“ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది..

‘ఖాకీవనం’ వచ్చి 40 సంవత్సరాలు Firebrand pathanjali’s first salvo! ——————————————————-

చేవగల రచయిత కె. ఎన్. వై పతంజలి తొలినవల “ఖాకీవనం” 1980 నవంబర్ లోఅచ్చయింది.ఈనాడు మాసపత్రిక ‘చతుర’ లో వచ్చిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. చతుర చకచకా అమ్ముడుపోవడంతో ఖాకీవనాన్ని మళ్ళీ ప్రింట్ చెయ్యాల్సివచ్చింది.డిమాండ్ బాగా ఉండడంతో రెండోసారి కూడా ప్రింట్ చేశారని నాకు గుర్తు.అపుడు చతుర ఎడిటర్ చలసాని ప్రసాదరావుగారు.

1975-80…ల్లో మధ్యతరగతి జీవితాలు,ప్రేమ, కన్నీళ్ళు, సెక్సు,క్రైమ్, దెయ్యాలు, కాష్మోరాలు,క్షుద్రపూజలతో వచ్చిపడుతున్న నవలల మధ్య పతంజలి “ఖాకీవనం” బాంబ్ షెల్ లా పేలింది.రచయితలు ఉలిక్కిపడ్డారు.అప్పటికి పతంజలి కొన్ని కథలు మాత్రమే రాసివున్నారు. ఆయన తెచ్చిన చిన్న కథాసంకలనం పేరు “దిక్కుమాలిన కాలేజీ” (1976).మన పోలీసు వ్యవస్థ దుర్మార్గాన్ని ఉతికి ఆరేసిన తొలినవల ‘ఖాకీవనం’.హృదయంలేని ఖాకీతనాన్ని లాగిలెంపకాయ కొట్టినట్టూ,నిరంకుశాధికార పోలీసు చట్రాన్ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పేల్చిపారేసినట్టూ అనిపిస్తుంది ఖాకీవనం చదువుతుంటే.1952 మార్చిలో పుట్టిన పతంజలికి ఖాకీవనం రాసేనాటికి 27 ఏళ్లవయసు.’ఈనాడు’లో జర్నలిస్ట్.

*** ***

ఖాకీవనం నవల ఇలా మొదలవుతుంది:”ఒరే” అని పిలిచింది కొత్త ఎస్.పీ భార్య.సుందరయ్య తుళ్ళిపడి చూసాడు. “ఇప్పుడే వస్తానని వెళ్లిన ఆ పనిలంజ అదే పోత పోయినట్టుంది.ఈ దిక్కుమాలిన వూరిలో మరో ముండే దొరకలేదా మీకు? మీ అయ్యగారికి?దాని గుండెలమీద తన్ని తగిలేసి మరోదాన్ని తీసికిరండి…ఇదిగో చంటిది దొడ్డికి కూచున్నట్టుంది…కాస్తకడిగీ…”అని చెప్పి ఆవిడ విసవిసలాడుతూనే లోపలికి వెళ్ళిపోయింది.సుందరయ్య కొయ్యబారిపోయాడు.

చారల టోపీతో పాటు బుర్రనికూడా వీధి వరండాలోనే జాగ్రత్తచేసి రానందువల్ల,పళ్ళబిగువున కదిలి ‘అమ్మగారు’ చెప్పిన పని పూర్తిచేసి పెరటిలోంచి చుట్టూ తిరిగి వీధిలోకి వచ్చాడు.

ప్రహరీగోడకు ఆనుకొనివున్న నీలగిరి చెట్టుకింద ఆర్డర్లీ కానిస్టేబుల్స్ నించొని ఉన్నారు.సుందరయ్య అక్కడికి చేరుకున్నాడు.

“ఈవిడగారికి ఒళ్లంతా కొవ్వేన్రా బాబూ.పనిమనిషి రాలేదని పిల్లముండ ముడ్డి నాచేత కడిగించింది.ఆ ఎస్.పీ. నంజికొడుకుని చెప్పుచ్చుకుని కొడితే ఆడి పెళ్ళానికి బుద్దొస్తుంది.

” సుందరయ్య చాలా కోపంగా…ఎంతవిసురు! ఎంత దురుసు! ఇంత మోటుగా,ఇంత ‘అమర్యాదకరంగా’ మొదలవుతుంది నవల.మొదటి రెండు మూడు పేరాలతోనే పాఠకుణ్ణి పడగొట్టేస్తాడు పతంజలి. ఈ120 పేజీల నవల ఇదే దూకుడుతో,ఖాకీల దుమ్మురేపుతూ సాగిపోతుంది.మనకి ఊపిరి సలపనివ్వదు.పోలీసు అధికార్లకి నిద్రపట్టనివ్వదు కూడా!

*** ***

అప్పట్లో రెండు రాష్ట్రాల్లో పోలీసులు తిరగబడ్డారు.సమ్మెకట్టారు.ప్రభుత్వాలు గడగడలాడిపోయాయి.ఈ చారిత్రాత్మక సమ్మె పతంజలి ఖాకీవనం రాయడానికి కారణం అని అనుకుంటాను. “లోయర్ కేడరంతా ఇవ్వాళ లోడుచేసిన తుపాకీలాగ పేలడానికి సిద్ధంగా ఉంది” అని రాసారు రచయిత.

*** ***

1978 ఫిబ్రవరిలో నేను విశాఖ ‘ఈనాడు’లో జాయిన్ అయినప్పుడు పతంజలి నా సీనియర్.78 చివరిలో ఆర్టిస్ట్ మోహన్ విశాఖ వచ్చాడు.నన్ను కలవడానికి ‘ఈనాడు’ ఆఫీసుకు వచ్చాడు.అప్పుడు సీతమ్మధారలో ‘ఈనాడు’ ఎదురుగా ఉండే టీకొట్టులో మోహన్ని, పతంజలికి పరిచయం చేశాను.

1979 చివరిలో కావచ్చు.పతంజలిని విజయవాడ ‘ఈనాడు’ కి పంపించారు.ఆ సంవత్సరం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ నవలల పోటీకి…అంటూ ‘ఖాకీవనం’, విశాలాంధ్రలో పనిచేస్తున్న మోహన్ చేతికిచ్చారు పతంజలి. చదివి బాగా ఇంప్రెస్ అయిన మోహన్,అప్పటి పబ్లిషింగ్ హౌస్ సూపర్ బాస్ పి.సి.జోషి గారికి ఇచ్చాడు.

జోషీ, కేతు విశ్వనాథరెడ్డి,తుమ్మల వెంకట్రామయ్య గార్లు,అమర్యాదకరమైన,మొరటు భాషలో, వ్యవస్థ మీద మెరుపుదాడి లాంటి ‘ఖాకీవనం’చదివి తట్టుకోలేకపోయారు.వాళ్ళ సున్నితమైన హృదయాలు గాయపడి ఉండొచ్చు.పతంజలి నవలని తిరస్కరించారు.

ఆ సంవత్సరం మొదటి బహుమతి, కేశవరెడ్డి నవల :’స్మశానం దున్నేరు’ కి దక్కింది.తర్వాత ‘చతుర’ లో వచ్చిన ఖాకీవనం, పతంజలి అనే ఫైర్ బ్రాండ్ రచయితని పరిచయం చేసింది.

*** ***

1982లో వచ్చిన ‘ఈనాడు’ తిరుపతి ఎడిషన్ కి ప్రమోషన్ మీద,విజయవాడ నుంచి పతంజలి,విశాఖ నుంచి నేనూ వెళ్లాం.రేణిగుంటలో పత్రికాఫీసు. నేను బాధ్యతగా పేపర్ చూసుకుంటాననే భరోసాతో, ‘ఈనాడు’ ఆఫీసులోనే,డ్యూటీ టైంలోనే పతంజలి, రెండో నవల ‘పెంపుడు జంతువులు’ రాశారు. యాజమాన్యం అడుగులకు మడుగులొత్తే వెన్నెముకలేని జర్నలిస్టులని హేళన చేసిన పదునైన రచన అది.అప్పుడే, అక్కడే ఆయన ‘రాజుగోరు’ నవల కూడా రాశారు.ఈ రెండు నవలల రాతప్రతులకు తొలిపాఠకులం నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, నేనూ. రేణిగుంటలో చింతచెట్లకింద టీలు తాగిన సాయంకాలాలు,వెన్నెల్లో జనసంచారం లేని ఆ తార్రోడ్డు మీద నడిచిన రాత్రులూ… మాటలన్నీ, పరిగెత్తించే ఈ నవలల గురించే. జోకులన్నీ పతంజలి వాక్యాల మీదే!

*** ***

అవి కుర్రరచయిత పతంజలి, తన దారి తాను వెతుక్కుంటున్న రోజులు… తానేం చేయాలో,ఏం రాయాలో,తానే తర్కించుకొని,సణుక్కుని, తనలో తానే మాట్లాడుకుంటూ,సిగిరెట్లని తగలబెడుతున్న సమయం అది. Discovery of the real pathanjali అనే అంతర్మథనంలో ఒక 30సంవత్సరాల రచయిత, ధైర్యంతో,సాహసంతో, అసాధారణమైన కామన్ సెన్స్ తో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలిగిన వేళ అది! అప్పుడు మేం ఇద్దరం ఒన్ బై టూ చాయ్ తాగుతున్నాము.నేనాయన సిగిరెట్ వెలిగిస్తున్నాను,ఆయన చెయ్యి నా భుజంమీద ఉంది. నామిని సుబ్రహ్మణ్యం నాయుడూ,మేర్లపాక మురళి,దాట్ల నారాయణమూర్తి రాజు అనే ముగ్గురు సాక్షులూ మాతోనే ఉన్నారు.ఆ సాయంకాలం… ఆకాశం లేత ఎరుపురంగులోకి మారుతోంది. చింతచెట్లమీద పిట్టలు అల్లరి చేస్తున్నాయి. దూరంగా రైలు వెళుతున్న చప్పుడు…. మహారచయిత కావడానికి ఇంకొద్ది దూరంలోనే ఉన్న,కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి అనే జర్నలిస్టు మిత్రుడు, నలిగిన లాల్చీతో,చేతిలో వెలుగుతున్న సిగరెట్ తో, ఒక పాత దిక్కుమాలిన సైకిల్ స్టాండ్ తీసి, “వెళ్తానండీ” అంటూ ముందుకి కదిలాడు.

*** ***

పరిణతి చెందిన పతంజలి, తర్వాతి కాలంలో… “ఖాకీవనం, పెంపుడు జంతువులు నాకు తెలియని విషయాల్ని తెలుసుకుని రాసిన నవలలు.వాటికంత ప్రాధాన్యం లేదు” అని అనేకసార్లు చెప్పారు.తనకి బాగా తెలిసిన ఉత్తరాంధ్ర రాజుల జీవితాల గురించి చేసిన రచనలు కవుల్నీ,రచయితల్ని,జర్నలిస్టుల్నీ, పండితుల్నీ ఆశ్చర్యపరిచాయి. రాజుగోరు,వీరబొబ్బిలి,గోపాత్రుడు,రాజుల లోగిళ్ళు(అసంపూర్తి నవల) పతంజలి లోతైన పరిశీలనకూ,హాస్యదృష్టికీ,రచనా నైపుణ్యానికీ నిలువుటద్దాలుగా ఎప్పటికీ నిలిచి వుంటాయి. రాజుల బేషజాలు,ఎకసెక్కాలు, వాళ్ళ జీవితాల్ని కుంగదీస్తున్న పేదరికం…ఐనా దర్జా వెలగబెట్టాలన్న తాపత్రయం… లోన లొటారపు ధ్వనుల్లోని విషాదసంగీతాన్ని తెలుగుసాహిత్యంలో ప్రతిభావంతంగా ‘ధ్వనిముద్రణ’ చేసినవాడు పతంజలి

*** ***

అది 1992.హైదరాబాద్. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకుడు వాకాటి పాండురంగారావు. పతంజలి ఎప్పుడోరాసి,ఒక చిన్నపత్రికలో సగంవచ్చి ఆగిపోయిన ‘గోపాత్రుడు’ నవలిక వాకాటి చేతికి అందింది.స్వతహాగా మంచిరచయిత అయిన వాకాటి పతంజలి రచన చదివి తేరుకోలేకపోయారు. పదాలవిరుపు,వాక్యవిన్యాసం,వ్యంగ్యం,ఫక్కున నవ్వించే హాస్యధోరణి,అధిక్షేపం,కన్నీటి బిందువులో మెరిసే జీవితపు చివరాఖరి ఆశ,భోరున కురిసే చికటిచినుకుల విషాదం…భూమి గుండ్రంగా ఉంటదా?బల్లపరుపుగానా?అనే గొడవతో ఒక గ్రామం రెండు ముఠాలుగా చీలిపోతుంది.సర్కిల్ ఇన్స్పెక్టర్ కి చిరాకెత్తుతుంది.

“భూమి మా టోపీ లాగుంటుంది. భూమి పోలీసోడి లాఠీ లాగుంటాది తెలిసిందా?” అని గదమాయిస్తాడు. ఇక, ఈ జోడు గుర్రాల బండిని పతంజలి చివరాకరి దాకా దూకించి, పరిగెత్తించి, నవ్వుల దారుల్లో నడిపించి, ఆఖరికి మనం ఎంత పనికిమాలిన వాళ్లమో, చాచి కొట్టినట్టుగా చెబుతాడు.ఆంధ్రప్రభ వీక్లీలో గోపాత్రుడు నాలుగైదు వారాలు సీరియల్ గా వచ్చింది, మోహన్ బొమ్మలతో. అప్పుడు విజయవాడలో ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ గా వున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మ, గోపాత్రుడు చదివారు. ఒక సంపాదకుడు మరో వీక్లీ కి లెటర్ రాయడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పతంజలి గోపాత్రుడు గురించి ఒక పాఠకునిలా పురాణం రాసిన లేఖ ‘ఆంధ్రప్రభ’లో వచ్చింది. ఆ లెటర్ లో…”గోపాత్రుడు లాంటి చీమూనెత్తురూ, సిగ్గూశరమూ వున్న నవల రాయలేకపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. తెలుగు సాహిత్యంలో గురజాడ మహాశయుని తర్వాత ఇంత హాస్యం రాయగలిగిన ప్రతిభా సంపన్నుడు పతంజలి మాత్రమే’ అని పురాణం రాసారు. పతంజలి గారికి సాహిత్య అకాడమీ అవార్డులూ, పద్మశ్రీలూ రాకపోయినా పురాణం గారి ప్రశంస చాలదూ!

*** ***

పతంజలి జీవించి వున్నప్పుడు చాసో, రావిశాస్త్రి పురస్కారాలు పొందారు. ‘సిందూరం’ సినిమాకి మాటల రచయితగా ‘నంది’ అందుకున్నారు 2009లో. పతంజలి చనిపోయాక ఆయనకి రెండు చెప్పుకోదగ్గ గౌరవాలు దక్కాయి. ఒకటి : ‘మనసు’ ఫౌండేషన్ వారు పతంజలి రచనలు అన్నీ కలిపి రెండు సంపుటాలుగా తీసుకువచ్చారు. రెండు : ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ సిరీస్ లో భాగంగా పతంజలి monograph ని సాహిత్య అకాడమీ 2017 లో ప్రచురించింది. ఆసక్తికరమైన, సమగ్రమైన 125 పేజీల ఈ మోనోగ్రాఫ్ ని రచయిత, జర్నలిస్టు చింతకింది శ్రీనివాసరావు రాశారు.

***

ఒకటీ అరా తప్ప, పతంజలి అన్ని కథలకీ, నవలలకీ ఆర్టిస్ట్ మోహనే బొమ్మలు వేశాడు. 1995 ‘ఇండియాటుడే’ వార్షిక సాహిత్య సంచికలో వచ్చిన పతంజలి ‘పిలక తిరుగుడు పువ్వు’కి మోహన్ వేసిన రంగుల బొమ్మలు గొప్ప వర్క్. పతంజలివి రెండు కేరికేచర్లు,రెండు పోర్ట్రైట్ లూ వేశాడు మోహన్.

ఆయన కథలకి ‘ఓన్లీ పతంజలి’ శీర్షికతో మోహన్ ముందు మాటలో ఇలా అన్నాడు : “పతంజలిలా కనిపించిందీ, పతంజలిలా వినిపించిందీ, పతంజలీ చాలా వేరేమో!… ఎందుకంటే, పతంజలి లాంటి విస్తృతి గల, తలతిక్కగల, ఆలోచనగల, చదవగల, రాయగల పరమ అవకతవక పిచ్చోడు తెలుగు సాహిత్యానికి దొరకడు

“***

అవునూ, ఇన్ని రాసి, ఇంత చేసి, ఎంతోమందికి అభిమాన రచయితగా కీర్తితో, యశస్సుతో కాంతులీనే కె.ఎన్.వై.పతంజలి సాహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ విప్లవ రచయితల సంఘం ఒక్క సభ కూడా జరపదు. ఎందుకో?పతంజలి అంతటివాడి రచనల్ని సెలబ్రేట్ చేసుకోవడం మన విధి అని అభ్యుదయ రచయితల సంఘం సరదాకి కూడా అనుకోదు. అదేమిటో? మన జర్నలిస్టు, మన సంపాదకుడు, మనతో ఉంటూనే మహా రచయితగా ఎదిగిన వాడంటూ జర్నలిస్టు సంఘాలు ఒక్క సభ కూడా పెట్టాలని ఎప్పుడూ అనుకోవెందుకో…? పోనీ, వుదారంగా పతంజలిని ఉత్తరాంధ్ర రచయితగా కుదించి చూసినా, మా గురజాడ, మా రావిశాస్త్రి, మా పతంజలి అంటూ గుండెలు బాదుకునే విశాఖ రచయితల సంఘం లేదా విశాఖ సాహితి ఇన్నేళ్లలో పతంజలి కోసం ఒక్క సభ కూడా పెట్టకపోవడం ఏమిటో? ‘నా అభిమాన రచయిత పతంజలి’ అని రావిశాస్త్రి డిక్లేర్ చేసినా వీళ్ళకెందుకు పట్టదో? “దెస్టోయ్! దైద్రవోయ్!!”ఏళ్లతరబడి ప్రతివారమూ సాహిత్యానికి పూర్తిపేజీ ఇస్తున్న సాక్షి,ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఏనాడూ పతంజలి సాహిత్యం మీద ఒక వ్యాసం వచ్చినట్టుగానీ,చర్చ జరిగినట్టుగానీ నాకైతే గుర్తులేదు.ఎందుకిలా జరిగింది? ఈ దారుణానికి కారణం?విషాదం అనేది, చావు… అనుకునేది ఎక్కడో దాక్కొని వుండదు. మనం విసుక్కుంటున్న, మనం విస్మరిస్తున్న, మనమంతా నడుస్తున్న ఈ బల్లపరుపు భూమ్మీదే, మన చుట్టూనే, మనల్ని చూస్తూనే, మన నీడగానే ఉంటుందేమోననిపిస్తోంది!

TAADI PRAKASH 97045 41559

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles