బాపుని మళ్లీ తలుచుకోడమెందుకు?Artist mohan on lion king baapu ……………………………………………………………………….
బాపు పోవడం తెలుగు కళ (అంటే సినిమా)కి తీరని లోటు, పూడ్చలేని గొయ్యి అంటూ చాలా మంది రాజకీయ నాయకులూ, సినిమా వాళ్ళూ ఏడాది క్రితమే గుడ్లనీరు కుక్కుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే ఏడుపు… మరైతే మళ్ళీ తలుచుకోడమెందుకు? కొందరెందుకో పుడతారు. ఎందుకో పోతారు.వారికి గానీ, వారి వారికి గానీ, జనాలకి గానీ కారణాలు తెలీవు.
కొందరుంటారు. వారి రాతల చేతా, చేతల చేతా, మళ్ళీ మళ్ళీ తిరిగొస్తారు. అపుడు మన చుట్టూ ఆదర్శం ఆవరిస్తుంది.
ఒక అశరీరవాణి వినిస్తుంది. దారి చూపిస్తుంది. కదిలిస్తుంది. ముందుకి నడిపిస్తుంది. ఐన్ స్టీన్, చార్లీచాప్లిన్, పాబ్లో నెరుడా, టాల్ స్టాయ్, మార్క్స్, గాంధీ, ప్రేమ్ చంద్, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి, బడే గులాం అలీఖాన్ లను మనం ఒట్టి పుణ్యానికే తలచుకోం. మనదారి వెతుక్కోవడం కోసం, మనం ప్రపంచాన్ని చూసే చూపు తెలుసుకోడం కోసం తలుచుకుంటాం. తోలుతిత్తి వంటి ఈ శరీరానికీ, తూట్లు తొంబది పడ్డ గుండెకీ, పారదర్శకమైన ఆత్మకీ నిత్యజీవితం తగిలించే తుప్పుని వదిలించడానికి తప్పక తలుచుకుంటాం. అది మన అవసరం.
గొప్పోళ్ళంటూ వాళ్లని వేనోళ్ళ పొగిడి మనం సాధించేదేం లేదు. వాళ్ళకి వంకలు పెట్టి తిట్టి శపించి బావుకునేదీ లేదు. ఆ సముద్ర కెరటాలను పట్టి నింపడానికి మన దగ్గరున్న లక్కపిడత సైజు ఎంతనేదే తక్షణ, తీవ్ర దుర్భర సమస్య. కానీ ఈ సైజు భగవదానుగ్రహం… మానవ మాత్రులమైన మనమేమియూ చేయలేము. ఈ బుజ్జి లక్కపిడతలే ఆయన సృష్టి అనుకోవడమూ పొరపాటే. భగవంతుడు చేసిన పొరపాట్లో ‘బ్లండర్ మిస్టేక్’ల లిస్టురాస్తే పాత నిబంధన గ్రంథమంతవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ : ఆది యందు ఆయన ఏమిచేసెనో ఏమోగాని తదనంతరమూ నేలక్లాసునూ, అచ్చు దానినే పోలిన బాల్కనీని సృష్టించెను. అక్కడితో ఆగక రెంటికంటే హీనమైన దర్శకులూ, నటులను కూడా సృష్టించెను. ఇక వీళ్లూరుకుంటారా?
ఉత్పత్తి, పునరుత్పత్తి అనే టెక్నిక్ తో శిష్యులనీ, కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్లని కని, పెంచి, మల్టీప్లెక్స్ అంత పెద్దజేసి మన మీదికి వదిలారు.
మానవజాతి స్వకీయ సంహారానికి దేవుడు ఈ ట్రిక్ చేసి ఉండొచ్చు గాక. యాతడి లీలలు మన మెరుగలేము. కానీ ఈ హింసనీ, సర్వసంహారాన్ని, రక్తపాతాన్ని కళకి అత్యున్నత రూపంగా, హిమవన్నగముగా మనం అనుకోడం, ప్రింటూ, ఎలక్ట్రానిక్ మీడియాల నిండా రాసుకునీ, రంగు పూసుకునీ బట్టలూడతీసి ఎగరడం పంచమహాపాతకమే కాదు, అష్టమ దశమ దరిద్రమేదన్నా ఉంటే అది. ఆ లిస్టులో బాపుని వేసి అతను అలాటిలాంటి దర్శకుడు కాదని పొగడడం అంతకన్నా హీనం.
ఆ కొన్ని సినిమాల్లోని ఎన్నో చిల్లర సీన్లని తలుచుకుంటూ నోస్టాల్జియాలోకి జారిపోతూ పోతూ చుట్టూ జనాలని పోరి ప్రచారం చేయడమంటే.. హిట్లర్ గాస్ చాంబర్ ఇనాగరేట్ చేయడం కంటే రెండాకులెక్కువ.
చిత్రకారుడికీ, దర్శకుడికీ చేసే పనిలో కొన్ని సమాన ధర్మాలో, బాధ్యతలో ఉన్నమాట నిజం. ఒక హ్రస్వ చతురస్రాకారమో, సుదీర్ఘ చతురస్రాకారమో గల తెల్ల కాయితమైనా, కాస్త పెద్ద కాన్వాసయినా, మరింత పెద్ద తెర అయినా అందులో ఉండే చెట్టూ, చేమా, మనుషులో, జంతువులో ఎక్కడుండాలి, ఆకాశమెటూ, ఎంతా అనే స్పేస్ మేనేజ్మెంట్ ప్రాథమికమైన విషయం.
రష్యన్ డైరెక్టర్ సెర్జీ ఐసెన్స్టీన్ చక్కని చిత్రకారుడు. బేటిల్ షిప్ పాటెమ్మిన్’, ‘ఐవన్ ది టెరిబుల్’, ‘అక్టోబర్’ లాంటి సినిమాలు ప్రపంచ సినిమా గ్రామర్ని బద్దలు కొట్టి కొత్త వ్యాకరణాన్ని రాశాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇవి అందరూ చూసిన క్లాసిక్ ఫిలిమ్స్.
కొందరే చూసిన విషయం ఐసెన్ స్టీన్ స్కెచ్లు, అగ్గిపెట్టె సైజులో ఆయన గీసిన ఫ్రేముల్లో ‘ఐవన్ ది టెరెబుల్’ పాడుగాటి గడ్డం క్లోజప్, దూరంగా తెల్లటి మంచులో నల్లటి వానకు వేల జనం నడవడం చూస్తే పెన్సిల్ స్కెచ్ కి ఇంచు కూడా పక్కకి తప్పకుండా పెద్ద తెర మీద సీస్ ప్రత్యక్షమవుతుంది.
ఆయన సినిమాలన్నీ అంతే. ఐన్ స్టీనే దేవుడని ఇంట్లో ఫోటో పెట్టుకు మరీ ఆరాధించే సత్యజిత్ రే పెన్సిల్ స్కెచ్ లూ, పథేర్ పాంచాలీ ఫ్రేమ్ లూ గూడా అంతే. అది కళ. స్వఛ్వమైందీ, వున్నతమైందీ. మానవాళికి చేయందించి పైశిఖరాలకు తీసుకువెళ్లేదీ. సకల పవిత్ర కళా సర్ప పరిష్వంగాలను ఛేదించి, సర్వకళా గ్రామర్నూ ఉల్లంఘించి, డబ్బులెక్కల్తో, డబ్బు తిక్కల్తో, వంద కోట్ల టార్గెట్ లతో పరిగెడుతున్న ఇండియన్ కమర్షియల్ సినిమాకీ, ఈ గొప్ప కళకీ ఏడామడలో, సప్తసముద్రాలకావలో ఇంకెంత దూరమో ఏమో. వాళ్ళనీ కన్ఫ్యూజియస్ లను చేస్తారు.
ఆయన చిత్రకళ గురించి కూడా కొన్ని అపోహలున్నాయి. యూరోపియన్ తరహా ఆయిల్ పెయింటింగ్ అమ్మకాలు వ్యాపారం పుంజుకున్న తర్వాత మార్కెట్ ని చూసి చిన్నా పెద్దా ఆర్టిస్టులు బతుకుతెరువు కోసం ఈ బిజినెస్ లో పడ్డారు. కాస్తంత డబ్బు చేశాక, ఇంకొంచెం పేరు మోశాకా: ‘బాపు వట్టి ఇలస్ట్రేటర్ మాత్రమే. అతను ఆర్టిస్టు కాదు. పెయింటర్ కాదు’ అంటారు.
ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్ అంటే జోకర్లనీ, కాన్వాస్ మీద ఆయిల్స్ వేసేవారు హీరోలనీ చిత్తశుద్ధితో నమ్ముతారు. ఈ పెయింటింగ్ లని అమ్మే గేలరీల వాళ్ళు, కొనుక్కునే వీరి కళాభిమానులు కూడా ఇదే నమ్ముతారు. చదువు లేకపోవడం, చదువు రాకపోవడం, చూసే కంటికి శిక్షణ లేకపోవడం లాంటి కారణాన ఇలాటి మూఢనమ్మకాలు కలగడం కద్దు.
తెలుగు సాహిత్యంలో తొమ్మిది కథల బంగారంగా వెలిగే మెగాస్టార్ కథా రచయిత సి. రామచంద్రరావు కూడా ఇలా అంటారు.
“బాపు ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ హి ఈజ్ ఓన్లీ యాన్ ఇలస్ట్రేటర్ బట్ నాట్ ఎ పెయింటర్”. సి.రా. గారికి కళ అంటే ఇష్టం. ఇంటినిండా పికాసో లాంటి ఎంతోమందివి ప్రింటూ, కొందరి ఒరిజినల్స్ ఫ్రేమ్ లు కట్టి ఉంటాయి. మరి అంతటి జైంట్ కూడా ఇట్లా అంటే ఎట్లా?
చిన్న కాయితం మీద సన్నటి, లావాటి గీత గీయడం, హ్యూమన్, యానిమల్ ఎనాటమీ ని, ప్రకృతినీ అదేపనిగా స్టడీ చేసి, గీసి, కొత్త సొంత భాష్యమివ్వడం గొప్పల్లో గొప్ప పని. బాపు అది చేశాడు. చిన్నప్పుడు బుల్లి గీతల నుంచి, పోయిన ఏడాది వరకూ అదేపనిగా చేశాడు. అదే ఆయన నిశ్వాసం. రంగుల మీద ఆయనకున్న అథారిటీ భారతీయ నృత్యాల సిరీస్ లో కనిపిస్తుంది.
గీతల్లో రంగుల్లో కథాశివరావుగా మారిన హైఫై స్కైఫై కథా రచయిత సదాశివరావు గారి దగ్గర బాపు బొమ్మల ఒరిజినల్స్ కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. బాపు ఫొటోలు కూడా బోలెడున్నాయ్. కొత్త రాజధానిలో బాపు మ్యూజియం పెడతామని గవర్నమెంటు వారు సెలవిచ్చారు గదా. దానికి ఈ బొమ్మలనీ పంపుతానంటారు. అయితే సదాశివుడి కండిషన్ ఒకటుంది : ‘ఆ మ్యూజియంను గవర్నమెంట్ కల్చరల్ డిపార్ట్మెంటో, ఇంకోటో నడపకూడదు. ప్రైవేట్ ఫౌండేషన్ కివ్వాలి. వాళ్ళు పద్ధతిగా రన్ చేస్తారు. ప్రభుత్వం అయితే, ఐఏఎస్ ఆఫీసర్ లో, ఏ కమిషనర్ లో వచ్చి తగలేస్తారు”.
నిజమే. ఐపీఎస్ ఆఫీసర్ గా చేశారు గనక సదా గారికి విషయం బాగా తెలుసు. కానీ బురాక్రసీలో ఆయన మాట సదా చెల్లదని నా అమూల్యాభిప్రాయం.కొంపదీసి నిజంగా మ్యూజియం పెడితే అందులో జాకీ, బుల్లెట్, మిస్టర్ పెళ్లాం లాంటి సినిమా స్టిల్స్ పెట్టి చంద్రబాబు గారు ఇనాగరేట్ చేయకుండా ఉంటే అదే పదివేలనుకుని వెంకటేశ్వరస్వామికీ, బాబు గారికీ కలిపి వెయ్యి కొబ్బరికాయలు కొట్టడానికి మాలాటి ‘వెర్రివాడులారా’ అందరం ప్రిపేర్ అవుతున్నాం.
బాపు ప్రథమ వర్ధంతి సందర్భంగా…. ఆర్టిస్ట్ మోహన్ 31 ఆగస్టు 2015న రాసిన వ్యాసం.. కార్టూన్ కబుర్లు నుంచి..
( Taadi Prakash )
22