‘మో’ కవిత్వంతో బతికిన క్షణాలు Magical, surreal, and insane at times
శ్రీశ్రీ నుంచి రా.రా, చేరా దాకా రెండక్షరాలతో పాపులర్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నా ఒకే ఒక్క అక్షరంతో కవితాజగత్ ప్రసిద్ధుడైనవాడు మాత్రం ‘మో’ వొక్కడే! జీవితాంతమూ సర్రియలిస్టు మబ్బుల్ని పట్టుకు వేలాడి సప్తవర్ణ మాలికల సౌందర్యంతో కవితామ్ల వర్షమై కురిసిన వాడూ ఆయనొక్కడే!ఆశాభంగం చెందిన అక్షరాలనన్నిటినీ పోగుచేసి, వాటికి క్షోభనూ, కన్నీళ్లనూ జతజేసి… “అలా అని పెద్ద బాధా లేదు” అంటూ తనని తాను వోదార్చుకునే వ్యర్థ ప్రయత్నం చేసిన వొంటరివాడూ ఆయనొక్కడే!వేగుంట మోహన ప్రసాద్ తో నాదొక పొడవైన disturbingly beautiful love affair… కొన్నేళ్లు నడిచింది. ఒక సాయంకాలం, విజయవాడ మొగల్రాజపురం రోడ్డుమీద, తెల్ల లాల్చీ పైజమాతో ఎడం చేతిలో కాల్తున్న సిగిరెట్ తో వస్తున్న ‘మో’కి నన్ను పరిచయం చేశాడు మోహన్. ఒక మిశ్చివస్ చిరునవ్వుతో అందంగా పలకరించాడాయన. సముద్ర కెరటాల్ని సెవనో క్లాక్ బ్లేళ్లతో చీరేస్తూ… లాంటి ఆయన పొయేం ఒకదాన్ని చటుక్కున అప్పజెప్పాను.
“వీడెవడండీ బాబూ, నడిరోడ్డు మీద వచన కవిత్వాన్ని విరజిమ్ముతున్నాడు” అన్నారు ‘మో’.1985… విజయవాడ ‘ఉదయం’లో పని చేస్తున్నాను. ఒకరోజు మధ్యాహ్నం హోటల్ లో ఉన్నాం. నన్ను ఇంటర్వ్యూ చేయవా? అన్నారు ‘మో’. అదేంటండీ, ఆనందంగా చేస్తాను. అయితే మీ కవిత్వంలోలా డొంకతిరుగుడుగా కాకుండా తిన్నగా సమాధానాలు చెప్పాలి” అన్నాను. తేలికగా నవ్వేస్తూ సరే అన్నారు. ఈవెనింగ్ పార్టీల వల్ల ఆయనతో చనువుగా మాట్లాడే అవకాశం కలిగింది. ఒక గంటకు పైగానే ‘మో’ మాట్లాడారు. రావిశాస్త్రి? అన్నాను.”ఆయనా, విప్లవానికి ఎర్రని లోలంగా తొడిగినవాడు-” అన్నారు. మరి సోమసుందర్? అడిగాను.
“వాడా… తుప్పుపట్టిన వజ్రాయుధాన్ని యింకా ఝుళిపిస్తున్నాడు” అన్నారు. అలా మొదలైంది… ‘మో’ అనేక అవాకులూ, చవాకులూ పేలారు. ఈ ఇంటర్వ్యూ రాయకూడనిది. రాస్తే ఆయనకే పరువు తక్కువ అనుకున్నాను. ఆరోజు నాకు నైట్ డ్యూటీ. ఏడు గంటలకి ఆఫీసు పనిలో ఉన్నాను. వాచ్ మన్ వచ్చాడు. మీకోసం ఎవరో వచ్చారు, రమ్మంటున్నారు అన్నాడు. ‘పైకి రమ్మను’ అన్నాను. మిమ్మల్ని కిందికి రమ్మంటున్నారు అన్నాడు. అదేంటో అనుకుంటూ కిందికి వెళితే- ఉదయం గేటు దగ్గర ‘మో’ నిలబడి వున్నారు, చేతిలో రెండు బీరు సీసాలతో! పక్క వీధిలోకి రమ్మన్నారు. అక్కడున్న కారుకి ఆనుకుని నించుని బీరిచ్చి తాగమన్నారు. నేను డ్యూటీలో ఉన్నాను అన్నాను. మాకు తెలుసులే. తాగు అన్నారు. ఊరుకోడని అర్థమైంది. రెండు గుక్కలు తాగి, ఏంటి జోరు! అని అడిగాను. నువ్వా ఇంటర్వ్యూ రాయొద్దు అన్నారు. నేను రాయడం లేదని, ప్రామిస్ అనీ, ఎప్పటికీ రాయననీ క్లియర్ గా చెప్పాను. అంతా విని, ఆ ఇంటర్వ్యూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాయొద్దు అన్నారు. ఎలియెట్ మీద వొట్టు, రాయనే రాయను అన్నాను. “రాయకు. రాయొద్దు. నీకు దణ్ణం పెడతా. చంపేస్తా…” ఇలాంటి బోలెడన్ని మాటలని వెళిపోయారు. ఆయన భయపడ్డారు. బెంగపడ్డారు. ‘మో’ పిచ్చిపిచ్చి కామెంట్లన్నీ సెన్సేషన్ కోసం రాసేస్తానేమోనని కంగారుపడి పోయారు. బహుశా, ఆ రాత్రి సరిగా నిద్రపోయి వుండరు. మర్నాడు పేపర్ చూసిన తర్వాత కుదుటపడి వుంటారు. నేను అక్షరం ముక్క కూడా రాయలేదు. తర్వాత మా స్నేహం గ్లాసులో పోసిన సోడాలా పొంగింది. 1985లోనే కావచ్చు. రోణంకి అప్పలస్వామి విజయవాడ వచ్చారు. ఒక హోటల్లో వున్నారు. రోణంకి విజయనగరం ఎం ఆర్ కాలేజీలో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనీ, పండితుడనీ వొరేషియస్ రీడరనీ తెలుసు. రోణంకి ఆంధ్రా యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్నపుడు, కోటుకున్న ఏడెనిమిది జేబుల్లోనూ పుస్తకాలు పెట్టుకుని, చేతిలో పట్టుకున్న పుస్తకాన్ని చదువుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వెళిపోవడాన్ని చాలాసార్లు చూశానని మా సుశీలక్క నాకు ఏనాడో చెప్పింది.నాలాంటి చదువూ సంధ్యా లేనివాడు అలాంటి మహానుభావుణ్ణి ఎలా ఇంటర్వ్యూ చేయగలడు? ఒక ఐడియా వేశాను. మోహన్ ప్రసాద్ గారికి ఫోన్ చేశాను. ఆదుకోవాలని అడిగాను. ఆయన హోటల్ కి కలిసి పోదాం అన్నారు. ఆరోజు రోణంకితో ‘మో’, నేను చాలసేపు మాట్లాడాం. “మీరెప్పుడైనా, ఎవర్ని ఐనా ప్రేమించారా?” లాంటి వెర్రిమొర్రి ప్రశ్నలు అడిగాను. కవిత్వం గురించి ‘మో’ మాట్లాడారు. మర్నాడు రోణంకి ఇంటర్వ్యూ ‘ఉదయం’ మొదటి పేజీలో పెట్టాను. ఎన్నడూ ఎవర్నీ పొగుడుతూ ఒక్కమాట అనడానిక్కూడా యిష్టపడని మంచి జర్నలిస్టు, బ్రిలియంట్ క్రిటిక్ మందలపర్తి కిషోర్, “ప్రకాష్… రోణంకి గురించి మీరు రాసింది చాలా బాగుంది. అది 21st century interview” అన్నారు. హృదయం తేలిక పడింది ‘మో’ కాళ్ళ కి మనసులోనే దణ్ణం పెట్టుకున్నాను.
*** *** ***
1986 లోనేమో… ‘ఉదయం’ ఆఫీసుకి ఒక ఫోన్ వచ్చింది. ఎవరో పెద్దాయన మాట్లాడుతున్నారని ఫోన్ నా చేతికి యిచ్చారు. లేండ్ లైన్ రోజులవి. “విశాఖ నించి రోణంకి అప్పలస్వామిని మాట్లాడుతున్నాను. నేను చనిపోయానని ఈరోజు మీ పేపర్లో వార్త వచ్చింది. బతికే వున్నానని చెప్పడానికి యీ ఫోన్ చేస్తున్నాను. వుంటాను” అని ఫోన్ పెట్టేశారు.నాకు చచ్చినంత పనైంది. సవరణ ప్రచురించిట్టున్నాం.చావు, సవరణ గురించి జర్నలిస్టులందరికీ తెలిసిన పాపులర్ జోకు ఒకటుంది. “ఒక పెద్దాయన చనిపోయారని నిన్న మా పేపర్లో వచ్చిన వార్త వాస్తవం కాదు. పొరపాటు జరిగింది. ఆయనింకా బతికే వున్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాం”
*** *** ***
తెలుగులో పేరున్న కవులు రాసిన కవిత్వాన్ని ‘మో’ ఇంగ్లీషులోకి అనువాదం చేసి ఒక మంచి ఆంగ్ల కవితా సంకలనం తెచ్చారు, 1982లో. దాని పేరు This Tense Time. ఆ పుస్తకాన్ని అంకితం ఇస్తూ మోహన్ ప్రసాద్, To my father and srisri… The father of modern Telugu Poetry” అని రాశారు. అది చూసి, రోణంకి కోపంతో వూగిపోయారు. అలా ఎలా అంటారు? ఆధునిక తెలుగు కవిత్వానికి తండ్రి ఒక్క గురజాడ మాత్రమే. శ్రీశ్రీ, గీశ్రీ జాన్తానై అని ఒక వ్యాసంలో రాశారు. అది చదివి చిరాకు పడిన శ్రీశ్రీ రెచ్చిపోయి, “హైస్కూలు పిల్లలకి ఇంగ్లీషు గ్రామరు చెప్పుకోక రోణంకి అప్పలస్వామి కవిత్వం గురించి ఎందుకు మాట్లాడడం!” అన్నారు. రోణంకి- విశ్వనాథ అన్లేదుగా… గురజాడనే అన్నారు. అర్థమయిందా శ్రీశ్రీ ఎంత అన్యాయంగా కామెంట్ చేశారో? పోనీ, గురజాడ పెదనాన్న అయితే, నేను చిన్నాన్నని అనొచ్చుగా శ్రీశ్రీ! ‘మో’ కామెంట్ వల్ల ఇంత గొడవ జరిగింది.
*** *** ***
ఆగస్టు 2. ‘మో’ చనిపోయిన రోజు.2011లో ఆ కవి మనల్ని విడిచి వెళిపోయారు. 1942 జనవరి 5న పుట్టిన మోహన్ ప్రసాద్ ది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని వట్లూరు గ్రామం. పాతకాలం సినీ దర్శకుడు కె.బి.జి.తిలక్, ఆనాటి సీనియర్ జర్నలిస్టు మోటూరి వెంకటేశ్వరరావులదీ వట్లూరే! ఆర్టిస్ట్ మోహన్ కీ, నాకూ వీళ్ళు ముగ్గురూ బాగా సన్నిహితులు. నాకు తెలిసిన ‘మో’- మర్యాదస్తుడు. మొహమాటస్తుడు. మన్నించే మనసున్నవాడు. భార్య సుజాత, ఒక్కగానొక్క కూతురు మమతే తన సర్వస్వం అనుకున్నవాడు. చదివి… చదివి… ఉన్నత కవితాగ్ని పర్వత శిఖరాలపై కఠోర తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొందినవాడు. రాజ్యాలు యేలాలా? మణుగులకొద్దీ మణిమాణిక్యాలు కావాలా? అని ఆ దేవుడే అడిగితే, “కవిత్వం రహస్యం ఏమిటో చెప్పండి, చాలు” అన్న వెర్రిబాగులవాడు మోహన్ ప్రసాద్. ఇంగ్లాండ్ లో టి ఎస్ ఎలియెట్ ‘వేస్ట్ ల్యాండ్’ లోంచి నడిచి… నడిచి వచ్చి, మేలైన కవితా విత్తనాలు వెదజల్లి ఆంధ్రప్రదేశ్ ని fertile land గా మార్చినవాడు ‘మో’. సాహిత్యం, కవిత్వం… జీవితంగా బతికిన ఈ రియల్ సర్రియలిస్ట్ కవి, తన ఇంగ్లీషు ఆలోచనల్ని అచ్చ తెలుగులోకి అపురూపంగా అనువదించినట్టుండే ‘బతికిన క్షణాలు’ వచన కావ్యం చదివి త్రిల్ అయినరోజులు ఎప్పటికీ మరిచిపోలేనివి.”హిమాలయన్ రేసులోనూ ఉన్నాను. ఆల్ప్స్ పైనా వున్నాను. దొర్లుతున్నాను. కాళ్ళకి సూర్యకిరణాలు చుట్టుకొని…రోమన్ సామ్రాజ్య ఔన్నత్యం లోంచి లోయల్లోకి… చిక్కుకుపోయిన పురాసంస్కృతీ బంధాల్లోంచి దొర్లుతూ… పొర్లుతూ… ఓ ప్రజాస్వామ్య క్షీణ దశాబ్ద శవాల మీద శవమా… ఓ మంచు కళేబరమా… ఓ ఎక్స్ లెంట్ సరీసృపమా…” అంటూ విశ్వదగ్ద సంగీతాన్ని వినిపిస్తాడు ‘మో’. వాక్యం కలగాపులగంగా అనిపించినా, ఆ అనుభూతిని అంతశ్చేతనలో పలికించగలిగే ఒరిజినల్ కవి వేగుంట. మాటల్ని విరిచేస్తాడు. చితి పేర్చినట్టుగా పదాల్ని పరుస్తాడు. కవిత్వాన్ని కాంప్లికేట్ చేస్తాడు. నరకయాతన పెట్టి నవ్వుకుంటాడేమో!
*** *** ***
1990 ఫిబ్రవరి 11: మో, కనకమేడల జగన్ మోహన్ రావు అనే జర్నలిస్ట్ మిత్రుడూ, నేనూ విజయవాడ పడమట లో ఒక బార్ లో ఉన్నాం. ఓ కవిత చెబుతాను, రాయండి అన్నారు మో. టేబుల్ మీద ఉన్న పేపర్ నాప్కీన్ మీద రాసాను. ఎలా ఉంది? అని అడిగారు. మీరెంత వంకరగా రాసినా చాలా బాగా కుదిరింది. యీ కవిత అంతా నాకు బాగా అర్థం అయింది” అని ఒకసారి అంటే, “then I am a great failure” అన్నారు ‘మో’. అయితే ఆ కవిత చంపెయ్ అన్నారు. ఆ కాగితాన్ని చించిపారేసేదాకా వూరుకోలేదు. నాకో ఫోన్ వచ్చింది. 27 ఏళ్ల జైలు శిక్ష తరవాత నెల్సన్ మండేలా విడుదలయ్యారు, అర్జెంట్ గా రావాలంటూ… ఆంధ్ర భూమి ఆఫీస్ నించి.మో కి బై చెప్పి నేను వెళ్ళిపోయాను. “మనసుకీ, తెరవెనుక మనసుకీ కల పారలల్ గా నడుస్తుంది.కల నిద్రను కాపలాకాస్తుంటుంది.చలిలో ఉరితీస్తుంటే ఒక వింటర్వేకువజామున శవానికి నెమ్ము చేస్తుందేమోననితుమ్మినపుడు వస్తుంది మెలుకువ.కల అసంకల్పం కల్పన” అంటూ విరిగి వివర్ణమవుతున్న కలలెన్నో మాకు కానుకగా యిచ్చిన పదాల మాయల ఫకీరు మా మోహన్ ప్రసాద్. సిద్ధార్థ కాలేజీ దగ్గర, కొండ నీడలో వుండే ఇల్లు ‘ఛాయ’ లో ఉయ్యాల బల్ల మీద కూచుని, సాయంకాలాల్ని గ్లాసుల్లో నింపుతూ కబుర్లు చెప్పే ‘మో’…మా జ్ఞాపకాల్లో మెదులుతూనే వుంటాడు. ఆత్మీయంగా పిలుస్తూనే వుంటాడు. అధివాస్తవ కవిత్వానికి ఆరడుగుల నైరూప్యచిత్రంగా డిస్టర్బ్ చేస్తుంటాడు. PS: విజయవాడలో మో ‘రహస్తంత్రి’ పుస్తకావిష్కరణ సభ (1991) త్రిపుర, చందు, జయ ప్రభ, సీతారాం ఏమన్నారు?… రేపు.
TAADI PRAKASH 97045 41559
బతికిన క్షణాలు – Vegunta Mohana Prasad Cover: Artist Kalla Satyanarayana