మాతో రండి, అలా అరణ్యం వైపు వెళ్లొద్దాం. అక్కడొక అరుదైన వ్యక్తి మన కోసం చినుకుల మధ్య ఎదురు చూస్తున్నాడు. అతడు చొక్కా తొడుక్కోడు, చెప్పులు వేసుకోడు ! అసలు చెప్పులు ఎలా ఉంటాయో తెలీదు. ఉత్సాహంగా రోజూ ఆరు కిలో మీటర్లుకు పైగా అడవి దారుల్లో నడుస్తాడు. భూమి దున్న కుండా పంటలు పండిస్తాడు. సొంత విత్తనాలు సొరకాయ బుర్రలో దాచుకుంటాడు. ఎర్రచీమలే అతడి పరమాన్నం…
తెలంగాణ లో కొత్తగూడెం నుండి 70 కిలో మీటర్లు వెళ్లి, మోకాళ్ల లోతులో వాగు దాటితే లక్ష్మీదేవిపల్లి మండలంలో క్రాంతినగర్ తండా కనపిస్తుంది. సుమారు వంద గడపలుంటాయి. ఈ ప్రాంతం అభయారణ్యం లోపలకు ఉండటడంతో విద్య, వైద్యం, విద్యుత్ వంటి కనీస అవసరాలు అందుబాటులో ఉండవు. మూడు దశాబ్దాల క్రితం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడ అడవులను ఆసరా చేసుకొని స్ధిర పడిపోయారు. వారికి తెలుగు, గోండు, కోయ భాషలు తెలుసు.
చెప్పులు ఎలా ఉంటాయో తెలీదు!!
క్రాంతినగర్ తండా వాసి, సోడి గంగ వయస్సు 70 ప్లస్. అయినా ఉత్సాహంగా నిత్యం ఆరు కిలో మీటర్లుకు పైగా నడుస్తాడు. ఉదయం 5 గంటలకు తన రెండు ఎకరాల పొలంలోకి వెళ్లి రోజంతా పని చేసి సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అడవుల్లో తేనె, తునికిపండ్ల కోసం మైళ్ల దూరం నడుస్తుంటాడు కానీ, ఎంత ఎండ ఉన్నా చెప్పులు వేసుకోడు.” పొలం పనిలో పాదాలకు రాళ్లు గుచ్చుకుంటాయని ఒక సారి చెప్పుల జత తెచ్చినా ఇంత వరకు వాటి వైపు చూడలేదు… ఇప్పటి వరకు బస్సు ఎక్క లేదు.” అంటాడు గంగ బంధువు లక్ష్మణ్ .
అతడికి ఇద్దరు కొడుకులు , ముగ్గురు ఆడపిల్లలు. ఎవరు చదువుకోలేదు, అందరూ వ్యవసాయపు పనులు, అటవీ ఫలసాయం మీద బతుకుతుంటారు. సోడి గంగ జీవన చిత్రం ఈ వీడియో లో ఉంది చూడండి .