శ్రీసిటీ ఐమాప్ పరిశ్రమ వితరణతో నిర్మించిన నూతన బహుళ ప్రయోజక స్కూల్ భవనం ప్రారంభం- 29 లక్షల వ్యయంతో 3 తరగతి గదులు, స్టూడెంట్ డెస్కులు ఏర్పాటు
శ్రీసిటీ, సెప్టెంబర్ 08, 2021:
శ్రీసిటీలోని ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రాసెసింగ్ (ఐమాప్) పరిశ్రమ వితరణతో స్థానిక ఇరుగుళం జడ్పీ హైస్కూల్ లో నిర్మించిన నూతన బహుళ ప్రయోజక స్కూల్ భవనాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇవాన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. 29 లక్షల రూపాయల వ్యయంతో 3 తరగతి గదుల భవన నిర్మాణంతో పాటు 48 స్టూడెంట్ డెస్కులు, టీచర్స్ డెస్కులు, కుర్చీలు, గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేశారు. కంబైన్డ్ క్లాసులు, సమావేశాలు, పరీక్షల నిర్వహణకు వీలుగా 3 తరగతి గదులను ఒకే హాల్ గా వినియోగించుకునేలా భవన నిర్మాణం చేశారు.
ప్రారంభం అనంతరం నూతన భవనాన్ని ఐమాప్ డైరెక్టర్ సుజుకి, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధి సురేంద్ర కుమార్ సమక్షంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి లాంఛనంగా అప్పగించారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇవామి మాట్లాడుతూ శ్రీసిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఐమాప్ మరిన్నికార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ దిశగా తమను ప్రోత్సహిస్తూ తగు సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీసిటీ ఫౌండేషన్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
ఐమాప్ చొరవను శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో అభినందించారు. శ్రీసిటీలోని పరిశ్రమల సహకారం భాగస్వామ్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి మాత్రమే కాకుండా పిల్లల నమోదు, ఉతీర్ణత శాతం పెంపు, వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంపై తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నూతన భవనం రాకతో పాఠశాల ఆవరణ సరికొత్త శోభను సంతరించుకోవడంపై ఇరుగుళం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన భవన ఏర్పాటుపై ఐమాప్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానోపాధ్యాయులు మధు, ఈ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల మౌళిక వసతుల అభివృద్ధికి ఎంతో చొరవ చూపుతున్న శ్రీసిటీ ఫౌండేషన్ పనితీరును ప్రశంసించారు.
కాగా, గతంలోనూ ఐమాప్ పరిశ్రమ తమ సీఎస్సార్ కార్యక్రమాల్లో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో ఇరుగుళం హైస్కూల్ కు 3 తరగతి గదులు, తొండూరు సొసైటీ ప్రాథమిక పాఠశాలకు ఓ తరగతి గదిని డెస్కులు, కుర్చీలు సమ కూర్చారు.