పేదలు సోమరులైతే పరిశ్రమలు నడవ్వు, పొలాలు పండవు.

ఎవరు సోమరులు?

( G S Ram Mohan ) ప్రభుత్వ ధనాన్ని పేదలకు పంచిపెట్టి సోమరులను చేస్తున్నారు అనే మాట ఇటీవల తరచుగా వినిపిస్తోంది. పేదలు సోమరులైతే పరిశ్రమలకు పెట్టుబడి ఎక్కడినుంచి వస్తుంది. ఆకాశం నుంచి ఊడిపడుతోందా, దావీదు మాయా?జేబులోంచి తీసి అంతంత పెట్టుబడి పెడతున్నారా? వాళ్ల అయ్యా, అమ్మా రెక్కలు ముక్కలు చేసుకుని కోట్లు కూడబెట్టారనుకోవాలా? పిత్రార్జితమా,(మాత్రార్జితం దగ్గరికి మనం ఇంకా ప్రయాణించలేదు), కష్టార్జితమా?

నువ్వూ నేను అందరం కష్టపడి పనిచేసి దాచుకునే డబ్బు, కట్టే పన్నులు తిరిగి పెట్టుబడి రూపంలో వాళ్లకు చేరుతోంది. భవిష్యత్తు కోసం పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం, రిటైర్మెంట్ జీవితం కోసం ఇంకా సవాలక్ష రోజువారీ అవసరాల కోసం దేశంలోని కోట్లాది శ్రమజీవులు అలియాస్ ‘సోమరిపోతులు’ రోజంతా వైట్ కాలరో బ్లూకాలరో, కాలర్లెస్సో కూలీ చేసి పైసా పైసా కూడబెట్టి బ్యాంకుల్లో పెడితే అది వేల కోట్ల, లక్షల కోట్ల రూపమెత్తి పారిశ్రామిక అప్పుగా వాళ్లకు చేరుతుంది. లేకపోతే వాళ్లేమైనా ప్రింటింగ్ మెషీన్ పెట్టుకుని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారనుకున్నారా?నువ్వు బయటకొచ్చి తిన్నా పన్నా ఏమి చేసినా అందులోంచి పైసాపైసా బొక్కసానికి చేరతాయి. నువ్వు పెట్రోల్ కొట్టించుకున్న ప్రతిసారీ, మందు తాగిన ప్రతిసారీ సొమ్ము ఖజానాకు చేరుతుంది.

వేల కోట్ల లక్షల కోట్ల రూపమెత్తి పెట్టుబడులుగా మారతాయి.పారిశ్రామిక వేత్తలకు పెట్టుబడులిచ్చేది ప్రధానంగా ప్రభుత్వమే. ప్రజల సొమ్మే. ‘సోమరిపోతుల’ శ్రమ ఫలితమే.ముఖ్యంగా కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, -బ్యాంకుల్లోనూ, ఎల్ ఐ సి లాంటి సంస్థల్లోనూ దాచుకునే డబ్బు లక్షల కోట్ల పెట్టుబడిగా పారిశ్రామికవేత్తలకు చేరుతోంది. లాభం వస్తే క్యూ 1లో ఇంతలాభం క్యూ2లో ఇంత లాభం అని చూపించుకునే వెసులుబాటు వాళ్లకు ఉంటుంది. లాభం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. ఎక్కడిదా లాభం. ఈ ముప్పయ్ ఏళ్లలో ఇంతింత సంపద సృష్టి జరిగిందంటే అంతమందికి ఇంతింత లాభాలు వచ్చిపడ్డాయంటే 119 మంది ఫోర్బ్స్ బిలియనీర్లు తయారయ్యారంటే కారణమేమన్నట్టు? టాప్ 10 శాతం చేతిలో 80 శాతం జాతీయ సంపద పోగుపడిందంటే ఎవరి శ్రమ అన్నట్టు?‘సోమరిపోతులైన’ కార్మికుల, కూలీల శ్రమ. అలంకారికంగా చెప్పుకుంటే చెమటచుక్కలే లాభం మూటలుగా రూపాంతరమవుతాయి.లాభం వస్తే ఎఫీషియెన్సీ అనొచ్చు. ఎంతెంత లాభం వస్తే అంతంత ఎఫీషిఎన్సీ. శ్రమ మీద ఎంత అదనపు విలువను తీసుకుంటే అంత లాభం అని అర్థం చేసుకుంటే ఎఫిషియెన్సీ నిర్వచనం తెలుస్తుంది. నష్టం వస్తే ఐపి పెట్టొచ్చు, బెయిల్ అవుట్ కోరొచ్చు, సవాలక్ష మార్గాలున్నాయి. సింపుల్గా ఆరేడు వేల కోట్లు ఎగ్గొట్టేసి లండన్ కో ఆఫ్రికన్ కంట్రీస్ కో చెక్కెయ్యొచ్చు.

ఎన్ని లక్షల కోట్ల మొండిబాకీలు అట్లా పడి ఉన్నాయి బ్యాంకుల్లో. ఎవడబ్బ సొమ్ము, ఎవడమ్మ సొమ్ము?నీది, నాది మనందరిది. మనకు చీమకుట్టినట్టైనా ఉండదు. అది దూరంగా కనిపిస్తుంది. అంతంత పెద్ద పెద్ద లెక్కలు తాకవు. Yes బార్గెయినింగ్ పవర్ పెంచి సిస్టమ్ లోకి మరింత డబ్బు ప్రవహించేలా చేసే ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా, ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రయోజనాల కోసం అవసరం లేని వాళ్లకు అవసరం లేని సందర్భాల్లో అనుత్పాదకమైన తాయిలాలను కూడా ప్రభుత్వాలు ఇస్తున్న మాట వాస్తవం. వాటిని చర్చించడం వేరు. సోమరిపోతులవుతున్నారన్న మాట వేరు. పేదలు సోమరిపోతులన్నది అవాస్తవం మాత్రమే కాదు. బూతు.

సోమరులైతే మీ పరిశ్రమలు నడవ్వు. మీ పొలాలు పండవు. బార్గెయినింగ్ పవర్ కాస్త పెరిగి ఉండొచ్చు. బానిసత్వం కాస్త తగ్గి ఉండొచ్చు. కానీ సోమరులయితే కాలేరు. నిజమైన సోమరిపోతులను గుర్తించే తెలివితేటలు, ఎక్స్పోజర్ వచ్చే వరకూ చరిత్ర తల్లకిందులుగానే కనిపిస్తూ ఉంటుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles