తెలుగు సాహిత్యాన్నీ కాలర్ పట్టుకుని గుండెల మీద తుపాకీ పెట్టిన, ఎడిటర్ !

తెలుగు సాహిత్యంపై పతంజలి ఫిర్యాదు.

పతంజలి అని ఒకడుండేవాడు. కలాన్ని కత్తిలా పట్టుకుని, సిగరెట్ కాలుస్తూ రోడ్లమీద తిరుగుతుండేవాడు. కొన్ని కథలూ, నవలలూ రాశాడు. జర్నలిస్టుగా వుద్యోగం చేశాడు. ‘ఉదయం’ దినపత్రిక ఎడిటర్ గా పనిచేశాడు. వుద్యోగం పోయి ఖాళీగా వున్నప్పుడు, హైదరాబాద్ శంకరమఠం దగ్గర రెండు గదుల ఆఫీసులో నడుస్తున్న ‘మహానగర్’ అనే చిన్న పత్రికలో చేరాడు. అతి తక్కువ సర్క్యులేషన్ వున్న, పాంచజన్య అనే జర్నలిస్టు నడిపే ఆ పత్రికలో ఒకసారి పతంజలి ఈ సంపాదకీయం రాశాడు. ఇది చదివి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలాంటి చూపుతో, ఈ perspective తో తెలుగు పత్రికల్లో ఒక వ్యాసమో, సంపాదకీయమో ఇంతకాలం, ఇన్నేళ్ళూ ఎందుకు రాలేదా అని ఆశ్చర్యం కలిగింది. ఒక తాపీ ధర్మారావో, నార్ల వెంకటేశ్వర్రావో, ఎబికే ప్రసాదో, గార శ్రీరామ మూర్తో, మానికొండ చలపతిరావో(వీళ్ళంతా అబ్రాహ్మణులని గ్రహించగలరు) రాసి వుండాల్సింది కదా అనిపించింది. లేదా లిటరరీ నక్సలైట్లు గురజాడో, చలమో, లతో, కేశవరెడ్డో ఎందుకు రాయలేదో అనే సందేహమూ పీడించింది. ఇంత అద్భుతమైన మన సాహిత్యాన్ని పట్టుకుని చాలా చులాగ్గా “కాల్జేతుల్లేని సాహిత్యం” అనేయడానికి ఎన్ని గుండెలు కావాలి? పతంజలి అంటేనే లెక్కలేనితనం… అవతలి వాళ్ళు ఎంతటివాళ్ళైనా సరే. ఓసారి ఉదయం దినపత్రికలో పతంజలి రాసిన దాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ వ్యాసం రాశారు. దానికి పతంజలి జవాబు రాశాడు. దానికి ఆయన “వెవ్వెవ్వే”…అని శీర్షిక పెట్టాడు. అంత మంచీ మర్యాదా లేని మనిషి కాకర్లపూడి నారసింహయోగ పతంజలి. తెలుగు జర్నలిజంలో ఇదొక historic editorial. సమస్త తెలుగు సాహిత్యాన్నీ కాలర్ పట్టుకుని గుండెల మీద తుపాకీ పెట్టిన ‘పాయింట్ బ్లాంక్’ రేంజ్ ప్రశ్న. – Taadi Prakash

కాల్జేతులు లేని సాహిత్యం Historic edit by K N Y Patanjali

‘మాయాబజార్’ అందరికీ ఇష్టమైన సినిమా. అందులో ఘటోత్కచుడూ, అతడి అనుంగు పరివారం సృష్టించిన మాయాబజారూ, అందులోని విందు వినోదాలూ, ‘వివాహ భోజనంబు’ పాటా తెలుగు ప్రజల సాంస్కృతిక స్మృతి పథంలోంచి ఎన్నటికీ చెరిగిపోనివి. అయితే ఇందులో ఒక తమాషా వుంది. మాయాబజారు సృష్టించిన వారు రాక్షసులు. అందులో విడిది చేసిన వారు కౌరవులు కురు వంశ క్షత్రియులు. వంటలు తయారు చేసిన వారు రాక్షసులు. భోజనాలు చేసిన వారిలో శర్మా, శాస్త్రి తప్ప మిగిలిన వారు రాక్షసులో, కౌరవులో అయి తీరతారు. అవునా? సినిమా తీసినవారు రెడ్డి కులస్తులు. సినిమా డైరెక్ట్ చేసిన వారు పెదరెడ్డిగారు. కానీ అది బ్రాహ్మల సినిమా అయిపోయింది.క్షత్రియుల కోసం రాక్షసులు బ్రాహ్మణ శాకాహార భోజనాలు వండుతారు. అప్పడాలు, దప్పళాలు, పులిహోర, దద్దోజనం, ఆకుకూర పులుసులు, కాయగూర కూరలు, రకరకాల పిండి వంటలు, అన్నీ కూడా ఘటోత్కచుడు చక్కగా బ్రాహ్మల పిల్లవాడిలాగా తిన్నాడు. సినిమాలో ఆ భోజన దృశ్యం ఎంత రక్తికట్టిందో తెలియని వారెవరు? శుభకార్యాల రోజున బ్రాహ్మణేతరులు కూడా మాంసాహారాల్ని ముట్టుకోరు. నిజమే కానీ పెళ్లి ముందురోజు, పెళ్లి తరువాత రోజూ నిక్షేపంగా తింటారు. ఇంతకూ ఇది మాయాబజార్ లో డైరెక్టర్ పప్పులో కాలు వేశారని చెప్పడం కోసం ప్రస్తావించలేదు. శాకాహార భోజనానికి ఉన్నంత ప్రాచుర్యం, ప్రచారం మాంసాహారానికి లేదని చెప్పడం కోసం మాత్రమే.బాతు మాంసం కూడ ఆవపెట్టి మజ్జిగపులుసు లాగా వండితే ఎంత మజాగా వుంటుందో ఎప్పుడైనా చూశారా? పోనీ చదివారా? నెత్తళ్లూ, చుక్కకూర వేడి అన్నంలో కలిపి తింటేనూ, అడవి పంది ఓర్ల పులుసు కలిపిన అన్నం తింటూ కొబ్బరిముక్క లాగా వుండే దాని ఓరుని మునిపంట కసక్కని కొరుకుతుంటేనూ ఎంత కమ్మగా వుంటుందో తెలుసునా? కణుజు మాంసం కూర్లో వేడివేడి పూరీలు అద్దుకు తింటుంటే జిహ్వకు ఎంత పండుగగా వుంటుందో గమనించేరా?

పీత కాళ్లలోని ములుగు మధురంగా, నాజూకుగా నోటిలో వెన్నపూస లాగా కరగక ముందే గొంతులోకి జారిపోతుందని తెలుసునా? తిత్తి తీసేసిన కుందేలును పొట్లం మాంసంగా వండి ఎపుడైనా తిన్నారా? ఇసుక దొంది చేపల్లోని చిరుచేదునూ, బులకొక్కులనే చేపల్లోని చిరుతీపినీ మీ నాలుక గుర్తించిందా? బైట వర్షం పడుతుంటే వేడి చేపల పులుసులో వేడివేడి అన్నం తింటుంటే చెవిలోంచి ఆవిర్లు ఎప్పుడైనా వచ్చాయా? చాతకాని వాడెవడో కోడిని కోస్తే సేసి కట్టుతెగిపోయి మాంసమంతా చేదెక్కిపోవడం గుర్తున్నదా?మంచి మంచి పుట్టకొక్కులు పీక్కొచ్చి కూర వండించుకు తిన్నారా? చిన్న ఈతచెట్టును నరికేసి దాని మొవ్వలోని గుజ్జును ప్రాణప్రదంగా భావిస్తూ తిని వాత పరుస్తుందేమోనని భయపడ్డారా? నల్లేరు పులుసు నచ్చుతుందా?వెల్లుల్లి పాయలూ, తెలకపిండీ కలిపి కూర చేస్తే ఏ మాత్రం భోజనం ఆ పూట ఎక్కువ తింటారు. ఉడుం మాంసం దొరికితే ఒదులుతారా?

ఏదుపంది మాంసంతో ఎలాంటి కూరలు చేయవచ్చో తెలుసునా? చచ్చువాతమొస్తే పోలుగు పిట్టల కూర ఏమైనా పనికి వస్తుందా? ఈసుళ్ళు వేయించుకు తింటే ఇతరులు నవ్వుతారా? ఉడత మాంసం కమ్మగా వున్నదంటే ఎవరైనా అసహ్యించుకుంటారా? అడవి పంది మాంసాన్ని దంచి తయారు చేసిన ఆయుర్వేదం మందు పునర్ యవ్వనాన్ని ప్రసాదించుతుందంటే నమ్ముతారా? ఇంట్లో ఎలుకల్ని చంపి పారేసినా, పంట పొలాల్లోని ఎలుకలను కొందరు హాయిగా తింటారని తెలుసునా?ఇందులో చాలామందికి చాలా విషయాలు తెలియకపోవచ్చు. తొంభై అయిదు శాతం ప్రజలు ఏమి తింటున్నారో మన పుస్తకాల్లో ఎవరూ రాయరు. మాంసం తినే ప్రజలు మాంసాన్ని ‘నీచు’ అని సిగ్గులేకుండా వ్యవహరిస్తారు. ఫలానీ వారు ఫలానా తింటారని రాయనక్కర్లేదు.

కథ రాసినపుడో, పాట కట్టినపుడో, నవలలో ఏదో సందర్భం వచ్చినపుడో భోజనాల ప్రస్తావనే రాదా? మాయాబజార్ లో రాలేదా? గంటివెన్నులను ఊచకొట్టి ఆ గింజలు నలుపుతూ ఒక రైతు కథలో ప్రవేశించవచ్చు గదా!తిండి గురించే గాదు, చావుల గురించి కూడా తెలుగునాట ఊహించనలవి కాని వైవిధ్యం ఉంది. కంసాలి శవాన్ని కూచోబెట్టి స్మశానానికి తీసుకుపోతారని అందరికీ తెలుసునా? ఇంత ప్రాచీనమైన తెలుగు సాహిత్యంలో ఎపుడైనా కంసాలి శవం కనిపించిందా? చాలా కులాల్లో స్త్రీలకు మారు మనువులుండేవి. భర్తని కులపెద్దల సాక్షిగా వొదిలేసి వేరే మగాడ్ని హాయిగా పెళ్ళి చేసుకుని, అవసరమైతే అతడిని కూడా వదిలేసి వేరే మనిషిని పెళ్ళాడేవారు. వారి గౌరవానికి ఎలాంటి లోపమూ వుండేది కాదు. ఇలాంటి మారు మనువుల కథలు మనకెపుడూ ఎందుకు రాలేదు?అలాగే, తెలుగు జీవితంలో చాలా విషయాలు అదృశ్యం అయిపోయాయి. సరైన లెక్క తీసేనాధుడే దొరికితే ఎన్ని కులాలు, జాతులు, వృత్తులు అంతరించి పోయినాయో లెక్క తేలుతుంది. డి.ఎఫ్. కార్మికేల్ దొరలాంటి మహానుభావులు పనిగట్టుకు సేకరించిన లెక్కలు నిండా నూరేళ్ల క్రితంవే.

విశాఖ మండలం అని నాడు ఆయన పేర్కొన్న ప్రాంతాలలో అప్పటికి గుర్తించిన అనేక కులాలు ఇప్పుడు లేవు. నాగాసపు జాతి ఏమైనది? కొమ్మదాసర్లు, మాల దాసర్లు ఏమైపోయారు? కజ్జెపువాళ్లు, నెయ్యల వాళ్ళు, మొండికూట్లు, విప్ర వినోదులు ఏమైనారు? నల్ల చీనావాళ్లు ఎవరు? ఈ జనమంతా జీవితంలో భాగంగా వున్న సంగతి ఇంగ్లీషు దొరలూ, శాస్త్రవేత్తలూ చెబితే తెలుస్తుంది గానీ తెలుగు సాహిత్యం చదివితే ఎందుకు తెలియటం లేదు?అశోకుడనే చక్రవర్తి ఉత్తర హిందూస్థానం నుంచి వచ్చి కళింగ రాజ్యాన్ని సర్వనాశనం చేసినట్టు తెలుసుకానీ ఆ కళింగరాజు ఎవడో మనకు ఎందుకు తెలియదు? ఇండో చైనా దేశాలను ఆక్రమించి, రాజ్యాన్ని స్థాపించి శతాబ్దాల తరబడి ఏలిన కళింగ రాజులు తెలుగువారే అయినప్పటికీ వారి గురించి ‘జయవర్మ’ అనే పేరు తప్ప మనకెవరికీ ఏమీ ఎందుకు తెలియదు?బహుశా తెలుగువారికి ఇపుడూ, అపుడూ కూడా తెలిసిన విషయాల మీద రాయాలన్న ఆసక్తి లేకపోవడం దానికి ఒక కారణం కావచ్చు. ఉన్నది ఉన్నట్టు ఎవడైనా రాయగలడు, ఆఖరికి తెల్ల దొరలు కూడా రాయగలరు. వున్నది లేనట్టు మనం తప్ప మరొకరు రాయలేరని మన లోపల ఒక నమ్మకం వుండవచ్చు.మనము రాసినదే ఉన్నది, కడమది కల్ల అని మరో సమ్మకం కూడా మనవారిలో వుండవచ్చు. అపుడు కూడా ఆ ప్రమాదాలు సంభవం. కారణాలు ఇంకా గంభీరమైనవి వేరేగా వుండవచ్చు. ఏక్సిడెంట్ కారణాలు మనం కనిబెట్టలేకపోవచ్చు గానీ ఫలితాలు అనుభవిస్తున్నాం. కాళ్ళూ చేతులూ సవ్యంగా లేని సాహిత్యాన్ని చూస్తున్నాం.

– పతంజలి, మహానగర్, సాయంకాల దినపత్రిక, 1994

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles