నిప్పులు చిమ్ముకుంటూ రోదసీలోకి…!

చామనచాయతో, నవ్వు ముఖంతో కళకళలాడిపోతున్న ఆ పిల్ల బండ్ల శిరీష, నిప్పులు చిమ్ముకుంటూ రోదసీలోకి ఎగిరింది. టూరిస్టుగా కానే కావొచ్చు, అంతరిక్షాన్ని ముద్దాడింది. స్పేస్‌లో తొలి తెలుగు సంతకం చేసింది, ఇప్పుడామె మన వలెంటినా తెరిష్కోవా. రూట్స్‌ను తవ్వితే తెనాలి, పల్నాడు. క్యాస్ట్‌ను వెదికితే చౌదరీమణి. ఇక చూసుకో….ఓ వైపుకులానందలహరి, మరోవైపు ఇంత గొప్ప విషయంలోనూ కులాన్ని చూస్తారా అని? రెండూ రెండు ఎక్‌స్ట్రీమ్‌లు స్ట్రీమ్‌ అవుతున్నాయి సోషల్‌ మీడియాలో. ఎక్కువ మంది అన్నింటిలోనూ కులాన్ని వెతుకుతారు. కొందరికి పెళ్లిలోనే చూడాలని, మిగతావాటిలో చూడకూడదనేది ఆదర్శం. ఓకే మంచిదే. కానీ కులం భారతీయ వాస్తవికత కదా, తెలుసుకుని తీరాలి. ఫలానా శిరీష మాత్రమే అక్కడిదాకా ఎలా వెళ్లిందీ, ఇంకో బీసీ శిరీషగానీ, దళిత శిరీషగానీ ఎందుకెళ్లలేకపోయారు, అని స్టడీ చేయడం కోసమైనా ! నిన్న మొన్నటి దాకా క్రికెట్‌లో ఒకే కులం వాళ్లు ఎందుకున్నారు? తెలుగులో సైతం వెంకటేశ్‌ లాంటి స్పోర్ట్స్‌ కాలమిస్టులు రాస్తే మనం చదివామా లేదా ? శిరీష ఇంటి పేరు, ఆమె తాతల తండ్రుల ఊళ్లూ, ఆమె ఎవరో ఏమిటో చెప్పకనే చెప్పాయి. ఆమెకీ విజయం ఎలా సాధ్యపడిందో తెలుసుకోవాలంటే, కమ్మవాళ్లు – ఓ పరిశీలన అనే టాపిక్‌లోకి వెళ్లాల్సిందే. ఒక చిన్న ఫ్లాష్‌బ్యాక్‌తో మొదలు పెడతా. ఇరవై ఏళ్లకి పైనే అయిందేమో. నా ఫ్రెండ్‌ సురేష్‌చంద్ర బండి నడుపుతున్నాడు. వెనుక సీట్లో నేను. బండితో పాటే పిచ్చాపాటీ కూడా నడుస్తోంది. భవిష్యత్తంతా టెక్నాలజీదేరా అని అంటున్నాడు. అది వాడికి బాగా ఇష్టమైన సబ్జెక్టు. నేను ‘భయో’ టెక్నాలజీ ( టెక్నాలజీ అనగా భయం) అని వాడికి బాగా తెలుసు. మా టాపిక్‌ స్పేస్‌లోకి వెళ్లింది. బండి లక్డీకాపూల్‌ వచ్చింది, పక్కనే అన్నీ ట్రావెల్స్‌ ఆఫీసులు.. రాబోయే రోజుల్లో – హైదరాబాద్‌ బెజవాడ మధ్య బస్సులు తిరిగినట్టు- స్పేస్‌లోకి కూడా వెహికిల్స్‌ తిరుగుతాయేమో? ఒక హనీ బాటిల్‌ చేతికిచ్చి, నిజంగానే మూన్‌ మీదకి తీసుకెళ్లే హనీమూన్‌ ప్యాకేజీలు కూడా వస్తాయేమో ? అని సరదాగా అనుకున్నాం. అప్పుడు, ఇదే లక్డీకాపూల్‌లో కేశినేని ట్రావెల్స్‌ బదులు, స్పేసినేని ట్రావెల్స్‌ వస్తుందేమోరా? అని చెబితే, వాడు నవ్వునీ బండినీ కంట్రోల్‌ చేసుకోలేక ఇబ్బంది పడ్డాడు.

అప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. ఆ తర్వాత కొన్నేళ్లకి టీవీ9లో జాయినయ్యాను. ఓ రోజు స్పేస్‌ టూరిజం గురించి ఓ అరగంట. దీనికి ఏం పెడితే బాగుంటుదబ్బా అని చించుకుంటుంటే – నాకు పై సంఘటన గుర్తొచ్చింది. స్పేసినేని ట్రావెల్స్‌….అదే ఖాయం చేశాం. దీనికి ముందూ వెనకా వందలాది హిట్లు ఉండే ఉండొచ్చు గాక.. ఇది బాగా సూపర్‌ డూపర్‌ హిట్టు. అప్పటినుంచి స్పేస్‌ టాపిక్‌ అయితే చాలు, అన్నిచానళ్లలోనూ ఇదే టైటిల్‌. ఆంజ్యోతిలో ఉండగా మరో సంఘటన…ఆఫీసుకొచ్చిన ఒకాయన్ని గురించి రాయమన్నారు వసంతలక్ష్మి. అతడు కృష్ణాజిల్లాలో ఓ ఊరికి మాజీ ప్రెసిడెంట్‌. అమెరికాలో ఉండే వాళ్లమ్మాయి పొలమూ, మాజీ ప్రెసిడెంట్‌ నిక్సన్‌ పొలమూ పక్కపక్కనే . ఆ రకంగా ఈ మాజీలిద్దరికీ పరిచయం, వ్యవసాయం గురించి ముచ్చట్లు. ఆ రైతుకెంత గర్వకారణం నిక్సన్‌తో పరిచయం అన్నారామె. కాదు కాదు, అది నిక్సన్‌కేగర్వకారణం అని – నా స్టయిల్‌లో వివరించా. నువ్వు మరీ చెబుతావయ్యా అని ఆమె గట్టిగా నవ్వారు. ఒక మామూలు కమ్మ రైతు, నిక్సన్‌ అంతటివాడితో వ్యవసాయం గురించి చర్చిస్తాడంటే, ఆ ఫీల్డ్‌లో నిక్సన్‌ కంటే ఇతడే తోపు అని అర్థం. ఆ కులం పునాదే వ్యవసాయంలో ఉంది మరి. కష్టపడి పని చేయడం. మంచి భూములు ఎక్కడ ఉంటే అక్కడికి వలస వెళ్లటం, అన్నింటికంటే ముఖ్యం – రిస్క్‌ తీసుకోవటం. పేరు గుర్తుకు రావటం లేదు కానీ, ఈ కులం మీద ఫ్రెంచిస్కాలర్‌ ఒకామె పరిశోధన చేసి, పీహెచ్‌డీ సంపాదించింది. ఈ విషయం తెలిసినప్పుడు, నా ఫ్రెండ్స్‌ ఒకరిద్దరు ఏమన్నారంటే – అంత పెద్దపరిశోధన ఎందుకు? నువ్వయితే మూడు ముక్కల్లోనే చెబుతావుగా అని !

ఇది కూడా చదవండి… ఆ రోజు ఆ పత్రిక మందుపాతరలా పేలింది! ఒక రోజు ఉదయం క్రిష్ణానదికి ఈతకు వెళ్లి వస్తున్నాం…‘ ఎంత కాలం ఇలా కార్టూన్లు వేసుకుంటూ ఆఫీసులో కూర్చుంటావ్‌?దట్టమైన అడవుల్లో తిరిగొద్దాం, వస్తావా…?’ అని పిలిచాడు శ్రీను. లీవ్‌ దొరక్క వెళ్లలేక పోయాను కానీ, ఒక అద్భుతాన్ని మిస్‌ అవుతున్నానని అపుడు నాకు తెలీదు. https://www.ruralmedia.in/public/journalism-trends-and-predictions-2021/

ఆ మూడూ ఏమిటంటే.. బస్సు- మెస్సు – ప్రెస్సు! ఇక్కడ బస్సు అంటే మొబిలిటీ. అది లారీ కూడా కావొచ్చు. లారీచక్రం ప్రగతికి చిహ్నం. కదిలేదీ కదిలించేదీ కావాలి వాళ్లకి. కాటన్‌ బ్యారేజీలు కట్టిన తర్వాత – వ్యవసాయం పుంజుకుని మిగులుకి దారితీసింది. వీళ్ల కథ అలా బండిచక్రంతో మొదలైంది. అది లారీ చక్రంగా, బస్సు చక్రంగా, ఫిలింబాక్సుగా, సీడీగా, డీవీడీగా రూపాంతరం చెందుతూ వచ్చింది. లారీ ఓ చోటకి వెళ్లి సరుకులు దించిన తర్వాత, ఖాళీగా తిరిగి రాదు కదా. కాలాన్ని బట్టి బైబిల్‌నో, కమ్యూనిస్టు మేనిఫెస్టోనో, దాస్‌ కేపిటల్‌నో, రష్యన్‌ సాహిత్యాన్నో, సినిమాబాక్సులనో,కంప్యూటర్లనో, అప్పటికి మార్కెట్లో కొత్తగా ఏముంటే వాటిని తీసుకొస్తుంది. కొత్త వస్తువులతో పాటు, కొత్త భావాలను కూడా. మెస్సు అంటే – వ్యవసాయం. తిండిగింజలను పండించేవాళ్లే, రుచికరంగా వండి వడ్డించే మెస్సులను, హోటళ్లను పెట్టడం. స్వగృహఫుడ్స్‌ పేరుతో వ్యాపారం చేయడం. అసలు అమెరికాకు ల్యాండ్‌ రూట్‌ ఉంటే , అక్కడి దాకా బస్సులు వేసేవాళ్లేమో- దారిలో మెస్సులు పెట్టేవాళ్లేమో అని ఒక జోక్‌ ! ఇక షిరిడీకి బస్సులు వేసి, మెస్సులు పెట్టి – తెలుగునేలకి సాయిని పరిచయం చేసింది వీళ్లేనేమో అని నాకు డౌటు ! కులం, మతం , లేనిపోని ఆచారాలు ఏమీ లేని సూఫీ కావటం వల్ల కూడా బాబా వీళ్లని ఆకర్షించాడేమో ? ఇక ప్రెస్సు అంటే భావజాలం. సినిమా, మీడియా, కమ్యూనిజం, హేతువాదం , రకరకాల ఐడియాలజీలు. ఇది చాలా కీలకం. మనుషుల ఆలోచనలను ప్రభావితం చేయగలిగే రంగాలివి. చదువు ఎంత ముఖ్యమో గుర్తించిన కమ్మలు, బ్రాహ్మణులతో పోటీ పడటం మొదలు పెట్టారు. ( అప్పట్లో వీళ్లే కాదు, రెడ్లు కూడా చదువు కోసం హాస్టళ్లు పెట్టుకున్నారు ) ప్రతిదాన్నీ ప్రశ్నించటం మొదలుపెట్టారు. నిలవనీరు లాంటి బ్రాహ్మిణిజంపై పోరాడారు. పురాణాలను హేతువాద, లేదా ద్రవిడ కోణం నుంచి తిరగేసి మరగేశారు. కమ్యూనిజంతో సహా అనేక ప్రత్యామ్నాయ భావజాలాలను భుజానికెత్తుకున్నారు. మీడియా శక్తి ఏమిటో , సాహిత్యం శక్తి ఏమిటో తెలుసు కాబట్టే పత్రికలు పెట్టారు. మొట్టమొదట టీవీలు పెట్టిందీ వాళ్లే . ఇక సినిమారంగం గురించి చెప్పేదేముంది? సినిమా మీదున్న పేషన్‌తో – ఎల్వీప్రసాద్‌ అనే రైతుబిడ్డ ముంబై వెళ్లి స్టూడియోలో వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఫ్లోర్లు ఊడ్చాడు. ఇలా ఎంతో మంది రిస్కు తీసుకున్నఫలితం, ఆ రంగం మీద ఆధిపత్యం. ( ఇప్పుడు పోతోందనుకోండి ) అభివృద్ధి అంటే అన్ని రంగాల్లో ఉండటం.

