కరవును ఎదురించిన ‘వాటర్ ఛాంపియన్ ’!

కోవిడ్‌ని మించిన మహమ్మారి ఇది. దీనికి వ్యాక్సిన్‌ కూడా ఉండదు.  దేశాల ఆర్ధిక స్ధితి కూడా తల్లకిందులవచ్చు. ఇది ఎప్పటి నుండో మనకు తెలిసిన పాత శత్రువే… అదే కరువు. ఇక ముందున్నది కరువు కాలమనే అనేక అధ్యయనాలు తేల్చేశాయి.  గత రెండేళ్లుగా  కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు మరో ముప్పు ఇది. వాతావరణంలో వస్తున్న మార్పులు, జల సంరక్షణ లోపాల వల్ల  భవిష్యత్తులో ప్రజలు కరువుతో అల్లాడిపోతారని ఐక్యరాజ్యసమితి సహా వివిధ అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సమగ్ర ప్రణాళికను ఇప్పట్నుంచే రూపొందించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాయి.

ఇలాంటి పరిస్ధితులను అయిదేళ్ల క్రితమే ఊహించి, పంటలసాగులో మార్పులు తెచ్చి,  రాయల సీమ నేలతల్లి గొంతు తడిపి  ‘జాతీయ మహిళా వాటర్‌ ఛాంపియన్‌ ’ పురస్కారం అందుకున్నది పారేశమ్మ. ప్రజల ఐకమత్యంతో సాధించిన ఈ విజయగాధ తెలుసుకోవాలంటే, చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె వైపు చూడాలి.

కరవు కన్నీళ్లు పెట్టిస్తున్నా.. కష్టాలు కడుపు మాడుస్తున్నా విధిని నిందించకుండా ఎదురెళ్లారు. పారేశమ్మ స్పూర్తితో … నేను బాగుండాలి అని ఎవరికి వారు అనుకోకుండా… అందరూ బాగుండాలనుకున్నారు. ఆ సమభావన, లక్ష్యమే వారి జీవితాల్ని మార్చేసింది. 

‘‘ ఆ రోజులు ఇంకా గుర్తే. మాకు ఎకరం భూమి ఉన్నా, పంటలు లేక కుటుంబం గడవడమే కష్టమయ్యేది. అర్జెంట్‌గా అయిదొందల రూపాయలు అవసరమై తెలిసిన వ్యాపారిని అప్పు అడిగితే రోజుల తరబడి తిప్పుకుని అధిక వడ్డీకి ఇచ్చాడు. ఇపుడు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. నేడు, అతడే మా దగ్గరకే వచ్చి అప్పు అడుగుతున్నాడు.’’ అంటూ గర్వంగా చెబుతుంది పల్లె సంఘం సభ్యురాలు.

కరువు కొత్తేమీ కాదు

‘‘ భూగర్భ జలాలు అడుగంటిపోవడం మాకు కొత్తేమీ కాదు. కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ తంబళ్లపల్లె . సాగు చేయడానికి నేల ఉంది, పంటలు పండిరచడానికి నీరే లేదు.  తంబళ్లపల్లెతోపాటు చుట్టుపక్కల పదహారు గ్రామాలు నేడు ఆ దుస్థితి నుంచి గట్టెక్కాయి. దీని కోసం వేల అడుగులు నడిచింది పారేశమ్మ. ఆమె శ్రమను గుర్తించిన  యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, నేషనల్‌ వాటర్‌ మిషన్‌లు నేషనల్‌ ఉమెన్‌ వాటర్‌ చాంపియన్‌ అవార్డును ప్రకటించాయి.’’ అంటారు, ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ’ ప్రతినిధి సుధీర్‌. ఇది పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతం. ఇక్కడ 50 శాతం వరకు ఉమ్మడి వనరుల భూములున్నాయి. వీటి మీద ఆధారపడి ఈ ప్రాంతపు ప్రజలు జీవిస్తున్నారు, ఈ వనరులను కాపాడుకోవడానికి పల్లె సంఘాలతో కలిసి ఉమ్మడి వనరుల పరిరక్షణ కోసం ఈ సంస్ధ పనిచేస్తున్నది.

ఎవరీ పారేశమ్మ?

 ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలం, గోపిదిన్నెకు చెందిన పారేశమ్మ ఐటీఐ పూర్తి చేసింది. పారేశమ్మ తల్లిదండ్రులకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నప్పటికీ సాగునీరు లేక  వ్యవసాయం చేయలేక, కూలీ పనులు చేసుకునేవారు.  పారేశమ్మ అదే గ్రామానికి చెందిన  బయ్యా రెడ్డి ను కులాంతర వివాహం చేసుకుంది. అతడు తంబళ్లపల్లె పంచాయతీలో పారిశుద్ద్య కార్మికునిగా పనిచేస్తున్నాడు.

ఎన్జీఓ లో చేరి…

 భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక పని చేయాలి, అని వెతుకుతున్నపుడు,  భూగర్భ జల సంరక్షణ,సుస్ధిర వ్యవసాయం,పర్యావరణం కోసం పనిచేస్తున్న  ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎకోలాజికల్‌ సెక్యూరిటీ’ సంస్థ గురించి తెలిసి ఉపాధి కావాలని అడగగా , అమెలోని చురుకు దనం గుర్తించి, 2015లో నెలకు రూ. 4,500 గౌరవ వేతనంతో తంబళ్లపల్లె పంచాయతీ లో రీసోర్స్‌పర్సన్‌గా తీసుకున్నారు.

 తంబళ్లపల్లె పరిసరాల్లోని 16 పల్లెల్లో రైతులకు అవగాహన కల్పించడం ఆమె పని.  వ్యవసాయంలో ఎంతో అనుభవం ఉన్న  రైతులకు సూచనలివ్వాలి. చెప్పడానికి పారేశమ్మ సిద్ధంగా ఉన్నా, వినడానికి ఎవరూ ముందుకు రాలేదు. వాళ్లు అలవాటు పడిన పాత సాగు పద్ధతుల్లో మార్పు తీసుకురావడం సులువు కాదు. అందులోనూ సేద్యంలో అనుభవం లేని పారేశమ్మ చెప్తుంటే పట్టించుకునేదెవరు?

నీటి విలువ తెలిసి ముందుకు సాగాం…

‘‘ మొదట్లో నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. నేను రైతుకుటుంబానికి చెందిన దానిని కాబట్టి నీటి విలువ తెలుసు. చిన్నపుడు కుంటలు వాగులు ఉండేవి. అవి ఎండిపోవడంతో వందలాది బోర్లు తవ్వేస్తున్నారు. ఇపుడు వెయ్యి అడుగులు కూడా వేస్తున్నారు. అందుకే నీటి పొదుపును వారికి తెలియ చేస్తున్నాను.  తంబళ్లపల్లె, బురుజు, బోడికిందపల్లె, కొండకింద మేకలవారిపల్లె, ఇట్నెనివారి పల్లె, పులసవాండ్లపల్లె, గోళ్లపళ్లోపల్లె, చెవిటివారిపల్లె, ఎగువబోయపల్లె, బలకవారిపల్లె, చెన్నప్పగారిపల్లె, నాయనప్పగారిపల్లె, దబ్బలగుట్టపల్లె, కురవపల్లె, మట్టావాండ్లపల్లె, చేలూరివాండ్లపల్లెలు తిరిగి, ఇంటికి ఒకరిని సంఘంలో చేర్చాను. వారితో నిత్యం మీటింగ్‌లు  నిర్వహించి,  ఏయే పల్లెల్లో భూగర్భజల మట్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేసి వివరించాను. వాన నీటి సంరక్షణ కోసం ఏం చేయాలి? తక్కువ నీటితో చిరుధాన్యాలు ఎలా పండిరచవచ్చో చెప్పేదాన్ని, నీటివనరును బట్టి ఏ పంటలు వేసుకోవాలో అవగాహన కల్పిస్తూ  అందుకు అనువైన పంటలను పరిచయం చేయడంతో  అందరూ కలిసివచ్చారు. కొండవాలులో వాననీటిని ఒడిసిపట్టే కందకాలు తవ్వాం. సహజవనరులను ఇప్పటి నుండి కాపాడుకోక పోతే పశువులకు గడ్డి కూడా పెరగదు. ఈ అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో మేం ఇంకా ఎక్కువ పనిచేస్తాం…’’ అని వివరించింది, ఎఫ్‌ఈఎస్‌ రీసోర్స్‌ పర్సన్‌, పారేశమ్మ.

గ్రామాల్లో  పరిస్థితులు అనుకూలించక పోయినా, ఆమె పట్టుదలతో ముందడుగు వేసింది. ఒక్కొక్క పల్లెకు ఒకటికి పదిసార్లు వెళ్లింది. రాత్రి 8 గంటల దాక పల్లెల్లోనే… నీటిని పొదుపుగా వాడక పోతే కలిగే నష్టాలను, అధిక నీటి వినియోగమయ్యే పంటలసాగుతో కలిగే ఇబ్బందులను  వివరిస్తూ వచ్చింది. ఆమె మాటలు క్రమంగా  రైతులు వినడం మొదలు పెట్టారు. కరవును ఎదుర్కోక పోతే కష్టాలు తప్పవని గ్రహించారు. అలా పారేశమ్మ పంటల సాగులో మార్పుకు వారిని ఒప్పించింది.

చివరికిలా సాధించింది!

వర్షాభావ పరిస్థితులు ఇక్కడి  రైతులను కుదేలు చేశాయి. కొన్నేళ్లుగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. వ్యవసాయంపై ఆధారపడ్డ రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదని భావించి,  పారేశమ్మ ఆశయాలకు సహకరించారు.

1, ఈ ప్రాంతపు  రైతులు వరి, టమాట పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు. ఆ విధానం మార్చింది పారేశమ్మ.  సగం పొలంలో రైతుకు ఇష్టమైన పంట వేసుకుని, మిగిలిన సగంలో  కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు సజ్జలు, రాగులు లాంటి చిరుధాన్యాలు సాగు చేసేలా ఒప్పించింది.

గత ఏడాది 60 మంది రైతుల చేత 75 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చేయించారు. ఎకరాకు ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిరచే ఈ విధానం వల్ల రైతులకు నష్టాలు తగ్గాయి.

2, ఈ పల్లెల చుట్టూ కొండలు, గుట్టలు ఉంటాయి.  సహజంగా ఉన్న ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం, వాలుకడ్డంగా కందకాలు తవ్వి, భూమికోత నివారించారు.  మొక్కల పెంపకం ద్వారా గుట్టలను పచ్చగా మార్చారు.

3,  భూగర్భజలాల వృద్ధికి పొలాల్లో కందకాలు తవ్వుకుంటే నీరు పొలంలోనే ఇంకిపోయి తేమ శాతం పెరుగుతుందని అవగాహన కల్గించారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించే విధానాలు, సేంద్రియ పద్ధతుల్లో సాగు, నాణ్యమైన విత్తనాల ఎంపిక, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించేలా క ృషి చేస్తున్నారు. తక్కువ ధరకు మేలైన విత్తనాలు, ఎరువులు అందివ్వడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తూ,   భూగర్భ జలాలు అభివ ృద్ధి లక్ష్యంగా సేద్యపు కుంటలను, చెక్‌ డ్యామ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

4, ఉపాధి హామీ పథకం పనుల్లో అధికంగా నీటినిల్వ పనులు చేసేలా ప్రోత్సహించింది. ఫలితంగా ఇప్పుడు ఈ పల్లెల్లో ఒక వర్షానికే కుంటలు నిండిపోతున్నాయి. భూగర్బ జలాలను బట్టి పంట మార్పిడి,  కొత్తగా పచ్చదనం పెంచడం ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. అడవిలో అగ్ని ప్రమాదాలు తగ్గించారు.

ఇలా గ్రామాల్లో చైతన్యం తీసుకురావడానికి పారేశమ్మ ఒంటరిపోరాటం చేసింది. ఆమె కృషికి గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి, జాతీయ వాటర్‌ మిషన్‌ లు ‘విమెన్‌ వాటర్‌ ఛాంపియన్‌ ’ అవార్డుకు ఎంపిక  చేశాయి.

‘‘  ఒకపుడు ఇక్కడ నెమళ్లు కానీ జింకలు కానీ కనపడేవి కాదు.ఇపుడు దండీగా తిరుగుతున్నాయి. కణితులు కూడా ఉన్నాయి. బోడి కొండలు పచ్చగా మారి భూగర్భజలాలు పెరిగాయి.’’ అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్యాంమోహన్‌ ( 9440595858  )

…………………………………………………………………………..

ముఖరా‘కె’ ఒక చిన్న ఊరు. తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండ‌లంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పచ్చదనం ఎలా ఉంటుందో తెలీదు. హరిత హారం ప్రారంభించిన తరువాత ఎలా మారిందో చూడండి.

……………………………………………………………………………………………………

గత15 సంవత్సరాలుగా నల్లమల అడవుల్లో తిరిగి ఎందరో మూలికా వైద్యులను కలిసి ఔషధ మొక్కల గురించిఅరుదైన సమాచారం తెలుసుకున్న, ప్రక్రుతి వనమూలికల నిపుణుడు ,కొమెర జాజి ( గురూజీ ), మోకాలి నొప్పిలు మాయం చేసే  మొక్కను పరిచయం చేస్తున్నారు…https://youtu.be/qEdcm7ZzTow

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles