.అక్కడ ఒకపుడు గడ్డికూడా మొలకెత్తకుండా, ఈసురో మంటూ ఉండేవి భూములు. ఏ పల్లెకు వెళ్లినా ఆడవాళ్లు, వృద్ధులు తప్ప రైతులు కన్పించేవారు కాదు, కాడిని పక్కన పారేసి వలస పిట్టల్లా హైదరా బాద్ వైపు ఎగిరి పోయేవాళ్లు.ఇదంతా దూరదర్శన్‌లో కెమేరా మేన్‌గా పనిచేస్తున్న సతీష్ చూశాడు. ఉద్యోగాన్ని వదిలేసి, జహీరాబాద్ వచ్చాడు. అక్కడ వివక్ష, వేధన,బాధను చూశాడు. తరతరాలుగా అన్యాయం ఉందని గుర్తించాడు.కులాల్లో వ్యవసాయం చేసే వారు వేరేగా ఉన్నారనే సంగతిని కనిపెట్టాడు.
వీటన్నింటికీ పరిష్కారం భూమి మాత్రమే అని అడోళ్లకు చెప్పాడు.‘‘ ఎర్రజెండాలను భూముల్లో పాతితే విప్లవం రాదు, ఎర్రమట్టిలో సారం నింపి, సొంత విత్తనాలు నాటాలి అన్నాడు.అతడి వెంట పైట కొంగులను బిగించి పలుగు, పార పట్టుకొని నడిచారు . అలా ‘ డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ ’ ఏర్పాటయింది.జహీరాబాద్ చుట్టూ విసిరేసినట్టుండే ఎల్గోయి, రేజింతల్, జీడిగడ్డ, పస్తాపూర్, ఖాసింపూర్, పొట్‌పల్లి, చిలుకపల్లి వంటి 30 పల్లెల్లో ఆరువేల మంది ఆడబిడ్డలు మిల్లెట్స్‌ని ఒక ఉద్యమంగా పండిస్తున్నారు.వారు అక్కడితో ఆగలేదు, సొంత విత్తనాలతో సీడ్ బ్యాంక్ పెట్టారు. ఆర్గానిక్ ఎరువులను, గానుగ నూనెలు తయారు చేస్తున్నారు. బ్రెడ్ నుండి అరెసెలు వరకు చిరు ధాన్యాల తో అరుదైన అరవై రకాలు ఫుడ్ ప్రోడక్ట్స్ చేస్తున్నారు. చివరికి సొంతంగా మిల్లెట్స్ రెస్టారెంట్‌నే నిర్వహిస్తున్నారు.
వీరు ఇంత చేస్తున్నా మీడియా సహజంగా నే పట్టించుకోలేదు. దాని వల్ల వారు మరికొన్ని విద్యలు నేర్చారు. సొంతంగా రేడియో స్టేషన్ పెట్టారు. కెమేరాలు పట్టుకొని తమ జీవన చిత్రాలను తామే తీసి ఎడిట్ చేస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న ఒకే ఒక్కడు పీవీ సతీష్. తన జీవితానికి సరిపోయినంత కాదు,ఇంకా ఎక్కువే ఈ సమాజానికి ఇచ్చి వెళ్లిపోయే ముందు మాతో మాట్లాడారు. ఇదీ వీడియో… https://youtu.be/0CC9fw1E7mUhttps://youtu.be/0CC9fw1E7mU