చెరుకూరి రామోజీరావులు పుట్టిన సమూహంలో నుంచే , చెరుకూరి రాజ్‌కుమార్‌లు కూడా పుట్టడం. వీళ్లు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ దగ్గర్నుంచి మావో యిస్టు పార్టీ వరకూ అన్ని ఎర్ర పార్టీల్లోనూ ఉన్నారు, రాజ్‌కుమార్‌లాగా ప్రాణాలర్పించినవాళ్లు, త్యాగాలు చేసినవాళ్లు ఎందరో కనిపిస్తారు. ( కమ్యూనిస్టుపార్టీలలో చేరి త్యాగాలు చేసినవారిలో ఎంతో మంది రెడ్లు కూడా ఉన్నారని మనం మర్చిపోకూడదు. నాయకత్వస్థానాల్లో ఎక్కువగా కమ్మ, రెడ్డి కులస్తులే ఉండటం వల్ల, తెలుగునాట కామ్రేడ్‌ పదానికి నిర్వచనాలు మారిపోవటం వేరేసంగతి) కమ్మవారు కాలక్రమంలో విద్యా, వ్యాపారరంగాలన్నింటినీ కమ్మేశారు. దాస్‌కాపిటల్‌ స్ఫూర్తితో మొదలై, కాపిటల్‌ దాసులుగా ఎదిగిపోయారు. ఇక యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అవతారాన్ని చాలించి, ఎస్టాబ్లిష్‌మెంట్‌గా మారే టైమొచ్చింది. అయితే రెడ్ల ఆధిపత్యం ఉంటుంది కాబట్టి, కాంగ్రెస్‌లో వారికి అవకాశం లేదు. కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నా, అధికారం దక్కేంత సీన్‌ లేదు. దీంతో రిస్క్‌ చేసి, ఒక కొత్త పార్టీ పెట్టాల్సివచ్చింది. దీని వెనుక ద్రవిడపార్టీల స్ఫూర్తి కూడా ఉండి వుండొచ్చు. తెలంగాణలో ఈ కమ్యూనిటీ ఎక్కువగా లేకపోవటం వల్ల – అక్కడ కూడా బాగా పాపులారిటీ ఉన్న ఎన్టీఆర్‌ రూపంలో కొత్త నాయకత్వం తెరపైకి వచ్చింది. దానికితోడు, కాంగ్రెస్‌ రాజకీయాల్లో అంతగా చోటు దక్కని బీసీలకి ప్రయారిటీ ఇచ్చారు. చరిత్రను సృష్టించారు. ఈ రాజకీయ విషయాల్నిఎన్టీఆర్‌తోనే ఆపేద్దాం ! దేశంలో సంపన్న కులాలు చాలానే ఉన్నాయి, కానీ ఆడవాళ్ల విషయంలో వాళ్లు ఎలా ఉన్నారన్నది ప్రశ్న. కొన్ని కులాల్లో బాగా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, తమను తాము నిరూపించుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. కాస్ట్‌లీ మేలిముసుగులు, నగలు కొనుక్కునే స్వేచ్ఛ ఎక్కువ. ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌కి వీళ్లు మహారాణులు.

విక్రమార్కుడు భేతాళుడిని మోసినట్టుగా, సంస్కృతీ సంప్రదాయాలను మోయడమే వీళ్ల పని. ( మగవాళ్లు – సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే, మోసే భాధ్యతను ఏ దేశంలోనైనా, ఏ మతంలోనైనా స్త్రీల భుజస్కంధాల మీదే ఉంచారు… యువర్‌…. ఆనర్‌ ) కమ్మవాళ్లకి కేవలం డబ్బు కోసం డబ్బు సంపాదించటం ఒక్కటే లక్ష్యం కాదు, అలా అయితే ప్రాణాలు పోవడానికి అవకాశముండే నక్సలైటు పార్టీలలో పనిచేయరు కదా.. అది ఏ రంగమైనా సరే, తాము ఎన్నుకున్న ఫీల్డ్‌లో ముందుకెళ్లడం వాళ్ల ఫిలాసఫీ…ఇందులో ఆడా మగా తేడా ఏమీ లేదు. ఇక్కడ డబ్బు ఒక్కటే కాదు, వికాసం ముఖ్యం. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పైపైకి – అనే కవితాపాదాలు వీళ్లకి బాగా యాప్ట్‌. ముందుకు వెళ్లటమే ముఖ్యం అంటూ బయల్దేరి, ఇప్పుడు శిరీష రూపంలో పైకి కూడా వెళ్లారు. ఆ కవితాపాదాలు లేదా అటువంటి సాహిత్యం ఆ పిల్లకి తెలియకపోవచ్చు. కానీ ఆమె తాతలు తండ్రులు చదివి వుంటారు. ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలని నినదించిన, మహిళలను ఎంతో గౌరవించిన దేశం నుంచి స్ఫూర్తిని పొంది ఉంటారు. ప్రపంచంలోనే తొలిసారి ఒక మహిళను స్పేస్‌లోకి ఆదేశమే పంపించింది మరి. అందుకే శిరీషను వలెంటినాతో పోల్చింది. ఇక మనదేమో మహిళ గడప దాటకూడదనే కల్చర్‌. కానీ, కమ్మవాళ్లు ఈ మనువాదంనుంచి ఎప్పుడో బయటపడ్డారు. ” మా ఇళ్లలో మేం ఆడపిల్లలకు స్వాతంత్ర్యమిస్తాం, తమ కాళ్ల మీద తాము నిలబడాలని ప్రోత్సహిస్తాం’ – ఇటువంటి మాటలే ఆమె తాత ఒకరు అన్నట్టు ఎక్కడో చదివాను. శిరీష కుటుంబం ఒక్కటే కాదు, మొత్తం కులంలోనే ఆడపిల్లల్నీ, వాళ్ల చదువుల్నీ ప్రోత్సహిస్తారు. ఎంతదూరమైనా వెళ్లి ఉద్యోగాలు చెయ్యమంటారు. ఊళ్లలో కూడా మగవాళ్లు కొత్త ఆదాయ వనరులను అన్వేషించే పనిలో ఉంటే, ఆడవాళ్లు వ్యవసాయాన్ని కుటుంబాన్ని చక్కబెడుతూ ఉంటారు. మిగతావాళ్లతో పోల్చినప్పుడు విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఈ కమ్యూనిటీలో. మన సమాజంలో కుటుంబాన్ని మొత్తం, మగవాడు ఒక్కడే మోస్తుంటాడు- హీరో ఒక్కడే సినిమాను మోసినట్టు. ఆడవాళ్లకి భాగస్వామ్యం తక్కువ, చదువుకున్నా నోరు మూసుకుని పడి ఉండాలి. మగాడిని ప్రశ్నించకూడదు. ఆడపెత్తనం బోడిపెత్తనం లాంటి సామెతలెక్కువ. ఈ రకంగా సగం నవవనరులు వృధా అయిపోతున్నాయి. కమ్మవాళ్లలో ఈ పరిస్థితి లేదు కాబట్టే, వాళ్లు వేగంగా అభివృద్ది చెందారు, ఇప్పుడు రోదసీలోకి కూడా అడుగు పెట్టారు. జాతులు, కులాలు, మతాలు, భాషలు, వలసలు, సంస్కృతులు వంటి విషయాల్లో ప్రత్యేక ఆసక్తి ఉన్న ఓ పాత్రికేయుడిగా నాకున్న పరిమితమైన అవగాహన ఇది. కేవలం పాజిటివ్‌ అంశాలను మాత్రమే తీసుకున్నాను. దీని ఉద్దేశమేమిటంటే – ఎదగాలని, రాజ్యాధికారం సాధించాలని తపన పడే కులాలకు – ఇది ఓ నమూనాగానో, ఒక మోడల్‌ పేపర్‌గానో ఉపయోగపడుతుందేమో అని. ఆలోచిస్తారేమోనని !

తరతరాల భావదాస్యాల నుంచి బయటపడనంతకాలం, సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ను మార్చనంత కాలం – ముందడుగు కష్టమే. కమ్మలు, రెడ్లలో కులచైతన్యం వచ్చిన వందేళ్ల తర్వాత కూడా, ఎన్నో కులాలు ఇంకా కదలిక లేకుండానే ఉన్నాయి. బీసీల్లో కూడా చట్టసభల్లోకి వెళుతున్నదిఓ ఐదారు అగ్ర బీసీ కులాలే. చాలా సమూహాలకి కనీసమైన చదువులూ ఉద్యోగాలు కూడా లేవు. ఇంటలెక్చువల్స్‌, ఎంటర్‌ప్రెన్యూర్స్‌, లీడర్స్‌ పుట్టనంతకాలం ఏ కులమూ ముందుకి పోలేదు. దీనికి చదువొక్కటే సొల్యూషన్. మొబిలిటీ ఒక్కటే మార్గం. అయినా చదువు ఎంత ముఖ్యమో ఫూలే చెప్పలేదా? అంబేద్కర్‌ సాధించలేదా? తరతరాలుగా మనుషులుగా కూడా గుర్తింపుకి నోచుకోని కులంలో పుట్టిన భీముడు, కసితో కృషితో జాఞన భీముడయ్యాడు. ఇప్పుడు తరరాలకీ వెలుగునిచ్చే వేగుచుక్కలా అటు దిగ్మండలంలోనూ , ఇటు జనహృదయంలోనూ ప్రకాశిస్తున్నాడు. చదువుకి ఉన్న శక్తి ఏమిటో చెప్పడానికి బాబాసాహెబ్‌ను మించిన ఉదాహరణ ఇంకెవరున్నారు.

Saambasiva Rao M (సీనియర్ పాత్రికేయుడు,TV9)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles