మిడిల్ క్లాస్ కిటికీలోంచి చిన్నచూపు, పెద్ద నవ్వు

Artist mohan on R K.laxman

ఆయన పోయాడనగానే ఇంగ్లీషు పాఠకులకి పాత కార్టూన్లు గుర్తొస్తాయ్.

ఆయన పుస్తకాలు చదివినవాళ్ళు కార్టూనింగ్ గురించీ, ప్రముఖులని కలవడం, విదేశాల్లో ఆయన చూసిన ప్రాంతాలూ, మనుషులూ, విశేషాలూ జోకులూ తలుచుకుని నవ్వుకుంటారు.

కార్టూనిస్టులయితే మరింత దగ్గరగా, చాలా భారంగా ఫీలవుతారు. ఆ గీతల్నీ, హ్యూమర్ నీ, అవి తమపై మొదటిసారి చూపిన ప్రభావాన్నీ, తర్వాత తమ సొంత గీతనీ, ఆలోచనలనీ ఒక దారి పట్టించడం గురించి నెమరేసుకుంటారు. ఇక లక్ష్మణ్ తో పరిచయముండి, కలిసి తిరిగి, ఇంటర్వ్యూలు చేసి అచ్చేసిన కార్టూనిస్టులకైతే ఈ ఫీలింగ్ పదిరెట్లు. జ్ఞాపకాల ద్వారా ఇదంతా ఇంగ్లీషు చదివే వాళ్లకే ప్రత్యేకం. తెలుగు, హిందీ ఇతర భారతీయ భాషల్లో మాత్రమే చదువరులకు అంతగా వీలయ్యే ఛాన్స్ లేదు. ఎవరో పెద్దవాడట, గొప్పవాడట, ఎవార్డు లొచ్చాయట అని వార్తలు చదివి అనుకుంటారు.

చాలా ఏళ్ళ క్రితం లెక్కల ప్రకారం మన దేశంలో సకల ఇంగ్లీషు పేపర్లను కలిపి లెక్కేస్తే, వాటిని చదివేవాళ్ల సంఖ్య పాతికశాతంలోపే. దేశీయ భాషాపత్రికలదే 75 శాతం. ఈ మధ్య ఇంగ్లీషు పాఠకుల సంఖ్య పెరిగి ఉండొచ్చు. కానీ ఈ కొత్త తరానికి లక్ష్మణ్ తెలిసే అవకాశం లేదు. దశాబ్దకాలంగా ఆర్కే లక్ష్మణ్ అనారోగ్యంతో ఉన్నారు. మొదటి పేజీలోగానీ మరేపేజీలోగానీ ఎక్కడా కనిపించడంలేదు. అంటే ఆయన అప్పుడే మరణించినట్లు లెక్క మహా అయితే కొందరు పాఠకులు, అభిమానుల జ్ఞాపకాల్లో మిగిలుంటాడు.

మన బంధువుగానీ, మిత్రుడుగానీ చనిపోతే తన గురించి కొన్ని మంచిమాటలు చెప్పుకుంటాం. కొన్ని అతిశయోక్తులూ అంటిస్తాం. సహజం… అతని లోపాలేమైనా ఉంటే పక్కన పెడతాం. సందర్భం కాదుగనక. ఇదీ సహజమే. కానీ నిస్పాక్షికంగా అంచనా వేయడానికి ఇలాంటివి అడ్డం పడతాయి.

*ఒక ప్రముఖుడిని అదేపనిగా ఆకాశానికెత్తడమో, లేదా బండ బూతులు లంకించుకోవడమో మొదలెడితే పోయిన ఆయనకి పోయేదేం లేదు. సుబ్బరంగా ఉంటాడు. మన జ్ఞానమో అజ్ఞానమో బయట పడుతుందంతే*.

ఈ శతాబ్దం నాదన్నాడు శ్రీశ్రీ, కవి గనక! ఈ మరోశతాబ్ది మాది అని బాపూగానీ, లక్ష్మణ్ గానీ అనలేదు. ఆర్టిస్టులు గనక!!

కానీ వీళ్లు అర్ధశతాబ్దిని నిజంగా ఆక్రమించి పాలించిన మహరాజులు. ఎవరూ ఎక్కడా కాదనలేని ఫినామినాలు. వాళ్లు పట్టి చేయాల్సింది చేసి పోయారు. వాళ్ల కాలం గురించీ, కళ గురించీ అనుభవించి పలవరించి, ఆనక తేలిగ్గా *సరిగ్గా అంచనా వేసుకోవటమనేది మన బుర్రలోతుకీ లేదా బోలుతనానికి సంబందించిన సంగతి*.

కార్టూన్, పొలిటికల్ కార్టూన్ అనేవి భారతీయ సాంప్రదాయంలో లేవు. అవి యూరప్ నుంచి మరీ ముఖ్యంగా బ్రిటన్ నుంచి వాళ్ల పరిపాలన వల్ల మనకు వచ్చింది. స్వతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు మన పత్రికలకు అదొక ఆయుధమయింది. దాన్ని ధరించిన మన రాజకీయ కార్టూన్ పితామహుడు శంకర్ పిళ్లే. ఆయన ఎవర్నీ అనుకరించకుండా సొంత ఒరవడితో ఈ రంగంలోకొచ్చాడు. ఎందరో కార్టూనిస్టులను గుర్తించి, *శంకర్స్ వీక్లీ* లో బొమ్మలు గీయించి ఒక సంస్థగాఎదిగాడు. ఉద్యమకారుడయ్యాడు. స్వతంత్ర్యం కోసం పోరాడే జవహర్ లాల్ నెహ్రూ లాంటి ఎందరో నాయకులకు మంచి దోస్తు అయ్యాడు. బ్రిటీష్ పాలన మీదా, జాతీయ నాయకుల లోపాల మీదా దూకుడుగా దాడి చేసేవాడు. వాళ్లని కుక్కలుగా పిల్లులుగా చూపి వెటకరించేవాడు. మన రామాయణ, భారతాల నుండీ, గ్రీకు, రోమన్ పురాణగాధలను ఆనాటి రాజకీయాలను ఆపాదించి నవ్వులు రువ్వేవాడు.లక్ష్మణ్ స్వతంత్రం తర్వాత వచ్చిన కార్టూనిస్టు. రాజకీయ నాయకులతో ఎలాంటి దోస్తీ చేసేవాడుకాదు.

రెండవ ప్రపంచయుద్ధకాలం నాటి *డేవిడ్ లో* కార్టూన్ ప్రభావంతో అచ్చు అలాగే బ్రష్ గీత ప్రాక్టీస్ చేశాడు. మనుషుల్ని జంతువులుగా బొత్తిగా చూపేవాడు కాదు. పురాణ గాధల ప్రతీకలతో ప్రస్తుత రాజకీయాలను బొమ్మల్లో చూపడానికి గట్టిగా వ్యతిరేకి. కార్టూన్ లో విమర్శలన్నీ “సోఫార్ సో ఫర్ దర్” అన్నట్టు సుఖంగా కితకితలు పెట్టినట్టుంటాయి.

శంకర్ లాగా నవ్విస్తూనే దాడిచేయడు. సరదాలు బోలెడన్ని.

మధ్యాన్న భోజన పధకంలో పెట్టిన అన్నం కూరా అన్నీ ఓ కుర్రాడు తింటుంటాడు. వాళ్ళ టీచర్ వచ్చి “జీతాలొచ్చి మూణ్ణెల్లు దాటింది. తిండి తిని చాల రోజులయింది. నాక్కొంచెం పెట్టరా” అని స్టూడెంట్ ని దేబిరిస్తుంటాడు.

(దీన్నే మరోరకంగా నేను కాపీ కొడితే *ఆంధ్రప్రభ* లో అది హిట్టు) ఆఫ్రికాలో మిలటరీ నియంతలని సొంతవాళ్లే (ముఖ్యంగా బాడీగార్డులు) బంధించి, పదవి నుండి తప్పించి వాళ్లే సింహాసనమెక్కితే, నియంత దేశాలు పట్టిపోవడం రివాజు. ఒక కార్టూన్లో పదవి పోయిన నియంత యూరప్ నుంచి కొత్త పాలకుడికి ఫోన్ చేస్తాడు.

“నన్ను నీ బాడీగార్డుగా పెట్టుకోరాదూ” అని. నవ్వలేక ఛస్తాం. కానీ ఆఫ్రికాలో వలసపాలనని అంతం చేస్తూ ఒక్కొక్క దేశమే వేగంగా విముక్తి అవుతున్న కాలంలో అక్కడి ప్రజల గురించి ఇలాంటి కార్టూన్ ద్వారా మనకేమీ తెలియదు.

ఒక మిడిల్ క్లాస్ మనిషి పేపర్ తిరగేస్తూ ఎక్కడో ఓ మూల సింగిల్ కాలం వార్తలో “మరో తిరుగుబాటు” అని చదివి ఎప్పుడూ ఇంతే అనుకున్నట్టుంటుంది. లక్ష్మణ్ సామాన్య ప్రజలపక్షం వహించాడనీ, పేదల కోసం రాజ్యాధికారాన్ని ధిక్కరించాడనీ, నిలదీశాడనీ తెగ రాశారు. నిజానికాయన *మిడిల్ క్లాస్ కిటికీలోంచి దేశ రాజకీయాలనూ, ప్రపంచ పరిణామాలనూ చూశాడు, చూపించాడు*. మన దగ్గరే కాదు చాలచోట్ల ఇలా జరిగింది. ప్రపంచ కార్టూన్ పత్రికలో అగ్రగామి లాంటి “న్యూయార్కర్” కూడా 1930 నాటి గ్రేట్ డిప్రెషన్ (మాంద్యం) గురించి బొత్తిగా పట్టించుకోలేదు. *మోడరన్ టైమ్స్* లాంటి గొప్ప హ్యూమర్ చిత్రానికి వస్తువైన “మాంద్యం” న్యూయార్కర్ కి ఏమీ కాకుండా పోయింది. పైగా *జేమ్స్ త్రబర్* లాంటి గ్రేట్ కార్టూనిస్ట్ రచయిత ఎడిటర్ గా ఉన్న కాలంలో ఇలా జరిగింది.

స్వతంత్రం వచ్చిన తర్వాత, పరిపాలన చేసుకోవాలన్నా, రాజ్యాంగం రాసుకోవాలన్నా, చట్టాలూ, సంస్కృతీ, కళారంగాల్లో ఏ అవసరం వచ్చినా మనం బ్రిటన్ వంకే చూశాం. మనమేకాదు వర్ధమాన దేశాలన్నీ తమ అవసరాలన్నిటికీ పాత వలస పాలకుల వంకే దారికోసం చూశాయి. ఆ కాలం, ఆ అవసరం మనకి ఆర్.కె. లక్ష్మణ్ ని ఇచ్చింది. 1967 ప్రాంతాల్లో ఆంధ్రప్రభలో బాపూ వేసిన రాజకీయ కార్టూన్ లలో కూడా మురికివీధులూ, గుంతలూ, సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు కూల్చడం, అయోధ్య సయోధ్య, కాంగ్రెస్ టికెట్ కోసం కొందరి తంటాలు తప్ప నాటి నిజమైన మార్పుల్ని చూపవు, చెప్పవు.

ప్రపంచాన్ని కుదిపి, కదిపిన ఉద్యమాలూ, అన్నిరంగాల్లో వ్యవస్థని కాలర్ పట్టుకు నిగ్గదీసిన పశ్చిమ దేశాల యువతరం, వర్ధమాన దేశాల ప్రజా ఉద్యమాలని ఇవి ఎక్కడా తడమవు. ఆనాటి రాజకీయ భూకంపాల్ని మళ్లీ తలుచుకుంటూ అమెరికన్ *టైమ్* మాగజైన్ 1987లో ప్రత్యేక వార్షిక సంచిక ప్రచురించింది. అప్పటి పారిస్ సారబాన్ చుట్టూ వీధులు అగ్గిమీద గుగ్గిలమవడం, వియత్నాం యుద్ధం కీలకమలుపు తీసుకోడం, రష్యా చైనా విబేధాలూ, తూర్పు యూరప్ కెలకబారడం అన్నిటినీ టైమ్ మాగజైన్ వివరంగా జ్ఞాపకం చేసింది. *పొరుగున ఆగ్నేయాసియాలో పాతికేళ్లుగా అమెరికా పై పోరాడిన చిన్నదేశం వియత్నాం రాజకీయ కార్టూన్ కు పెద్ద సబ్జెక్ట్ కాకపోవడం గ్రిమ్ ట్రాజెడీ అని అబు అబ్రహాం నాతో ఒకసారి అన్నాడు. అది లక్ష్మణ్ ని ఉద్దేశించి నదేనని స్పష్టంగా అర్ధమయింది. అలాగని ప్రావ్డాలో, ఇజ్వేస్తియాలో బోరిస్ ఎఫిమోవ్ గానీ “కుకొనిక్సీ” ఆర్టిస్టుల త్రయంగానీ వేసిన వార్ ప్రాపగాండా కార్టూన్లు వేయాలని లక్ష్మణ్ నించి ఎవ్వరూ కోరుకోరు. ఆ హ్యూమర్ వరస దానిదే.

అది అలా ఉండాల్సిందే. కానీ అదెప్పుడూ, పాతుకున్న వ్యవస్థను అంటలేదు. ముట్టలేదు. ప్రశ్నించలేదు. *ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ పిలిచి వార్నింగ్ ఇచ్చినపుడు ఆయన విదేశాలు వెళ్లిపోయాడు*. తర్వాత ఆవిడే పద్మవిభూషణ్ తో సత్కరించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏ సంపాదకుడూ ఆయన బొమ్మని చూసి ఓకే చేయడమో, మార్పు చెప్పడమో నిరాకరించడమో ఏనాడూ జరగలేదు. కార్టూన్ నేరుగా లక్ష్మణ్ గది నుండి రోటరీ మిషన్ కెళ్లి అచ్చయ్యేది. ఎడిటర్లూ యజమానులూ మర్నాడు పేపర్లో చూసుకోడమే. అంటే *తమ కార్పొరేట్ ప్రయోజనాలకూ, రాజకీయ లబ్దికీ ఎలాంటి ధోకా లేదని ధీమా ఉండబట్టే కదా*!.

అలాగని ఈ వ్యంగ్యం, వెటకారం వెర్రివి అనలేం. అవి దక్షిణ భారతదేశం బ్రాండ్. ఉత్తరాదివారికి దక్షిణాది లెక్కలోకే రాదని అందరికీ తెలిసిందే. మహా అయితే మదరాసీలంటారు. *పడోసన్* లాంటి సినిమాలతో అనాగరికంగా వెటకరిస్తారు. కానీ సినిమాల విషయం వచ్చేసరికి వాళ్లకి నాటి వైజయంతిమాల, పద్మిని నుండి నేటి శ్రీదేవి వరకూ కావల్సొచ్చారు. మదరాసీలంటేనే మండిపోయే బొంబాయిలో ఆ కాలంలో మరో వైజయంతిమాల మాదిరిగా లక్ష్మణ్ ఎస్టాబ్లిష్ కావడం ఆషామాషీ సంగతి కాదు. ఘనాపాటీలైన మరాఠీ ఆర్టిస్టుల కేంద్రం బొంబాయిలో ఆ కాలంలో ఓ కర్నాటక కుర్రాడు కాలుమోపి, వెలుగు వెలిగాడంటే మరీనూ!!టీవీ, సెల్లూ, నెట్టూ, ఫేస్ బుక్కూ వికీపీడియా, గూగుల్ లేని బ్లాక్ అండ్ వైట్ కాలం మన కందించిన చిన్న మిడిల్ క్లాస్ కిటికీలోంచి బైటకి చూసిన చూపు. కిటికీ చిన్నది మరి.

*** *** ***

(ప్రముఖ కార్టూనిస్ట్ *ఆర్కే లక్ష్మణ్* కు నివాళిగా తెలుగు కార్టూనిస్ట్ & ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం, ప్రచురణ: ఫిబ్రవరి,2015, ప్రజాసాహితి*అక్టోబర్‌ 24న రాశిపురం కృష్ణస్వామి లక్ష్మణ్‌ శతజయంతి*)Rk Laxman పై ఆర్టిస్ట్&కార్టూనిస్ట్ మోహన్

  • Taadi Prakash-9704541559

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles