస్తాం. అంతే.
శైలేంద్ర చూపిన దారికి ‘పాదయాత్రాంజలి’
ఘటించిన వాడు మాత్రం ఆదినారాయణ.

*** *** ***

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు. అది చదవమని చాలా ఏళ్ల క్రితం తల్లావఝల శివాజీ నాకు చెప్పారు. ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు. ఆది…

రాహుల్ సాంకృత్యాయన్ కి నిజమైన వారసుడు, ఏనుగుల వీరాస్వామికి ముద్దొచ్చే మునిమనవడు.

*** *** ***

ఒకవేళ ఆంధ్రా యూనివర్శిటీకి సోమవారం పొద్దునే వెళ్లాల్సి వుంటే- ఈయన మధ్యాహ్నం వెళ్లేవాడు. ఇంత లేటుగా వచ్చారేంటి అని అడిగితే- ప్రకాశం జిల్లా నుంచి నడిచి రావడం కదాండీ… అనేవాడు. మధ్యలో కాస్త అక్కడ అక్కడ కూర్చుని రావడం వల్ల లేటయిందని చెప్పేవాడు. విశాఖలో యూనిర్శిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. అక్కడి నుంచి ఉదయాన్నే ఆది- నాటు పడవలో సముద్రం మీదుగా వచ్చేవాడు. పడవ దిగి మళ్లీ యూనివర్శిటీకి నడక.. అని మిత్రులు ఆశ్చర్యంతో చెబుతుంటారు.

*** *** ***
Land of thunder dragon అని పిలిచే భూటాన్ లో అడుగుపెట్టాడు. అక్కడి పిట్టల రాగాలు విన్నాడు. మంచు కొండల సౌందర్యంలో తప్పిపోయాడు. తిరిగి, నడిచి అలసి… వచ్చి హోటల్ రూంలో వాలిపోయి, ‘‘నిద్ర లోయల్లోకి దొర్లిపోయా’’ అంటాడు. భూటాన్ ప్రభుత్వమూ, ప్రజలూ ప్రకృతిని కాపాడుకుంటారు. టూరిస్టుల వల్ల ఆదాయం బాగా వస్తుందని తెలిసినా, ఏడాదికి 2000 మందిని మాత్రమే అనుమతిస్తారు. అదేమని అడిగితే, ‘‘మాకు జాతీయ తలసరి ఆదాయం కన్నా తలసరి ఆనందమే ముఖ్యం’’ అంటారు.

ఫేస్ బుక్, ఇంటర్నెట్ ద్వారా కొద్దిగా తెలిసిన వాళ్లనీ, అక్కడి ఆర్టిస్టుల్నీ పలకరిస్తాడు. వస్తున్నానని చెబుతాడు. వాళ్ల ఇళ్లల్లోనే వుంటాడు. ఆర్ట్ గేలరీలూ, మ్యూజియంలు చూస్తాడు. తన బొమ్మలు కొన్ని అమ్ముతాడు. తక్కువ డబ్బుల్తో అతి సాధారణమైన లైఫ్ స్టైల్ తో వాళ్లని ఆశ్చర్యపరుస్తాడు. ఏ దేశం వెళ్లినా ‘‘A great walker has come’’ అంటూ వాళ్లు ఆదిని ఆదరిస్తారు. వీడ్కోలు చెప్పేటప్పుడు జపాన్ వాళ్లు ‘‘సాయొనారా, ఆదినారా’’ అన్నారట.

SUBSCRIBE to Rural Media YouTube :https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

కలల పూలతోట ఇరాన్ లో కాలుపెట్టాడు. అలనాటి పర్షియా ఈ ముసాఫిర్ని మురిపించింది. ‘ఒక చేత్తో రెండు పుచ్చకాయల్ని తీసుకోలేం’ అనేది సూఫీ సూక్తి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు అనే మన మాట లాంటిదే!
‘‘ప్రసిద్ధ ఇరానీ గాయని మార్జాన్ ప్రేమ గీతాన్ని ప్లేయర్ మీద వినిపించాడో మిత్రుడు. ఎండిపోతున్న ఎడారి బావుల వేదనలా వుంది ఆమె స్వరం. విరహ వేదన అనుభవించే ‘తోడి రాగిణి’ అనే రాజస్థానీ పెయింటింగ్ నా కళ్ల ముందు కదిలింది’’ అని రాస్తాడు ఆది. వర్షం వస్తుందన్న భయం లేదు గనక పర్షియన్ నవాబులు మట్టి కోటలు కట్టారు. అవి ధృఢంగా వుండటం కోసం నీటితోపాటు ఒంటె పాలు కలిపారట ఆ మట్టిలో.

కెర్మాన్ నగరంలో యాత్రికుల్ని ఆకర్షించే అందమైన రాగి పాత్రల మీద సాయుధులైన ‘పెర్సిపాలిస్’ సిపాయిల బొమ్మలున్నాయి. నిర్మాణ కౌశలం వుట్టిపడే గొప్ప కట్టడం పెర్సిపోలిస్ (అద్భుతమైన ఇరాన్ యానిమేషన్ ఫిల్మ్ పెర్సిపోలిస్ నేను చూశాను). కవులకూ, గులాబీ పూలకూ స్వర్గథామం షిరాజ్ నగరం. అది 13వ శతాబ్ది నాటికే కళల కాణాచి. కవి సాదీ (1210-1290) సమాధి అక్కడొక ప్రత్యేక ఆకర్షణ. సాదీ రాసిన బోస్థాన్ (పళ్లతోట), గులిస్తాన్ (పూలతోట) ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి వుంటాయి. ‘‘ఎడారిలో బావి తవ్వగలిగే శక్తి లేకపోతే మసీదులో కొవ్వొత్తి వెలిగించు’’
‘‘నీ బానిసతో కూడా ప్రేమగా వుండు, అతడు రాజు కావొచ్చు ఒక రోజు’’ సాదీ సూక్తులివి. పచ్చని ఆకులు, పూలతోటల మధ్య సాదీ సమాధి వుంటుంది. గులిస్తాన్ పర్షియన్ సాహిత్యంలో ఒక మైలురాయి.

How to build a resort https://youtu.be/osDbl6v7uh0

మిడిల్ ఈస్ట్ లో కెల్లా అతి పెద్ద మసీదు- మహషద్ లో వుంది. అక్కడే ఉమర్ ఖయాం సమాధి వుంది. సమయం లేక ఆది అటు వెళ్లలేకపోయాడు. షిరాజ్ లోని షాచరాగ్ మసీదు మహోన్నతమైన కట్టడం. రెండు ఎత్తయిన మినార్లతో వున్న ఈ మసీదుని చూస్తే, రెండు చేతులూ ఆకాశం వైపు ఎత్తి ప్రార్థిస్తున్న భక్తుని రూపం గోచరిస్తుంది.

*** *** ***

ఇవి ఆదినారాయణరావు అనుభూతి గీతాలు

అతనొక విశ్వమానవ గీతం పాడుతున్నాడు.

రండి, విందాం! పదండి, గొంతుకలుపుదాం!

మైగూల్ శాంటి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీరుని పరిచయం చేసుకుని మెక్సికో వెళ్లాను. మెక్సికన్ ఆధునిక కళ పితామహుడు జోస్ పసోదా (1852-1913). ధనికుల జీవితాల్లోని మురికినీ, జీవచ్ఛవాల్లాంటి రాజుల్నీ, మూర్ఖులైన మిలిటరీ అధికారుల్నీ, అసమర్థ రాజకీయ నాయకుల్నీ, హేళన చేస్తూ, పుర్రెలు, అస్థిపంజరాల్నీ ప్రతీకలుగా వాడాడు. విప్లవ చిత్రాలు వేసినందుకు పసోదా చాలాసార్లు జైలుకు వెళ్లాడు. మెక్సికోలో హరిత విప్లవానికి మూల పురుషుడు మన మహారాష్ట్రకి చెందిన పాండురంగ సదాశివ ఖాన్ ఖోజ్ (1884-1967). ఆయన బోటనీ ప్రొఫెసర్. మెక్సికోలో 1920 నుంచి 1947 దాకా పని చేసి, ‘వ్యవసాయ విప్లవ వీరుడు’ అని పేరు పొందాడు. ఈ ఇద్దరి గురించీ తెలుసుకోవడం కోసం మెక్సికో వెళ్లాను. ఒక రోజు అక్కడ దుగ్గల్ సింగ్ అనే ఒక పంజాబీని కలిశాను. ‘‘మన భారతీయుడు ఎం.ఎన్.రాయ్ (1887-1954) ఈ దేశంలో కొంతకాలం వుండి, కమ్యూనిస్టు పార్టీ స్థాపించాడని విన్నాను. వివరాలేమన్నా తెలుసా అని అడిగాను. ‘‘1917 రష్యా విప్లవం తర్వాత లండన్ లో వుంటున్న ఎం.ఎన్.రాయ్ భార్యతో సహా ఇక్కడికి వచ్చి, మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీ స్థాపించాడు. అంతకన్నా వివరాలు నాకూ తెలీవన్నాడు దుగ్గల్. పాండు రంగ సదాశివ ఖాన్ ఖోజ్ ఫోటో ఒకటి మా క్లబ్ లో వుంది. లాలా హరదయాళ్ స్థాపించిన గదర్ పార్టీలో ఆయన సభ్యుడు. బెల్జియం స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వ్యవసాయంపై పరిశోధనలు, మొక్క జొన్నలు పండించడంలో కొత్త ప్రయోగాలు చేశాడు. ప్రఖ్యాత మెక్సికన్ పెయింటర్ డీగో రివేరా- ఖాన్ ఖోజ్ చిత్రాన్ని ఒక మ్యూరల్ పెయింటింగ్ లో భాగంగా వేశాడు’’… అని దుగ్గల్ వివరించాడు.

Making Magic Cup https://youtu.be/P52CQEoM-DM

ఆక్వాస్ కాలియంత్ నగరంలో National museum of death వుంది. ప్రతి ఏడాదీ అక్కడ Day of dead ఉత్సవాలు మూడు రోజులు జరుపుతారు. అక్కడే జోస్ పసోదా మ్యూజియం వుంది. ఆయన వేసిన పుర్రె, అస్థి పంజరాల బొమ్మలు బాగా పాపులర్. ఎటు చూసినా పుర్రెలు, ఎముకలు, కళేబరాలు, కంకాళాలు, దెయ్యాలూ, భూతాలూ, రాక్షసులు, రక్తం, మృత్యు దేవతల బొమ్మలు మనల్ని నవ్విస్తాయి. చావంటే భయం పోగొడతాయి. ఇళ్లని కూడా పుర్రెల బొమ్మలతో పుష్పగుచ్ఛాలతో అలంకరిస్తారు. చక్కెరతో, కేకులతో తయారు చేసిన పుర్రెల్ని బహుమతులుగా యిచ్చుకుంటారు. వాటి మీద పూర్వీకుల పేర్లూ రాస్తారు. మృతులు అందరూ సంతోషంగా వుంటేనే సమాజానికి మేలు కలుగుతుందని వాళ్ల భావన. మరణం మరో జీవితానికి పుట్టుక అనేది ఈ పండుగ వెనకున్న తాత్విక దృక్పథం. It is a passage to new life అని చెబుతారు.

మెక్సికన్ కొండ ప్రాంతాల్లో నివశించే రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఉద్యమం నడిపిన ఎమిలియావో జపాటా (1879-1919)ని 39 ఏళ్ల వయసున్నపుడే హతమార్చారు. Land and liberty అనే స్లోగన్ తో భూస్వాముల మీద తిరుగుబాటు చేసిన వీరుడు జపాటా. విశాలమైన టోపీ, కోర మీసం, చేతిలో తుపాకీతో గుర్రం మీద స్వారీ చేస్తున్న ఆ వీరుడి చిత్రాన్ని చూసినపుడు అల్లూరి సీతారామరాజు (1897-1924) గుర్తుకు వచ్చాడు నాకు’’ అని రాశారు ఆది. జపాటా లాంటి విప్లవ వీరుడి బొమ్మ వేసి, తానూ విప్లవకారుణ్ణని ప్రకటించుకున్నాడు ఆర్టిస్టు పసోదా.

రియోలో కరుణామయుడు:

బ్రెజిల్ లోని రియో డిజనీరో చేరుకున్నాను. 2,300 అడుగుల ఎత్తున్న కొండ గగనాన్ని చుంబిస్తోంది. దాని శిఖరాగ్రం మీద 120 అడుగుల ఎత్తున్న భారీ ఏసుక్రీస్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒక రైలు పెట్టెలో అక్కడికి చేరుకోవాలి. ఆ ఎత్తు నుంచి రియో పరిసరాలు, కొండలూ, సముద్రం… చూసి తీరాలి! 1927లో మొదలైన ఈ ప్రాజెక్టు 1931 నాటికి పూర్తయింది. ఇది బ్రెజిల్ సాంస్కృతిక చిహ్నం. ఏడు ప్రపంచ వింతల్లో ఒకటి. ‘‘గగన మార్గాన సాగిపోతున్న ఒక ప్రయాణికుడు అలసట తీర్చుకోవడానికి ఆ కొండ మీద కాసేపు ఆగినట్టు అనిపించింది నాకు, ఆ శిల్పాన్ని చూస్తున్నపుడు… కొండ శిఖరం మీద పెట్టుకున్న గూడులో నుంచి ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని గగన విహారానికి బయలు దేరబోతున్న గరుడ పక్షిలా కనిపించింది ఆ విగ్రహం’’ అన్నారు ఆది. ‘‘శిఖరాల మీదికి చేరుకున్న ఈ కలల పంటని కోసుకోడానికి నేను ఎన్నో లోయలు దాటుకుని రావాల్సి వచ్చింది. నా ప్రపంచ యాత్రలో చివరి ఘట్టం… ఈ అద్భుత శిల్పం పాదాల దగ్గరికి చేరుకున్నందుకు ఆనందించాను’’

*** *** ***

‘‘మెల్లగా నడక సాగినా, క్రమేణ ముందుకి పోతూనే వుంటాం. ప్రయాణాలు నా ఆత్మవికాసానికీ వారధులై నిలిచాయి. నావి ప్రార్థించే పాదాలు’’. తిరిగి తిరిగి, నడిచి నడిచి అలిసి సొమ్మసిల్లిపోతున్న ఆదినారాయణ పాదాల్ని సప్త మహా సముద్ర కెరటాలు సేద దీర్చాయి. నిరాడంబరమైన ఈ మానవుడు- పిల్లల్నీ, పువ్వుల్నీ, పిట్టల్నీ, కొండల్నీ, చెట్లనీ, నీలి సముద్రాలనీ ప్రేమించిన వాడు.

ఉపన్యాసాలు దంచి బెదరగొట్టడు.
ఆదర్శాల లగేజీ మన భుజాలకెత్తడు.
అదిగో విప్లవం అని చూపిస్తూ ఆ వేలితోనే
మన కన్ను పొడవడు.

ఇప్పటికి ఆరు అమూల్యమైన పుస్తకాలు రాశాడు.
1. భ్రమణ కాంక్ష 2. Decorative arts of south Indian temples 3. జిప్సీలు (సంచారుల జీవితాలు) 4. స్త్రీ యాత్రికులు (28 మంది ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుల జీవితం) 5. మహాయాత్రికులు (24 మంది ప్రపంచ స్థాయి యాత్రికుల జీవితం) 6. తెలుగు వారి ప్రయాణాలు (64 మంది తెలుగు యాత్రికుల అనుభవాలు).

*** *** ***

TaadiPrakash

సికింద్రాబాద్ లో ‘అనల్ప’ బుక్ కంపెనీ పెట్టిన జర్నలిస్టు- కె.బలరామ్ ‘భూ భ్రమణ కాంక్ష’ ప్రచురణ కర్త. వెల: 280 రూపాయలు.
చదివి తీరాల్సిన పుస్తకం.

ఇంత అపురూపమైన పుస్తకం ఇన్నేళ్లుగా సాహిత్య అకాడమీ దృష్టికి ఎందుకు రాలేదో?

అరుదైన మనిషి ఆది నారాయణకి పద్మశ్రీ యిచ్చి గౌరవించుకోవడం కనీస ధర్మం అని యీ ప్రభుత్వాలకి ఎందుకు తోచదో?

గౌరవ డాక్టరేట్ అన్నా యిచ్చి సత్కరించాలని మన యూనిర్శిటీలకి ఎప్పటికి జ్ఞానోదయం అవుతుందో?

ఏ అగ్రకులానికీ చెందని వెనుకబడిన తరగతుల (బీసీ) వాడు అయినందువల్లే
ఆది నారాయణపై ఈ చిన్న చూపా?

ఇన్ని దేశాలు తిరిగి, ఇంత పరిశోధన చేసి, యిన్ని పుస్తకాలు రాసినా పట్టించుకునే దిక్కులేదంటే మనసుకెంత కష్టంగా వుంటుంది!

పైగా ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆయన!

నేను విశాఖలో రెండు సభల్లో ఆది నారాయణగార్ని కలిశాను. చాలా ఏళ్ల క్రితం బంజారాహిల్స్ లో ఆర్టిస్టు మోహన్ ఆఫీసుకి వచ్చారాయన. ఒక గంటకి పైగా మాతో మాట్లాడారు. నవ్వుతూ కబుర్లు చెప్పి కరచాలనం చేసి తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడాయన. ఈ సంస్కారి, సాదా సీదాగా తిరిగే బక్క పల్చని దేశ దిమ్మరి… దేశదేశాల మధ్య స్నేహ వారధులు నిర్మించడమా?

ఎక్కడో ఇరాన్, మెక్సికోలో ముక్కూ మొహం తెలియని వాళ్లని సొంత మనుషుల్లా ప్రేమించడమా?

కాంతులీనుతున్న ఒక శాంతిగీతాన్ని మానవాళికి కానుకగా యివ్వడమా?

మనం ఇంకా ఎక్కడో చీకట్లో మగ్గిపోతున్నాం అనిపిస్తోంది నాకు.

కళ్ల ముందు వున్న సంపదని చూడలేని అంధత్వమేదో మనల్ని ఆవరించిందనిపిస్తోంది.

భవిష్యత్ తరాలు మనల్ని క్షమించలేని పాపమేదో చేస్తున్నామని అన్పిస్తోంది.

ఇప్పుడు నిజంగా నాకు…
మాచవరపు ఆదినారాయణ
అనే మనిషిని చూడాలని వుంది.
వినమ్రంగా ఒక్కసారి ఆయన
పాదాలని తాకాలని వుంది.

*** *** ***

Bon voyage: ప్రొఫెసర్ గా రిటైర్ ఐన ఆది నారాయణ మరో ప్రపంచ యాత్రకి సిద్ధం అవుతున్నారు.

– తాడి ప్రకాష్, 97045 41559

How to convert dry hills to green hillocks https://youtu.be/gmA3fWqQ3Pw

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles